9
"వేణుకు తనంటే అంత నమ్మకం ఎందుకు? అతను లేకపోతే తను తప్ప, ఆఫీసు మానేజ్ చేసేవారెవ్వరూ లేరా? గోవిందరావుగారు ఎన్ని సార్లు పనిమీద ఊరికి వెళుతూ, హెడ్ క్లర్కును ఇన్ ఛార్జిగా వేసిపోలేదు? మరి వేణు తన కెందుకీ బాధ్యత ఇచ్చినట్లు?
'పాతిక వేలకు పైగా నగదు బీరువాలో ఉంది. ఇంకా డబ్బు కావలసివస్తుందేమోనని, చెక్ బుక్ మీద సంతకాలు పెట్టి ఇచ్చాడు. తన నిజాయితీని పరీక్షిస్తున్నాడ?' ఆ రెండు రోజులూ సునీత కివే ఆలోచనలు. పండుగకు రెండు రోజులు, మొదటి రోజు ఆదివారం, మొత్తం సెలవు మూడు రోజులు. సంక్రాంతి ఒక్క రోజు తప్ప, భోగినాడు, ఆదివారంకూడా ఆమె పని చేసింది. ఇతర గుమాస్తా లెవరూ రాలేదు. ఆఫీసు రూంకు సంబంధించినంతవరకు, వేణు ఆశ్రద్దగా , అసంపూర్తిగా వదిలిన ఫైళ్ళను పూర్తిచేసింది. షెల్ఫ్ లో క్రమం అంటూ లేచి ఫైళ్ళను చక్కగా సర్దింది. అవసరంగా సంప్రదించవలిసిన కంపెనీలకు ఉత్తరాలు వ్రాసింది.
పండుగే అయినా, సంక్రాంతిరోజు పెద్ద విశేష మేమీ లేదు, తలంటుకోవటం తప్ప. నీలకంఠం తల్లిదండ్రులు ఉత్తరం వ్రాయటంచేత ఇంటికి వెళ్ళాడు. యాదగిరి కొడుకులిద్దరూ రమ్మని వ్రాశారు గానీ, ఆయన వెళ్ళలేదు.
ఆ రోజు వాళ్ళు ముగ్గురూ కలిసి సమష్టిగా వంట చేసుకున్నారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక విశ్వం ఇంటికి వెళదామని బుద్ధి పుట్టింది. వెళదామా వద్దా అనుకుంటూండగానే, అలసటగా కళ్ళు మూతలు పడ్డాయి. సాయంత్రం వెళదామనుకుని నిద్రపోయింది. అనుకున్నట్లు ఆమె సాయంత్రం వెళ్ళింది. విశ్వం లేడు. ఇంటికి తాళం వేసిఉంది. 'పండుగకు వెళ్ళారేమో?' అనుకుని పబ్లిక్ గార్డెనుకు దారితీసింది. జూ వైపు వెళుతూంటే పచ్చికలో విశ్వం, అతని పక్కన మరొకామె, వాళ్ళిద్దరి మధ్యా ఏడాది పసివాడు గడ్డిలో కనబడ్డారు. ఆమె విశ్వం భార్య కావచ్చు. ఆ పిల్లవాడి మాటలను వింటూ, మధ్య మధ్య విశ్వంకేసి చూస్తున్నది. సునీత కేక వేద్దామనుకుంది. తనే పిలిచినా, మాట్లాడించినా అతని భార్య ఏమైనా అనుకోవచ్చని విరమించుకుంది.
తల తిప్పేసరికి నిలుచుని తమవైపే చూస్తున్న సునీత కంటబడింది. అతను నిర్మలవైపు చూస్తూ, "ఆవిడ నీకు తెలుసా ? అలా మనిద్దరివైపూ చూస్తున్నది" అన్నాడు సునీతను చూపిస్తూ.
పెదిమను వేలితో ఒత్తుతూ, "అంతగా వెళ్ళి మాట్లాడాలనుంటే వెళ్ళండి! నన్ను అలా అడగట మెందుకు?" అన్నది ఆమె.
"ఇక అన్నీ అనుమానాలు!"
"అనుమానమా? ఛ! ఆమె మీ క్లాస్ మేట్ అయి ఉంటుంది."
"అదే! అదే!" అప్పటికే సునీత వెళ్ళిపోతున్నది. గబ గబా దగ్గిరికి వెళుతూ "సునీతా! ఓ సునీతా! అలా వెళ్ళిపోతున్నావేం?" అన్నాడు విశ్వం.
"వట్టివే."
"సర్లే, నిర్మలను నువ్వు చూడలేదు కదూ? బాణీ కూడా కొన్నాళ్ళనుంచి 'అత్త, అత్త' అని కలవరిస్తున్నాడు. చూద్దువుగాని రా!"
"ఎందుకులే విశ్వం!"
"రె! నేను నీతో మాట్లాడి వచ్చేస్తే నే నేదో గూడుపుఠానీగాడినని శ్రీమతి సందేహంతో ...తెలుసు గా ?"
వెళ్ళక తప్పేటట్లు లేదు.
వాళ్ళిద్దరూ నిర్మలను సమీపించారు. తనేదో అంటే, విశ్వం నిజంగానే సునీతతో పూర్వ పరిచితుడిలా మాట్లాడటం, ఆమెను వెంటబెట్టుకుని తన వైపే రావటం చూసి నిర్మల వింతపడింది.
విశ్వం పరప్సర పరిచయాలు కానించాడు.
గడ్డిలో ఆడుకుంటున్న పసివాడిని ఎగరేసి, "బాల విశ్వనాథ్. నేమ్ నిర్మలా ప్రసాద్. నిక్ నేమ్ బాజీ" అంటూ సునీతకు అందించాడు. సునీత చేతికి ఉన్న రంగురంగుల బాగ్ ను చూసి, బాజీ సునీత దగ్గిరికి రావటానికి ఏడవలేదు. సునీత బాజీ బుగ్గలను ముద్దు పెట్టుకున్నది.
సునీతను చూసిన నిర్మలకు, ఆమె పట్ల ఆకర్షణ గానీ, వికర్షణగానీ కలగలేదు. సునీతకు మాత్రం నిర్మల అంటే భక్తి లాంటి భావం ఏదో కలిగింది. నిర్మల అందం చాల సాధారణమైంది. కాని ఆమెలో ఒక విధమైన స్వచ్చత, గృహిణికి ఉండే ఒక గర్వం, ఏదో నిండుదనం ఉన్నవి.
ఉప్పాడ జరీ చీర ఆమెను మరింత తీర్చిదిద్దుతున్నట్టుంది. తలంటుకుని నూనె రాయకుండా వదిలిన ముంగురులు గాలికి అల్లరి చేస్తున్నాయి. ముఖంమీద తారాడుతున్న కేశాలమధ్య, నయాపైసంత కుంకుమ బొట్టు మబ్బుల్లో దోబూచులాడుతున్న చందమామలా ఉంది. ఏ రంగూ వెయ్యకపోయినా, ఎర్రగా ఉన్న పెదవులు, నవ్వితే తెల్లగా మెరిసే పలువరస - విశ్వం తనలో మెదిలే భావాలకు రూపకల్పన చేసుకున్నట్లు ఉందామె.
ఇంచుమించు తన ఈడే ఉన్న నిర్మలనూ, తననూ పోల్చి చూసుకుంటూంది సునీత. ఆమెకూ, తనకూ ఎంతో తేడా ఉంది. నిర్మల చూపులో ఒక గర్వం, సంతోషం, తృప్తి. క్షణకాలం ఆమె అదృష్టానికి ఈర్ష్య పడింది. తన జీవితానికి ఆ అదృష్టం లేదు. తను వాసన లేని పువ్వుగానే పుట్టింది. మోడులాగే జీవిస్తున్నది. చివరికి అలాగే మట్టిలో కలిసి పోవచ్చు. తనకు నిర్మలలా 'అమ్మా' అని పిలిపించుకునే సౌభాగ్యం లేదు. తను మాత్రం పిలిచిందా? తన జీవిత పరమార్ధం ఏమిటి? తను జన్మించటం ఎవరికోసం....
నిర్మల విశ్వాన్ని చూస్తూంది. విశ్వం సునీతను చూస్తున్నాడు. సునీత బాజీని చూస్తున్నది. బాగ్ తో ఆడుకుని, అదీ నచ్చక సునీత మెడవైపు చూసి, ఆమె మెడలో అమ్మలా ఆడుకోడానికి ఏమీ లేకపోవటంవల్ల తనను 'అమ్మ ఎప్పుడు ఎత్తుకుంటుందా?' అన్నట్లు చూస్తున్నాడు బాజీ.
విశ్వం సునీత వదనంలో భావాలు చదవ ప్రయత్నిస్తున్నాడు. నిర్మల విశ్వం ఆంతర్యాన్ని కనుక్కోవాలని చూస్తూంది. సునీత తన స్వగతాల్లో కొట్టుకుంటున్నది.
బాజీ తల్లివైపు చేతులు చాచారు. నిర్మల వాడిని అందుకున్నది.
"ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, సునీతా?"
సునీత తేరుకుంది. "ఏం లేదు, విశ్వం, నీ శ్రీమతిని గురించి." ఏదో ఒకటి చెప్పాలి గనక.
"ఆఁ, వట్టి పల్లెటూరి మొద్దు."
"మాట్లాడితే నన్ను చెప్పటం, ఎప్పుడు అదును దొరుకుతుందా అని చూడటం!"
"కాలేజీలో ఉండగా పేర్లు పెట్టిన నోరు." సునీత నిర్మలకు సపోర్టు ఇచ్చింది.
"ఆ బుద్దులెక్కడికి పోతాయి మరి?"
"ఇద్దరూ ఒకటయ్యారూ? మీ ఆడజన్మమే అంత. పదిమందీ మెదిలే పార్కులో పట్టుకుని ఇద్దరూ నన్ను దులపడం. బావుంది. ఎవరైనా చూస్తే నవ్వు తారనిగూడా లేదు."
సునీత నిట్టూర్చింది. 'నిర్మల పూర్వజన్మ సుకృతం' అనుకుంది.
పొద్దు గూకుతున్నదని నిర్మల అన్నది.
"ఒకసారి ఇంటికి రాకూడదూ?" అన్నాడు విశ్వం. సునీతను చూస్తూ.
"ఎప్పుడైనా వస్తాలే, విశ్వం!"
"ఇవ్వాళ తీరకపోతే మరెన్నడూ తీరదు. అన్నట్లు ఇవ్వాళ పండుగ కదూ? స్పెషల్ ఏమిటి?"
"నాకేం పండుగ విశ్వం? డబ్బున్నవాళ్ళు చేసుకుంటారు!"
"మరి మేం చేసుకున్నాం కదా?"
"ఆఁ! కావచ్చు! మీ మనసులు రసవంతమైనవి!"
"అంటే?" విశ్వం సందేహం.
"అంటే, అది నువ్వే ఆలోచించుకో బస్సు వస్తూందేమో?" ముందుకు నడిచింది. మెయిన్ గేటు దాటి కొంత దూరం వచ్చాక, బస్ స్టాప్ దగ్గిర సునీత ఆగిపోయింది. వాళ్ళు ముందుకు వెళుతూంటే బాబీకి "టా! టా!" చెప్పింది సునీత.
"విచిత్రమైన మనిషి!" నిర్మల వ్యాఖ్య.
"కాదు, నిర్మలా! జీవితపు లోతులేమిటో బాగా తెలిసిన వ్యక్తి, జీవనప్రవాహానికి ఎదురీదటం ఆమెకు బాగా చేతనవును, తపనపట్టి చూడాలనుకున్నవాళ్ళకు గుణపాఠాలు చెప్పటంలో ఘటికురాలు. ఆమె జీవన విధానం మన జీవితాలకు ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక పట్టాన అర్ధంకాని మనస్తత్వం."
సంక్రాంతి గడిచింది. మరొకరోజు కూడా వెళ్ళింది.
మరునాడు పదకొండు గంటలకు పోస్టు వచ్చింది. అందులో సునీతకు గూడా ఓ కవరు ఉంది. ఆ వ్రాత ఆమెకు తెలీదు గానీ, కింద ఫ్రమ్ అడ్రసు ఆర్తి దగ్గరనుంచి వచ్చినట్లు చెబుతూంది. సునీత కుతూహలంగా విప్పింది. నాలుగు కాగితాలు ఉన్నాయి. అందులో ఒకటి వేణు వ్రాశాడు. ముందే అది చదివింది. కొద్దిగానే వ్రాశాడు.
"ఇన్ ఛార్జి మానేజర్ సునీతాదేవికి,
ఇవ్వాళే పండుగ, హఠాత్తుగా నువ్వు గుర్తుకు వచ్చావు. అప్పటికీ ఉత్తరం వ్రాయాలన్న ధ్యాస కలగలేదు. అక్కయ్య కవరు (నీకు) పోస్టు చెయ్యడానికి పంపిస్తుంటే, వ్రాద్దామనిపించింది. మళ్ళీ కవరు ఊడదీసి, ఇది అందుతో పెట్టి, అంటించి పంపుతున్నాను.
అన్నిట్లోనూ నాకు సలహాలిచ్చే నీకు, అంత కష్టంగా లేదనుకుంటాను. క్లర్కులూ, ఫ్యూన్లూ నీ పరిపాలనను అంగీకరించారా? వాళ్ళను కఠిన శాసనానికి తల వంచేట్లు చేశావా? నీపాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? విప్లవకారులను...."
సునీత నవ్వుకుంది. మిగతా అయిదారు పంక్తులా అదే ధోరణిలో ఉన్నాయి.
ఆర్తి ఉత్తరంలో మాత్రం అసలు మొదలే విచిత్రంగా ప్రారంభించింది.
"పాపా!
నిన్ను ఇలా పిలవాలని అనుకోటానికి ఒక చిన్న కారణం ఉంది. అది అప్రస్తుతం. కనక వదిలేస్తున్నాను.
ఏమిటో? మొదటిసారి నిన్ను చూసినప్పుడు నేను ఒక ఆకర్షణకు లోనయ్యాను. గాఢంగా కౌగిలించుకుని తనివిదీరా పాపాయిలా ముద్దు పెట్టుకోవాలనిపించింది. సన్నగా, తీగరాగంలా ఉండే నీ స్వరం నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. భావగర్భితమైన నీ మాటలు అగాధంలో అణగారిన స్మృతులను వెలికితియ్య ప్రయత్నిస్తున్నట్లుంటాయి. నీ పెదవు లకు శోభ కూర్చే నీ నవ్వు ఒక అనుభూతిని కలిగిస్తూంది.
నాకన్నా చిన్నదానివి. కానీ, నీకున్న లోకజ్ఞానం నిన్ను అప్రతీభురాల్ని చేసింది. వేణు చెప్పాడు, తమ్ముడు విశ్వం తప్ప ప్రపంచంలో ఎవరన్నా నీకు లెక్కలేదని, కాదు, ఉన్నారు. అదెవరో తెలుసా? నేను. ఎందుకో నేనంటే గౌరవం చూపిస్తావు. అది నీకు తెలీకుండానే జరగవచ్చు. ఏమైనా నేను నీ ఆదరాభిమానాలను సంపాదించుకున్నందుకు సంతోష పడుతున్నాను.
ఎన్నోసార్లు నా జీవితాన్ని నీ ముందు చెప్పుకోవాలనుకున్నాను. వేణు చెప్పేఉంటాడని ఊరుకునేదాన్ని. ఒకవేళ చెప్పి ఉన్నా మళ్ళీ నీతో చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు, మరెప్పుడైనా.
నువ్వు ఒక్కదానివేనట! నాకూ తెలుసు. కాని నువ్వెన్నడూ అలా అనుకొని నిరాశపడకు. నేను, నాన్న, విశ్వం, వేణు అందరమూ నీ బంధువులమే. నువ్వూ మా కుటుంబంలో ఒకదానివి. మేము వేరు, నువ్వు వేరని అనుకోకు. మా నుండి నీకేం కావలసినా, అభ్యర్ధించికాక స్వతంత్రంగా తీసుకోవచ్చు. నా ఇంట్లో, హాస్పిటల్లో నువ్వు వెళ్ళరాని చోటు ఉండదు. ఆఖరుకు నా మధురమైన గతాలకు అలవాలమైన హాస్పిటల్ ప్రైవేట్ రూమ్, ఇంట్లో బెడ్ రూం - అన్నింటిలోను నువ్వు తిరగవచ్చు.
ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితం జీవించటం పూల బాట అనుకున్నాను. చెప్పలేని విషాద సంఘటన ఒకటి, కొన్ని ఏళ్ళు లోకంలో జీవించినందుకు మనం పొందే ఫలం మరణం అని స్ఫురింపచేసింది. మళ్ళీ చాలా కొద్ది ఏళ్ల క్రితం, మనం మరణించినా అంతకుముందు జీవితంలో మాధుర్యం అనేది ఉంటుందని తెలుసు కున్నాను. అది నా మరణం వరకూ ఉంటుందనుకున్నా. కానీ.....కానీ.... నేను దురదృష్టవంతురాల్ని, పాపా....
కొన్నాళ్ళు ఇలాగే గడిచిపోవచ్చు. అప్పటికి నా నిరీక్షణ నిష్ఫలం అయితే, జీవనరథం కుంటుపడింది కనక, నీ ఆసరా తీసుకుంటాను. నువ్వు నాకు చేయూత ఇవ్వాలి. నువ్వు కాకపోతే మరెవ్వరూ ఇవ్వలేరు.
ఒక సమయం తప్పకుండ వస్తుంది. అప్పుడు మన జీవితాలు ఒక ప్రళయాన్ని చూడవచ్చు. తత్ఫలితంగా మనం అందరమూ కలుసుకుంటాం. లేదా తలా ఒక తీరానికి చేరుకుంటాం. ఎందుకు నేనిలా అనుకుంటున్నానో చెప్పలేను.
రేపు మళ్ళీ ఎప్పుడు వస్తామో అదంతా వ్రాస్తాను.
నీ
డాక్టర్ ఆర్తి."
ఆర్తి వ్రాసినట్లు మరునాడు ఒక కార్డు వచ్చింది. అందులో -
"పాపా!
రాత్రి నువ్వు కలలో కనిపించావు. నన్ను ఓదార్చావు. నా నిరీక్షణ ఫలిస్తుందని చెప్పావు. ఇవ్వాళ మొదటిసారిగా మళ్ళీ ఆశాజీవి నయ్యాను.
పెద్దక్క ఇంకో అయిదారు రోజులు ఉండమంటున్నది. తప్పేటట్లు లేదు.
