Previous Page Next Page 
కాగితపు పల్లకి పేజి 14

 

    
                                   8
    ఓ మంచి రోజున రాజశేఖరం , సుభద్రమ్మ బాధ్యత వహించి రంగనాధం తో సహా రాధమ్మను తీసుకొచ్చి చలపతికి అప్పచెప్పారు.
    వచ్చిన మరు నిమిషం సుభద్రమ్మ వంటగది పెత్తనం స్వీకరించింది. రాధ బిడియం లేకుండా అడ్డం ముందు నిలబడి జడ ముందుకు వేసుకుని అద్దంలోంచి వీధి గుమ్మంలో రాఘవులి చేత కుర్చీలు టేబిలు సర్శిస్తున్న చలపతిని చూస్తుంది.
    సుభద్రమ్మ వంటగదిలో సరుకులు సామాన్ల కోసరం వెతుకులాట మొదలుపెట్టింది. ఆమెకు అంతా కొత్తగా ఉంది.
    రంగనాధం , రాజశేఖరం స్నానాలు చెయ్యటానికి వెనక పెరట్లో బావి దగ్గరకు చేరారు.
    చలపతి వెనక్కి తిరిగేసరికి రాధ అద్దం ముందు నిలబడి ఉంది.
    రాఘవులు సామాన్లు సర్దేసి గోడకి పటాలు తగిలిస్తున్నాడు. రాధ గుమ్మం దగ్గర కొచ్చి "అవేం పటాలండి. అంతకంటే మంచి పటాలు కొనకపోయారా" అంది.
    రాఘవులు ప్రకృతి దృశ్యం పటం ఒకటి గోడకి తగిలిస్తున్నాడు.
    "ఏం, దానికేం. చాలా బాగుంటుంది. నీకు రాముళ్ళు, భీముళ్ళు , పంచ పాండవుల పటాలు ఇష్టం కాబోలు" అన్నాడు.
    "నాకేమిటి? ఎవరైనా అవే ఇష్టపడతారు. ఇళ్ళలో అవే పెట్టుకుంటారు. ఈ ఆకులూ అలవలు తగిలిస్తారా ఎవరైనా. అన్నయ్య రాదా కృష్ణుల పటం. రామ పట్టాభిషేకం పటం ఇస్తానన్నాడు. సామాన్లు ఎక్కువై పోయాయని నేనే తేలేదు" అంది రాధ.
    "చాదస్తంగా ఏవిటా పటాలు? నయం తీసుకు వచ్చావు కాదు. నీకూ నాకూ తగాయిదా వచ్చేది"
    రాఘవులు ఆ పటం కొట్టేసి ఇంకో పటం తీశాడు.
    "ఏది రాఘవులూ ఆ పటం చూపించు" అని "అబ్బే ఇది అసలు బాగులేదు. సంసారి ఇళ్ళల్లో ఇలాంటి పటాలు పెట్టుకోకూడదు అది తగిలించకండి" అంది.
    "దీనికేం చాలా బాగుంటుంది. ఇంత చక్కని కాలెండరు ఈ సంవత్సరం ఎవరూ వెయ్యలేదు." ఆ కాలెండరు లో ఓ అమ్మాయి అర్ధ నగ్నంగా చంకలో బిందె తో రేవు దగ్గర నిలబడి ఉంది.
    రాధ ముసిముసిగా నవ్వుతూ నోరు మూసుకుని "ఎవరైనా నవ్వుతారు. ఇలాంటి బొమ్మలు తగిలిస్తే' అంది.
    "నువ్వు తగిలించరా రాఘవులూ . ఈ పల్లెటూరు మనిషికి పట్నం వాసం పోకడలు ఏం అర్ధం అవుతాయి" అన్నాడు చలపతి.
    పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తూ రాజశేఖరం రంగనాధం కబుర్లు చెప్పుకుంటున్నారు. సుభద్రమ్మ మొత్తానికి వంటగదిని డిస్కవర్ చేసి వంట ప్రారంభించింది.
    రాధమ్మ కు అంతా అలవాటు లేనిచోట తడుముకుంటున్నట్లుగా ఉంది.
    రాధ వంటగది గుమ్మంలో నిలబడి అక్కగార్ని ఒకసారి పలకరించింది. "మొత్తానికి ఎక్కడ ఏం ఉందో ఇట్టే పట్టేశావే" అంది.
    రాజశేఖరం అప్పుడే స్నానం పూర్తీ చేసి వంట గది గుమ్మంలో నిలబడి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు. రంగనాధం చాదస్తంగా స్నానం చేస్తాడు. అతను బావి దగ్గర వంద బకెట్ల న్నా తోడి పోసుకుందే తృప్తి పడడు.
    "నీ తమ్ముడికి ఇంట్లో ఓచిన్న చెరువు లాంటిది తవ్వితే రోజంతా అందులోనే కాలక్షేపం చెయ్యడానికి వీలుగా ఉంటుంది." అన్నాడు రాజశేఖరం.
    రాధ వంటగది గుమ్మం దగ్గర భర్తతో పరాచికాలు ఆడుతుంది. బావి దగ్గర్నుంచి రంగనాధం ఈ బావగారి పరాచకానికి సమాధానం ఇచ్చాడు.
    "తిండిలో ఎముందోయ్ బలం? స్నానం ఒంటికి సగం బలం ఇస్తుంది." అంటూ.
    "మీ బావకి ఒక్కొక్కప్పుడు రెండు రోజులైనా స్నానం చెయ్యకుండా కూడా బలంగా ఉండే అలవాటుంది" అంది సుభద్రమ్మ బావి దగ్గర రంగనాధానికి వినబడేట్టుగా.
    రంగనాధం నవ్వేశాడు రాజశేఖరం "అబద్దం అబద్దం" అంటున్నా అతను నవ్వు ఆపలేదు."
    రాధ భర్త కేసి ప్రతి పనికీ వంకలు పెడుతుంది. రాఘవులు చలపతిని ఉడికిస్తున్నాడు. "ఆమెకేం తెలుసు రాఘవులూ ఉత్తి పల్లెటూరి రకం" అన్నాడు చలపతి.
    "అది సరే గాని ఈ గదిలో ఎక్కడా పొరపాటున అయినా ఒక్క పత్రిక గాని, ఒక్క పుస్తకం గాని కనబడదేం?' అంది రాధ.
    రాఘవులు 'అయ్యగారికి ఇక చదవాల్సిన పుస్తకం అంటూ లేకుండా అన్నీ చదివేశారండి "పేపర్లు అక్కడ క్లబ్బుల్లో ఉంటాయి అక్కడ చదువుతారు.' అన్నాడు.
    చలపతి ఎంత జాగ్రత్త పడినా అసలు ఆయువు పట్టు పట్టేసింది రాధ. అతను అణిచేశాడు గాని ఆ విషయం గురించి మాత్రం ఆలోచించలేక పోయాడు.
    "మీరు పట్నం వాసం వారు కదా మరి. ఇదేనా సివిలిజేషన్" అంది రాధ.
    చలపతి తడుముకుంటూ "ప్రతివారం ప్రత్రికలు తెప్పిస్తూనే ఉంటాను. ఈ వారం ఇంకా తెప్పించలేదు. "రాఘవుల్ని హెచ్చరిస్తూ "రాఘవులూ ఈ వారం పత్రికలన్నీ తెచ్చి ఇంట్లో పడెయ్యి" అంటూ పురమాయించాడు.
    "మా ఇంట్లో బోలెడు ఇంగ్లీష్ నవల్లున్నాయి" అంది రాధ.
    చలపతి ఇరుకున పడ్డాడు. అతను ఈ మాటలు వినిపించుకోనట్టుగా రాఘవుల్ని ఏదో హెచ్చరిస్తున్నాడు.
    "మా అన్నయ్య చదవని పుస్తకం లేదు. ఓ పెద్ద అలమారా నిండా వున్నాయి పుస్తకాలు. మీరు చదువుకుందుకు కొన్ని తెద్దామని అనుకున్నా."
    రాఘవులు అంతవరకూ ఆపుకున్న నవ్వు ఇక ఆపుకోలేక పైకి తన్ను కొచ్చింది.
    చలపతి "ఏముంటుంది అందులో అన్నీ అబద్దాలు' అన్నాడు.
    రాఘవులు "ఏమీ తెలియని వాళ్ళకి పుస్తకాలు గాని, అయ్యగారిలాంటి జగమెరిగిన వారికి పుస్తకాలు ఎందుకండి." అన్నాడు అతను గోడ వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. అతనికి నవ్వు అపుకోవటం కష్టంగానే ఉంది.
    చలపతికి సిగ్గుగా ఉంది.
    'అమ్మగారు నేనోమాట చెప్పనా. లోకంలో బ్రతకటానికి ఒంట్లో కండ చాలా ముఖ్యం అండి. ఈ లోకంలో బ్రతకాలంటే అయ్యగారి ధీరీ ప్రకారం అయితే బుర్రలో తెలివి కంటే ఒంట్లో కండ బలం చాలా ఉండాలండి. అవసరం అయితే ఒక్క దెబ్బతో పదిమందిని కిందకు తోసెయ్యటం, లేదా పేకాట వేస్తె ఎదుటి వాళ్ళంతా తెల్ల మొహం వెయ్యాలి. అదే తెలివంటే. అయ్యగారి ధీరీ ప్రకారం ప్రయోజకత్వం అంటే అదండీ అంతే గాని ఇలాంటి ఆడంగి అలవాట్లు అతనికి లేవండి. పుస్తకాలు చదవటం, పత్రికలు చదవటం పనిలేని సోమరి పోతులూ చేసేపనండి." అన్నాడు రాఘవులు.
    చలపతికి ఇది సమర్ధన అయిందా ఎగతాళి అయిందా అంతు పట్టక "ఒరేయ్ నువ్వు అట్టే వాగక ఆ పని కానియ్యి ముందు" అన్నాడు.
    రాధమ్మ సన్నగా కూనిరాగాలు తీస్తూ వెళ్ళి మంచం మీద జారబడింది. రాఘవులు "అమ్మగారు చలపతయ్య గారి ప్రపంచమే వేరండి. "అంటూ చెప్పుకు పోతుంటే చలపతి "ఎవరితోరా నీ వాగుడు. ఆమె ఇక్కడ లేదు లోపలికి వెళ్ళింది" అన్నాడు.
    'అయ్యగారికి ఎలావుంది మన ధోరణి అన్నాడు రాఘవులు.
    చలపతి "ఎడిసినట్టే ఉంది" అన్నాడు.
    "అదేమిటండి అట్లాగంటారు. ఎంత తెలివిగా మిమ్మల్ని సమర్ధిస్తే " అన్నాడు రాఘవులు.
    రంగనాధం, రాజశేఖరం స్నానాలు పూర్తీ చేసి గదిలో కొచ్చి బట్టలు తొడుక్కుంటున్నారు. ఆసరికే అవతల గదిలో గోడలకి పటాలు తగిలించే పని పూర్తీ చేయించాడు.
    రాజశేఖరం చెవుల్లో వున్న సబ్బు చేతితో తుడుస్తూ "అన్నీ సదుపాయంగా నే ఉన్నాయి గాని ఇంతంత ఫానులు మూడు గదుల్లో వున్నాయి బోలెడు డబ్బయి పోదురా" అన్నాడు.
    రంగనాధం సంచీలో రెండు విసన కర్రలు కూడా వేసుకొచ్చాడు. అసలే వేసవి కాలం కదా ఇక్కడ దిగగానే అవసరం అవుతుందని."
    రాజశేఖరం ఫానుల సంగతి ఎత్తగానే సిగ్గుపడుతూ సంచి లోంచి అ రెండు విసన కర్రలూ తీసి అవతల పారేశాడు. రాధ సన్నగా కూనిరాగం తీస్తూ "ఉండనీ అన్నయ్యా వాటి అవసరం మాత్రం ఉండదూ" అంది.
    రంగనాధం రాజశేఖరం ఎత్తి పొడుపుకి తన సమాధానం నోటి చివరి వరకు వచ్చింది. కాని అక్కడ లేకుండా ఉంటే అనేసేవాడే.   చలపతికి దడిసి అతను మౌనంగా ఊరుకున్నాడు.
    పదకొండు ఆయె సరికి సుభద్రమ్మ "వంట పూర్తయింది రండి" అంటూ ఆహ్వానించింది.
    రాఘవులు వెళ్ళిపోయాడు.
    రాధ గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చుంది.
    సుభద్రమ్మ వడ్డన చేస్తూనే మౌనంగా ఉన్న బావా మరుదులను కలపాలని ప్రయత్నించింది.
    "మా తమ్ముడు ఇవాళే పోదాం అంటున్నాడు." అంది.
    చలపతి తలెత్తి "వచ్చి ఒక్క రోజయినా కాలేదు. అప్పుడే ఏం తొందర రెండు రోజులుండండి " అన్నాడు.
    రంగనాధం "అవతల సెలవు లేదు. రెండు రోజులు మాత్రం అప్లయి చేశాను" అంటున్నాడు.
    "ఒరేయ్ నీకంటే అంతా స్వేచ్చ స్వతంత్రం అడిగేవారు లేరు. అందరికీ అలా ఎలా కుదురుతుందిరా? తలలు అమ్ముకున్న వాళ్ళు ఒకరి చేతుల్లో ఉండేవాళ్ళకి అలా ఎలా కుదురుతుంది. వెళ్ళనీ మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడుగా"
    "సరే వారంతగా వెళ్ళాలంటే ఎలా ఆపటం."
    సుభద్రమ్మ ముక్కు నులుపుకుంటూ "మేము అతనితో పాటే ప్రయాణం." అంది.
    చలపతి అంతగా రోక్కించలేదు. "సరే అయితే" అన్నాడు.
    రాజశేఖరం ఓ పది నిముషాల సేపు సంసారం గురించి, సంసారంలో భార్య భర్తలు ఒకర్ని ఒకరు అర్ధం చేసుకుని సంసారం చేసుకోవాల్సిన అవసరం గురించి భర్తలు భార్యలను కేవలం చెప్పు చేతల్లో ఉంచుకునే యంత్రాలుగా గాక వాళ్ళకి కోరికలూ, గౌరవాలు ఉంటాయని గుర్తించి మొగవాళ్ళు మసులుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భం లోనూ కలగజేసుకో కూడదని ఇలా ఉపాయాలూ, సూక్తులు చాలా చెప్పాడు.
    చలపతి ఊ కొడుతూ వింటున్నాడు. సుభద్రమ్మ మధ్య మధ్య ఎగతాళి గా భర్తను దేప్పుతుంది.
    "వాళ్ళు విననీ వినకపోనీ చెప్పటం మన ధర్మం. చెప్పినట్టు వింటారా వాళ్ళ సంసారం సుఖజీవన సారం అవుతుంది. వినరూ వాళ్ళే గిల్లి కజ్జాలతో ఇల్లు నరకం చేసుకుని బాధలు పడతారు."
    "వింటాం లే అన్నయ్యా" అన్నాడు చలపతి.
    రంగనాధం ఉలకలేదు. పలకలేదు.
    సుభద్రమ్మ అంది "వాళ్ళు చెల్లెలికి చెప్పవలసినవన్నీ అక్కడే చెప్పేశారు. 'ఒకరు కాదు నలుగురు చెప్పారు' అంది.
    "నువ్వు ఆ పంచి పెట్టె చలిమిడి ఇతర పదార్ధాలు నాలుగిళ్ళలో ఇచ్చేసి ఇట్టే తెమలాలి. ఆలస్యం పనికి రాదు. సాయంత్రం అయిదు అయేసరికి మనం స్టేషను ఫ్లాటు ఫారం మీద ఉండాలి.' అన్నాడు రాజశేఖరం.
    వాళ్ళు అయిదు గంటలకి వెళ్ళిపోయారు.... స్టేషను ప్లాటు ఫారం మీద అయిదున్నర అయేసరికి చలపతి, రాధ, రాఘవులు మిగిలారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS