Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 15


    "ఇలా సురేష్ గుమ్మందాటగానే అలా ఫోన్ వచ్చింది. అంటే ఫోన్ చేసినవాడు, దగ్గర్లోనే ఉండి సురేష్ ని కనిపెడుతున్నాడా-లేక ఇది కాకతాళీయమా?" అంది రాజమ్మ.
    అసిస్టెంటు మాటలు వింటూనే వెంకన్న చటుక్కున లేచాడు.
    ఫోన్ చేసినవాడు తమకు చాలా దగ్గర్లో ఉండి ఉండి ఉండాలి. ఎంత దగ్గర్లో?-ఈ వీధి మొత్తానికి తమ ఇంట్లోనూ ఎదురింట్లోనూ మాత్రం ఫోన్ ఉంది. ఫోన్ ఎదురింటి నుంచే వచ్చి ఉండాలి.
    వెంకన్న వీధిలోకి వచ్చాడు. ఎదురింటికి తాళంవేసి ఉంది.
    ఎదురింటివారు ఊరికివెళ్ళి నాలుగురోజులైంది. మరి ఫోన్!
    లోపల ఎవరైనా వున్నారేమో!
    వెంకన్న వేరే ప్రయత్నాలు చేయలేదు. అతడు కాసేపు సూటిగా ఆ యింటినే చూస్తున్నాడు. ఆ ఇంటి మొత్తం ఆకారం అతడి కళ్ళ ముందున్నది. వెనుకవైపు నుంచి ఆ యింట్లోకి ఎవరైనా దూరే అవకాశమున్నది. ఇంటి వెనుక చిన్న సందు ఉంది. సందులోంచి గోడ దూకితే.....
    వెంకన్న క్షణాలమీద ఆ ప్రాంతం చేరాడు. ఎదురింటివాళ్ళ దొడ్లోంచి ఆ యిరుకు సందులోకి గోడదూకిన వ్యక్తి వెంకన్నకు దొరికిపోయాడు.
    "ఎవర్నువ్వు?" అన్నాడు వెంకన్న.
    "ఎవరండీ మీరు?" అన్నాడతను.
    అదే గొంతు.....వెంకన్న గుర్తుపట్టాడు-"నువ్వు నాకు ఇప్పుడే ఫోన్ చేశావు...." అన్నాడు.
    "నేను మీకెందుకు ఫోన్ చేస్తాను?" అన్నాడతను.
    "అది తర్వాత - ముందు నువ్వు గోడదూకడానికి కారణం చెప్పు..."
    "తాళాలు గాలిలోకి ఎగరేస్తూ రోడ్డుమీద నడవటం నాకు అలవాటు. అల్పాచమానానికని ఈ సందులో దూరి ఎగురవేయడంలో గోడకు అవతలపడ్డాయి తాళాలు వెళ్ళి తెచ్చుకున్నాను" అంటూ అతడు తాళాలు చూపించాడు.
    "అలా కాదు. దొంగతనంగా నువ్వీ యింట్లో దూరి వస్తున్నావంటాను...." అన్నాడు వెంకన్న.
    "ఈ యింట్లో అయితే దొమ్గాతనంగా దూరడమెందుకూ-దర్జాగా వీధి తలుపులు తీసుకునే వెళ్ళగలనుగా-" అన్నాడతను.
    "అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసిన విషయం రహస్యంగా ఉండదుగా-" అన్నాడు వెంకన్న.
    "మీరేమంటున్నారో నాకు తెలియదు. ఈ యింటి వాళ్ళు నాకు బంధువులు. వెళ్ళేటప్పుడు నాకు తాళాలిచ్చి కూడా వెళ్ళారు. అసలు వీధి గుమ్మంలోంచి వెళ్ళి ఓసారి ఇల్లంతా ఎలాగుందో చూద్దామని బయల్దేరాను. ఈలోగా ఎలాగూ దొడ్లోకి దూకానుగదా అని దొడ్డితలుపు తాళంతీసి ఇలంతా చూసి వచ్చాను...."
    "అప్పుడే నాకు ఫోన్ చేశావు....."
    "పోనీ చేశాననే అనుకోండి ఇప్పుడేమంటారు?"
    "నాతో పోలీసు స్టేషన్ కు రమ్మంటాను....." అన్నాడు వెంకన్న.
    "నేను దొంగతనం చెయ్యలేదు. పోలీస్ స్టేషను కెందుకు రావాలి? ఈ తాళాలు ఈ యింటివి కావో అవునో పరీక్షించి అప్పుడు నామీద అభాండం వేయండి-" అన్నాడా వ్యక్తి.
    వెంకన్న పరీక్షించగా అవి ఆ యింటి తాళాలేనని తేలాయి. వెంకన్న ఆ వ్యక్తిని ఫోటో తీశాడు. వేలిముద్రలు తీసుకున్నాడు.
    "ఈ రాత్రి సురేష్ కి ఏం అపకారం జరిగినా-నేను నిన్నే వేటాడతాను. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నిన్ను పట్టుకోగలను-" అన్నాడు వెంకన్న.
    "మీరేమంటున్నారో నాకు తెలియదు. కానీ ఆ సురేష్ ఎవరో అతడికి ఈ రాత్రి ఏం అపకారమూ జరగరాదని నేనూ మనసారా కోరుకుంటున్నాను అయినా నావంటి డిటెక్టివ్ ల రక్షణ పొందినాక అతడి ప్రాణాలకు భయమేమిటి?" అని ఆ వ్యక్తి తాళాలతో సహా వెళ్ళిపోయాడు.
    

                                     9

    వరదయ్య కంగారుగా-"ఏరా-ఆయన చెబుతున్నది నిజమేనా?" అన్నాడు.
    చలపతి ఆశ్చర్యంగా - "ఇంత తక్కువ వ్యవధిలో మీరీ సంగతి ఎలా తెలుసుకున్నారు?" అనడిగాడు. అతడి ప్రశ్నలోనే జవాబు ఉన్నది.
    అప్పుడు వెంకన్న తన సంచీలోంచి కత్తితీసి అతడి ముందుంచి-"హత్యచేసి ఏదో సాధిద్దామానుకునేవాడు తను తన భవిష్యత్తును హత్య చేసుకుంటున్న విషయం ఎప్పుడు గుర్తిస్తాడో తెలియదు. నాలాంటి డిటెక్టివులు నీటిలో జాడలు తీయగలరు. ఈ విషయం చెప్పి నిన్ను హెచ్చరించడానికి వచ్చాను-" అన్నాడు.
    "ఈ రహస్యం మీ కడుపులో పెట్టి దాచుకోండి. మావాడిలాంటి వెధవ పని మళ్ళీ చేయకుండా నేను చూసుకుంటాను-" అన్నాడు వరదయ్య.
    "అది సరే-నేను ఇంకా మీ అమ్మాయితో కూడా మాట్లాడవలసి ఉంది-" అన్నాడు వెంకన్న. అతడు పద్మినిని అడిగి వివరాలన్నీ తెలుసుకున్నాడు. మనసులో ఇద్దరి కథలూ కలుపుకున్నాడు. వెంటనే ఎవరో నాటకమాడినట్లు అతడికి అర్ధమైపోయింది.
    వెంకన్న పద్మినికి తను అర్ధం చేసుకున్న మొత్తం కధ చెప్పి-"ఇందులో ఏదో పెద్ద నాటకముంది. సురేష్ సచ్చీలుడని నేను చెప్పలేను. కానీ మీ యిద్దరి మధ్యా ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు మాత్రం ఎవరో కల్పించిన నాటకం. అతడిని నువ్వు అనుమానించడానికి ఈ సంఘటనలే కారణమైతే అతడిని అనుమానించడం అన్యాయమూ, అనవసరమూ-"అన్నాడు.
    వరదయ్య కంగారుగా - "అయితే ఇప్పుడేం చెయ్యాలి? చైర్మన్ గారింటికి వెళ్ళి అన్నీ చెప్పమంటారా?" అన్నాడు.
    "ఈ నాటకంలో ఆయన పాత్ర యెంతవరకూ ఉన్నదో నాకు తెలియదు. నేను మాట్లాడేవరకూ మీరు ఆయన్ను కలవకండి-నేను మీకు కబురు పంపుతాను-" అన్నాడు వెంకన్న.

                                    10

    డిటెక్టివ్ వెంకన్న చైర్మన్ యింటికి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి చైర్మన్ ఇంట్లోనే వున్నాడు. ఆయనకు వెంకన్న గురించి తెలుసు.
    "నమస్కారం-రండి-కూర్చోండి!" అన్నాడు చైర్మన్.
    "నేను డిటెక్టివునని మీకు తెలుసు. కానీ ఈ రోజు పెళ్ళి పెద్దగా మీ యింటికి వచ్చాను-" అన్నాడు వెంకన్న.
    "అంటే?" అన్నాడు చైర్మన్ ఆశ్చర్యంగా.
    సురేష్ కీ, పద్మినికీ మధ్య ఈ మధ్య కాలంలో జరిగిన నాటకం గురించి వెంకన్న ఓపికగా వివరించాడు.
    చైర్మన్ ముఖం గంభీరంగా మారిపోయింది-"అయితే వరదయ్య మీ మధ్యవర్తిత్వం కోరాడన్న మాట!" అన్నాడు వెంకన్న.
    "అలా ఎందుకనుకుంటున్నారు?" అన్నాడు వెంకన్న.
    "తన కూతురి చరిత్ర నేను బయటపెట్టాను. అది మాపుకుందుకు ఆయన మీ సాయం తీసుకున్నాడు...."
    వెంకన్న నవ్వి-"నే నెవరితరపున పనిచేస్తూ ఇక్కడికి వచ్చానో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. ఈ విషయమై పరిశోధించమని నన్ను కోరింది మీ అబ్బాయి సురేష్!" అన్నాడు.
    "వాడా?" ఆన్నాడు చైర్మన్ ఆశ్చర్యపడుతూ.
    బదులుగా వెంకన్న నవ్వాడు.
    "నేను అబద్దం చెప్పనని వాడికి తెలుసు. ఆ పిల్ల ఎలాంటిదో వాడు కళ్ళారా చూశాడు. అయినా వాడికి ఆమెమీద మోజుచావలేదు. ఆమెలో ఎన్ని తప్పులున్నా క్షమించి పెళ్ళిచేసుకోవాలని వాడు నిర్ణయించుకున్నాడు. అందుకే మిమ్మల్ని నియమించాడు. మీ కల్పిత గాథలు నేను నమ్మను. ఎర్రగా, బుర్రగా ఉన్నదని కుర్రాడు కంగారుపడ్డా - పెద్దవాళ్ళు ఎందుకున్నట్లు? ఈ పెళ్ళి జరుగదు. మీరు నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి-"అన్నాడు చైర్మన్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS