Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 16


    స్వింగ్ డోర్ దగ్గిరికి వెళ్ళాడు. నెట్టబోయి మళ్ళీ ఆగాడు. చప్పుడు చేయకుండా లోపలికి చూశాడు. సునీత ఏమిటో వ్రాస్తూంది. టేబుల్ మీద ఎక్కడి వస్తువులక్కడ ఉన్నాయి. ఎదురుగా షెల్ఫ్ లో ఫైళ్ళు, లెడ్జర్లు, అన్ని క్రమపద్దతిలో ఉన్నాయి. టేబుల్ ఫాన్ కు ప్రత్యేకంగా ఒక స్టూల్! బాస్కెట్ లో రోజూ అవసరమయ్యే ఫైళ్ళు, లెడ్జర్లు, కాగితాలు అన్నీ క్రమశిక్షణ తెలిసిన బుద్దిమంతులైన అబ్బాయి లకు మల్లే ఉన్నాయి.
    "మళ్ళీ నాన్న పరిపాలనలా ఉంది. మొత్తంమీద నేను అసమర్ధుడినే!' వేణు స్వగతం చెప్పుకున్నాడు. డోర్ తెరుస్తూ "మే ఐ కమిన్, మేడమ్!" అన్నాడు.
    సునీత చూసి నిలుచుని "రండి....రండి..." అన్నది పక్కకు లేస్తూ.
    "మీరు అక్కడే కూర్చోండి. నేను కేవలం ఒక విజిటర్ని. ఓహ్! ఈ రూమ్ ఎంత హాయిగా ఉంది! టైప్ రైటర్ కూడా పక్కనే పెట్టించారే? వెరీ గుడ్!"
    "అది రూమ్ కు పంపించండి. నా బాధ్యత అయి పోయింది....
    "అన్నీ ఆఫీసు డైరీలో రాశాను....బాంకునుంచి పదిహేనువేలు అవసరం ఉండి తెచ్చాను.  రేపు చిదంబరం కంపెనీవాళ్ళకు పాతికవేలు పంపాలి. శనివారం బొంబాయినుండి స్టీల్ ఫర్నీచర్ వస్తుంది.....అవన్నీ రిమెంబరేన్సర్ లో వ్రాసి పెట్టాను."
    'ఈ నిర్వహణ అంతా సునీతకే అప్పగిస్తే? ఆమెఏమంటుందో మరి!'
    "ఒక మాట చెబుతాను. ఏమనుకోవుగదా?" అన్నాడు వేణు.
    సునీత తల వంచుకుంది. అంటే వినడానికి సిద్ధమన్న మాట. వెళ్ళి రివాల్వింగ్ చైర్ లో కూర్చుని, "నాకీ బరువంతా మొయ్యాలని లేదు. నువ్వే దీన్ని నిర్వహించు, సునీతా! నేను బి. కామ్. పాసయినాఅంత ఓపిక, శ్రద్ధ లేవు" అంటూ ఆమెవైపు చూశాడు.
    "బావుంది. మీ బరువును మీరు మోయలేకపోతే నేను మోస్తానా? ఎవరో చేస్తారని వాళ్ళమీద వేసి, తరవాత విచారిస్తే ఏం లాభం? అయినా నాకు ఇంతకన్నా పెద్ద ఉద్యోగం కావాలనీ, పైకి రావాలనీ లేదు. ఇప్పుడు నేనెంతో తృప్తిగా జీవిస్తున్నా. అవసర మైతే మీకు సహాయం చెయ్యటానికి నేను సిద్ధమే."
    "కాదు, సునీతా..."
    "నాకు తెలుసు మీరు చెప్పేది. ఇప్పుడు మీరు చూసిన ఈ వాతావరణాన్ని బట్టి, ఆఫీసు దిద్దుకో గలిగి మెయిన్ టైన్ చెయ్యగలిగితే, అన్నీ తేలికగానే ఉంటాయి.....నేను వెళ్ళవచ్చా?"
    "ఊఁ!"
    సునీత వెళ్ళబోతూ ఆగి, "డాక్టర్ గారితో మాట్లాడాలి. ఓ అయిదు నిమిషాలు ఫోన్ ఉపయోగించుకుంటాను" అంది ఫోన్ అందుకుని.
    ఆర్తి పలికింది. "నేనే, సునీతను, కులాసాగా ఉన్నారా?"
    "ఆఁ! ఆఁ! ఆఫీసు ఎలా ఉంది? వేణు వచ్చాడా?"
    "వచ్చారు. ఇప్పుడే ఛార్జి అప్పజెప్పేశాను."
    "సాయంత్రం ఓ మాటు రా! తప్పకుండా రావాలి!"
    "ఇవ్వాళ కాదు. రేపు సాయంత్రం వస్తాను. ఇవ్వాళ నా క్లాసుమేట్ సుజన పార్టీకి పిలిచింది. ఈ ఒక్కసారికి క్షమించండి."
    "నీ ఇష్టం."
    సునీత ఫోన్ పెట్టగానే, "సుజన ఎప్పుడు వచ్చింది?" అన్నాడు వేణు.
    "మొన్న. నేను మీ దగ్గిర పని చేస్తున్నానని తెలిసి, మీకు నమస్తే చెప్పమని చెప్పింది. వస్తాను. టైప్ రైటరు రూమ్ కు పంపించండి."

                            *    *    *

    వర్ధనమ్మ, రఘుపతి వారంరోజులు ఉండి రాధను అక్కడే ఉంచి వెళ్ళారు. రాధ వాళ్ళు వెళ్ళే రోజు పైకే ఏడ్చింది. తండ్రి ధైర్యం చెప్పాడు. తల్లికూడా ఏదో చెప్పింది. వేణు, రాధ స్టేషనుకు వెళ్ళి వాళ్ళను పంపించారు.
    సునీత రెండు మూడుసార్లు వచ్చిపోయింది కనీ ఆస్పత్రిలోనే ఆర్తితో మాట్లాడి వెళ్ళటంవల్ల, వాళ్ళ నెవరినీ చూట్టం పడలేదు. ఆర్తికి కూడా చెప్పాలని తట్టలేదు. అక్క చెప్పిందేమోనని వేణుకూడా ప్రస్తావించలేదు.
    వేణు రాధకు-తిప్పగలిగినంతవరకు-నగరమంతా చూపించాడు. ఇప్పుడామె ప్రతిదానికీ వింతపడటం మానేసింది. తెలీనప్పుడు అదేమిటి, ఇదేమిటని అడిగి తెలుసుకుంటూంది. తన పరిభాషలో ఏవో వ్యాఖ్యానాలు చేస్తూ అర్ధం చేసుకునేది. రానురాను తను తెలుసు కోవలసినది చాలా ఉందని ఆమె గ్రహించింది.
    ఒకరోజు బల్లమీద భోజనం చెయ్యటం చూపించాడు. రాధ అతను తినే విధానం దీక్షగా చూసింది. తను ప్రయత్నించి కొంతవరకు విజయం సాధించింది. ఇలాగ ఇంటిలో ప్రతిరోజు వాడుకునే వస్తువులతో, రాధే తను స్వయంగా పరిచయం చేసుకుంది.
    ఆస్పత్రికూడా రాధకు ఆసక్తి కలిగించింది. ఆర్తి పక్కన కూర్చుని రోగులను వేసే ప్రశ్నలూ, పరీక్షించే విధానమూ అన్నీ గమనించేది. వెనక వార్డు లోకి వెళ్ళి వచ్చేది. కాంపౌండింగ్ రూమ్ లో మందులు కలవటం చూసేది. లాబొరేటరీలో ప్రతి పరికరాన్ని చూస్తూండేది. లైబ్రరీరూంలో పుస్తకాలు తిరగేసేది. ఆ బొమ్మలు, భాష, గుర్తులు ఏమిటో అంతుపట్టదు. ఒక్కోరోజే గడుస్తుంటే తను చదువు కుని, ఇవన్నీ తెలుసుకోవాలన్న వాంఛ ఎక్కువ కాసాగింది.
    మొదటిరోజుల్లో వేణు ఆలస్యంగా వస్తే, తనూ అన్నం తినకుండా కూర్చునేది. ఆర్తి చెప్పినా వినలేదు. అయిదారు రోజులు అయ్యాక ఆమె తెలుసుకోగలిగింది, ఇలా ఎదురు చూపులతో కాలక్షేపం చేస్తే ఎన్నాళ్ళో గడపలేమని.
    ఆర్తితో చెప్పేసింది తను చదువుకుంటానని.
    రాధలో మార్పు వస్తుందనుకున్నది గాని ఇంత త్వరగా వస్తుందనుకోలేదు.
    "స్కూలుకు వెళతావా మరి?"
    ఊహుఁ! ఇంత పెద్దదాన్ని బాలశిక్ష తరగతిలో ఎలా చేరను? నువ్వన్నా, మామయ్య అయినా చెప్పాలి."
    "మేమా? చూస్తాను. వేణు నడగాలి. నాకు చెప్పటం రాదు."
    "అబ్బ, ఎందుకు రాదేం? నువ్వు డాక్టరు వెట్లా అయినావు?"
    "అది కాదు, రాధా! అందరూ చక్కగా చెప్పలేరు. డాక్టరయినంత మాత్రాన చెప్పటం రావాలనేం ఉంది? మామయ్యను అడుగుదామన్నానా?"
    ఆ మాటే వేణు వచ్చాక చెప్పింది. "చదువు చెప్పించి, డిగ్రీలు ఇప్పించడం ముఖ్యం కాదు. తెలుపు, నలుపు ఏదో తెలుసుకోగలిగి, లోకాన్ని అర్ధం చేసుకో గల విద్య అవసరం."
    "నేను.... నేను చెప్పాలా?"
    "రాధ స్కూలుకు వెళ్ళనంటూంది. అసలే ఆమెకు జిజ్ఞాస ఎక్కువ. ఒకవేళ పంపినా ఆమె ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఒక్క మాటకు వంద ప్రశ్నలు. స్కూలుకు పంపితే ఆమె నేర్చుకునేది అక్షరాలు, పుస్తకాలు చదవటం మాత్రమే."
    "నాకు ఆఫీసు, నీకు హాస్పిటల్. ఎవరు చెబుతారు?"
    "నీ ఎరుకలో నుంచి స్నేహితులు, తెలిసినవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఆలోచించు."
    "ఎవరు? ఎవరు ఉన్నారు?" వేణు వేలితో కణత కొట్టుకున్నాడు.
    అంతలో రాధ నిద్రలేని వచ్చింది. మత్తుగా ఉన్న కళ్ళను నులుముకుంది. "ఇవ్వాళ బాగా నిద్ర పట్టింది, పిన్నీ. ఎంతసేపు అయింది వచ్చి?"
    "ఇందాకే? మొహం కడుక్కున్నాక బీరువాలో వస్తున్నాయి తిను."
    కాలేజీలో స్నేహితుల దగ్గిరనించీ ఒక్కొక్కరినే దృష్టికి తెచ్చుకుంటున్నాడు.....సునీత....సునీత జ్ఞాపకం రాగానే....ఆమెకు టీచింగ్ లో కూడా అనుభవముంది. చదువుకుంటూనే, ట్యూషన్లు చెప్పేదని తను విన్నాడు. ఇటు చదువు.... అటు నిత్యావసరాలకు ట్యూషన్లు, ఆమె సహనానికి నిదర్శనాలు.
    వేణు చిటిక వేసి ముందుకు వంగాడు. పాత మాసపత్రిక తిరగేస్తున్న ఆర్తి ఆగింది.
    "అక్కా! సునీత.... సునీత మంచి టీచర్. కాలేజీలో ఉండగా ట్యూషన్లు చెప్పేది."
    "నీకు బాగా తెలుసా?"
    "ఆఁ! బాగా తెలుసు. రాధ చదువు భారం ఆమెకు వదిలితే, మనం అనుకున్న మార్పు ఇంకా త్వరగా రావచ్చు!"
    "సరే, అడుగు! కానీ సాయంత్రాలు ఆమె మనలాగే అలిసిపోయి ఉంటుంది..."
    "దాని కేదో ఏర్పాటు చెయ్యవచ్చు. కానీ...ఇద్దరూ ఇద్దరే. ఎవరికి కోపం వచ్చినా వార్ డిక్లేర్! అడ్డు వెడితే మన పని స్వాహా!"
    ఆర్తి నవ్వింది. "సునీత అలాంటిది కాదు. ఆమె రక్తంలో త్యాగగుణం నిండి ఉంది. ఆమెను నీకన్నా వేణు బాగా అర్ధం చేసుకున్నా. తనను తాను కంటకాల నుండి రక్షించుకోటానికి అలా ఉంటుంది."
    "అక్కా!"
    "మా ఇద్దరి స్నేహం జరిగి ఎన్నాళ్ళో గాకపోయినా, ఆమె జీవితంలో ప్రతి క్షణమూ నాకు అవగతమే!"

                                     11

    వేణు బజ్జర్ నొక్కాడు. ఫ్యూన్ రాగానే సునీతను పిలిపించాడు.
    "కూచో! అర్జెంట్ పనేమీ లేదు గదా?"
    "పంపించేవారు మీకు తెలీకపోతే నాకూ తెలియదు."
    పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుని, దానిలో డిజైన్ చూస్తూ, "నువ్వు నా కొక చిన్న సహాయం చేసి పెట్టాలి, సునీతా!" అన్నాడు.
    "నాకు జీతమిచ్చేది అందుకే గదా?"
    "ఇది ఆఫీసు వర్కు కాదు. అందుకని."
    "తలకు మించినది గాకపోతే తప్పకుండా చేసి పెడతాను."
    కిటికీలోనుంచి ఎండ పేపర్ వెయిట్ మీద పడుతూంది. అందులోనుంచి దూసుకుని వక్రీభవనం చెందుతున్న కిరణాలను చూడ ప్రయత్నిస్తూ అన్నాడు! "రాధ పేరు అక్కయ్య ద్వారా వినే ఉంటావు."
    "లేదు. ఆ సందర్భం ఎన్నడూ రాలేదు."
    "ఓ, పోనీ ఇప్పుడు విన్నావుగా? ఆమె నీకన్నా ఒకటి రెండేళ్ళు చిన్నది కావచ్చు. అమాయిక. పల్లెజీవి. ఆమెను విజ్ఞానవతిగా చెయ్యాలి."
    "నేనా?"
    "ఊఁ! సాయంత్రాలు నీకు తీరిక ఉంటుంది."
    "క్షమించండి! నేను చెయ్యలేను."
    "నేను చెప్పేది విని..."
    "వినటానికి నేను మీ ఫ్యాక్టరీలో యంత్రాన్నైనా బావుండును. సాయంత్రమంటే నా మస్తిష్కం పరి పూర్ణమైన విశ్రాంతి కోరే సమయం...."
    "నేను కాదన్నానా? నిన్ను యంత్రంలా పని చేయించుకునేందుకు నేనూ సిద్దంగా లేను. నువ్వు ఒక పూట ఆఫీసు మానెయ్యవచ్చు!"
    "మరి ఇక్కడ?"
    "కాచిగూడా బ్రాంచ్ నుండో, సికిందరాబాదు నుండో ఎవరినైనా పిలిపిస్తాను. అక్కడ ఇక్కడున్నంత పని ఉండదుగా? అందుచేత అక్కడొక పూట, ఇక్కడొక పూట ..."
    "ఆలోచించి జెబుతాను. వీలుంటే నా కామెను ఒకసారి చూపించండి."
    "అలాగే. అయిదింటికల్లా ఏదైనదీ చెప్పాలి!"
    "ఊఁ." స్వింగ్ డోర్ మీద చెయ్యి అలాగే ఉంచి, "ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోరు గదా?" అంది వెనక్కు తిరిగి.
    "నో! ఎప్పుడన్నా అనుకున్నానా?"
    "ఆమె మీ కేమవుతుంది?"
    "ఇదేనా? మేనకోడలు.....ఐ మీన్ పెద్దక్కయ్య బిడ్డ. మొన్న మావెంట వచ్చింది."
    ఒక క్షణం అలాగే చూసింది. చూపులు అదో విధంగా ఉన్నాయి. కొద్దో గొప్పో ఆమె మనోభావాలు ఎరిగిన వేణు, 'నే నెప్పుడూ నీవాడినే! నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు, నీలా!' అనుకున్నాడు.
    అయిదయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. సునీత చివరన రూమ్ నుంచి బయటపడింది. ఆఫీసు రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఆమెకోసం ఎదురు చూస్తున్నాడేమో? వేణు ఏమిటో వ్రాస్తున్నాడు. సునీతను చూసి, "ఇంటికి వెళుతున్నానా?" అన్నాడు.
    "అవును! మీ ఇంటికి."
    "ఓ ఏం నిర్ణయించుకున్నావ్?"
    "ఊహించలేరా?"
    "థాంక్స్ ఓ పది నిమిషాలు కూచుంటే దీన్ని పూర్తిచేసి..."
    "కూర్చోలేను."
    "నువు ఒక్కదానివీ వెళతావా?"
    "ఉఁహూఁ!"
    "ఓహ్, నన్ను ఇరుకున పడెయ్యకు, సునీతా."
    "నా కా రెండో పేజీ ఇవ్వండి. రాసేస్తాను. త్వరగా వెళ్ళవచ్చు."
    "సస్పెన్సా! ఊఁ, తీసుకో." మూడు కాగితాలు, కార్బన్ పేపర్లు, పెన్ అందించాడు.
    కార్బన్లు, కాగితాలు మాత్రం తీసుకుని, "నా కా అర్హత లేదు. పేదవాళ్ళు ఆ పెన్ తో రాయ...."
    చటుక్కున చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. "నీకు ధనవంతులంటే అంత కోపం ఎందుకు?"
    "పేదవాళ్ళ కోపం పెదవికి చేటు!"
    "నేను.... నేను నీకేం అపకారం చేశాను? ధనవంతులంటే నీకు పడకపోతే, ఒక స్నేహితుడుగా నాతో మంచిగా ఉండడానికేం?"
    "ఎందుకు ఉండాలి? అలాంటి  రూల్ ఏమైనాపాస్ చెయ్యబడిందా?"
    "రూల్ అని కాదు. నీకు కష్టం కలిగితే మందలించటం కూడా చెయ్యను. కానీ ఎప్పుడూ నీతో మాట్లాడే అవసరం ఉంటూనే ఉంటుంది. అప్పుడూ ఇలా రూడ్ గా ప్రవర్తించకు!"
    "అంటే?"
    "అంటే..... ఇలా.... ఇప్పటిలా దురుసుగా జవాబివ్వకు."
    "ఇస్తే!"
    "ఎవరైనా వింటారు..."
    "మీ పరువు, మర్యాద అన్ని మూసీలో కలుస్తాయి కదూ? అయినా నలుగురిలో మీ పరువు తియ్యడానికి నాకు తెలీదనా?"
    "తెలుసు! సాధ్యమైనంతగా సరళంగా ఉండమని కోరుతున్నా."    
    "అందువల్ల మీకు లాభం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS