Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 13


                        

                        అంతా మామూలే
    దాదాపు కాలేజీ గర్స్ అందరు వెళ్ళిపోయిన తరవాత, రాధ నెమ్మదిగా, అడుగులో అడుగులేస్తూ కాలేజీ గేటు దాటింది. ఎందుకో ఆమె లోలోన భయపడుతున్నట్లు ఆమె చూపులు చెబుతున్నాయి. అంతే కాకుండా , ఆమె చూపులు ఎవరి కోసమో వెతుకుతూ, ఎవరినో కాలేజీ అవరణకు కొంత దూరంలో చూడగానే వాలిపోయాయి.
    ఆమె నడుస్తూంది కాని, అమెలో ఏదో భయమూ, ఏదో సంచలనం కలగసాగింది. ఆ యువకుడు నెల రోజులుగా తన నెందుకు వెంబడిస్తున్నాడో ఆమెకు తెలియని విషయం. ప్రతి రోజు కాలేజీ వదలగానే ఎదురుగా ప్రత్యక్షం. తనే బస్సులో వెళ్ళితే అతనూ అదే బస్సులో వస్తున్నాడు. తను దిగే చోటనే దిగుతున్నాడు. తన ఇంటి వరకూ ఎస్కార్ట్ లేదనే భయం లేకుండా చేస్తున్నాడు. అలాగని అతనెప్పుడు అసభ్యంగా ప్రవర్తించ నూ లేదు. మాట్లాడనూ లేదు.
    ఆలోచనలలో నిమగ్నమై ఆలస్యంగా రావటం వలన బస్సు స్టాండు లో ఎక్కువ జనం లేరు. బస్సు వచ్చింది. రాధ బస్సు ఎక్కింది. అనుకున్న ప్రకారం అతనూ బస్సు ఎక్కాడు. ఇద్దరు కూర్చునే ఒకే ఒక సీటు మాత్రం ఖాళీగా ఉంది. ఆమె కూర్చుంది. అతను నుంచున్నాడు. అంతలో కండక్టర్ వచ్చాడు. టికెట్ కోసరం తన పర్స్ చూసుకుంది. అంతే, ఆమె గుండె గతుక్కుమంది. తన పుస్తకాలలో పర్సు కనిపించలేదు. బహుశా కాలేజీ లో మర్చిపోయానేమో అనుకుంది. ఆమె ఆలస్యానికి కండక్టర్ విసుక్కుంటున్నాడు. అంతలో, ఆ యువకుడు వారి గమ్యాన్ని తెలిపి రెండు టికెట్లు తీసుకున్నాడు. ఆ పరిస్థితిలో ఆమె ఏమీ మాట్లాడలేక పోయింది. కొంతసేపటికి గమ్యస్థానం రానే వచ్చింది. ఇద్దరూ దిగారు. అతను జంకుతూ --
    "నేను తీసుకున్న చొరవకు క్షమించండి రాధ గారూ!" అన్నాడు. ఆమె అందుకు బదులుగా తటాలున అతనిని చూసింది. ఆ చూపుల్లో "నా పేరును ఎలా తెలుసుకో గలిగాడా!?" అన్న ఆశ్చర్యం, ప్రశ్నార్ధకం రెండూ ఉన్నాయి. అంతేకాని , బదులు చెప్పలేక పోయింది . మరలా అతనే--
    "ఏమండీ! అంత చేయరాని నేరం చేశానా నేను? చెప్పండి. క్షమించరూ?' అని ప్రాధేయ పూర్వకంగా అన్నాడు.
    "పరవాలేదు" అన్నా ననుకుంది ఆమె. ఆ పలుకులు తన చెవులకే సోకనంత మెల్లగా ఉన్నాయి. అతనికి వినిపించిందా అన్నది ప్రశ్నగా నే మిగిలి పోయింది. అలా కొంతదూరం మౌనంగా నడిచారు. అప్పటికి ఆమెకు కొంచెం ధైర్యం కలిగింది కాబోలు!
    "మీరు, రోజూ ఎందుకిలా....?' మరి మాట పెగలలేదు.
    "వెంబడిస్తున్నారు? అనే కదూ మీ ప్రశ్న?' అని అతను వాక్యాన్ని పూర్తీ చేశాడు, ఆమె నవ్వీ నవ్వనట్లు నవ్వి, తల వంచుకుంది. అంతలో ఆమె మలుపు తిరగవలసిన చోటు వచ్చి ఆగిపోయింది. అతను ఒక ఉత్తరాన్ని ఆమె కందించ బోయాడు; ఆమె తీసుకోడానికి తటపటా యించింది. అంతలో అతను........
    "రాధాగారూ! దయచేసి తీసుకొని చదివి మీ అభిప్రాయాన్ని తెలుపండి. మీ కయిష్టంగా నేనెప్పుడు ఏది చేయను. అంతవరకూ నన్ను నమ్మండి." అన్నాడు.
    ఆ రోజు రాత్రి , అందరు పడుకున్న తరవాత, రాధ ఉత్తరాన్ని పదేపదే చదివింది. రాధ గదిలో లైటు వెలగటం చూసిన రాధ తల్లి--
    'నా పిచ్చి తల్లికి చదువంటే ఎంత శ్రద్దో! ఇంకా చదువుకుంటుంది' అని మనసులోనే తలపోస్తూ మురిసి పోయింది. ఆ రాత్రి రాధకు నిద్రపట్టలేదు. ఉత్తరం చదివిన తరవాత అతని పేరు 'మాధవ' అని తెలుసుకుంది. ఎందుకో తనలోనే నవ్వుకుంది. ఉత్తరం సారాంశం, అతను ఆమె స్నేహాన్ని గాడంగా కోరుకుంటున్నాడు. ఆమె అతని స్నేహాన్ని నిరాకరిస్తే , ఇక పై అతను తన చదువుకు స్వస్తి చెప్పుతాడట. కారణం తను ఆమె పై గల ఆలోచనలతో తన చదువు పై ఏకాగ్రత చూపలేడు. చివరిలో తనను బీచ్ లో ఒక స్థలం నిర్ణయించి కలువమని వ్రాశాడు. అతనిపై నమ్మక ముంచి, ఆమె తన కోరికను మన్నిస్తే తనేవిధంగా నూ, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించ నని హామీ కూడా ఉత్తరంలో ఇచ్చాడు. అంతా చదివిన తరవాత, ఆమె మనో పెండులామ్ నిజమా, అబద్దమా అను ఇరువైపు లకు అస్సిలేట్ చేయసాగింది. ఆమె కొన్ని విషయాలలో ఎంతో అమాయకురా లయినప్పటి కీ, కొంత వరకు మనుష్యులను అర్ధం చేసుకో గల మేధ ఆమె కుంది. అందువల్ల ఆమె అతని మాటలను నిజమని నిర్ణయించుకోలేక పోయింది. అలాగని, అబద్దంగా త్రోసి పుచ్చలేక పోయింది. చివరి కోక నిర్ణయాని కొచ్చింది. తన హద్దులో తానుండి, అతనెంత వరకు తనను నిజంగా ప్రేమిస్తున్నాడో తెలిసి కోవాలని, చివరకు అతనిది నిజమైన ప్రేమయే అని తెలిసిన నాడు అతనిని వివాహ మాడాలని నిర్ణయించు కుంది. ఆమెలో అంతటి తెగువకు కారణం , ఆమె వల్ల ఒకరి భవిష్యత్తు పాడవటం ఆమె కిష్టం లేదు. ఆ నిర్ణయాని కొచ్చిన తరవాత, కొంత తేలిక పడ్డ మనసుతో కిటికీ గుండా బయటికి చూసింది. అప్పుడే తెల్లవారు తూంది.
    అనుకున్న ప్రకారం ఆరోజు సాయంకాలం రాధ, మాధవు లు బీచ్ లో కలుసుకున్నారు. ఆరోజు అతనెంతో ఉత్సాహంగా కనపడ్డాడు. రాధ తెల్లచీరా, తెల్ల బ్లౌజు లో మంచి మల్లె పూవులా ఉంది. అతను ఉత్సాహంగా, ఆమె తన కోర్కె ను మన్నించి నందుకు తన సంతోషాన్ని వేలిబుచ్చుతున్నాడు. ఆమె అన్నీ వింటూ, ఇసుక కుప్పలు చూస్తుండి. ఏమీ మాట్లాడాలో రాధకు తోచటం లేదు. అది ఆమె జీవితంలో ప్రధమ సంఘటన. కొంతసేపు మౌనంగా కూర్చున్నారు.
    "ఇకమీదట మీరు శ్రద్దగా చదువు కుంటారు కదూ?' అని రాధ అడిగింది నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ,
    "దేవిగారు వారానికో సారి ఈ విధంగా దర్శన మిస్తే తప్పకుండా' అని కొంటెగా బదులిచ్చాడు మాధవ. ఆమె సన్నగా, తియగా నవ్వింది.
    కాలం వేగంగా గడిచి పోతుంది. వారిద్దరి స్నేహం మధ్య ఆరు నెలలు గడిచి పోయాయి. వారానికోసారి కలుసుకుంటున్నారు. ఇద్దరు స్నేహంగా మాట్లాడు కుంటున్నారు. అతనెన్నో తీయటి కబుర్లు చెబుతున్నాడు. ఆమె వింటున్నది. అతనెప్పుడూ మరో విధంగా ప్రవర్తించనూ లేదు, మాట్లాడనూ లేదు. అప్పుడప్పుడు తన కిష్టమైన మల్లెలు, పండ్లు మాత్రం తెచ్చిస్తున్నాడు. అతను ధనికుల బిడ్డ. కొన్ని విలువైన వస్తువులను ఆమెకు ఎన్నోసార్లు బహూకరించాలని ప్రయత్నించాడు ఆమె నిరాకరించింది.
    మరొక ఆరు నెలల కాలం గడిచి పోయింది. ఆమె బి.ఎ ఫైనల్ పరీక్షలు , అతని బి.ఇ. పరీక్షలు సమీపించాయి. ఆరోజు, రాధ హటాత్తుగా మాధవ తో వారి వివాహ విషయం తన తల్లితండ్రులను అడుగుతానని అన్నది. తన అభిప్రాయాన్ని వారు త్రోసి పుచ్చలేరని కూడా చెప్పింది. ఒక సంవత్సర కాలపు స్నేహం లో తన చేతిని కోన వేళ్ళతో కూడా తాకనివ్వని రాధ ఈ ఆకస్మిక నిర్ణయానికి, మాధవ విస్తుపోయాడు. అతని మనో భావాలను అతని కళ్ళలో చదవ గలిగిన రాధ కంగారు పడింది. అంతలోనే అతని మోము ప్రసన్నంగా మారిపోయింది. ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చాడు. రాధ తల్లితండ్రులు అంగీకరిస్తే , తన వాళ్లకు కూడా ఏ విధమైన అభ్యంతరం ఉండదని అన్నాడు.
    "పేదవాళ్ళం, కట్నం మాత్రం అడగ కండెం?" నవ్వుతూ అంది రాధ.
    "ఈ సంవత్సర కాలంలో కొన్ని లక్షల విలువ గల ముత్యాలను నీ నవ్వుల నుంచి పుచ్చుకున్నాను. ఇక కట్న మెందుకు?" అన్నాడు . ఇద్దరు బయలుదేరారు.
    వివాహ విషయం, అతను పైకి సంతోషంగా మాట్లాడి నప్పటికీ , అతను దాచిన ఏదో భావాన్ని అతని చూపులు దాచలేక పోయాయి. ఆమెలో అనుమాన బీజం పడింది.
    మరుసటి వారం, ఆమె అతనికై బీచిలో వేచి ఉంది. అతను ఆలస్యం చేయటం ఇదే మొట్టమొదటి సారి. ఎందుకో ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను రాలేదు. ఎంతో నిరాశతో, బాధతో బయలుదేర పోతుండగా , ఒక చిన్న కుర్రవాడు ఒక ఉత్తరాన్ని ఆమె కందించి, అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయాడు. వణికే హస్తాలతో ఉత్తరాన్ని తీసింది రాధ.
    "డియర్ టచ్ మీ నాట్ ప్లవర్,
    నీ స్నేహాన్ని నేను కోరిన మాట వాస్తవమే. కాని, నేను పెళ్లి చేసుకో దలుచుకోలేదు. లక్షాధికారు లైన మా తల్లి తండ్రులు కట్నాలు, కానుకలు లేకుండా పేద కుటుంబం నుండి వచ్చిన నిన్ను వివాహ మాడటానికి సమ్మతించరు. ఒక సంవత్సర కాలం ఎంత ప్రయత్నించినా, చివరి నీ చేతి స్పర్శ కు కూడా నోచుకోలేకపోయాను. నీ వంటి మనో నిబ్బరం , ఐ మీన్ సేల్ప్జ్ కంట్రోల్ ఉన్న ఆడపిల్ల లుంటారని నేను ఎప్పుడూ ఊహించను కూడా లేదు. నేను నీ నుండి వేరవుతూన్నప్పటికి , నీ నిర్మలమైన ప్రవర్తనను మనస్పూర్తిగా మెచ్చుకుంటున్నాను. అందరూ నీలాంటి వాళ్ళయితే, ఆడపిల్లలు మగవారి చేత మోసపోవట మంటూ జరగదు . నన్ను మరిచి పో. సంతోషంగా జీవించు. ఎల్లప్పుడు నీ సుఖ సంతోషాలను కోరుతూ,
                                                                                                   --మాధవ."
    ఉత్తరం చదివిన రాధకు, ఒక్కసారి తన కాళ్ళ క్రింద భూమి గిర్రున తిరిగినట్లని పించింది. అక్కడి నుండి బయలుదేరి నడవ సాగింది. తానేటు నడుస్తున్నది తనకే తెలియని పరిస్థితి. అయినప్పటికీ , తన నేదో అజ్ఞాత శక్తి ఇంటికి జాగ్రత్తగా చేర్చింది. రాత్రి భోజనం చేయకుండానే పడుకుంది రాధ. ఆమెకు తెలియకుండానే , ఆమె కన్నుల నుండి నీరు ధారాపాతంగా స్రవించ సాగింది.
    
                          *    *    *    *
    పరీక్ష అయిన తరవాత రాధకు మరీ ఏమీ తోచడం లేదు. తరచు కాలేజీ రోజులు, స్నేహితులు, గుర్తు కోస్తున్నారు. కాలేజీ జీవితాన్ని తలుచుకున్నప్పుడు, ఆమె మనసు సంతోషంతో నిండిపోతుంది. ఇక ఆ రోజులు మరలి రావు కదా? అన్న ఆలోచనలతో ఆమె మనస్సు వికలమై పోతుంది. వసంత, చిత్ర, హేమ రాధకు సన్నిహిత స్నేహితురాండ్రు. అప్పుడప్పుడు వాళ్ళను కలుసుకొని మాట్లాడినపుడు, రాధ మనస్సు కాస్త ఊరట చెందుతుంది.
    ఒకరోజు గత స్మృతులలో లీనమైన రాధ, తండ్రి పిలుపుతో తన గది నుండి బయటి కొచ్చింది. తండ్రి చేతిలో పేపరును చూడగానే రాధ కంగారు పడుతూ--
    "రిజల్స్ వచ్చాయా నాన్నా?" అని ప్రశ్నించింది.
    "అవునమ్మా! నీవు పాసయ్యావు తల్లీ!" అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. లోపలి నుంచి వస్తూ తండ్రీ కూతుళ్ళ సంభాషణ విన్న రాధ తల్లి శారదమ్మ ఎంతో ఆనందించింది. ఆరోజు రాధ, తన తల్లి తండ్రుల కన్నులలో ఎన్నడూ లేని తృప్తిని చూడసాగింది.
    రాధ ఇప్పుడు గతాన్ని పదేపదే తలచు కోవటం లేదు. చాలావరకు మరిచి పోగాలిగింది. ఇప్పుడు తన ధ్యేయం -- మంచి ఉద్యోగం సంపాదించి, తల్లిదండ్రులకు చేదోడు వాదోడు గా ఉండాలన్న దొక్కటే. తరవాత కొంత కాలం పాటు ఉద్యోగాన్వేషణ లో రాధ నిమగ్నమైంది. ఆమె కోరిక ఫలించింది.
    రాధ పనిలో చేరింది. అదొక ప్రైవేటు కంపెనీ . తను గాక, అందులో మరిద్దరు అమ్మాయిలూ పని చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ , రాధకు వాళ్లతో కొంత పరిచయ మేర్పదిందే కాని, వారితో సన్నిహిత మైన స్నేహం కుదరలేదు.
    వాళ్లతో నేనెందుకు కలువలేక పోతున్నానా?' అని చాలాసార్లు తనను తాను ప్రశ్నించు కుంది.
    మరి కొన్ని మాసాలు గడిచి పోయాయి. రాధ యధావిధిగా ఆఫీసు కెళ్ళుతుంది. నాలుగు రోజులుగా ఉషారాణి ఆఫీసు కు రావటం లేదు. ఆఫీసులో అందరు ఆమెను గురించి చర్చలు సాగిస్తున్నారు. ఒకనాటి ఉషా సమయంలో ఉషారాణి ఆఫీసులో సాక్షాత్కరించింది. అందరు ఆమె వైపు ఆశ్చర్యంతో చూశారు. చూశారు అనటం కంటే ఆమె అలంకారం వారి నా విధంగా చూసేలా చేసిందనటం బాగుంతుందే మో? ఆమె అలంకరణలో, రాధ కు రంగు రంగుల సీతాకోక చిలుక గోచరించింది. ఉషారాణి చిరునవ్వు లోలక బోస్తూ ముందు మేనజరు దగ్గరికి వెళ్లి మాట్లాడి వచ్చేటప్పటికి , తక్కిన అందరు ఆశ్చర్యం నుండి కోలుకొన్నారు. ఉషారాణి వచ్చి అందరికీ తన వివాహ పత్రికల నిచ్చి, అందరిని రమ్మని స్వయంగా ఆహ్వానించి వెళ్ళిపోయింది. రాధ సంతోషంగా పత్రికను చూసింది. ఉషారాణి వివాహం , ఒక ఇంజనీర్ తో. ఒకరితో స్నేహం, ఒకరితో ప్రేమ కలాపాలు, మరొకరితో వివాహం! రాధ కళ్ళు ఆశ్చర్యంతో నిండాయి. కాని, ఆమె పెదవుల పై మందహాసం తొణికిస లాడిందెందుకో?
    రాధ, ఇటువంటి కొన్ని ఆశ్చర్యాలతో పాటు, కొన్ని ఇబ్బందులను కూడా ఆఫీసులో ఎదుర్కో వలసి వచ్చింది. ఆమె ధరించిన దుస్తుల దగ్గరి నుండి, ఆమె అందచందాలు , గుణగుణాల వరకు కొందరు అనుకోవడం ఆమె వినకపోలేదు. ఆమె మాత్రం ఏమీ విననట్లు మసలుకునేది. కాని మేనేజరు మధు ప్రవర్తన ఆమెను కలవర పరిచింది. ఏదో ఒక సాకుతో అతను రాధను పదేపదే తన గదికి తప్పించు కుంటున్నాడు. ఉద్యోగ రీత్యా వెళ్ళటం తప్పని పనైంది. దీనిని గమనించిన ఉషారాణి, అప్పుడప్పుడు తనను అదో విధంగా చూచేది.'  అవును మరి. దొంగ కంటికి అందరు దొంగలు గానే కనిపిస్తారు.' అనుకుని రాధ సమాధాన పడింది. ఉషారాణి వివాహమైన తరవాత, ఆఫీసులో అందరి చర్చ తన పై ప్రారంభమైంది. అందరు మధును, తనను గురించి నానా విధాలుగా అనుకుంటున్నారు. రాధ మనస్సు చాలా బాధపడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS