ఇక్కడికి వచ్చిన ఈ నెల రోజుల్లోనూ రాధ భర్తని గురించి ఊహించిన దానికి తన్ని గురించి వాళ్ళు భయపడ్డదానికి భిన్నంగా ఎంతో ఆదరణ అభిమానం పొందుతోంది. భర్త తనంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. తనమాట కాదని అతనేమీ చెయ్యటం లేదు. అయిదు అయేసరికి అతను ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేటప్పుడు ఉత్తి చేతుల్తో రాడు ఏదో ఒకటి తెస్తుంటాడు. ఇద్దరూ కలిసి సినిమాకి పోతుంటారు. ఒక్కొక్కప్పుడు ఊళ్ళో స్నేహితుల ఇళ్ళకు పోతుంటారు. ఒకోక్కరోజు ఇంట్లోనే కూర్చుని నయాపైసలు పెట్టి పేకాట ఆడుతుంటారు. ఒచ్చిన డబ్బులను రాధమ్మ తన పర్సు లో వేసుకుంటుంది. నెల మొదట్లో చలపతి నాలుగు వందలు ఆమె చేతిలో పోస్తాడు. ఆమె ఏదో కొద్దిగా అతని ఖర్చుకు అప్పుడప్పుడు ఇస్తుంటుంది.
ఇరవై తారీకు రాగానే చలపతి బుర్ర గోక్కుంటూ "డబ్బు కావాలి" అన్నాడు భార్యతో.
రాధమ్మ "నేనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను" అంది.
ఈ ఎదురు జవాబు అతనికి చికాకు కలిగించింది! ఇంకా పది రోజులు గడవాలంటే ఎలా లేదన్నా తన మటుకు తనకు కనీసం ఓ వంద రూపాయలైనా కావాలి. "నీకెంత కావాల్సి వుంటుంది?' అన్నాడు చలపతి.
"నాకు ఓ వందయినా కావాలి."
ఎందుకని గాని అసలు ఇచ్చిందానికి ఖర్చు వివరాలు గాని అతను అడగలేదు. ఒక్కడికి అయిదొందలు ఖర్చు కాగా లేంది ఇద్దరికీ అంత డబ్బు నెలలో అంతవరకూ రావటమే రాధమ్మ తెలివి తేటలకు, సమర్ధత కి నిదర్శనం అనుకున్నాడతను.
సాయంత్రం ఓ వంద రూపాయలు తెచ్చి, ఆమె చేతికిచ్చాడు.
ఆమెకు అతనెలా ఈ మొత్తం సంపాదించాడో తెలుసుకోవాలని అనిపించింది. అడిగింది.
'అప్పు చేశాను" అన్నాడు చలపతి.
"ఎంత చేశారు?"
"రెండొందలు."
ఆ పై నెల చలపతి మూడు వందలే భార్య చేతిలో పెట్టాడు. అదేం అంటే పాతబాకీ అన్నాడు. ఆ రెండొందలు పోగా మిగతా డబ్బే తెచ్చాడు. ఇలా నెలనెలా అప్పుల కింద పోయింది పొగా మూడో నెల దాటేసరి కల్లా ఓ వంద రూపాయలు తెచ్చి భార్య చేతిలో పెట్టాడు.
రాధ కంగారుగా "ఇలా అయితే ఎలా?' అంది ఈ అయిదు మాసాల్లోనూ ఓ వెయ్యి రూపాయల దాకా ఆమె దాచింది. అయితే అసలామే భర్తకు తెలియనివ్వలేదు.
"ఇలా అప్పులు చెయ్యాల్సిందే."
రాధా నవ్వేసి "మనం సంసారం ఆరంభించి అయిదు మాసాలు కాలేదు. అప్పుడే అప్పుల మీద సంసారం చేసే పరిస్థితిలో ఉన్నాం ఇలా అయితే ఎన్నాళ్ళు సంసారం చెయ్యగలం" అంది.
చలపతికి ఇలాంటి ఇబ్బందుల గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అతనికి భార్యకి సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఈనాటికి కల్పించబడింది. "నేను మాత్రం ఏం చెయ్యను?' అన్నాడతను.
'అలాగంటే ఎలా? మీ ఖర్చు పెరిగి పోబట్టి మన సంపాదన మనకి చాలటం లేదు. ఆ సంగతి మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఇలా అంటే మీకు కోపం వస్తుంది." అంది రాధ.
చలపతి తల అడ్డంగా ఊపుతూ "ఇది మాత్రం మానమంటే మానను. నీకు కావాల్సిన డబ్బు తెచ్చి నీకు ఇవ్వటం ముఖ్యం అంతేనా ? నెలకు నాలుగు వందలూ నీ చేతిలో పోస్తాను." అన్నాడు.
ఆమెకు అంతకంటే ఎలా చెప్పాలో బోధపడలేదు. రకరకాలుగా భర్త దురలవాట్లని మాన్పించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కోపగించుకుంది. సత్యాగ్రహాలు చేసింది. అప్పుడప్పుడు పుట్టింటికి పోతానని బెదిరించింది. బుజ్జగించింది. ఎన్ని రకాలుగా చెప్పినా ఆతగాడు దారికి రాలేదు. తన్ని ఇబ్బంది పెట్టని మాట వాస్తవమే అయితే ఇలా నిరాధారంగా అప్పుల మీద ఎన్నాళ్ళు సంసారం వెళ్తుంది? అది ఆమె భయం. ఒక్కొక్కప్పుడు అతను విన్నట్టే కనిపిస్తాడు. ఈ రెండు రోజులూ తగ్గించేస్తాను. అంటాడు. కాని ఏం లాభం? మళ్ళీ మామూలే ఒక్కొక్కరోజు బాగా పొద్దు పోయి ఇంటికి వస్తున్నాడు మొదట్లో అయిదింటి కల్లా ఇంటికి వచ్చేవాడు. ఎక్కడో తాగి పూర్తిగా ఆ నిషా తగ్గిం తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు ఏకంగా ఇంటికి తెచ్చుకుంటున్నాడు. రాత్రి బాగా తాగేసి పడుకుంటాడు. మిన్ను విరిగి మీదపడినా అతనికి తెలియదు.
"ఏమిటిది?"
"నీకెందుకు?"
ఇంకా ఎక్కువ గొడవ చేస్తే మర్నాడు అసలు ఇంటికే రాడు. రాత్రంతా అక్కడ హాల్లోనే పడుకుని పొద్దున్నే వస్తాడు. మొదట్లో తనకోసమంటూ చాలా ముస్తాబు చేసుకునేవాడు. ఇప్పుడు గడ్డం బాగా మాసిపోయినా , బట్టలు మాసిపోయినా పట్టించుకోరు. సినిమాలకి, వెళ్ళటం కూడా చాలా తగ్గిపోయింది.
"ఓనాడు అన్నగారికి రాధ ఉత్తరం రాసింది.
"నాకూ ఏదైనా ఉద్యోగం చెయ్యాలని ఉంది. ఎంత రాబడి వున్నా సంసారానికి చాలని స్థితిలో వున్నాం అంటే ఆలోచించు అయన ఎంతగా చెప్పినా వినిపించు కోవటం లేదు. ఇదివరకు కాస్త భయం అన్నా ఉండేది. ఇప్పుడు ఏకంగా కొంపలోనే సాగిస్తున్నాడు. నువ్వు వస్తే నాకు వచ్చెయ్యాలని ఉంది. కొన్నాళ్ళ పాటు మీతో ఉండాలని వుంది" అని రాసింది.
అన్నగారు సమాధానం రాస్తూ "నామీద నింద వేసినా ప్రయోజనం లేదు. నేను ఆనాడు ఎందుకంత గొడవ చేశానో ,మీరెవరూ అర్ధం చేసుకోలేక పోయారు. ఇప్పుడు అర్ధం అవుతోందా? నువ్వు కూడా నన్నే తప్పు పట్టావు. ఇప్పుడిక కష్టం అయినా, సుఖం అయినా భరించి అక్కడ ఉండటమే నీకు గౌరవం కాని ఇప్పుడు పుట్టింటికి వస్తే నలుగురూ నిన్నే అంటారు. అందువలన కలిగే మంచి కంటే చెడు ఎక్కువంటాను. నువ్వు అలిగి పుట్టింటికి వస్తే మీ ఆయనకు మరీ మంచిది. ఇక మిగిలిన మొత్తం కూడా ఖర్చు చేసేస్తాడు. అతని కేమిటి నష్టం?" అంటూ రాశాడు.
అదీ వాస్తవమే అనిపించింది. ఆడది కాబట్టి తాను క్షణిక ఉద్రేకంతో అలా రాసినా తను ధైర్యంగా నిలబడవలసిన అవసరాన్ని అన్నయ్య ఉత్తరం తనకి తెలియజేసింది.
* * * *


"ఇదేమిటి అన్యాయం? ఇలా బరితెగించి పోయారు" అన్నాడు రాఘవులు.
"ఏం మాములేగా"
"చిన్నావిడ. ఇంటి కూడా పట్టుకు పోయి తాగుతే ఆవిడ బెదిరిపోయింది."
"అలవాటు పడాలి రాఘవులూ. ఎన్నాళ్ళని సొంత కొంప, సొంత మనిషిని పేట్టుకుని కూడా ఇతరుల పంచలో పడి నీలాంటి వాళ్ళ సేవలు చేయించుకొను."
"ఛా! అల్లూ మరీ బాధపడతారు. మీరంటే మునుపటి గౌరవం, మర్యాద అన్నీ పోతాయి. ఎవరైనా వస్తే'అన్నాడు రాఘవులు.
"వస్తే రానీ. వాళ్ళకీ నాలుగు గ్లాసులు పోయిస్తాను. రుచి మరిగితే వాళ్ళకే తెలుస్తుంది."
"లిల్లమ్మనుకున్నారా? ఆయమ్మ చేసిన సేవలు ఎవరూ చెయ్యలేరు" అన్నాడు రాఘవులు.
చలపతి "అవును రాఘవులూ . లిల్లమ్మ దగ్గరనించి ఏమైనా ఉత్తరం వచ్చిందా?" అన్నాడు.
"లేదయ్యా."
ఓ వారం పొయిం తర్వాత "లిల్లమ్మ ఎడ్రసు నీకు తెలుసునా?' అన్నాడు చలపతి.
రాఘవులు "తెలియదు" అన్నాడు.
"నువ్వు అబద్దం ఆడుతున్నావు. నువ్వేగా ఆమెను స్వయంగా బండి ఎక్కించి ప్రయాణం చేయించావు."
'అడిగాను. ఎన్నిసార్లు అడిగినా ఆమె చెప్పలేదు."
"పోనీ ఎప్పుడు వస్తుందో అదైనా చెప్పిందా?' అన్నాడు చలపతి.
'ఆహా అది తెలియదు. ఆమె ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. " అన్నాడు రాఘవులు.
అతనికి ఈ మార్పు ఆశ్చర్యం కలిగించింది. 'ఆమె గొడవ ఇప్పుడెందుకులే చలపతి, చెడిపోయిన మనిషి చెడిపోయిన మనిషే. నిన్ను చూస్తె ఆమెకు పడదు. అందుకే పోయింది అంతదూరం." అన్నాడు రాఘవులు.
చలపతి ఈ ఎత్తి పొడుపుని పట్టించుకోలేదు.
"ఆమె అవసరం కొద్దీ ఆమె నిన్ను చేరదీసింది. ఆమెకు మీరోకరేనా నా లాంటి వాళ్ళు. ఎంతమంది ఉన్నారో?" అన్నాడు రాఘవులు.
చలపతి ఈ విసురుకి తట్టుకోలేక "ఏదో ఆమె అల్పత్వం కొద్దీ ఆమె బయటపడ్డా మనలాంటి వాళ్ళు, కాస్త సానుభూతితో అర్ధం చేసుకోవాలి. ఆమెకు మాత్రం ఎవరున్నారు పాపం. ఆమె అక్కడ ఏం ఇబ్బందులు పడుతుందోనని" అంటూ సానుభూతి వ్యక్తం చేశాడు.
"ఆమెకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు లెండి. కావాల్సినంత పైకం ఉంది. అక్కడ తెలుసున్న వాళ్ళే రమ్మన్నారట."
"ఎవరు వారు?"
"ఎవరో మీలాంటి పుణ్యాత్ములే అయి వుండొచ్చు.
చలపతి ఈ వ్యంగ్యానికి కొంచెం దెబ్బతిని ఇక ఈ సంభాషణ పొడిగించకుండా అపుచేశాడు.
రాఘవులు ఓసారి ముక్కు ఎగపీల్చాడు.
చలపతి ఇంటికి చేరేసరికి రాధ బండ నిద్ర పోతుంది. అతను ఎంతసేపు తలుపు తట్టినా ఆమె తెరవలేదు. కళ్ళు నులుపుకుంటూ ఆమె తలుపు తీసింది. గొణుగుతూ , సతాయిస్తూనే వడ్డన చేసింది.
చలపతి "నువ్వు భోజనం చేశావా?' అన్నాడు.
"మీకోసరం అని కూచుంటే నా కడుపు మాడుతుంది." అంది రాధ.
"నువ్వు చాలా మారిపోయావు రాధా. మునుపటి ఓపికా, శాంతం యిప్పుడు పోయాయి." అన్నాడు.
ఆమె నిద్ర కమ్ముకు వస్తుంటే "మీరూ కాస్త ఆడవాళ్ళ ఇబ్బందులు కనిపెట్టాలి. ఇలా అర్ధరాత్రి అపరాత్రి తప్పతాగి వస్తే నాకూ కష్టంగానే ఉండదూ" అంది.
చలపతి తన కోసరం ఎదురు చూస్తూ కూర్చునే లిల్లమ్మ . ఆమె తిందో లేదో కూడా తెలుసుకోకుండా తాను ఆమె వండిందంతా తినేసినా ఆమె పల్లెత్తు మాట అనకుండా చూపిన ఓర్పూ తాగినా, జ్వరం వచ్చినా ఆమె చేసిన సేవా. చూపిన ప్రేమాతిశాయాలు గుర్తుకు వస్తే చలపతికి మనస్సు కలతవారింది.
