Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 13


    "చూడు, నాన్నా, మామ య్యేంచేస్తున్నాడో?"
    "తన చేతి అన్నం తినిపించాలని వాడి ఆరాటం!" వర్ధనమ్మ విసురు.
    "ఛీ!"
    వేణు ముద్ద మింగి నవ్వాపుకుంటూ, "నిజమే! కొద్ది రోజుల్లో అందరూ ఇలాగే అయిపోతారట!" అన్నాడు.
    సిగ్గుతో రాధ తల బరువైంది వాళ్ళ గలగలల మధ్య.

                           *    *    *    *

    వేణు అంటే రాధకు బెరుకు తీరింది.
    పండుగ ముందు భోగిరోజున రాధ నాలుగు గంట లకే లేచింది. బావి దగ్గిర చన్నీళ్ళతోనే స్నానం చేసింది. పెట్టెలో తెల్లని సిల్కు పరికిణీ, నీలం వోణీ, కనకాంబరం రంగు జాకెట్టూ వేసుకుని తలంటుకున్న వెంట్రుకలను నూనె సారి రోజులా దువ్వుకుంటూ, రెండు అల్లికలువేసి వదిలింది. ఆ వేళ చద్దన్నం తినలేదు. పాలు మాత్రం తాగేసింది.
    అందరూ ఒక్కొక్కరే లేస్తున్నారు. వేణు ఏడు కావస్తున్నా లేవలేదు. 'అంత పొద్దెక్కే దాకా ఎలా నిద్ర పడుతుంది? చికాగ్గా ఉండదూ? పగులూ నిద్రే. రాత్రీ అంతే! ఎక్కడినుంచి వస్తుంది? వెళ్ళి పిన్నిని అడిగితే బాగుండును. ఆమె కూడా లేచిందో లేదో? అబ్బ! ఈ పట్నంవాళ్ళు నిద్రకు మొహం వాచినట్లుంటారా ఏం?'
    తల్లి దగ్గిరికి వెళ్ళింది. ముక్కాలి పీటమీద పొందికగా కూర్చుని, "అమ్మా! పిన్నీ, మామయ్యా ఇంకా లేవలేదే?" అన్నది.
    "లేస్తారులే! వాళ్ళు చేసే పనేం ఉంది?"    
    "ప్చ్! అమ్మకూడా అట్లా అంటుందేం? పిన్ని కొంచెం నయంగానీ, మామయ్యే మరీ! అసలు మన మనిషిలా లేడు. వాళ్ళిద్దరూ చద్దన్నం తినరు. ఒట్టి కాఫీ తాగుతారు. ఆ కాఫీ అయినా ఎంత? తనయితే ఒక్క గుక్కలో తాగేస్తుంది. పొద్దున చద్దన్నం తినకపోతే ఆకలి వెయ్యదూ? తను ఇందాకే పాలు తాగినా, అన్నం తినక పోవటంవల్ల అప్పుడే ఆకలి వేస్తూంది.'
    తండ్రి కేకవేశాడు, "వాళ్ళెవరో అడుక్కునేవాళ్ళు వచ్చారు. కాసిని బియ్యంవేసి పంపించు, రాధా!" అని. రాధ లేచి బియ్యం బస్తా దగ్గిరికి వెళ్ళి దోసిలి నిండా బియ్యం తీసుకుని వాళ్ళకు వేసి వస్తూంటే గదిలో నుంచి వేణు ఆవులించిన ధ్వని వినపడింది. ఉత్సాహంగా వంటింటి ముందు గూటిదగ్గిరికి వెళ్ళి, దానిలో ఉన్న రెండు వేపపుల్లలు తీసుకున్నది. అవి పాలేరు చేత విరిపించి, ఆకులు గంట్లు లేకుండా తను స్వయంగా నునుపు చేసింది.
    గదిలో పరిస్థితి తారుమారు.
    వేణు ఎర్రగా ఉన్న పుల్ల నోట్లో పెట్టుకుని, బరా వెళ్ళమీద వేసి రుద్దుతున్నాడు. ఆర్తి అటువంటిదే మరొక పుల్లమీద, ఒక గొట్టంలో నుంచి నొక్కి, తెల్లదేదో వెలుపలికి తీస్తూంది. వేణు నోట్లోనుండి తెల్లని నురగ అలా వచ్చేస్తూంది! కొయ్యబొమ్మలా చూస్తూ నిలుచుంది రాధ.
    "ఓహ్! ప్రాతఃకాలమందే చంద్రముఖి వదనారవింద దర్శన భాగ్యమే! ధన్యులం!"
    వేణు మాటలకు ప్రత్యుత్తరం ఏమీ లేదు. రాధ ఆర్తిని చూసింది. ఆమే అంతే!
    రాధ కదులుతున్నదో, లేదో? మామయ్యేనా మాట్లాడుతున్నది? అదేమిటో? నురగ అలా కక్కేస్తూ ఎలా మాట్లాడుతున్నాడు? పిన్నికూడా నురగ...ఆమె రెప్పవెయ్యటం లేదు.
    రాధ దేన్ని అలా నిర్ఘాంతపోయి చూస్తున్నది? తనను తాను చూసుకున్నాడు వేణు. ఏమీ కనపడలేదు గాని, తను బ్రష్ తీసినప్పుడూ, నోట్లో పెట్టి పళ్ళు తోము తున్నప్పుడూ, ఆర్తి నోటివైపు, బ్రష్ వైపు చూడటం గమనించాడు.
    ఆమె అమాయకత కి జాలి వేసింది. 'వెధవది ప్రైమరీ స్కూలయినా నడవని ఈ పల్లెటూర్లో ఏం ఉంది? చదువు చెప్పించకుండా కూవస్థమండూ కంలా ఉంచారు. రాధ వంటి అమ్మాయి ఈ మారు మూల కుగ్రామంలో ఉంటే ఏం తెలుసుకోగలుగుతుంది? ఈ సారి అక్కయ్యనూ, బావనూ అడిగి కొన్నాళ్ళు హైదరాబాదు తీసుకు వెళ్ళాలి. మరుగుపడ్డ ఈ రత్నానికి మెరుగులు దిద్దాలి.'
    ఈలోగా ఆర్తిని అడిగింది! "అది......అదేమిటి, పిన్నీ?"
    "ఇదా! దీన్నేనా నువ్వు చూసేది? బ్రష్షు అని పళ్ళు తోముకునే సాధనం. దీనిమీద పేస్టు వేసి తోముతారు."
    "బ్రష్షు! పేస్టు!!" పదేపదే అనుకున్నది రాధ.
    తను పట్నవాసి అయినా, కొన్ని మారుమూల గ్రామాల్లో మనుషులెంత అమాయకులుగా ఉంటారో తెలుసు వేణుకు. అతని స్నేహితులు చాలామంది పల్లె టూళ్ళకు చెందినవారే! అతని ప్రియమిత్రుడు విశ్వం పల్లెజీవి. అతని ద్వారానే చాలావరకు పల్లెలను గురించి తెలుసుకోగలిగాడు. వీలు చిక్కినప్పుడల్లా విశ్వం తన స్వగ్రామం తీసుకువెళ్ళి, గ్రామీణుల జీవనవిధానం, నమ్మకాలు, ఆచారాలు అన్నీ వివరించి చెబుతూండే వాడు. అదీగాక వేణు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూండేవాడు.
    రాధకు అసలేమాత్రం వేణు పద్ధతులు నచ్చలేదు. నిన్న అన్నం తినేటప్పుడు చూసింది. మరీ నాలుగు మెతుకులు. ఏమో అనుకుంది. గడ్డ పెరుగు వేసుకుని, ఆవకాయ నంజుకుంటూ అంతా జుర్రేసి, మరి కాస్త తెమ్మంటాడనుకుంది. ఏదీ? తనెంతో ఇష్టపడే వంకాయ అసలు ముట్టుకోనే లేదు. నీటికోసం, తను నాలుగు రోజుల క్రితం పంకజంతో జగడమాడిన సంగతి కూడా విస్మరించి, దాన్ని బతిమిలాడి స్నేహం కలుపుకుని, వాళ్ళ పెరట్లో కోసుకుని వచ్చింది. అప్పటికి ఆ దెంత టెక్కు చూపించిందని? తన శ్రమ అంతా వృథా! వాళ్ళ సోమమ్మకు తన పాత పరికిణీ ఇచ్చిందని, ఎల్లమంద తాత అడగ్గానే, తను అమ్ముకునే గోంగూరలో పెద్ద కట్టలు నాలు గిచ్చాడు. డబ్బులు కూడా తీసుకోలేదు, పాపం! ఆ గోంగూరను అసలు కలుపుకోకపోగా దాని కేవో పేర్లు పెట్టి వదిలేశాడు. తాత అమ్ముకున్నా డబ్బులు వచ్చేవి. అన్నంకూడా తను తినేదానిలో సగం తినలేదు. సరే! పిన్ని అంటే విచారంలో ఉంది కనక, సరిగా తినదు. నాన్న కూడా అన్నాడు బస్తీవాళ్ళు మరీ నాలుగు మెతుకులే తింటారుట! గంట కో కాఫీ ఉంటే, ఇంకేం అక్కర్లేదుట! చాలా నాజూకుగా తింటారుట!
    రాధ ఈ ఆలోచనలతోనే వెళ్ళింది బయటికి.
    ఆ వేళ వేణు కాఫీ వద్దని పాలు తాగాడు. అది రాధకు నచ్చింది.    
    ఆ మధ్యాహ్నం ఆర్తిని ఇంకా అడిగి తెలుసుకోవాలనుకుంది. వేణు, రఘుపతి, వర్ధనమ్మ హాల్లో మాట్లాడుతున్నారు. రాధ ఆర్తి దగ్గిరికి వెళ్ళింది. వెళుతూనే ఆమె చదువుతున్న పుస్తకంలో అస్థిపంజరం అగుపించింది రాధకు. ఒళ్ళు జలదరించింది. "అది దయ్యమా" అని అడిగింది.
    "కాదు! మనిషిలో ఎముకల గూడు. మన శరీరంలో కండరాలన్నీ దీనిమీదే అతుక్కుని ఉంటాయి."
    "నీ కెలా తెలుసు?"
    "నేను చూశాను. నేను డాక్టరీ చదివే రోజుల్లో చచ్చిపోయినవాళ్ళను కోసేవాళ్ళం! రోజు కాకపోయినా వారానికి ఒకసారి, ప్రాక్టికల్ క్లాసు ఉన్నప్పుడల్లా అదే పని."
    "అదేం క్లాసు? అంటే ఏమిటి?"
    "అంటే ఏదైనా మనం స్వయంగా చేసి అది నిజమో, కాదో చూడటం!"
    "నీకు వాంతి రాలేదూ? ఎట్లా కోశావు?"
    "మొదట్లో ఎలాగో ఉండేది! రాను రాను అలవాటయింది."
    "మరి నువ్విప్పుడు మనుషుల్ని కోసి వైద్యం చేస్తావా?"
    "ఆఁ, అవసరం  అయితే తప్పదు."
    "నీ ప్రాణం ఎట్లా ఒప్పుతుంది?"
    ఆర్తి పరిహాసం చేసింది. "నువ్వు నా వెంట కొన్నాళ్ళుంటే తెలుస్తుంది. నీకు కూడా నేర్పుతా గాని, నా వెంట పట్నం వస్తావా?"
    "ఓ మరి ఇందాకా ఆ బ్రష్టు అన్నావు అటువంటివి ఏమైనా తెచ్చావా?"    
    "ఏం, ఉన్నాయి. తాళం చేతులిస్తా చూసుకో!" చేతిలో ఉన్న రింగ్ ఇచ్చింది. సూట్ కేసు దగ్గిరికి వెళ్ళింది. అది తమ ఇంట్లో ఉన్న పెట్టెల్లా ఉండక పోవటం చూసి, ఆర్తి వైపు చూసింది. ఆమె చూపు గ్రహించి, "అది సూట్ కేసు. అంటే గట్టి చర్మంతో తయారు చేస్తారు" అంది.
    తాళం తెరిచింది.
    మొదట్లో రాధను ఆకర్షించింది పేస్ట్ ట్యూబ్. ఇదివర కొకసారి చూసింది కనక, దాన్ని ఆర్తి దగ్గిరికి తెచ్చి, "ఇది నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?" అనడిగింది.
    "తియ్యగా!" వెనకనించి వేణు మాట వినపడ్డది. అతనూ వచ్చాడు. ఈసారి రాధ సిగ్గుపడలేదు. కొంటెగా చూసింది. దాన్ని మూత పెట్టటం, విప్పటం చూసింది కనక, మూత తీసి నొక్కింది. పేస్టు బయటికి వచ్చింది.    
    "రె! రే! అలా నొక్కేస్తే అంతా వెళ్ళిపోతుంది." వేణు అన్నాడు.
    "మళ్ళీ లోపల వెయ్యవచ్చు!"
    "చచ్చాం! టూత్ పేస్టు ట్యూబులోకి తిరిగి ఎక్కించిననాడు మరో వరల్డ్ వార్ వచ్చి, ప్రళయం సంభవించి..." ఆగి రాధవైపు చూశాడు.
    "ఏమవుతుంది? వార్ అంటే ఏమిటి?"
    "అనగా యుద్ధం. ప్రళయం అంటే నీకు వచ్చే కోపం లాంటిది."
    నాలిక చాపి వెక్కిరించి పరిగెత్తబోయింది. వేణు చెయ్యి పట్టుకున్నాడు. రాధ ఒళ్ళు ఝల్లుమంది. మనసు కేదో మధురానుభూతి. వేణు నెత్తిమీద కొట్టాడు. వదిలేస్తూ, "వెళ్ళు!" అన్నాడు. అంత దూరం వెళ్ళి మళ్ళీ వెక్కిరించి పోయింది.

                             *    *    *

    సంక్రాంతి రోజు -
    ఆర్తి దగ్గిర ఉన్న నల్లంచు గులాబీ రంగు పట్టు చీర రాధను బాగా ఆకర్షించింది. "ఇది నేను తీసుకుంటాను, పిన్నీ!" అని స్వతంత్రంగా తీసుకుంది. తల్లి మందలించింది.
    "పోన్లే, అక్కా! ఇప్పుడేమయింది?" ఆర్తి అన్నది.
    "కాదే! దానికి ఉన్నాయి. అవి కట్టవే అంటే, ఉఁహుఁ వినదు. ఇవ్వాళ తీసుకుంది. అది కట్టుకుంటే బాగానే ఉండును. రేపు నువ్వు వెళ్ళాక మళ్ళీ పెట్టెలో వేసేస్తుంది."
    "నాకేం వద్దులే!" మూతి సున్నాలా చుట్టి, దాన్ని అక్కడే పీటమీద పెట్టింది.
    ఆర్తి కొంచెం బాధపడింది. రాధ తల నిమురుతూ, "అమ్మ అట్లాగే అంటుంది. నేను ఇవ్వనంటే బాధ పడాలి. తీసుకో, రాధా!" అంది బుజ్జగిస్తున్నట్లు.
    రాధ కదల్లేదు.
    "తీసుకోవూ?"గడ్డం పట్టుకుని తల ఎత్తింది ఆర్తి. చిన్నగా ముద్దు పెట్టుకుని, "అమ్మ మంచిది కాదు. నువ్వే మంచిదానవు. తీసుకో" అంది.    
    తల్లి వైపు చూసింది రాధ. అది చూసి ఆర్తి అన్నది: "అక్కా! నువ్వెళ్ళు."
    వర్ధనమ్మ తనక్కడ ఉండటం బావుండదని వెళ్ళింది.
    ఆర్తి చీరను రాధ చేతిలో పెట్టి, "పదిహేడేళ్ళు వచ్చాయి. ఇకనుంచీ నువ్వు చీరలు కట్టుకోవటం అలవాటు చేసుకో, రాధా!" అని చెప్పింది.
    రాధ తల ఊపింది.
    గుమ్మంలో వేణు ఎదురయ్యాడు. "హా! ఏమిటీ తస్కరించుకు పోతున్నావు?"
    'చీరలు..."
    "చీరల దొంగతనమా? మొద్దు! అదేం పని?" నెత్తిన మొట్టాడు.
    "అబ్బ!" కొట్టిన చోట తడుముకుంది రాధ.
    "శిక్ష చాలు! ఇక వెళ్ళు."
    కొంత సేపటికి రాధ చీర కట్టుకుని వచ్చింది. యౌవనం తెచ్చి పెట్టిన అందంతో, మామయ్యను చూసి, రాగరంజితమైన చెక్కిళ్ళమీద నునుసిగ్గు పరుగులు తీస్తూండగా, ఆర్తికి పాదాభివందనం చెయ్యబోయింది.
    "అరే, భలేదానివే? ఎవరు చెప్పారు నీకు?" ఆర్తి ఆమె భుజాలు పట్టుకుంది. "అమ్మ!"
    "మరి, అమ్మకు నమస్కరించావా?"
    "ఊఁ!"
    "నాన్నకు?"
    "లేడు రచ్చబండ దగ్గిరికి వెళ్ళాడు."
    రాధ చీరలో నిండుగా ఉంది. వేణు కళ్ళు తిప్పుకో లేకపోయాడు. మళ్ళీ అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చి దృష్టి మరల్చుకున్నాడు.
    ఆర్తి ఏదో దీవిస్తూంది. వేణు కళ్ళు మూసుకున్నాడు. సునీత  రూపం కళ్ళకు కట్టింది. ఎవరో అతని పాదాలు స్పృశించారు. కాళ్ళు వెనక్కు జరుపుకుని రాధను లేవనెత్తాడు.
    "పిన్నిలా దీవించు, మామయ్యా!"
    "ఊఁ. ఏమని దీవించను...? నువ్వు కోరుకున్న భర్త దొరుకుతాడులే, రాధా."
    రాధ ముఖకవళిక లెలా ఉన్నాయో వేణు చూడలేదు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అంతర్నేత్రం ఎన్నో మైళ్ళ అవతల ఉన్న సునీతను చూస్తూంది. చెవులు లయ బద్ధమైన టైప్ రైటింగ్ టకటకలను వింటున్నాయి.
    'ఆఫీసు నిర్వహించటం బరువే అయినా....ఆడగ్గానే సరేనన్నావు....అక్కయ్య కోసమే ఇక్కడికి వచ్చాను, నీతా....నన్ను క్షమించు....' అతని మనసు ఏవో మాటలను నిశ్శబ్దంగా ప్రసారం చేస్తున్నది.

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS