Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 13


    సిగ్గుతో ఆమె శరీరం కుంచించుకుపోయింది.
    "చాలా అర్జంటుగా మీతో మాట్లాడాలి. ఒక్క అయిదు నిమిషాలు ప్లీజ్!" అన్నాడు శేఖర్.
    అతడి ముఖంలో అర్ధింపు చూసి కాదనలేకపోయింది ఆమె. పక్కనే పాకు వుంది. ఇద్దరూ పార్కులో కెళ్ళారు.
    "నేను నిన్న మీ మనసును కష్టపెట్టి ఉంటాను. నన్ను మన్నించండి-" అన్నాడు శేఖర్.
    "ఇప్పుడేం జరిగింది?" అంది పద్మిని.
    "నేను సురేష్ ను కలుసుకున్నాను. 'డబ్బుకోసం ఇంత వరకూ అంధరాడవాళ్ళూ నా మాట విన్నారు. కానీ పద్మిని అందరివంటిదికాదు. నేను నిజంగా వివాహం చేసుకుంటాననే నమ్ముతోంది. అలాంటి యువతిని నీ దగ్గరకు పంపినందుకు మన్నించు-' అని అన్నాడు. ఇప్పుడు మిమ్మల్నెలా వదుల్చుకోవాలా అని చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడతను-" అన్నాడు శేఖర్.
    పద్మిని విని ఊరుకుంది. మనసులోమాత్రం-"అదే జరిగితే చాలా మంచిది. ఈ వివాహం ఎలా తప్పించాలా అని నాన్న కూడా ఆలోచిస్తున్నాడు-" అనుకుంది.
    శేఖర్ ఆమె వంకనే పరీక్షగా చూస్తూ-"సురేష్ చాలా దుర్మార్గుడు. మిమ్మల్ని వదిలించుకోవడంకోసం మీమీద ఎంతటి దారుణమైన అభాండాన్నయినా వేయగల సమర్ధుడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి-" అన్నాడు.
    "ఇది చెప్పడానికేనా మీరు వచ్చారు? చాలా థాంక్స్!" అని మర్యాదగా లేచి నిలబడింది పద్మిని.
    "నా అసలు ఉద్దేశ్యం అది కాదు. మీవంటి ఓ మంచి అమ్మాయిని బజారు మనిషిగా భావించి అమర్యాదగా మాట్లాడాను. సారీ చెప్పుకుంటే తప్ప మనసుకు స్థిమితముండదనిపించి ఇలా వచ్చాను-..." అన్నాడతను.
    పద్మిని మౌనంగా అక్కణ్ణించి బయల్దేరింది. శేఖర్ అక్కడే ఆగిపోయాడు. అతడు కదుల్దామనుకునేలోగా ఓ యువకుడు అక్కడికి అవ్చ్చి - "ఎవర్నువ్వు?" అన్నాడు.
    శేఖర్ ఆశ్చర్యంగా అతడివంక చూసి-"నా పేరు శేఖర్. కనీ నేనెవరినైతే నీకేం?" అని అడిగాడు.
    "అంతా తర్వాత చెబుతాను. ఇందాకా నీతో మాట్లాడిన యువతి ఎవరు?" అనడిగాడా యువకుడు.
    "ఆమె నా ప్రియురాలు. పేరుపద్మిని...." అన్నాడు శేఖర్.
    "ప్రియురాలంటే-ఊరికే ప్రేమిస్తున్నావా, లేక పెళ్ళికూడా చేసుకుంటావా?" అన్నాడా యువకుడు.
    శేఖర్ ఓసారి చుట్టూ చూశాడు. తర్వాత నెమ్మదిగా యువకుడితో - "నీకు నాదో సలహా ఆడపిల్లల్ని ప్రేమించడం మగాళ్ళ వంతు. పెళ్ళి గురించి అడగడం ఆడవాళ్ళ వంతు. ఇంతవరకూ ఆమె నా దగ్గర పెళ్ళి ప్రసక్తి తీసుకురాలేదు. పైగా తనకు వేరే సంబంధం నిశ్చయమైనట్లు కూడా చెప్పింది. నేను విచారించడం లేదు. నాక్కావలసింది నాకు దొరుకుతోంది. నువ్వు కూడా ఎప్పుడూ ఆడపిల్లల దగ్గర వాళ్ళు మాట్లాడేదాకా పెళ్ళి ప్రసక్తి తీసుకురాకు-" అన్నాడు.
    ఆ యువకుడి ముఖం కమిలిపోయింది- "పద్మిని ఇలాంటిదనుకోలేదు. నిప్పులాంటిదనుకున్నాను-" అన్నాడు నీరసంగా.
    "ఆమె ఎలాంటిదైతే నీకెందుకు? కొంపదీసి నువ్వు గానీ ఆమెకు కాబోయే భర్తవు కాదుగదా!" అన్నాడు శేఖర్.
    "అవును నా పేరు సురేష్!" అన్నాడా యువకుడు అక్కణ్ణించి వెళ్ళిపోతూ.
    అతడు వెళ్ళిపోయాక శేఖర్ తనలో తాను నవ్వుకున్నాడు.

                                    6

    ఆ సాయంత్రం చైర్మన్ స్వయంగా వరదయ్య యింటికి వెళ్ళాడు. వరదయ్య ఆయనకు బాగా మర్యాద చేశాడు.
    "నేను మర్యాదలందుకుందుకు రాలేదు. మీ సంబంధం వదులుకుందుకు వచ్చాను-" అన్నాడు చైర్మన్.
    వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది వరదయ్యకు. కానీ అయన ఆమాట పైకి అనలేదు. తఃన సంతోషాన్ని బయటపెట్టలేదు - "హఠాత్తుగా ఇలాగంటున్నారు. ఏం జరిగిందండీ?" అన్నాడు.
    "ఏం జరిగిందో తెలుసుకోకపోవటమే మీకు మంచిది-" అన్నాడు చైర్మన్.
    "మీరు మగ పెళ్ళి వారు. ఏమన్నా చెల్లుతుంది. కానీ ఆడపిల్ల తండ్రిగా కారణం తెలుసుకోకపోతే-నలుగుర్లో నేను తలెత్తుకు తిరగలేను-" అన్నాడు వరదయ్య.
    "కారణం తెలియకపోవటమే మంచిది. తెలిస్తే మీ తలపైకి లేవదు-"
    "ఫరవాలేదు-చెప్పండి!"
    "సరే-అయితే చెబుతాను వినండి! మీ అమ్మాయి పవర్తన సరైనది కాదు-"
    పక్కలో పిడుగుపడినట్లు ఉలిక్కిపడ్డాడు వరదయ్య ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది-"మీకు సంబంధం నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కనీ ఆడపిల్ల మీద ఇలాంటి అభాండాలు వేయకండి-" అన్నాడు.
    "ఇది అభాండం కాదు. పచ్చి నిజం...."
    "ఋజువులున్నాయా?"
    "నేను నిన్న చూసి మా సురేష్ తో అంటే వాడు నమ్మలేదు. ఈ రోజు వాడు కూడా కళ్ళారా చూశాడు. ప్రత్యక్షసాక్ష్యానికి ఋజువులు కూడా కావాలా?"
    వరదయ్య ఆవేశపడ్డాడు-"మీకు డబ్బుంది. అధికారముంది. మాబోటివారింటి పిల్లని చేసుకోవటం మీకు ఇష్టంలేదు. అందుకే ఇలాంటి అభూతకల్పనలన్నీ చేసి చెబుతున్నారు. మేమేం మిమ్మల్ని మా పిల్లను చేసుకోమనలేదు. మా పిల్ల మీవాడిని ప్రేమించానని అననూలేదు. ఇప్పుడు నాకంతా అర్ధమవుతోంది. మీరు మా మీద గేలం వేయాలనుకున్నారు. మీక్కావలసింది పెళ్ళికాదు. మా పిల్ల అది సాగదని తెలిశాక ఇప్పుడు మమ్మల్ని వదుల్చుకుందుకు చూస్తున్నారు. మీవాడి గురించి మేమూ చాలా విన్నాం. కానీ మీరు కలవారు కావటంతో వెంటనే వచ్చి ఉన్నమాట అనలేక పోయాం...."
    వరదయ్య ఇంకా ఏదో అనబోతూండగా-"ఇన్ని మాటలొద్దు. మావాడి గురించిన రుజువులు మీరు తీసుకునిరండి. మీ అమ్మాయి గురించిన రుజువులు నేను తీసుకొస్తా. తప్పు నాదైతే లెంపలేసుకుని ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను. కాని పక్షంలో మీ అమ్మాయి చరిత్ర పత్రికల కెక్కుతుంది. ఈ జన్మకు పెళ్ళికాదు...." అని వెళ్ళిపోయాడు చైర్మన్.
    ఆయన వెళ్ళిపోయాక తేరుకునేందుకు చాలాసేపు పట్టింది వరదయ్యకు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు.
    వింటూనే పద్మిని అన్న చలపతి ఆవేశంగా లేచాడు "ఆ తండ్రీ కొడుకులిద్దర్నీ ఇప్పుడే చంపేసి వస్తాను...." అన్నాడు.
    "చలపతీ-పేదవాడి కోపం పెదవికి చేటు. నువ్విప్పుడీ మాటలు అన్నట్లు తెలిస్తేనే చాలు - హత్యదాకా అక్కర్లేదు. నిన్ను జైల్లో పెట్టించడానికి చైర్మన్ సర్వసమర్ధుడు. జరిగిందంతా ఎప్పటికప్పుడు మన పద్మిని చెప్పబట్టి కానీ లేకపోతే నేనే దాన్ని అనుమానించి ఉండేవాణ్ణి. ఆయన నాటకం చాలా తెలివిగా ఆడించాడు. ఇప్పుడు మనం చేయగలిగిందేమీలేదు- మరో సంబంధం వెతుక్కోవడం తప్ప!" అన్నాడు వరదయ్య.
    చలపతి కాస్త తగ్గి-"సరే-మీ వ్యవహారం మీరు చూసుకోండి. మీకు ఇబ్బంది కలిగించని విధంగా నేను వాళ్ళకు బుద్ధి చెబుతాను-" అన్నాడు.
    "వద్దురా బాబూ - నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు. ఆవేశం వస్తే నీకు వళ్ళు తెలియదు....." అన్నాడు వరదయ్య కంగారుగా.

                                    7

    తండ్రిమాటలు విని చలపతి తగ్గిపోలేదు. అతడు తనమిత్రుడు డేవిడ్ ను కలుసుకున్నాడు.
    డేవిడ్ కీ చలపతికీ స్నేహం ఎలా కలిసిందో చెప్పటం కష్టం. ఇద్దరూ భిన్న ధృవాలు. ఒకడు నీడచాటున హాయిగా బ్రతుకుతూంటే రెండోవాడు నీడలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు. డేవిడ్ కిరాయిగూండా అతడు హత్యలు అవలీలగా చేస్తాడని చెప్పుకుంటారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS