నీకు కష్టంగా ఉన్నట్లయితే వెంటనే తెంప మంటున్నాడు వేణు. శక్తికి మించిన శ్రమ చెయ్యకు. నిన్నటి ఉత్తరం అందే ఉండవచ్చు. నీ కేమైనా కష్టం కలిగించావా?
ఇవ్వాళ ఇంటికి వెళ్ళి, నా కేమైనా ఉత్తరాలు వచ్చాయేమో చూసి పంపించు. అన్నట్లు రెండు కార్లు అక్కడే ఉన్నాయిగా! అవసరమైతే వాటిని ఉపయోగించుకో! విశ్వాన్ని అడిగినట్లు చెప్పు.
ఆశీర్వదిస్తూ
నీ
డాక్టర్."
ఏమిటీ? ఆమెకు తనంటే ఎందుకింత ప్రేమ? వాళ్ళ ఇంట్లో తనకు అన్ని స్వాతంత్ర్యాలు ఇచ్చింది. వాళ్ళ కుటుంబంలో' తనుగూడా ఒక సభ్యురాలేనట! ఏమిటో? పైగా తనను "పాపా" అంటూ పిలుస్తున్నది. వేణు ఒకసారి పార్కులో అన్నాడు, తన రూపం వాళ్ళ నాన్నలో ఏవో పాత స్మృతులు కెలుకుతుందిట. అది ఆమెకుకూడా తెలిసి ఉండవచ్చు.
10
తన ఉద్దశ్యం వర్ధనమ్మ కు చెప్పాడు వేణు.
"ఏమోరా, వేణు! మాకుమాత్రం ఎవరున్నారు? అది ఒక్కతి. అదైనా మా కళ్ళముందు ఉండకపోతే ఎట్లా?"
"కళ్ళముందు? అన్నీ తెలిసినదానివి, చదువుకున్న దానివి నువ్వే అట్లా అంటే ఎలా?"
"ఇప్పుడది చదువుకోకుంటే ఏమైంది?"
"అట్లా అనుకునే ఇలా తయారుచేశారు. ఒట్టి రాయిలా తయారైంది."
రఘుపతి ఈ విషయంలో తటస్థంగా ఉన్నాడు. ఆర్తి వేణు ఉద్దేశ్యాన్ని బలపరిచింది. రఘుపతికికూడా రారను కొన్నాళ్ళపాటు బస్తీలో ఉంచటం ఇష్టమే. కాని ఆయన దేన్నీ అంతగా పట్టించుకోని మనిషి. పైగా వర్ధనమ్మ అన్నట్లు ఒక్కతే బిడ్డ. ఆ కారణంగానే వాళ్ళు రాధను ఎక్కడికీ పంపించి చదివించలేక పోయాడు. రాధ చదువు బాలశిక్ష తోనే అంతమయింది. ఈ మధ్య ఓ మాధ్యమిక పాఠశాల తెరిచాడు. కాని అది ఒక రోజు నడిస్తే రెండు రోజులు బంద్. పైగా రాధ తను ఇంత పెద్ధదై ఉండీ చిన్నపిల్లలా పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్ళనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.
రఘుపతి అంతా అదో విధమైన మనిషి. ప్రతిది భార్య ఇష్టానిష్టాలకే వదిలివేస్తాడు. వర్ధనమ్మ కూడా లన్నీ తెలిసినదే. పరిసరాలను, వ్యక్తులను అర్ధం చేసుకుని జీవించటం కూడా ఆమె దృష్టిలో విద్యే. స్త్రీకి అబల అన్నపేరు సరికా దంటుంది. సత్సంప్రదాయాలంటే ఆమెకు ఆసక్తి. అలా అని వాటి పేరిట ఆర్భాటా లేమీ చెయ్యదు. ఆచారాల ముఖ్యోద్దేశ్యాలకు భంగం వాటిల్లకుండా జరుపుకుపోతుంది.
"స్త్రీ లేనిది పురుషుడు, పురుషుడు లేనిది స్త్రీ - వీరిలో ఎవరు లేకపోయినా ప్రకృతిరథం కుంటుపడుతుంది. ఇద్దరూ దానికి చక్రాలు. అనుక్షణమూ జరిగే సృష్టి వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా జరగదు, ఒక్క మానవాళిలోనేకాదు, జంతుకోటిలోనూ, ఆఖరికి వృక్షసంతతిలోనూ అంతే" అంటుందామె.
పురోగమిస్తున్న లోకం ఎలాంటిదో ఆమెకు తెలుసు. తల్లి పోయాక బామ్మతోబాటు ఆర్తిని, వేణును పరిపూర్ణ వ్యక్తులుగా, విజ్ఞానవంతులుగా తీర్చి దిద్దినదే ఆమె. తన బిడ్డ విషయంలో మాత్రం శ్రద్ధ చెయ్యలేకపోయింది. రాధను స్వచ్చమైన పల్లె పడుచుగా పెరగనిచ్చింది. ఇప్పటికీ ఆ ఇంట్లో రాధ ఏది చెప్పినా నిరాటంకంగా జరిగిపోతుంది.
ఇక రాధ, ఆ ఊళ్ళో కల్లా అల్లరి అమ్మాయి ఎవరంటే, రఘుపతిగారి సుపుత్రి అంటాడు ప్రతివాడు. ప్రతి పేరంటంలోను, ప్రతి సంబరంలోను ఆమె తప్పకుండా ఉంటుంది. తన ఈడువాళ్ళందరికీ ఆమె నాయకురాలు. అందంలోనూ, ఆటపాటల్లోనూ ఆమెను మించినవాళ్ళెవరూ లేరు. జానపద గేయాలెన్నోవచ్చు. అవిగాక గుళ్లోనూ, పురాణాలవద్దా శాస్త్రులవారి ముఖత! విని నేర్చిన పద్యాలు, శ్లోకాలు ఎన్నో వచ్చు. శ్రావ్యంగా పాడుతుంది.
గుండ్రంగా ఉండే మొహం, విశాలంగా ఉన్న కనుదోయి, ఎప్పుడూ చెరిగిపోని చిరునవ్వు - రాధలో ప్రత్యేకతలు.
వర్ధనమ్మను అంగీకరింపజేసేసరికి తలప్రాణం తోకకు దిగింది. ఆ రోజలా వాళ్ళకు అదే వాదన. రఘుపతి తటస్థుడై, ఎటూ ఓటు చెయ్యని కారణంగా వేణు పట్టుదలే నెగ్గింది. ఒకవేళ ఆమె కనక ఒప్పుకోకపోతే, తామీ చాయలకే రానున్నాడు వేణు.
పట్నం వెళ్ళటమంటే రాధకు సంతోషంగానే ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది. మళ్ళీ వెళ్ళలేదు. ఆర్తి పెళ్ళప్పుడు వర్ధనమ్మ బాలింతరాలు కావడం మూలాన రఘుపతి ఒక్కడే వెళ్ళివచ్చాడు.
ఇన్నాళ్ళు తను పుట్టి పెరిగిన ఊరును, స్నేహితులను, అమ్మను, నాన్నను వదిలి వెళ్ళాలంటే మరో వైపు విచారంగానే ఉంది. అయినా అప్పుడప్పుడు వస్తూ పోతూనే ఉంటారన్న ధైర్యం. కొన్నాళ్ళేగదా?
రాధకు తోడుగా అన్నీ తెలిసిన సమర్దురాలు ఆర్తి ఉన్నది. అందుచేత ఎవరూ వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. వేణు అందర్నీ బయలుదేరదీశాడు కొన్నాళ్ళు ఉండి రమ్మని. సరే నన్నారు.
తను చదువుకోటానికి పట్నం వెళుతున్నట్లు తన స్నేహితులందరికీ చెప్పింది రాధ. వాళ్ళందరూ ఆమె అదృష్టాన్ని అభినందించారు. శనివారం తెల్లవారు జామున ఈ ప్రయాణానికి ముహూర్తం దివ్యంగా ఉందని శాస్త్రులవారు చెప్పారు.
శనివారం ఉదయం తూర్పు కొండలనుండి సూర్యోదయమవుతూ ఉండగా బండి బస్ స్టేజి చేరుకుంది. పాలేరు బస్సు వచ్చేదాకా ఉండి, బండితో ఇంటికి మలుపుకు పోయాడు. ఏడు గంటలకు ఖమ్మం చేరుకుంది. రాధ అప్పుడప్పుడు తండ్రి వెంట ఇక్కడికి వచ్చేది కనక, ఆ ఊరిని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు.
"మరి, ఆ పట్నం ఇంత పెద్దగా ఉంటుందా?" అనిమాత్రం అడిగింది వేణును.
"ఇదా? ఇది మీ ఇంటి ముందు వాకిలి లేదూ? అంత ఉంటుంది దానిముందు."
పది గంటలకు పాసెంజరు ఉంది. అప్పటిదాకా స్టేషన్లో పడిగాపులు పడి ఉండటం ఎందుకని రఘుపతి బండి వచ్చేదాకా, తన పెద్ద చెల్లెలింటికి తీసుకువెళ్ళాడు. వేణు మాత్రం వెళ్ళలేదు. స్టేషన్లో పాత స్నేహితుడు కనిపిస్తే మాట్లాడుతూ ఊళ్ళోకి వెళ్ళాడు. మళ్ళీ బండి వచ్చేవేళకు స్టేషనుకు వచ్చాడు వేణు. వస్తూనే అందరికీ ఫస్టు క్లాసు టికెట్లు తీసుకున్నాడు.
రైలు ఎక్కాక రాధ ప్రశ్నలు గుప్పించేసింది. రైలు ఎట్లా కదులుతున్నదనీ, దూరంగా ఉన్న ఆ తాటి చెట్లు ఎందుకలా పరిగెత్తుతున్నాయనీ, పక్కపెట్టెలో మాదిరిగా తాము కూర్చున్న పెట్టెలో మనుషు లందరూ ఎందు కెక్కరనీ, ప్రతి స్టేషన్లో ఎక్కే వీళ్ళకు రోజూ ఏం పని ఉంటుందనీ, ఎక్కడికి వెళతారనీ -ఇంకా తన బుద్దికి తోచిందల్లా అడుగుతూనే ఉంది.
ఆర్తి వాటన్నిటికీ ఓపిగ్గా జవాబు లిస్తూనే ఉంది.
పట్టాలమీద రైలు చక్రాలు చేసే కెప్పుడు విని, తమ ఊళ్ళో చప్పుల చప్పుడు దీనికన్నా ఎంతో నయమని ఒకటే నవ్వు. ఆ చప్పుడు కనుగుణంగా తనకు వచ్చిన పాటకూడా ఒకటి పాడేసింది.
సికిందరాబాదు స్టేషన్సూ, అక్కడి జనాన్ని చూసి ఇంత పెద్ద స్టేషను, అంతమంది ప్రయాణం చేసే మనుషులు ఉంటారా అని ముక్కుమీద వేలేసు కుంది. సాయంత్రం ఏడున్నరకు హైదరాబాదు చేరింది బండి.
టాక్సీలో కూర్చోబోతుండగా వేణు ఆర్తిని అడిగాడు: "అక్కా! బంజారా హిల్సుకా? గీతా భవన్ కా?"
"బంజారా హిల్స్ కెందుకోయ్? అక్కడెవరూ లేరుగా?" రఘుపతి అన్నాడు.
"లేరనుకో..." వేణు కూర్చొని అడ్రసు చెప్పాడు. టాక్సీ కదిలింది.
ఇరుపక్కలా జిజ్ఞాసువై చూస్తున్న రాధ తను నిజంగా ఏ స్వర్గంలోనో ఉన్నట్లు భావించింది. ఆ కార్లూ, జనప్రవాహాలూ, పట్టపగలులా ఉన్న ఎలక్ట్రిక్ దీపాల కాంతులూ, ఎత్తైన భవనాలూ- అదేదో దేవనగరమై ఉండాలి! పూర్వం దేవతలు కట్టి, రాక్షసుల బాధ పడలేక పోతూ పోతూ వీళ్ళకు ఇచ్చేసి ఉంటారు!
బజార్లతో రాసులు పోసి ఉన్న కూరగాయలు, పువ్వులు చూసి, అవి అమ్ముతారని తెలిసినప్పుడు, "ఛ! కరణం తాతయ్య తోటలో ఒట్టివే కోసుకుని రావచ్చు. డబ్బు లేమిటి?" అంది రాధ.
వర్ధనమ్మ "అది ఆ ఊళ్ళో తల్లీ. ఇక్కడ ప్రతిదీ కొనవలసిందే. మన ఊరికీ, దీనికీ సాపత్యం పెట్టకు" అంది. అప్పుడామెకు తెలిసివచ్చింది, తను రాధను ఎంత తెలియనిదానిగా చేసిందో?
ఇంటి ముందు కారు ఆగగానే రామదాసు వచ్చి గేటు తీశాడు. ముందు వేణు, తరవాత ఆర్తి, రాధ... అందరూ వరసగా దిగారు.
వర్ధనమ్మకూడా ఈ ఇల్లు, ఆస్పత్రి కట్టించాక ఎన్నడూ రాలేదు. అందుచేత ఆమె కాస్త కుతూహలంగా చూసింది. రాధ మంత్రముగ్ధలా ఆర్తి వెనక నడిచింది. రామదాసు తెల్లటి గడ్డమూ, జుత్తూ చూసి, "ఆ సాధువు ఇక్కడెందుకున్నా" డని అడిగింది.
"సాధువు కాదు. నౌకరు. అంటే మీ పాలేరు సుబ్బడు లేడూ? అలా!"వేణు చెప్పాడు.
రామదాసు వర్ధనమ్మకు ఇల్లంతా చూపించాడు. మెత్తగా స్ప్రింగ్ ఇస్తున్న సోఫా సెట్లు, డ్రాయింగ్ రూమ్, హాలు, పడక గదులు, ఎక్కడ చూసినా ప్రతిబింబాలు కనిపించేటట్లు అమర్చిన నిలువుటద్దాలు, ఎలక్ట్రిక్ బల్బులు - అవన్నీ చూసి రాధ సంతోషం పట్టలేక తల్లిని వాటేసుకుని ఊపేసింది. "వదలవే! నీ ఇల్లు బంగారం గానూ!" అన్నా వదల్లేదు. రాధ ఎవరి మాటా వినదు!
డ్రాయింగ్ రూమ్ లో రేడియో కనిపించింది. సారధి వెళ్ళిన దగ్గిరనుంచి అది మోగటం లేదు. బీరువాలో అద్దంలోనుంచి కనిపిస్తున్నదాన్ని అదేమిటని అడిగింది.
"అది రేడియో!"
"అంటే?"
ఎలా చెప్పాలో రామదాసుకు తెలియలేదు. పక్కనే ఉన్న తల్లి చెప్పింది, "మాట్లాడే పెట్టె" అని.
"కోతలు! మాట్లాడించు, మరి?"
"బీరువాకు తాళం వేసి ఉంది. తరవాత. అన్నం తినవూ?"
రాధకు ఆకలవుతూంది. ఈ సందడిలో మరిచింది. ఆమె అలా అనగానే తల ఊపింది. భోజనాల దగ్గిర అడిగింది, మాట్లాడే పెట్టెను గురించి. రేపు చూపిస్తానంది ఆర్తి.
ఉదయం రాధ లేస్తూండగానే ఎవరో వెంకటేశ్వర సుప్రభాతం చదువుతున్నారు. అటు ఇటు చూసింది. ఎవరూ లేరు గదిలో. నెమ్మదిగా లేచి బయటికి వచ్చింది. వర్ధనమ్మ ఎదురై, "ఆ రేడియో మాట్లాడుతున్నదే" అంది.
రేడియో అన్న పదం ఆమెకు నిన్ననే పరిచయమైంది. డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళింది. వేణు ఫేము కుర్చీలో జేరగిలబడి రేడియో వింటున్నాడు. చేతిలో పుస్తకం మూసి ఉంది. అలికిడి విని రాధ రాకను గమనించిన వేణు సరిగా కూర్చున్నాడు.
"ఎట్లా మాట్లాడుతుంది, మామయ్యా?" రాధ ప్రశ్న.
"ఇలా!" ట్యూన్ పెంచాడు. మళ్ళీ తగ్గించాడు.
"నేను తిప్పనా? నాకు నేర్పుతావా?"
"ఆహా! తప్పకుండా. దగ్గిరికి రా!" అన్నీ వివరంగా చెప్పాడు. రాధ శ్రద్దగా విని గుర్తు పెట్టుకుంది.
* * *
"హలో! ఎవరు మాట్లాడేది?"
"ఇన్ ఛార్జి మానేజర్! మిస్ సునీతాదేవి....మీరెవరు?"
అవతల నవ్విన ధ్వని. "గుర్తు పడతారనుకున్నా!"
ఈసారి పోల్చుకో గలిగింది. "ఓ, మీరా! ఎప్పుడు వచ్చారు? మంగళవారం వస్తానన్నారే?"
"అవును! కాని ముహూర్తం కుదరలేదు. ఆఫీసు ఎలా సాగుతూంది?"
"మామూలుగానే! డాక్టరు గారు వచ్చారా?"
"ఆఁ ! ఇంకా హాస్పిటల్ కు రాలేదు. నేనిప్పుడు అక్కడికి రావచ్చా?"
"భలేవారు! పండుగనాటి భుక్తాయాసం తీర లేదా? ఎంత త్వరగా వచ్చి, మీ స్థానం నుండి నన్ను తొలిగిస్తే అంత మంచిది. త్వరగా రండి...."
"అలాగే!"
వేణు ఫోన్ పెట్టాడు. ఆర్తి అప్పుడే రాధను తీసుకుని వస్తున్నది. వాళ్ళను చూసి నవ్వుతూ, "ఇంకేం? ఇక హాస్పిటల్ లో నర్సులూ, కాంపౌండర్లూ జోల్సా దారి వెతుక్కోవాలి కాబోలు" అన్నాడు.
రాధ కదేమిటో అర్ధం కాలేదు. ఆర్తి మృదుహాసం చేసింది. వేణు వాచీ చూసుకుని, "టైమౌతూంది. వస్తాను" అంటూ వెళ్ళాడు.
ఆఫీసు ఆవరణలో అడుగు పెడుతూనే ఒక మార్పు చూశాడు. అది, ఎప్పుడు కింద కూచుని గుమ్మానికి అనుకునే ఫ్యూను, ఓ స్టూలుమీద నిటారుగా కూర్చుని చూస్తున్నాడు. వేణు కారును చూడగానే, నిల్చుని సలాం చేశాడు. వేణు లోపలికి వస్తూండగానే ఇదివరలా ఇష్టం వచ్చినట్లు కూచుని, సిగరెట్లు తాగుతూనో, కబుర్లు చెబుతూనో ఉండే గుమాస్తాలు ఫైళ్ళు ముందేసుకుని వ్రాసేస్తున్నారు.
వేణును చూడగానే వాళ్ళ ముఖాలు వికసించాయి. అప్పటివరకూ ఒక పదిరోజులనుండి వాళ్ళకు, పంజరంలో ఉన్నట్లుంది. కదిలినా మెదిలినా సునీత దృష్టిలో పడి, మందలింపులకు గురి కావటం. 'మమ్మల్ని రక్షించావయ్యా, వేణు గోపాలా!' అన్నట్లు చూస్తూ గౌరవంగా నిల్చున్నాడు.
