"స్క్రిప్టు తీసుకుని వచ్చాను. నువ్వు పలుకు. నాటకీయత నీ గొంతులో అగుపిస్తే రాత్రికి టేపు రికార్డరు తీసుకుని వస్తాను...."
"డైలాగులు చెప్పడం రాదు నాకు...." అన్నాడు సురేష్.
"నీకెలావస్తే అలా చెప్పు!" అన్నాడు రామానుజం.
ఇద్దరూ పక్కగదిలోకి వెళ్ళారు. రామానుజం తలుపులు దగ్గరగా వేశాడు. సురేష్ స్క్రిప్టు చదివి- "ఇది నాకోసమే రాసినట్లుంది. పద్మిని అనే అమ్మాయిని నేను మోసంచేసి అన్యాయం గావించినట్లు అనాలి. నిజంగా నేను ఈ పేరుగల పిల్లను పెళ్ళాడబోతున్నాను. ఇది కాకతాళీయమని నాకు అనిపించటంలేదు-" అన్నాడు.
రామానుజం నవ్వి - "ముందు కాసేపు డైలాగులు చెప్పు. నీకు అనుమానంగా ఉంటే పద్మిని అన్న పేరు మార్చేద్దాం. అదంతా టేపు రికార్డు చేసేటప్పటి వ్యవహారం కదా-అందాకా డైలాగులు చెప్పు- అన్నాడు.
ఏమనుకున్నాడో సురేష్ డైలాగులు చదవనారంభించాడు. సగం చదివాక అతడెందుకో ఆపివేసి చటుక్కున వెళ్ళి తలుపులు తెరిచాడు.
తలుపులకవతల పద్మిని ఉన్నది. ఆమె ఏడుస్తోంది.
"నువ్వా?" అన్నాడు సురేష్.
పద్మిని మాట్లాడకుండా వెనుతిరిగింది.
"నేను చెప్పేది వినివెళ్ళు...." అన్నాడు సురేష్.
"విన్నది చాలు..." ఆమె వీధిలోకి వెళ్ళిపోయింది.
"రామానుజం.....నువ్వు చాలా క్రూరంగా నాటకమాడావు...." అన్నాడు సురేష్ వెనక్కు తిరిగి.
రామానుజం ముఖంలో ఆశ్చర్యముంది-"ఇలా జరుగుతుందని నేననుకోలేదు. అయితే ఇప్పుడైనా కొంప మునిగిందిలేదు. త్వరగా వెళ్ళి ఆమెకు స్క్రిప్టుచూపించు. కావాలంటే నేనూ సాక్షిగా వస్తాను...."
"ప్రేమ వ్యవహారాల్లో సాక్షుల్ని నమ్ముకునేవాడు అసమర్ధుడు...." అంటూ సురేష్ వీధిలోకి పరుగెత్తాడు. అతడు పద్మినిని కలుసుకుందుకు ఎంతోసేపు పట్టలేదు. ఆమె విననంటున్నా బలవంతంగా అతడు తన కధచెప్పి స్క్రిప్టు ఆమె చేతిలో పెట్టి- "ఒక్క అయిదు అయిదు నిమిషాలు పక్కనున్న పార్కుకిరా-" అని బ్రతిమిలాడాడు.
ఇద్దరూ పార్కులోకి వెళ్ళారు.
పద్మిని స్క్రిప్టు చదివింది - "మిమ్మల్ని నమ్మాలో నమ్మకూడదో తెలియడంలేదు. ఈ రోజు మీ పేరు చెప్పి నేను పొందిన అవమానం జన్మలో మరువలేనిది. దానిగురించి మిమ్మల్ని నిలదీసి అడగాలనివస్తే మీ మాటలు వినపడ్డాయి. కానీ ఇప్పుడీ స్క్రిప్టు చూశాక.." అని ఆగిందామె.
"ఆ అవమానమేమిటో చెప్పు!" అన్నాడు సురేష్ ఆత్రుతగా.
పద్మిని ఏదో మాట్లాడబోయేలోగ అక్కడికి ఓ యువతి వచ్చింది. ఆమె సురేష్ ని చూసి పలకరింపుగా నవ్వింది.
"ఎవరండీ మీరు?" అన్నాడు సురేష్.
ఆ యువతి అతడినుంచి పద్మినిమీదకు చూపులు మరల్చి-"డియర్ సిస్టర్! నువ్వెవరో నాకు తెలియదు. కానీ నేను నిన్ను హెచ్చరించాలని వచ్చాను. నా మాట వింటే బాగుపడతావు. లేదా...." అని ఆగిందామె.
సురేష్ ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆమె మాట్లాడటం ఆపగానే అతడికి ఆవేశం వచ్చింది. "ఊఁ నీ నాటకం బయటపెట్టటం పెద్ద కష్టంకాదు నాకు. ముందు నీ మాటలు పూర్తిచేయి. ఆ తర్వాత నువ్వెవరో నీచేతే చెప్పిస్తాను...." అన్నాడు.
ఆ యువతి అతడి మాటలను లక్ష్యపెట్టలేదు-"ఇతడి స్నేహం వదులుకో. లేని పక్షంలో ఈ రోజున నన్నడిగినట్లే ఓ రోజు నిన్ను కూడా-ఎవరండీ మీరు-అనడుగుతాడీ సురేష్!"
ఈ మాట పూర్తిచేసి ఆమె మెరుపు వేగంతో అక్కన్నించి వెళ్ళిపోయింది. సురేష్ పద్మినివంక దీనంగా చూసి-"ఇదంతా ఏదో పెద్ద కుట్ర. యెవరో మన యిద్దరికీ మథ్య అగాథం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు-" అన్నాడు.
"అలా ప్రయత్నించాల్సిన అవసరం యెవరికుంటుంది? నేను అతిసామాన్యురాలిని. నాకోసం ఎవరూ ఇంతటి నాటకమాడరు. మీలోనే ఏదో తేడా వుంది...." అని పద్మిని అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
సురేష్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఏమిటిదంతా?
తనకూ పద్మినికీ మధ్య సృష్టించబడే అగాధంవల్ల యెవరికి ప్రయోజనం? ఆ ప్రయోజనం ఎలాంటిది?
ఎంత ఆలోచించినా అతడికి ఏమీ తెగలేదు.
చివరికతడు ఇంటికే వెళ్ళాడు. అప్పుడే తండ్రి కూడా ఇంటికి వచ్చాడు. సురేష్ తండ్రిని సమీపించి-"నాన్నా! ఊహించనిది జరిగింది. పద్మిని నన్ను అనుమానిస్తోంది...." అన్నాడు.
చైర్మన్ గారు కొడుకును శ్రద్దగా పరిశీలించి-"పద్మిని నిన్ను అనుమానించడమా? ఆమెకా అర్హత ఉందా?" అన్నాడు.
"అర్హత ఉన్నా లేకపోయినా కారణాలు మాత్రం సబబైనవే! ఆమె నన్ను అపార్ధంచేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని నా అనుమానం....."
"అయితే వాళ్ళు నీ మిత్రులనే అనుకో-" అన్నాడు చైర్మన్.
"అంటే?"
"పద్మిని ప్రవర్తన మంచిదికాదు. ఈరోజు నేనది కళ్ళారా చూశాను...."
ఎవరో హెచ్చరించగా ఆయన వెళ్ళి గమనించాడు. పద్మిని శేఖర్ని కలుసుకోవటం ఆయన చూశాడు.
సురేష్ మ్రాన్పడిపోయాడు-"ఇందులో ఏదో మోసముందని నా అనుమానం-"
"మన అంతస్థుకు తగిన సంబంధం చూసుకోక పోవడం నేను చేసిన మొదటి తప్పు...." అన్నాడు చైర్మన్.
"అయితే ఇప్పుడేం చేయాలి?"
"ఈ సంబంధం వదులుకుంటాను. కారణం కూడా ఆమె తండ్రి మొహంమీదే చెప్పేస్తాను. తన కూతురి సంగతి ఆయనకూ తెలియాలికదా!" అన్నాను చైర్మన్.
5
పద్మిని తండ్రి వరదయ్య కూతురు చెప్పిందంతా విన్నాడు. ఆయనకు వళ్ళంతా చెమటలు పట్టింది.
"ఏదో వెతుక్కుంటూ సంబంధం వచ్చింది కదా అని నేను సంతోషపడుతున్నాను. ఇందులో ఇంత మోసముందనుకోలేదు. ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం. ఈ సంబంధం వదులుకున్నామంటే మనకు చాలా అప్రతిష్ట వస్తుంది. మనకు మనమై కాదన్నామంటే ఆ చైర్మన్ గారు మనమీద పగబడతాడు. అలాగని చూస్తూ చూస్తూ కూతురు గొంతు కోయలేను...."
ఆ రోజంతా ఈ విషయమై ఇంట్లో తర్జనభర్జనలు జరిగాయి. చిన్నవాళ్ళు ఆవేశపడ్డారు. చైర్మన్ అయినా సరే భయపడవలసిందేమీలేదన్నారు. పెద్దవాళ్ళు నిదానించారు. అంతా కలిసి పద్మినిని అడిగారు.
"చెయిర్మన్ అని భయపడకు. నూరేళ్ళ జీవితం గురించి ఆలోచించుకో-" అన్నారు చిన్నవాళ్ళు.
"ఏ మగాడికైనా ఇంతో అంతో దుర్గుణాలుంటాయి. అంతా పెళ్ళాం అదుపుచేయడంలో ఉంటుంది. చైర్మన్ గారి కోడలనిపించుకోవటం సామాన్యమైన అవకాశం కాదు. బాగా ఆలోచించుకో-" అన్నారు పెద్దవాళ్ళు.
ఆలోచించటం ఆడవాళ్ళ కర్తవ్యంకాదు. అందుకే పద్మిని "అంతా మీ యిష్టం" అనేసింది. ఆమెకు భర్త ఎలాంటివాడోనన్న భయం ఉంది. చైర్మన్ గారి కోడలనిపించుకోవాలన్న ఆశా ఉంది. అనుకోని ఆపదయెదురైతే తట్టుకోగల నిర్లిప్తతా ఉంది. అందుకే ఆ రాత్రి నిద్ర సులభంగానే పట్టిందామెకు.
మర్నాడామెకు ఉదయమే స్నేహితురాలు కబురుపెట్టింది. ఆమె యింటికి బయల్దేరగా దారిలో శేఖర్ ఎదురయ్యాడు. ఆమె అతడిని చూడలేదు. అతడే ఆమెను పలకరించాడు. ఆమె చటుక్కున ఆగిపోయింది. ఇతడు తనను ముందురోజు వేశ్యగా భావించాడు.
