అంతవరకూ తల్లి వెనక నిల్చున్న రాధ గబగబా పెరటి వేపు దౌడు తీసింది, తనను వేణు పలరిస్తాడేమోనని,
ఆర్తి పెరట్లో స్నానం చేస్తున్నది., రాధ అక్కడే ఉంది. రఘుపతి అవసరమైన సరంజామా కోసం ఊళ్ళోకి వెళ్ళాడు. వర్ధనమ్మ వంటింట్లో ఉంది. వేణు వంటింటివైపు ఏదో పనున్నట్లు రావటం చూసి, "ఏం కావాలిరా?" అనడిగింది వర్ధనమ్మ.
"ఏం లేదక్కా! నీతో వస్తూనే ఒక మాట చెప్పాలని ఇంటి దగ్గిర అనుకున్నాను."
"ఏమి టది?"
"ఏం లేదు..." ఒక క్షణం ఆగి, "చిన్నక్కయ్యను ఈ అయిదారు రోజులైనా కులాసాగా గడుపుతుందని రానన్నా తీసుకువచ్చాను. నువ్వుగాని, బావగాని, సారథి బావ మాట పొరపాటున అయినా అడగవద్దు" అన్నాడు.
"నాకు తెలీదుట్రా?"
"చెపితే మంచిది కదా? బావకు కూడా చెప్పు రాధ అసలే అల్లరిమనిషి. ఆమెను కూడా హెచ్చరించాలి!"
"అలాగే లేరా!"
కొంతసేపటికి వేణు స్నానం కూడా అయింది. వస్తూ వస్తూ పల్లెటూరు బస్సు స్టేజి దగ్గిర మొహం కడుక్కుని, అక్కడే చిన్న హోటలనబడే గుడిసెలో కాఫీ అని పోసిన చూరునీళ్ళ కాషాయం తాగాడు. అది అప్పుడే అరిగిపోయింది. అందులో నడుములు సాఫవుతాయని బండి ఎక్కకుండా నడిచి రావటంచేత వేణుకు మరీ ఆకలిగా ఉంది. బట్టలు వేసుకుంటూ తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు వేణు. ఆర్తి రాత్రి ప్రయాణం మూలంగా రాసుకోలేకపోయిన డైరీ రాస్తూంది.
కాఫీ పూర్తి అయింది. వర్ధనమ్మ గిన్నె దింపి, రెండు వెండి గ్లాసుల్లో పోసింది. రాధ తల్లి దగ్గిరే కూచుంది. తన చేతిలో పని ఉండటం వల్ల, "రాధా! ఈ కాఫీ గ్లాసులు ఇచ్చిరావే!" అన్నది.
"ఆఁ! నాకేం పనిలేదూ? నువ్విచ్చుకో?"
"ఏం పనే? నా దగ్గిర కూర్చోటం పనా? అయినా నీకు పని లేదంటావా? అన్ని పనులు నువ్వే చేస్తున్నా వాయె, మరి!" ఆమె చెక్కు తీస్తున్న దోసకాయలు పళ్ళెంలో పెట్టి, "పోనీ, వాటినన్నా ముక్కలుగా తరుగు" అంటూ గ్లాసులు తీసుకుని వెళ్ళింది.
మళ్ళీ వర్ధనమ్మ తిరిగి వచ్చేసరికి రాధ అలాగే ఉన్నది. అది చూసి, "నీ కసలు ఎవ్వరి మాటన్నా లెక్క లేదేమో? అవి కోస్తే అరిగిపోతావూ?" అంది.
"ఊఁ! కోస్తా పాపం!" లేచి వంటింటి గుమ్మం దాకా వచ్చింది. ఏదైనా తల్లి చెప్పినపుడు చెయ్యకుండా చివాట్లు తినటం రాధకు సరదా! అలా చెయ్యకపోతే ఆ రోజుల్లా రాధకు ఏమీ తోచదు. వర్ధనమ్మకూ ఏదో వెలితిగానే ఉంటుంది.
"ఎక్కడికి వెళుతున్నావే?"
"మీనాక్షి గోరింటాకు పెడతానన్నది. తెచ్చుకుంటాను."
"నీ ఇష్టం, తల్లీ! ఏమన్నా అంటే ఎగబడతావు!"
రాధ వెళ్ళిపోయింది.
వేణు, ఆర్తి రాత్రి నిద్రలేని కారణంగా రాధ తిరిగి వచ్చేసరికి నిద్ర పోతున్నారు. అప్పటికి వర్ధనమ్మ వంట పని పూర్తి అయింది. పండుగ పిండివంటలు నిన్ననే పూర్తి అయ్యాయి. పనేమీ లేదు. ఆర్తిని, వేణును వాళ్ళ పట్నవాసాన్ని గురించి రాధ వేసే ప్రశ్న లన్నిటికీ అక్కడే ఆమె జవాబు చెబుతున్నది.
వర్ధనమ్మ గోవిందరావు మొదటి సంతానం. ఆమె స్కూలుఫైనలు చదువుతున్న రోజుల్లో పెళ్ళయింది. రఘుపతి ఆమె తల్లికి తమ్ముడు. అతనూ స్కూల్ ఫైనల్ పాసయి, తండ్రి మరణించటం వల్ల ఇంటి బాధ్యతను తన భుజాలమీద వేసుకున్నాడు. అందుకని పైకి చదవటానికి వీల్లేక పోయింది. ఆ తరవాత ఇద్దరి చెల్లెళ్ళకూ వివాహాలు చేసి అత్తవారిళ్ళకు పంపించేశాడు. ఒక తమ్ముడు ఉండేవాడు గానీ, అతను పాము కరిచి మరణించాడు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం ముగ్గురే. రాధ ఒక్కతే బిడ్డ. ఆమె తరవాత ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగినా, అట్టే కాలం బ్రతకలేదు. అందుకే రాధ అంటే వాళ్ళకు ప్రాణం.
సాయంత్రం నాలుగు గంటలకు ఆర్తి, వేణు లేచారు. వర్ధనమ్మ కాఫీ, ఫలహారం తయారు చేస్తున్నది. వాళ్లిద్దరు లేవటం చూసింది. రాధ, తల్లి దగ్గిరికి వచ్చింది. "అమ్మా! మావయ్య, పిన్ని లేచావే!"
"లేస్తే ఏమయింది?"
"మరి కాఫీ తాగుతారన్నావుగా?"
"వాళ్ళకన్న నీకే ఎక్కువ తెలుసులా ఉందేమే? మరి తీసుకు వెళతావా?"
"అమ్మో! నేనే?" అ దేదో భయంకరమైన పని అన్నట్లు.
"అంత ధైర్యం లేనిదానివి ఎందుకు చెప్పావు?"
అమ్మ తనను బొత్తిగా తీసివేసినందుకు రాధకు రోషం వచ్చింది. తువ్వాలు తీసుకుని, వేణు పెరట్లో బావి దగ్గిరికి వెళ్ళటం రాధకు అవుపిస్తూనే ఉంది. త్వరగా గదిలోకి వెళ్ళి, అక్కడ పెట్టి, పిన్నికి ఇచ్చేసి రావచ్చు.
"ఇవ్వు మరి!"
తల్లి నవ్వుతూ, రెండు ఉప్మాప్లేట్లు ఒక పళ్ళెంలో పెట్టి ఇచ్చి, "ముందు అవి ఇచ్చిరా! కాఫీ కాగానే నేను తెస్తాను" అన్నది.
రాధ వెళ్ళింది.
గదిలో ఆర్తి వైద్య గ్రంధమేదో చదువుతూ ఉన్నది. రాధను చూసి, "నువ్వా, రా! రా!" అంటూ మరో కుర్చీ ముందుకు జరిపింది.
రాధ పళ్ళాన్ని పాతకాలంనాటి మేజామీద ఉంచి, "అమ్మ అవి తినమన్నది" అంటూ వెళ్ళబోయింది.
"పోతున్నావేం? కూచో!"
"మావయ్య వచ్చేస్తాడు."
"వచ్చాను కూడా!" దర్వాజా దగ్గిరనుండి వేణు కంఠం వినపడింది.
రాధ మరీ సిగ్గుపడింది. వేణు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మొహం తుడుచుకుంటూ ఆ కుర్చీకి, రాధకు మధ్య అడుగు దూరం కూడా లేదు. ఆర్తి కుర్చీకి, వేణు కుర్చీకి మధ్య రాధ నిలుచుంది.
"మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో?" వేణు అద్దం ముందుకు జరుపుకున్నాడు. రాధ మౌనం.
"వచ్చిన చుట్టాల నిలాగేనా మర్యాద చెయ్యడం?"
"........................"
"ఏమిటో, ఆ మౌనానికి అర్ధం?"
ఆర్తి అంది! "ఏం రాధా? అమ్మ మాట్లాడ వద్దన్నదా?"
"కా.... కా...దు. పిన్నీ!"
వేణు నవ్వాడు. "అబ్బ! ఇప్పటికి మాటలు పెగిలాయి. కింద పడ్డ ముత్యాలు ఏరుకోవడమే తరవాయి. "
రాధ వెళ్ళబోయింది వేణు తటాలున చెయ్యి చాపి, అవతల ఉన్న ఆర్తి కూర్చున్న కుర్చీని పట్టుకున్నాడు. అటు ఇటు కుర్చీలు, వెనక మేజా, ముందు అడ్డుగా వేణు చెయ్యి. బోనులో ఎలకలా అయింది రాధ పని. వేణు గలగల నవ్వాడు. ఆర్తి కూడా చిరునవ్వుతో చూసింది. రాధ నిస్సహాయురాలైంది.
ఆర్తిని సహాయం కోరుతున్నట్లు, "చూడు, పిన్నీ!" అంది రాధ.
"చూస్తూనే ఉంది." వేణు అన్నాడు.
వర్ధనమ్మ కాఫీ గ్లాసులతో లోపలికి వచ్చి, రాధస్థితిని గ్రహించి ముసిముసిగా నవ్వింది. ఆమెను చూసి వేణు, "అక్కా! ఈ పల్లెపిల్ల పట్నం బాబును టోపీలో వెయ్యాలని చూస్తూంది"అని చెయ్యి తీశాడు. రాధ బాణంలా రివ్వున వెలుపలికి దూసుకుపోయింది.
ఆమె కాసేపు కుశల ప్రశ్నలు వేసింది. రఘుపతి ఊళ్ళోకి వెళ్ళాడు. వాళ్ళతోనూ, వీళ్ళతోనూ రచ్చబండ దగ్గిర పొద్దుగూకే దాకా లోకం సంగతులు మాట్లాడి, పేపరులో సంగతులు చదివి వినిపించి వస్తాడు. వాళ్ళ ఊరికి ఒక్కటే పత్రిక, అతనికే వస్తుంది.
రాత్రి భోజనాల దగ్గిర వేణు కుట్ర (రాధ మాట) బయట పడింది. అందులో తన తల్లికూడా భాగస్వామి అయినందుకు పడుకునే వరకు సత్యాగ్రహం. అసలు సంగతి.
రఘుపతికి, ఆర్తికి, వేణుకు, రాధకు ఒకేసారి వడ్డించింది. తల్లి ఉద్దేశ్యం గ్రహించిన రాధ ముందు నిరాకరించినా, కూర్చోక తప్పలేదు. వేణు తను అటు కూర్చుంటున్నావంటూనేరాధ పక్కన కూర్చోనే కూర్చున్నాడు. తనమీద ఈ కుంభకోణం జరిపిన తల్లిని అరగజం ఎత్తున కోప్పడింది. రఘుపతి చెప్పే ప్రవాసనాలు, వేణు వినిపించే పట్నం సంగతుల మధ్య భోజనాలు కానిచ్చేస్తున్నారు. అయితే ఈ సందడిలో వేణు విస్తరిలో అన్నం రాధ విస్తరిలోకి గుసగుస నడిచి పోతున్నది. రాధ గమనించలేదు. తను ఎంత తింటున్నా అన్నం తరగకపోవటం, వేణు రెండు మూడుసార్లు అన్నం అడిగి పెట్టించుకోవటం, అందరూ తనను చూసి నవ్వుకుంటూ ఉండటం చూస్తే అనుమానం కలిగింది. కాసేపుకాపువేసి దొంగను పట్టుకుంది.
