Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 12


                            నట్టడవి లో హత్య

                
    బాగా పెరిగిన ఆడవులతో నిండిన పర్వత ప్రాంత మది. టేకు, చందనం, నల్ల చేవ మొదలైన చెట్లు దట్టంగా పెరిగాయి. అడవుల మధ్య జలజల మంటూ స్పటికంలా ఒక నది ప్రవహిస్తూ ఉంది. నదికి చాలా దగ్గర్లో కికియు అనే ఒక గ్రామం ఉంది.
    ఆ గ్రామ వాసులు కొండ జాతి వారు. దైర్య సాహసాలు వాళ్ళ కెక్కువ. వాళ్ళది నిరాడంబర మైన జీవితం. నాగరికత ఇంకా అక్కడికి ప్రవేశించ లేదు. అందువల్ల వాళ్లింకా సభ్య సంధులుగా ఉండగలిగారు. అబద్దం అక్కడ అరుదైన విషయం!
    ఒకరోజు ఆ గ్రామంలోని ప్రశాంతత కు భంగ మేర్పడింది. మరుగు అనే అతను గ్రామంలో కనుపించలేదు. ఆ గ్రామ వాసుకు కలత చెందారు. అతన్ని పులు చంపి ఉండవచ్చునని కొందరను కున్నారు. తన ప్రియురాలి కేమైనా తీసుకు వచ్చేందుకు పట్టణం వెళ్ళాడెమో అన్నారు కొందరు. వాళ్ళలో మూడ నమ్మకాలకు కొదవ లెదు. కాగా మరుగుని దేవతలు తీసుకు వెళ్ళారేమో అని కొందరన్నారు.
    ఆ రాత్రంతా మరుగు తల్లి-- డెబ్బై -- ఏళ్లది -- మేలుకుని గుడిసె గుమ్మం లోనే కూర్చుంది. ఆమెకు కంటి చూపు మందగించింది. మరుగు వస్తున్నా డెమో అని చెవులు నిక్కపోడుచుకుని ఆదుర్దాగా కూర్చుంది. అతను ఆమెకు ప్రాణం -- ఆమె ఏకైక కుమారుడు.
    మరుగు రాలేదు. తెల్లవారెంత వరకు గ్రామస్థులు వేచి ఉన్నారు. ఊళ్ళో ఎవరి కేది సంభవించినా, అది తమకు సంభావించినట్లుగా అనుకునేవారు. తెల్లవారిన తరవాత వాళ్ళంతా మరుగుని వెతకడానికి మొదలు పెట్టారు కొందరు, పట్టణానికి వెళ్ళారు. కొందరేమో పక్క గ్రామానికి వెళ్ళారు. కొందరు ఆ అడవి నంతా గాలించడం మొదలు పెట్టారు.
    మరుగు కోసం అడవి లోకి వెళ్ళిన వాళ్లు చాలాసేపు వెతికారు. ఎండ ఎక్కుతూ ఉంది. అలసిపోయి, కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఉన్నట్టుండి తూర్పు వైపుగా ఆకాశంలో నీడ పడుతున్నట్లు వాళ్లు గ్రహించారు. అది చూసేసరికి , ఎంత సాహసవంతు లైన వాళ్లు భయపడి పోయారు. ఆకాశాన్ని పరీక్షగా చూశారు. త్వరలోనే విషయం గ్రహించారు. నీడగా కనిపించింది గద్దల సమూహం! వెంటనే వాళ్ళ మెదళ్ళు పనిచేశాయి. గడ్డ లేగురుచున్న ఆ స్థలాన్ని చూచివద్దా మనుకున్నారు వాళ్లు.
    పొదల్నీ నిలువెత్తున పెరిగిన తుంగ దుబ్బుల్నీ తొలగించుకుంటూ వాళ్లు ఆ చోటు చేరుకున్నారు. వాళ్ళను కుంది నిజమయింది. కొండ విరిగి పడ్డట్టుగా మరుగు మృతదేహం పడి ఉంది.    
    అంతా నిర్ఘాంత పోయారు. చాలామందికి ఏడుపు వచ్చింది. కొందరు ఆలోచిస్తూ నిలబడ్డారు. మరుగు శరీరం మీద నెత్తుటి మరకలు కనిపించడంతో వాళ్లకు సందేహాలు కలిగాయి. కొంచెం సేపు ఆలోచించిన తరవాత, మరుగు మృత శరీరాన్ని వాళ్ళు మోసుకుని విచారంగా గ్రామం వైపుగా నడక సాగించారు.
    మరుగు గుడిసెకు ఎదురుగా నిలబడి, వాళ్లు, "బాయ్ మా, బాయ్ మా!" అన్నారు.
    "మా అబ్బాయి వచ్చేశాడా?' అంది ముసలమ్మా సంతోషంతో.
    "తీసుకొచ్చాం" అన్నాడు ఒకడు బాధగా. ఈ మాటలలోని అర్ధం వాళ్లకు తెలుసు. అడవి లో విపత్తు కి గురి అయ్యే వారిని ఇంటికి తీసుకు వస్తే అప్పుడు ఇలాగే అంటారు.
    ఆమె కలల్ల్లో నీళ్ళు తిరగలేదు. మరుగు శరీరాన్ని తాకి తాకి చూసింది. ఆ తరవాత అరుగు మీద దిగాలు పడి కూర్చుంది.
    ఊరంతా సమావేశ మయింది. హత్య జరిగినట్లు తీర్మానించారు. 'మరుగు నా హత్య చేశాడు? అతనికి విరోధు లంటూ ఉన్నారా? నమ్మడానికి వీలు లేకుండా ఉంది.' అనుకున్నారు.
    వెంటనే పోలీసుల వద్దకు మనిషిని పంపాలని నిశ్చయించారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పది మైళ్ళ దూరంలో ఉంది. అడవి గుండా వెళ్ళాలి. "త్వరగా వెళ్లి రా" అంటూ ఒకతనిని పంపించారు. అతనితో పాటు అటవీ శాఖ తాలుకూ ఒక గార్డుని కూడా పంపించారు. ఆ గార్డె ఆ ఊళ్ళో చదువు కున్నవాడు.
    వాళ్ళిద్దరూ త్వరగా వెళ్లి, పోలీసు స్టేషన్ నుంచి ఇన్స్ పెక్టర్ సింగ్ ని వెంట బెట్టుకుని వచ్చారు. వాళ్ళు ముగ్గురు అడవి అడ్డ దోవ గుండా త్వరత్వరగా వచ్చారు. అది అసలు దోవ కాకపోవడం వల్ల ఇన్ స్పెక్టర్ సింగ తుంగ దుబ్బులు మీద తడబడుతూ , జాగ్రత్తగా నడవ వలసి వచ్చింది. రెండు చోట్ల అయన కింద పడ్డాడు. ఆయన్ని పైకెత్తి నుంచో బెట్టారు. పొలాలు దాటి, ఏటి ఒడ్డు పట్టుకుని చివరికి గ్రామం చేరుకున్నారు.
    మరుగు గుడిసె కు వెళ్లాడు సింగ్. వాకిట్లో మృతదేహం ఉంది. మొదటి చూపులోనే మరుగుది వజ్ర కాయమని సింగ్ గ్రహించాడు .
    బాయ్ మా ఆయన్ని పిలిచి ఇలా అంది: "మీరేం చేస్తారు, పాపం? మాఅబ్బాయి చచ్చిపోయాడు. నేనూ సగం చచ్చిపోయాను."
    "మిమ్మల్ని ఈ గ్రామస్థులు ఆదుకుంటారు. మీరేం దిగులు పడకండి. ఏం జరిగిందో ఆ విషయం మటుకు నాతొ చెప్పండి" అని సింగ్ ఆమెను ఓదార్చాడు.
    "పొద్దున భోజనం చేసి, కట్టెలు కొట్టడానికి వెడుతున్నానని చెప్పి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఎవరో వాణ్ణి చంపి ఉండాలి." అని చెప్పింది.
    ఎవరు చంపి ఉంటారా? అని యోచించాడు సింగ్. ఇతరుల్ని విచారణ చేయడానికి మొదలు పెట్టాడు. ఆ విదారణ లో మరుగు కి సొంతంగా భూమి అంటూ ఏదీ లేదని తేలింది. కూలి పని చేసి తన తల్లిని పోషిస్తున్నాడనీ తెలియ వచ్చింది. ఆ ఊరు ఊరంతా అతన్ని పొగిడింది. అంత మంచివాడు మరుగు!
    మరుగు శరీరాన్ని బాగా పరిశీలించాడు సింగ్. ఆ పైన చాలా గాయాలు కనిపించాయి. పదునైన ఆయుధం వల్ల అవి ఏర్పడి ఉండాలి. మరుగు తలమీది గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. అడవి జంతువు చంపినట్లు జాడ కనిపించలేదు. ఎవరో అతన్ని హత్య చేసి ఉండాలి. ఆ మృత శరీరాన్ని శవ పరీక్షకు పంపించాడు సింగ్.
    శవ పరీక్షా ఫలితం త్వరగానే వచ్చింది. పదునైన ఆయుధం వల్లనే ఆ గాయాలు ఏర్పడి ఉండాలని పరీక్ష వల్ల బయటపడింది.
    సింగ్ విచారణ ప్రారంభించాడు. మొదట సరసారి హత్య జరిగిన చోటుకి వెళ్లాడు. అది గ్రామానికి ఒకటిన్నర మైలు దూరంలో , ఏటికి దగ్గరగా ఉంది. అక్కడ అయిదు మొదలుకొని ఆరడుగుల దాకా తుంగ దుబ్బులు పెరిగి ఉన్నాయి. ఆ దుబ్బుల చాటున పులులు మొదలైన జంతువులూ తమ ఆహారం కోసం పొంచి ఉండవచ్చు.
    ఆ దుబ్బుల కింద భాగాన్ని పరీక్షగా చూశాడు సింగ్. చాలా చోట్ల నెత్తుటి మరకలు కనుపించాయి. పదడుగుల మేరకు ఆ మరకలు కనుపించాయి. మరుగును చాలాసార్లు పొడవడం వల్ల అలా మరకలు కనిపిస్తున్నట్లు సింగ్ ఊహించాడు.
    మరుగు కి వెనకగా వచ్చి ఎవరైనా అతన్ని హత్య చేశారేమోనని అయన ఆలోచించాడు. కాని, అలా జరిగి ఉండదు. ఎందుకంటె మరుగుకి వెనకాల ఎవరు వచ్చినా, తుంగ కదలిక వల్ల అతను బయట పడడానికి వీలవుతుంది. కనక అలా జరిగి ఉండదని సింగ్ కి తోచింది.
    అ చోటుకి మరుగు నెవరో పిలుచుకు వచ్చి ఉండాలి. తరవాత అతన్ని హత్య చేయడం జరుగి ఉంటుందని అనుకున్నాడు. అయితే, మరుగుని ముఖాముఖి నిలబడి హత్య చేయడం జరగని పని. అతను బలశాలి. ఒకేసారి నలుగురితో డీ కొనే ధైర్యం అతనికీ ఉంది.
    రకరకాల ఆలోచనలు వచ్చాయి. చివరికి సింగ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుగుతో పాటు ఎవరైనా ఒకరు వచ్చి ఉండాలి. తలవని తలంపుగా అతన్ని హత్య చేసి ఉండాలి. ఆ హత్య ఇలా జరిగి ఉండవచ్చునని అనుకున్నాడు.
    అయితే, మరుగు కి విరోధి ఎవరు? ఎవరూ లేరే?
    హత్య జరిగిన స్థలాన్ని మళ్లీ చూశాడు సింగ్. పదడుగులు వెళ్ళాడో లేదో అయన కంటికి ఒక గొడ్డలి కనుపించింది. దాని చివరను నెత్తురు కనుపించింది. గొడ్డలి ఉన్న చోటు చుట్టూ చూశాడు. ఒక్క నెత్తురు మరకైనా కనుపించలేదు. హత్య చేసి , తరవాత హంతకుడు గొడ్డలిని దూరంగా విసిరి వేశాడని గ్రహించాడు సింగ్.
    గొడ్డలిని గురించి విచారణ చేశాడు సింగ్. అది మరుగుదే అని స్పష్ట మయింది. అగమ్యగోచరంగా ఉంది సింగ్ కి. మరుగు వద్ద నుంచి గొడ్డలి లాక్కుని, దానితోనే అతన్ని చంపి ఉండాలి హంతకుడు. అయితే, ఇది జరిగే పనేనా! మరుగుని పోట్లాటకు దింపి, అప్పుడు అతని వద్ద నుంచి గొడ్డలి ని లాక్కోవడం ఒక్క మనిషి వల్ల వీలు కాదు. కనక చాలామంది కలిసి ఈ పని చేశారా? అలాగూ అనిపించలేదు. ఎందుకంటె చాలామంది కనక అక్కడ తిరగడం జరిగితే , ఆ దుబ్బుల మీద అడుగులు కనుపించేవి. ఎవరు నడిచినా, అవి నలిగి విరిగి పోయి ఉండేవి.
    హత్య జరిగిన చోట నుంచుని గంటల తరబడి నేర విచారణ చేయడంతో సింగ్ అలసి పోయాడు. గ్రామానికి వెళ్లి , భోజనం చేసి తిరిగి వద్దామా అనుకున్నాడు. కాని, వెంటనే ఆ ఉద్దేశం మార్చుకున్నాడు. నేర విచారణ చెయ్యడమే కర్తవ్య మనిపించింది.
    మళ్లీ ఆ చోటుని పరీక్ష చేయసాగాడు సింగ్. కింద చాలా చోట్ల కనుపించిన అడుగుల గుర్తులు ఆయన్ని ఆకర్షించాయి. అవి మరుగు కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వారి అడుగులు. కాని వాటిలో కొన్ని మాత్రం మరో వైపు కనిపించాయి. ఇది చూసి సింగ్ ఆశ్చర్యపోయాడు.
    ఆ అడుగుల్ని అనుసరించి వెళ్లాడు సింగ్. అవి దగ్గర్లొ ఉన్న ఒక గుంట వద్దకు తీసుకు వెళ్ళాయి. పరీక్షగా చూసుకుంటూ వెళ్లాడు సింగ్. గుంటలో ఒక భాగం బురదగా ఉంది. ఆ భాగంలో అడుగుల గుర్తులు స్పష్టంగా కనుపించాయి. అవి కాళ్ళ బూట్ల వల్ల ఏర్పడినవి గా తోచాయి. బూట్ల అడుగున ఉండే పంక్తులు అలాగే అచ్చు పడినట్లు కనిపించాయి. బూట్ల పక్క కుట్లు కూడా కనుపించాయి. అడుగున పడ్డ గీతలు కూడా తెలియ వచ్చాయి.
    అయితే ఈ అడుగుల గుర్తులు బట్టి ఏం చెయ్యడమా అని ఆలోచనలో పడ్డాడు సింగ్. వీటివల్ల ప్రయోజనం కనుపిస్తుందా? ఇవి హంతకుని అడుగుల ఆధారం? ఇవి మరుగుని వెతకడం కోసం వెళ్ళిన వాళ్ళలో ఒకరి అడుగుల గుర్తులు కావచ్చు నెమో!
    అప్పుడు ఆకాశం మేఘావృత మవుతుంది. వాన కురిసే సూచనలు కనిపించాయి. రెండు వాన చినుకులు కూడా పడ్డాయి. ఇంకా కొద్ది సేపట్లో పెద్ద వానా గాలీ రావచ్చు నని అనుకున్నాడు సింగ్. వాన వస్తే అడుగుల గుర్తులు కాస్తా చెరిగి పోతాయి.
    ఆ గుర్తుల్నిఎలా కాపాడడ మో అనుకున్నాడు సింగ్. దేనితో నైనా వాటిని కప్పి పెడితే, గుర్తులు అలాగే ఉంటాయా? గుంట కనక నిండడం మొదలు పెడితే అప్పుడు అన్నీ మునిగి పోతాయి. ఏం చెయ్యడం?
    మళ్లీ రెండు వాన చినుకులు పడ్డాయి. సింగ్ వెంటనే అలోచించి, ఒక నిర్ణయానికి వచ్చాడు. అక్కడున్న వాళ్ళ నడిగి ఒక పెద్ద కత్తి తీసుకున్నాడు. తరవాత కింద కూర్చుని అడుగుల గుర్తు చుట్టూ జాగ్రత్తగా కత్తితో కోత పెట్టాడు. ఆ తరవాత మెల్లగా మైసూరు పాక్ బిళ్ళను తీసినట్లుగా అడుగు నుంచి గుర్తు మేరకు ఉన్న బంక మట్టిని పైకి తీశాడు. దాన్ని ఒక అట్ట మీద పెట్టి దాని మీద మరొక అట్టను ఉంచాడు.
    వెంటనే ఆ గుంట నుంచి అవతలి వైపు కనుపిస్తున్న అడుగుల గుర్తుల్ని అనుసరించి త్వరత్వరగా వెళ్లాడు సింగ్. అలా అవి ఏటి ఒడ్డుకి తీసుకు వెళ్ళాయి. ఒడ్డు వద్ద నీళ్ళలో ఉన్న ఒక రాతిని పరీక్షగా చూశాడు. దాని మీద నెత్తుటి మరకలా ఎర్రని రంగు కనుపించింది. రాతి మీద అక్కడక్కడా నెత్తుటి మరకలు స్పష్టంగా కనుపించాయి. హత్య చేసిన అనంతరం తనను శుభ్ర పరుచు కునేందుకు హంతకుడు త్వరత్వరగా నది ఒడ్డుకి వచ్చి ఉంటాడని తేలింది. ఆలోచిస్తూ నిలబడ్డాడు సింగ్.
    కొద్ది సేపట్లో వాన కురవడం మొదలు పెట్టింది. అడుగుల గుర్తులూ, నెత్తుటి మరకలూ నీళ్ళలో కలిసి చెరిగి పోయినాయి.
    ఆ సాయంకాలం గ్రామానికి రాగానే సింగ్ తన పరిశీలన మళ్లీ ప్రారంభించాడు. మరుగు కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వారెవరైనా బూట్లు తోడుకున్నారా అని వాళ్ళ నడిగాడు. కొండజాతి  వాళ్ళెవ్వరూ చెప్పులు వేసుకోరని తెలుసుకున్నాడు. పోనీ, ఆ గ్రామానికి ఇటీవల కాలంలో పోలీసు వారు గాని, మిలిటరీ వారు గాని ఎవరైనా వచ్చారేమో అని విచారించాడు. అలా ఎవరూ రాలేదని తెలియ వచ్చింది.
    ఆ ప్రాంతంలో బూట్లు వేసుకునే వ్యక్తీ అటవీ శాఖ తాలూకు గార్డ్ ఒక్కడే అని తేలింది.
    జమీందారీ లు రద్దు అయిన తరవాత ఆ అడవి ప్రాంతం ప్రభుత్వం వారి వశమయింది. దగ్గర్లో ఉన్న ఒక పట్టణం లో అడవుల్ని అజమాయిషీ చేసేందుకు గాను ఒక రేంజి ఆఫీసు స్థాపించబడింది. దీని తాలూకు చిన్న కార్యాలయం ఒకటి కికుయు లో పెట్టబడింది. అందులో బంగరు అనే అతను గార్డుగా పని చేస్తున్నాడు. ఎస్.ఎస్.ఎల్.సి పాసయాడు. అతను ఆ గ్రామానికి వచ్చి సంవత్సర మయింది. అమరియా అనే కొండజాతి వాని ఇంట్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బంగారు. నెలనెలా డబ్బిచ్చి వాళ్ళింట్లో నే భోజనం చేసేవాడు.
    అడవుల్ని తరుచుగా తనిఖీ చేస్తూ ఉండడం బంగారు పని. అడవి బూట్ల గుర్తుల్ని అడివి లో పెక్కు చోట్ల చూడవచ్చు. అతని బూట్లు పరీక్ష చేశాడు సింగ్. వాటి అడుగు భాగంలో ఉన్న పంక్తు లకూ, సింగ్ సేకరించిన అడుగు లలో ఉన్న పంక్తులకూ ఎలాంటి సంబంధమూ లేదు.
    పైగా బంగారు ని సందేహించెందుకు ఎటువంటి ఆధారమూ కనుపించలేదు. నేర విచారణ కోసం వచ్చిన సింగ్ కి అతను బహు విధాల సహాయం చేశాడు. సలహా కూడా చెప్పాడు.
    అయినా, బంగారు ని సింగ్ విచారించాడు. హత్య జరిగిన రోజున ఆ అడవి ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు తాను వెళ్ళినట్టుగా బంగారు చెప్పాడు. ఆ విషయం గురించి సింగ్ విచారించాడు. ఆ యా గ్రామాలకు మనుష్యుల్నిపంపాడు. ఆ గ్రామాలకు బంగారు వెళ్లలేదని స్పష్టమయింది.
    కాని, ఇలా ఊళ్లకు వెళ్ళక పోయినా వెళ్ళినట్లుగా తన డైరీ లో వ్రాసుకునే అవకాశం ఉంది బంగరు కి. కనక బంగారు చెప్పింది సబబే అనుకున్నాడు సింగ్. అయినా, బంగరు ని గురించి ఎక్కువగా తెలిసుకోవాలని అభిలషించాడు.
    ఊళ్ళో విచారణ జరిపాడు సింగ్.  కొండజాతి స్త్రీలను కలుసుకున్నాడు. హత్య జరిగిన ఆ రోజు మధ్యాహ్నం బంగారు ని అడవి ప్రాంతంలో చూసినట్లుగా వాళ్ళు చెప్పారు. "మరుగు తో బంగారు పోట్లాడుతూ ఉన్నాడు. ఏమిటని మే మడిగాము. అడవి లో మరుగు దొంగతనంగా కట్టెలు కొట్టాడని బంగారు చెప్పాడు. అందువల్ల అతని మీద చర్య తీసుకో దళిచినట్లుగా కూడా చెప్పాడు బంగారు. ఈసారికి మరుగు ని మన్నించవలసిందిగా మేమాయాన్ని బతిమాలుకున్నాం. మరుగుని ఒక హెచ్చరిక చేసి బంగారు వెళ్లి పోయాడు." అని చెప్పారు.
    "ఆ తరువాత మీరు బంగారు ని చూడలేదా?"
    "చూశాం."
    "ఎప్పుడు?"
    "సాయంకాలం చూశాం. ఏటి ఒడ్డునుంచి  ఉతికిన గుడ్డ ఒకటి పైన వేసుకుని వస్తున్నాడు."  
    "ఏటి ఒడ్డు న ఏ చోటో చెప్పగలరా?"
    వాళ్ళు బదులు చెప్పారు. నెత్తుటి మరకలు గల రాయి ఉన్న చోటే అని సింగ్ తెలుసుకున్నాడు.
    "ఈ ఊళ్ళో బంగారు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు?"
    ఇద్దరూ తెల్లబోయారు.
    "లమితో మాట్లాడుతూ ఉంటాడు." అని ఒకామె చెప్పింది.
    "ఎవరా లమీ?"
    "అమరియా కూతురు. వాళ్ళ ఇంట్లోనే బంగారు ఉంటున్నాడు."
    "ఆ." అనుకున్నాడు మనస్సులోనే సింగ్. "అంతు చిక్కినట్టే" అన్నాడు. తరవాత లమిని విచారించేందుకు వెళ్లాడు. వెళ్ళేటప్పుడు తన ఉద్యోగ సంబంధమైన దుస్తుల్ని విప్పి మామూలు దుస్తులు ధరించాడు. లమికి ఏ విధమైన సందేహం గాని, తత్తర పాటు గాని కలిగించ కూడదని అతను అనుకున్నాడు.
    సింగ అమరియా ఇంటికి వెళ్లాడు. వెంట ఒక కొండజాతి వాణ్ణి కూడా తీసుకు వెళ్లాడు. లమిని పిలిపించాడు. ఎవ్వరూ లేని చోట కూర్చున్నాడు.
    లమీ వచ్చింది. పెళ్లి కాని పద్దెనిమిదేళ్ళ పిల్ల పసిమి రంగు. అమాయకంగా చూసింది సింగ్ ని. ఉద్యానవనంలో అప్రయత్నంగా పూచిన పువ్వులా కనిపించింది ఆమె అందం.
    "బంగారు మీ ఇంట్లో ఎన్నాళ్ళు గా ఉంటున్నాడమ్మా" అని అడిగాడు సింగ్.
    "ఒక సంవత్సరంగా."
    "నువ్వు ఆయనతో మాట్లాడుతావా?"
    "మ్.....ఆయనకు కావలసిన పనులన్నీ నేనే చేస్తూ ఉంటాను."
    "ఏమిటా పనులు?"
    "అయన గదిని ఊడవడం..... అన్నం పెట్టడం....నీళ్ళు తెచ్చి పెట్టడం....అన్నీను."
    "అయన నీతో ఎలా ఉంటాడు?"
    లమీ తటపటా యించింది.
    "నేనంటే ఆయనకు ఇష్టం."
    "ఎలా తెలుసు నీకు?"
    "నన్ను మాటిమాటికి పిలుస్తాడు. 'నాతొ పాటు పట్టణానికి వస్తావా? ' అని అడుగుతాడు. నేను కనక గదిలోకి వెళ్లి నుంచుంటే నా వంకే చూస్తూ ఉంటాడు."
    "మ్...."
    "ఒకరోజు నేను నీళ్ళు తీసుకొచ్చి నప్పుడు, అయన నా వంక చూస్తూనే ఉన్నాడు. జంకుతూ నేను నీళ్ళు కింద పెట్టాను. అప్పుడు అయన లేచి నా దగ్గర కొచ్చి, నా చెయ్యి పట్టుకున్నాడు ...."
    "తరవాత?"
    "భయపడుతూనే అయన వంక చూశాను. 'మరుగుతో మాత్రం నువ్వు నాట్యం చేస్తావు! నాతొ కూడా ఒక రోజూ చెయ్య కూడదూ?' అని అడిగాడు."
    "నువ్వు ఆయనతో నాట్యం చేశావా మరి?"
    "ఉహూ!"
    "ఏం?"
    "నాకు మరుగంటే నే ఇష్టం."
    విచారణలో మరికొన్ని విషయాలు బయట పడ్డాయి. ఆ ఇంట్లో చేరినప్పటి నుంచీ బంగారు లమీ కీ ఎన్నో వస్తువుల్ని బహుమతులుగా ఇచ్చాడు. చీర, ఉంగరం, ఒక బంగారు గొలుసు మొదలైన ఎన్నో ఇచ్చాడు. ఎలాగయినా లమిని తన వైపుకి తిప్పుకోవాలని అభిలాషించాడు.
    ఇది ఇలా ఉండగా, దసరా వచ్చింది. ఆ సందర్భంగా లమీ వీదులో యువకులందరి తోనూ నాట్యం చేయసాగింది. ఇది కొండజాతి వాళ్ళ ఆచారం.
    కాని లమీ అలా చేయడం బంగారు కి నచ్చలేదు. వీధిలోకి వెళ్లి ఆ నాట్యాన్నిలిపివేశాడు. అటవీ శాఖ తాలుకూ గార్డు అంటే ప్రభుత్వ ప్రతినిధి. అనే ఉద్దేశంతో ఆ గ్రామస్థులు అతనికి భయపడతారు. అందువల్ల ఆ నాట్యం కాస్తా ఆగిపోయింది. మరొకసారి ఇంకొకటి జరిగింది. లమితో మరుగు మాట్లాడుతూ ఉండడం బంగారు చూశాడు. ఆయనకి కోపం ముంచుకు వచ్చింది. మరుగుని విడిగా తీసుకు వెళ్లి అతని చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. "ఇక నుంచీ లమితో మాట్లాడకూడదు. తెలిసిందా, జాగ్రత్త!" అని హెచ్చరించాడు బంగారు. ఈ విషయాన్ని మరుగు ఊరి పెద్దకు విన్నవించు కున్నాడు బంగారు ఉద్యోగాన్ని చూసి భయపడిన ఆ ఊరి పెద్ద ఏ విధమైన చర్యా తీసుకోలేదు.
    విచారణ సాగిస్తూ సింగ్ "నీకు మరుగంటే ఇష్టమేనా?" అని అడిగాడు.
    "అవును, ఆయన్నే పెళ్లి చేసుకోవాలను కున్నాను." అంది లమీ.
    "బంగారు అంటే ఇష్టమేనా?"
    "ఆయన్ని....." మధ్యలో ఆపి వేసింది లమీ. ఆవాక్యం ఆమె పూర్తీ చెయ్యలేదు. భయంతో మునిగి పోయింది.
    "హత్య జరిగిందే , ఆరోజు బంగారు ఇంటి వద్ద ఎప్పుడు బయలుదేరాడు?"
    "పొద్దున్నే బయలుదేరాడు. భోజనానికి కూడా రాలేదు. సాయంకాలం వచ్చాడు. గదిలో మౌనంగా కూర్చున్నాడు. చీకటి పడింది. దీపం పెట్టడానికి నేను గదిలోకి వచ్చాను. లోపల తడి గుడ్డ అరవేసి ఉంది. "మీరెందుకు ఉతికారు? నేను ఉతికే దాన్ని గదా!' అన్నాను. అందుకాయన ......" భయపడింది లమీ.
    "భయపడకుండా చెప్పమ్మా!"
    లమీ మాట్లాడలేదు. ఆమెకు ధైర్యం చెప్పాడు సింగ్. చివరికి లమీ చెప్పింది.
    "బంగారు నా దగ్గరి కొచ్చి నెమ్మదిగా "లమీ! నేను మరుగు ని చంపేశాను. నాతొ రా. మనం పట్టణానికి వెళ్లి పోదాం' అన్నాడు."
    "అప్పుడు నువ్వేమన్నావ్?"
    "నాకు భయం వేసింది. బయటికి పరిగెత్తాను.
    బంగారు గుడ్డల్ని వెంటనే తీసుకు రమ్మన్నాడు సింగ్. అవి తీసుకు రాగానే వాటి లోంచి ఒక గుడ్డను లమీ పైకెత్తి చూపించింది. నెత్తురు కడిగిన మరక దాని మీద కనిపించింది. అంతటితో సింగ్ విడిచి పెట్టలేదు. "బంగారు వద్ద బూట్లు మరేమన్నా ఉన్నాయా?' అని అడిగాడు. లోపలికి వెళ్లి బంగారు వేసుకునే రెండవ సెట్టు బూట్లు తెచ్చింది లమీ. ఆదుర్దాగా వాటి అడుగు భాగం చూశాడు సింగ్. అయన వద్ద ఉన్న అడుగుల గుర్తులలోని పంక్తులే ఆ బూట్లలో నూ ఉన్నాయి.
    అప్పుడు వెంటనే బంగారు ని పట్టుకున్నాడు సింగ్. మొదట దేన్నీ ఒప్పుకోడానికి నిరాకరించాడు. తరవాత అలా చేయడం లో లాభం లేదనుకున్నాడు. జరిగింది జరిగినట్టు చెప్పడం మొదలు పెట్టడు బంగారు.
    మరుగు మీద బంగారు కి కోపం లమిని మరుగు పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. మరుగుని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టదలుచు కున్నాడు. ఆ సంఘటన జరిగిన ఆరోజు, అడవి లో దొంగతనంగా కట్టెలు కొట్టినట్లు మరుగు మీద నేరారోపణ చేశాడు. కాని ఊళ్ళో ని ఇద్దరు స్త్రీలు అడ్డం రావడంతో రాజీ పడ్డట్టు నటించాడు బంగారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత బంగారు మరుగుని అనుసరించాడు. అడవిలోకి ఇద్దరూ వెళ్ళారు. "లమిని నువ్వెందుకు ప్రేమిస్తున్నావ్?' అని కోపంగా అడిగాడు బంగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. కొంచెం కోపంగా, బిగ్గరగా మాట్లాడి మరుగు పైకి నడిచాడు ఆ క్షణం అతని భుజాన వేలాడుతూ ఉన్న గొడ్డలిని వెంటనే తీసుకుని దానితో మరుగు తల మీద బలంగా ఒక దెబ్బ కొట్టాడు బంగారు. మరుగు కి స్మృతి తప్పింది. అప్పుడు బంగారు చాలాసార్లు గొడ్డలి చివరతో మరుగు ని కొట్టాడు. మరుగు మరణించాడు.
    బంగారు మీద హత్యానేరం మోపబడింది. కేసు కోర్టు కి వచ్చింది. విచారణ ప్రారంభమయింది. మరుగు ని తాను చంపలేదని వాదించాడు బంగారు. హత్య జరిగిన రోజు ఆ గ్రామంలోనే తాను లేనని చెప్పాడు.
    బంగారు మాటలని న్యాయమూర్తి స్వీకరించలేదు. తెలియవచ్చిన సమాదారాన్ని బట్టి బంగారే ఆ హత్య చేసి ఉంటాడని అయన చెప్పాడు. బంగారు కి యావజ్జీవ శిక్ష విధించబడింది.
    అటవీ శాఖ తాలుకూ గార్డు బంగారు ఆ విధంగా జైలుకి వెళ్లాడు.

                              *    *    *  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS