అంతలో డ్రయివరు వచ్చి కారు రెడీగా ఉందన్నాడు. ఆ మాట విన్న సుధ, "బయటికేళుతున్నారా?' అని ప్రశ్నించింది.
"అవును. అలా బీచి వేపు వెళదామని . ఆ! రమ రాలేదు. వేచి ఉండండి. ఇంతలో వచ్చేయవచ్చు."
"బాబోయ్! ఇంత పెద్ద ఇంట్లో నేనొక్కతనే! అవునూ, ఒక్కరే బీచ్ కెళితే ఏం తోస్తుంది, ఒంటరి తనమంత భయంకరం మరోటి లేదు సుమండీ? నాకు ఒంటరిగా ఉందట మంటేనే భయం, బీచ్ కెళ్ళి చాలా రోజులైంది. మీకు అభ్యంతరం లేకపోతె, నేనూ బీచ్ కి రానా?' అంటూ పుల్ స్టాప్ లేకుండా గబగబా మాట్లాడింది.
మాధవ ఇరకాటం లో పడ్డాడు. ఎమనటానికి అతనికి తోచలేదు. నిజానికి ఆమెను తీసి కెళ్ళటం అతని కెంత మాత్రం ఇష్టం లేదు. వద్దనటం సభ్యత కాదనుకొని అయిష్టంగానే , "సరే! రండి" అన్నాడు.
బీచ్ కెళ్ళి కాసేపు కూర్చున్నారు. సుధ ఏవేవో కబుర్లు చెప్పింది. మాధవ అయిష్టంగానే విన్నాడు. తరవాత ఇంటికి బయలుదేరారు. త్రోవలో సుదే మాట్లాడింది. అతను మౌనంగా ఉన్నాడు.
"మీకు బీచంటే ఇష్టమా? అప్పుడప్పుడు వస్తుంటారా?'
"అవును." మాధవ ముక్తసరిగా అన్నాడు. అతని మనసేమీ బాగులేదు. సుధను వాళ్ళింటి కి కొంచెం దూరాన దించి, తాను ఇంటి కెళ్ళాడు.
ఎన్నడు లేనిది సుధ, మాధవ పరిచయమైన తరవాత, తరచుగా వాళ్ళింటి కి వెళ్ళటం ప్రారంభించింది. అంతే కాకుండా సుధ మాధవ పై అనేకమైన కొర్కెలను పెంచుకో సాగింది. మాధవ మనస్సులో ఆమె పై ఎటువంటి భావం లేదు. అతని దృష్టి లో ఆమె కేవలం తన చెల్లి స్నేహితురాలు.
* * * *
ఒక్క వారం రోజులుగా రాధ ఆరోగ్యం బాగుగా లేదు. ఏదీ తినటానికి ఆమెకు మనస్కరించడం లేదు. మధు కంగారు పడి డాక్టర్ కు ఫోను చేశాడు. లేడీ డాక్టర్ వచ్చి రాధను టెస్ట్ చేసింది. మధు కంగారును చూచి ఆమె నవ్వుతూ--
"మధుగారూ! ...మీరు త్వరలో నాన్న కాబోతున్నారు" అని, అవసరమైన టానిక్కు లు వ్రాసిచ్చి బయలుదేరింది. రాధ అత్తమామలు అసలు విషయం తెలుసుకొని చాలా సంబర పడ్డారు. మధు మెల్లిగా రాధ ప్రక్కన వెళ్లి కూర్చుని ఆమెను పరిశీలనగా చూచాడు. రాధ సిగ్గుపడుతూ లేవబోయింది. అతను ఆమెను లేవనీయక, అలాగే పడుకోబెట్టి తన వైపుకు తిప్పుకొని, "రాదా! మరి నీకు పాప కావాలా? లేక బాబా?" అన్నాడు. రాధ మాట్లాడలేదు. అతని ఆలోచనకి నవ్వుకుంది.
"నాకేమో అందమైన నీలాంటి పాపే కావాలి" అన్నాడు మధు.
"ఉహు! నాకు మీలాంటి బాబు కావాలి."
"అయితే , నాకోసరం నీలాంటి పాప, నాకోసరం నాలాంటి బాబూ ఒక్కసారే........" అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.
'ఛీ! పొండి" అని సిగ్గుపడుతూ అతని కౌగిట్లో ఒరిగిపోయింది రాధ.
రాధ కోర్కె ఫలించింది. రాధకి అందాల బుజ్జి పాపాయి పుట్టాడు. రాధ తల్లితండ్రులు , అత్తమామలు మనుమడ్ని చూచుకొని మురిసిపోయారు. రాధతో పాటు, ఆమె స్నేహితులు వసంత, చిత్ర, హేమ లు కొంచే మించు మించుగా తల్లులయ్యారు. చిత్ర, వసంత ల అత్తవారిళ్ళు దూరమవటం వలన రాధకు వాళ్ళను తరుచుగా చూడటం జరగదు. తనలాగే హేమకు అదే ఊరిలో సంబంధం కుదరడం వలన తరచు కలిసే అవకాశ ముంది.
బాబుకు సుకుమార్ అని నామకరణం చేశారు. ఇప్పుడు సుకుమార్ కు ఆరో నెల. తన అత్త మామలు సుకుమార్ ముద్దు మురిపాలను చూచుకుంటూ, సుధ విషయం బొత్తిగా పట్టించుకోటం మానేశారు. ఇక మధు సరే సరి. కాని, రాధకు సుధ ప్రవర్తన కంగారు కలిగించింది. సుధ నిత్యం ఏదో సాకుతో బయటి కెళ్ళుతుంది. ఏదైనా చెబితే వినిపించుకునే రకం కాదు. మొండి పట్టుదల కలదని తెలుసుకున్న మధు ఆమెను దండించటం మానేశాడు. పైగా అతనికి ఆఫీస్ కార్యక్రమాలలో పడి ఎక్కువ తీరిక దొరకటం లేదు. ఇంట్లో ఉన్న కొంతసేపు సుకుమార్తో , రాధతో కాలం హాయిగా గడిచి పోతుంది.
* * * *
మాధవతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం సుధకు దొరకటం కష్టమైంది. మాధవ అప్పుడప్పుడు బీచికి వెళుతుంటా డన్న సంగతిని తెలిసిసిన సుధ, ఒంటరిగా బీచికి వెళ్ళటం ప్రారంభించింది. తలవని తలంపుగా, కొన్ని సార్లు మాధవ, ఆమె వెళ్ళిన రోజే వెళ్ళటం వలన అతనిని కలుసుకో గలిగింది. అతనెప్పుడూ ముభావంగా ఉంటున్నాడు. అందువల్ల సుధ తన కోర్కెను వెలిబుచ్చటానికి అవకాశం దొరకలేదు. ఒక రోజు--
"మీరెప్పుడు ఇదే చోట కూర్చుంటారు. ఈ చోటంటే మీకంట ఇష్టమా?' అని సుధ ప్రశ్నించింది.
"అవును చాలా ఇష్టం" అన్నాడు మాధవ. అది తాను, రాధ కలిసి కూర్చుంటున్న చోటు. అతని మనసు బాధతో నిండిపోయింది. సుధ అతనితో సెలవు పుచ్చుకుని ఇంటికి బయలుదేరింది.
ఆరోజు రాత్రి , మంచి నిద్రలో ఉన్న రాధ, బాబు ఏడవటం వలన మేల్కొంది. బాబుకు పాలు పట్టి పడుకోబెట్టింది. కిటికీ గుండా సుధ గదిలో లైటు వెలగటం గమనించి బయటి కొచ్చింది. ఆమె ఈ మధ్య బొత్తిగా చదవటం లేదు. అందువల్ల ఇంకా సుధ చదువు తుంటుందని నమ్మలేక పోయింది. మెల్లిగా వెళ్లి తలుపు తెరిచింది. సుధ నిద్రపోతుంది. చేతిలో డైరీ, లైటు ఆఫ్ చేయటం మరిచి పోయిందను కుంది. మెల్లిగా డైరీని తీసి ప్రక్కన పెట్టి లైటు ఆఫ్ చేయబోయిన రాధ, తటాలున ఆగిపోయింది. సుధ ఏదో కలవరిస్తుంది. రాధ ఆశ్చర్యంతో సుధను సమీపించింది. సుధ పెదవుల నుండి "మాధవ' అన్న మాట రెండు సార్లు వెలువడింది. ఆ మాటలను విన్న రాధ కొయ్యబారి పోయింది.
'మాధవ! అతను కాదు కదా! ఒక వేళ అతనితోనే సుధకు పరిచయ మైందా? అసలే దుడుకు పిల్ల. తొందరలో ఏదైనా పొరపాటు.....' ఇక ఆమె అలోచిన్చుకోలేక పోయింది. రాధ ఆపాదమస్తకం కంపించ సాగింది. వణికే చేతులతో ప్రక్క నున్న సుధ డైరీ తీసింది. అది సభ్యత కాదనిపించినా, గత్యంతరం లేదు. ఇప్పుడు డైరీ చూడక, రేపు ఆమెను ప్రశ్నిస్తే , ఆమె నుండి సరైన జవాబు రాబట్టడం చాలా కష్టం. చాలా కష్టమే కాదు, అది అసాధ్యమని తెలుసుకొన్న రాధ, డైరీ తీసి చదివింది. సందేహం లేదు. అతను మాధవే. తాను మాధవ ను ప్రేమిస్తున్నట్లు సుధ వ్రాసుకుంది. కాని, తన పట్ల మాధవ అభిప్రాయాన్ని ఎక్కడ వ్రాయలేదు. లైట్ ఆఫ్ చేసి, రాధ వచ్చి పడుకుంది. ఆమెకు నిద్ర పట్టలేదు. మధుకు అత్తమామల కు తెలియకుండా సుధను దండించా లనుకుంది. కాని, సుధ తన మాటలను లెక్క పెట్టదని బాగా తెలుసు. అందువల్ల సుధకు తనపై కోపమొచ్చినా సరే, భర్తతో చెప్పాలను కుంది.
రాధకు ఆలోచనలతోనే తెల్లవారింది. ఆరోజు మధుతో ఆమె సుధ ప్రస్తావన తెచ్చి, క్రితం రాత్రి జరిగిన విషయాన్ని చెప్పింది. అందుకు మధు నవ్వుతూ "రాదా! నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ అమ్మ, నాన్న సమ్మతించని పక్షంలో కూడా , వారి నెదిరించి నిన్ను వివాహ మాడే వాడ్ని. నా చెల్లి పట్టుదల విషయంలో నన్ను తీసిపోదు. ఇంకా నన్ను మించింది. అందువల్ల కొంతకాలం ఓపిక పట్టు. సుధ తనకు తానె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నాడు, వాళ్ళిద్దరి కి వివాహం చేసేద్దాం. అది చేసే అల్లరికి విసుక్కుంటానే కాని, సుధ అంటే నా కెంత ఇష్టమో నీకు తెలియదూ? దాని కయిష్టంగా నేనేం చేయను" అంటూ, కొంచెం అవసరమైన పనుందని బయటికి వెళ్లాడు.
రాధ ఇరకాటం లో పడింది. భర్తతో ఏవిధంగా నచ్చ చెప్పాలో అర్ధం కాలేదు. మధు ఊహిస్తున్నట్లు మాధవ నిజంగా సుధను ప్రేమించి వివాహ మాడితే మంచిదే. అలా కాకుండా, అతడు సుధ విషయంలో తనతో ప్రవర్తించి నట్లే ప్రవర్తిస్తే? పోనీ, మాధవ స్వభావ మిటు వంటిదని భర్తతో చెబుదామను కుంది. ఒకవేళ భర్త తన, మాధవ స్నేహాన్ని ఇంకో విధంగా అర్ధం చేసుకుంటే? ఆమె మనస్సు కొయ్యబారి పోయింది. ఎటు ఆలోచించలేక పోయింది. ఏమైనా సుధకు అన్యాయం జరగటాన్ని ఆమె ఓర్చుకోలేదు. మధుకు తను ప్రాణ సమానం. ఉన్న విషయాన్ని చెబితే అతను తనను అపార్ధం చేసుకోడని తలచి భర్తతో మాధవ విషయం చెప్పటానికే నిర్ణయించు కుంది.
సాయంకాలం మధు తోటలో పూల మొక్కలను చూస్తూ కూర్చున్నాడు. రాధ మెల్లిగా అతనిని సమీపించి, ప్రక్కనే కూర్చుంది.
"రాణి గారికి చిరంజీవి సపర్యల నుండి ఇప్పుడే కాబోలు ప్రభువును దర్శించటానికి తీరిక దొరికింది" అన్నాడు కొంటెగా.
రాధ నవ్వింది.
"అవును, రాధా! తల్లి కాగానే మీ ఆడవాళ్ళ కు భర్త పై కాస్త శ్రద్ధ తగ్గుతుంది కదూ? ఎందుకని " అన్నాడు మధు.
