Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 14


    "ఏం బ్రదర్ - చాలా రోజుల తర్వాత దర్శన మిచ్చావు...." అన్నాడు డేవిడ్ చలపతిని పలకరిస్తూ.
    "నువ్వు నన్ను బ్రదర్ అని పిలిచావు. అంటే నా చెల్లెలు నీకూ చెల్లెలేకదా!" అన్నాడు చలపతి.
    "అవును కాదని ఎవరన్నారు?"
    "కాదని ఎవరూ అనలేదు. నీ చెల్లెలికి అవమానం జరిగితే కాదని ఊరుకోగలవా నువ్వు?" అన్నాడు చలపతి.
    "అర్ధమయింది. ఆ వెధవెవడో చెప్పు, వాడికి బుద్ది చెప్పి తీరతాను-" అన్నాడు డేవిడ్ ఆవేశంగా.
    "వాడి పేరుసురేష్. చైర్మన్ కొడుకు-" అన్నాడు చలపతి.
    డేవిడ్ ఆవేశం చల్లారిపోయింది-"విషయమేమిటో విపులంగా చెప్పు బ్రదర్!"
    "చెప్పడానికేముంది?" అంటూ క్లుప్తంగా జరిగింది చలపతి.
    "అయితే ఇప్పుడేం చేయమంటావ్?" అన్నాడు డేవిడ్.
    "ఆ సురేష్ గాణ్ణి చంపేయాలి!"
    "వీలుపడదు...." అన్నాడు డేవిడ్ - "న్యాయస్థానాలే ఉరిశిక్షను రద్దుచేయాలనుకుంటున్నాయి. ఎంత దుర్మార్గుడినైనా సరే సంస్కరించడానికి ప్రయత్నించాలి. సురేష్ చేసింది పెద్దతప్పు కాదు...."
    "ఏమిటీరోజు-నీతి సూత్రాలు వల్లెవేస్తున్నావు?" అన్నాడు చలపతి.
    "అవునుగానిచోట అధికులమనరాదు...." అన్నాడు డేవిడ్.
    "అంటే?"
    "రామ రావణ యుద్దంలో రావణాసురుడు చివరి దాకా చావలేదు. రాజులంటే వాళ్ళే! తాము సృష్టించిన యుద్దంలో కూడా చివరిదాకా మిగిలి ఉండగల్గుతారు. యుద్ధం మంచిదా, శాంతి మంచిదా అని ఆలోచించు కునేందుకు వారికి బోలెడు వ్యవధి ఉంటుంది. చైర్మన్ కూడా ఈ ఊరికి రాజులాంటివాడు. నేను రాజుల తొత్తును. అందుకే హత్యలుచేసినా ఇంకా జైలుబయటే ఉన్నాను...."
    "నువ్వింత స్వార్ధపరుడవని అనుకోలేదు. నీ స్వార్ధం కోసం నీ చెల్లెలి అవమానాన్ని కూడా సహించదల్చుకున్నావు...." అన్నాడు చలపతి నీరసంగా.
    "నా స్వార్ధం విషయం అటుంచు. పద్మిని నాకు వరుసకు చెల్లెలు. కానీ నీకామె తోడబుట్టిన ఆడపడచు. ఆమెకు అవమానం జరిగితే స్వయంగా ప్రతీకారం తీర్చుకోక మధ్య నా దగ్గర కెందుకు వచ్చావ్? అది నీ స్వార్ధంకాదా?" డేవిడ్ సూటిగానే ప్రశ్నించాడు.
    చలపతికి ఏమనాలో తెలియలేదు.
    డేవిడ్ సానునయంగా - "నేనిలాగన్నానని కోపగించుకోకు. సూర్యుడివైపు ఎగరాలనుకుంటే పక్షి రెక్కలు కూలి పడిపోతుంది. అవమానాల విషయాల్లో కూడా మనకు పట్టూ విడుపూ ఉండాలి-" అన్నాడు.
    చలపతి అతడి మాటలు వింటూ - "నువ్వన్నదీ నిజమే! సురేష్ కు నేనే స్వయంగా బుద్ది చెప్పటమే సబబు-" అన్నాడు.
    "అరే-అఘాయిత్యం తలపెట్టకు. అది నీ వంటికి సరిపడదు.." అన్నాడు డేవిడ్. చలపతి అతడి మాటలు వినకుండా అక్కనించి కదిలాడు.
    
                                      8

    రాజమ్మ, సీతమ్మ - పెన్సిల్సు పట్టుకుని సిద్దంగా ఉన్నారు.
    "ఎస్-ప్రొసీడ్!" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న .
    "నామీద ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నదని అనుమానంగా ఉంది-" అన్నాడు సురేష్. అతడి కనులలో ఆందోళన స్పష్టంగా కనబడింది.
    "అందుకు కారణం?" అనడిగాడు వెంకన్న.
    "ఇదీ అని చెప్పలేను సార్! మీరు డిటెక్టివ్ లు. అన్నీ పరిశోధించి వివరంగా తెలుసుకోవాలి. నేను పద్మిని అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్నాను. మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఈలోగా ఆమె నన్ను అనుమానించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవెలా సరిదిద్దాల అనుకునేలోగా ఆమెను అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఇది యెవరో కావాలనే చేశారని ఇప్పుడు నాకు అనిపిస్తోంది..." ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకున్నాడు సురేష్.
    "ఎందువల్ల?" అన్నాడు వెంకన్న.
    "నిన్న సాయంత్రం పార్కులో నామీద హత్యాప్రయత్నం జరిగింది. నేను మరోసారి పద్మినితో అన్ని విషయాలూ స్వయంగా మాట్లాడాలనుకున్నాను. ఆమె ఇంటికి కబురుపెట్టి పార్కులో ఎదురుచూస్తున్నాను. ఆమె రాలేదు. అప్పుడు నామీదకు వచ్చి పడిందొక వస్తువు. అది ఒక కత్తి! అదృష్టవశాత్తూ నాకు పిడివైపు తగిలింది. కత్తి చాలా పదునుగా వుంది...."
    వెంకన్న అందుకుని చూసి-"నీమీద కత్తి విసిరిన వాడు ఇలాంటి పనులకు కొత్తవాడైనా అయుండాలి. లేదా చంపకుండా నిన్ను బెదిరించటమే అతడి ఉద్దేశ్యమయుండాలి-" అన్నాడు.
    సురేష్ నెమ్మదిగా-"నేనీ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ హత్యా ప్రయత్నానికీ, నా వివాహానికీ సంబంధమున్నదని నాకు అనుమానంగా ఉంది. మీరు పరిశోధించి అర్జంటుగా నాకే విషయం చెప్పాలి. ముఖ్యంగా మీరు శేఖర్ ఎవడో ఈ నాటకంలో అతడి పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటికే పెద్దలకు సంబంధించినంత వరకూ మా వివాహం రద్దయిపోయింది. కానీ ఒకందుకు నాకు బాధగా ఉంది. నాలో అవలక్షణాలున్నట్లు ఒక యువతి ఆరోపించింది. ఆ యువతి యెవరో నాకు తెలియదు, నేను పవిత్రుడనని పద్మినికి తెలియాలి. నేను ఆడపిల్లలతో ఆడుకునే మనస్తత్వం గలవాడిని కాను. ఇది మీరు ఆమెకు తెలియజెప్పాలి-" అన్నాడు.
    "కానీ నీ గురించి నాకు తెలియదే!" అన్నాడు వెంకన్న.
    "డిటెక్టివ్ లు మీరు నా గురించి తెలుసుకోడానికి ఎంతోసేపు పట్టదు. మీకు న్యాయమని తోచిందే ఆమెకు చెప్పండి-" అన్నాడు సురేష్. అతను వెయ్యి రూపాయలు బల్లమీద ఉంచి-"ఇది అడ్వాన్సు.....నామీద హత్యా ప్రయత్నం చేసినవాడి ఆచూకీ సంపాదించడం, నా వివాహం ఆపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవటం, పద్మినికి నా మంచితనం వివరించటం-ఇవీ నేను మీనుంచి కోరేది....." అన్నాడు.
    వెంకన్న వెయ్యి రూపాయలూ తీసుకుని జేబులో పెట్టుకుని-"నీవు నాకు కొన్ని అడ్రసులు చెప్పాల్సి ఉంది-" అన్నాడు. సురేష్ చెబుతూంటే సీతమ్మ రాజమ్మ నోట్ చేసుకున్నారు.
    సురేష్ వెళ్ళిపోయాడు. అతడు గుమ్మందాటిన మరుక్షణం టెలిఫోన్ మ్రోగింది. సీతమ్మ, రాజమ్మ, వెంకన్న ముగ్గురూ తమ యెదురుగా ఉన్న రిసీవర్లు తీసుకున్నారు. ఫోన్ లో ఏ సంభాషణైనా డిటెక్టివూ, అతడి అసిస్టెంట్సూ ఒకేసారి వినే సదుపాయముంది.
    "హలో!" అన్నాడు వెంకన్న.
    "డియర్ డిటెక్టివ్ వెంకన్నా! అంది ఫోన్ లో కంఠం-"నువ్వంటే నాకు ఎంతో గౌరవముంది. సురేష్ మీద కత్తి విసిరినవాడు పద్మిని అన్న చలపతి. హత్య చేయాలన్న ఆవేశముంది కానీ తెలివిలేదు. మొదటి ప్రయత్నం విఫలంకాగానే చప్పబడిపోయాడు. అతడి గురించి తెలుసుకుని నీకు ప్రయోజనముండదు. ఇంక మిగతా విషయాలూ విచారించనవసరంలేదు. అని నీకు ముఖ్యంకాదు. సురేష్ ఇచ్చిన ఫీజంటావా? దాని గురించి సంజాయిషీ ఇచ్చుకునేందుకు అతడు రేపటిదాకా ఉండడు. అందుకని ఈ కేసుకోసం నీ సమయం వృధా చేసుకోకు. నీ సమయం విలువ తెలిసినవాడిని కాబట్టి చెబుతున్నాను....."
    అవతల క్లిక్ మంది.
    "చాలా ఆశ్చర్యంగా ఉంది!" అన్నాడు వెంకన్న .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS