Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 11


    "సీతా!"
    గద్గద కంకుడై అతను పిలిచేసరికి ఆమె నిలవలేక పోయింది. కట్టు విప్పుకున్నట్టుగా ఆమె వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది. ఆ మరుక్షణం ఆమె అతని చేతుల్లో వాలిపోయింది.
    "ఎలా నేను మిమ్మల్ని మరిచిపోను? నాకేమీ అర్ధంకావడం లేదు!" అంటూ విలపించింది సీత. ఆమెను ఓదార్చాడు మూర్తి.
    చివరికి సీత తలఎత్తి అతన్ని చూసింది. "మూర్తి ! నా జీవితం మీదే" అన్నది.
    "నా జీవితమూను...." అన్నాడు మూర్తి.
    "నేనది గుర్తించే చెబుతున్నాను. జీవిస్తే నేను మీ భార్యగానే జీవిస్తాను."
    "ఏమిటి?"
    "అవును. మీ భార్యగానే నా జీవితం! ఇది తప్పదు."
    కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు తన మనోభిప్రాయాన్ని తలిదండ్రులకు చెప్పడం మొదలు పెట్టింది సీత. "నేను మూర్తిని పెళ్లి చేసుకుని ఆయన రెండో భార్యగా ఉంటాను." అని చెప్పిందో లేదో వాళ్ళు ఉలిక్కిపడ్డారు. "ఏమిటమ్మా నువ్వు చెయ్యదలుచు కుంది?" అంటూ ఆమె మీద మండి పడ్డారు. ఆమెకు బుద్దులు చెప్పారు. జీవితంలో ఇటువంటి పనులు చెయ్యడం తప్పనీ, ఇందువల్ల ఆమెకు నిరంతరంగా సంతోషం కలగనీ చెప్పారు.
    సీత చాలా గారాబంగా పెరిగిన పిల్ల. అందువల్ల ఆమె కోక విధమైన స్వాంతం త్యం అలవడింది. ఈ మధ్య ఆమెకు ఒక ధైర్యం కూడా వచ్చింది. ఆయన్నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది.
    ఈ సంగతి మూర్తి ఇంట్లో కూడా వ్యాపించింది. అంతే. రభస ఆరంభమయింది. అతనికీ, అతని భార్య నళినీ కీ మధ్య మాటిమటికీ పోట్లాటలు వచ్చేవి. ఇల్లు ఖాళీ చేసి, దగ్గరలో ఉన్న మరో గ్రామానికి బస మార్చాలని పట్టుపట్టింది నళిని. మూర్తి ఆమెకు ఎదురు చెప్పలేక పోయాడు. చివరికి ఆమె సలహాని అతను అంగీకరించవలసి వచ్చింది. ఒకనాడు రాత్రి పూట ఎవరికీ తెలియకుండా వాళ్ళు యిల్లు ఖాళీ చేసి వెళ్ళారు.  
    వాళ్ళు వెళ్ళిన విషయం సీతను ఆశ్చర్య పరిచింది. చివరికి వాళ్ళెక్కడికి బస మార్చింది తెలుసుకుంది. రకరకాలుగా ఆమె ఆలోచించింది. ఒక నిశ్చయానికి వచ్చింది. తల్లిదండ్రుల్ని , ఇంటినీ విడిచి పెట్టడానికే ఆమె నిశ్చయించు కుంది. తనకు సొంతం అనదగిన ఒకే ఒక కుట్టు మిషను మాత్రం తీసుకుని మూర్తి ఉన్న ఊరు చేరుకుంది సీత. చేరిన మూడో రోజున అతన్ని కనుక్కోగలిగింది........
    "ఎందుకు, సీతా, మాట్లాడడం లేదు?' అడిగాడు మూర్తి.
    తన పాత స్మృతుల నుంచి మెల్లగా బయట పడింది సీత.
    "ఏం లేదు. పాత సంగతుల్ని నెమరు వేసుకున్నాను."
    "సీతా! నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది."
    "మా నాన్న ఎంతగానో చెప్పి చూశాడు. వెళ్ళవద్దని బతిమాలాడు. నీతో సంబంధం తెగిపోతుందని భయపెట్టాడు. కాని నేనందుకు భయపడలేదు. అందర్నీ విడిచి పెట్టి వచ్చేశాను" అన్నది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా.
    "నువ్వు చేసిన త్యాగం చూస్తుంటే , నేను కుంచించుకు పోతున్నాను, సీతా! నీతో చెప్పకుండానే ఇక్కడికి వచ్చేశాను నన్ను క్షమించవూ?"
    "నేనా క్షమించడం? మీ దగ్గర నేనుండెందుకు అనుమతించారు మీరు. ఆ అనుమతే నా పాలిటి వరం!" అంది సీత.
    ప్రకాశం పార్కు లో వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు. దీపాలు తీసేటప్పుడు లేచారు.
    "ఈ ఊళ్ళో నేనుండడానికి అభ్యంతరం లేదుగా?' సీత నడుస్తూ అడిగింది.
    "అభ్యంతరం లేదు, సీతా! నా భార్య కనక నన్ను చూస్తె......."
    "అందుకనే నన్నూ పెళ్లి చేసుకో మని అడుగుతున్నాను."
    మూర్తి మౌనం వహించాడు.
    "ఏమిటి ఆలోచన?"
    "ఏమీ లేదు, సీతా! నా భార్య ఇందుకు ఒప్పుకోదు."
    కొంచెం దూరం నడిచిన తరవాత మూర్తి వెనక్కు తిరిగి సీతను చూశాడు. ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు కారుతున్నాయి.
    "సీతా!" అన్నాడు మూర్తి.
    "నన్ను విడిచి పెట్టండి. కన్నీరు కార్చి శాంతిని పొందుతాను. " సీత ఏడుస్తూనే చెప్పింది.
    మూర్తి పిచ్చివాడు లా నిలబడ్డాడు. ఉన్న చోటనే నిలబడింది సీత.
    ఆమె చేతులు పట్టుకున్నాడు మూర్తి.
    "సీతా! నాకు ఒక్క రోజు వ్యవధి ఇవ్వు. నేనొక నిశ్చయానికి వస్తాను. ఏమైనా నీతోనే నా జీవితం" అన్నాడు ఉద్రేకంగా.
    ఆ మరునాడు మూర్తి చేసుకున్న నిర్ణయం విచిత్రంగా కనిపించింది. ఆ ఊరు విడిచి పెట్టి సీతతో మరెక్కడి కైనా వెళ్ళడమే అతను చేసుకున్న నిర్ణయం.
    మొదట్లో సీత ఒప్పుకోలేదు. బలవంతం మీద చివరికి ఒప్పుకుంది.
    నెలలు చాలా గడిచాయి. ముప్పయి మైళ్ళ దూరాన ఉన్న ఒక గ్రామంలో సీతా మూర్తీ భార్యాభర్తలుగా జీవించారు. సీతకు ఒక మగ పిల్లవాడు పుట్టాడు.
     పిల్లవాడు పుట్టి రెండు నెలలయి ఉంటుంది. ఒకనాటి రాత్రి తలుపు తట్టిన చప్పుడయింది. సీత తలుపు తెరిచింది. గడప లో నళిని నిలబడడం చూచి ఆమె నిర్ఘాంత పోయింది.
    నళిని ని చూడడానికే బాధగా ఉంది. ఆమె కట్టుకున్న చీరే-- చిరిగి పోయింది. చిక్కి శల్య మయింది.
    "నీ జీవితాన్ని పాడు చేయ్యనమ్మా, సీతా! నువ్వు హాయిగా ఉందువు గాని! నాకు నా భర్త తప్ప దిక్కెవరూ లేరు. చుట్టాలేవ్వరూ నన్ను ఆదుకోవడం లేదు. ఎంతో కష్టపడి , ఈ ఊరు కనుక్కుని ఇక్కడికి వచ్చాను. ఒక మూలగా ఉంటాను. చోటివ్వు, అమ్మా! నిన్ను బతిమాలు కుంటున్నాను" అంది నళిని.
    సీత బదులేమీ చెప్పలేదు. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తలుపును బాగా తెరిచింది. లోపలికి వచ్చిన నళిని ని మూర్తి నిశితంగా చూశాడు. ఏమీ మాట్లాడలేదు.
    సీతతోనూ, నళిని తోనూ మూర్తి సంసార యాత్ర చేయసాగాడు. వాళ్ళిద్దరూ ఒకరి కొకరు సఖ్యతగా ఉంటూ ప్రశాంతంగా కాపరం చెయ్యసాగారు.
    కొన్ని నెలలు గడిచాయి. మూర్తి లో ఒక మార్పు ఏర్పడుతున్నట్టు సీత గ్రహించింది. సీత మీది ప్రేమ అతనికి క్రమక్రమంగా తగ్గ జోచ్చింది. ఆమెతో ఏకాంతంగా మాట్లాడడం అరుదయింది. ఒకవేళ ఆమె కలగజేసుకుని మాట్లాడినా విసుగుతో బదులు చెప్పేవాడు. అప్పుడప్పుడు కోపం కొద్ది తిట్టడం కూడా మొదలు పెట్టాడు.
    ఈ మార్పుల్ని నళిని కూడా క్రమక్రమంగా గ్రహించింది. ఇంటి పనుల్ని మెల్లమెల్లగా సీతకు అప్పజెప్ప సాగింది. మొదట్లో బతిమాలినట్టుగా చెప్పేది. ఆ తరవాత ఆజ్ఞాపించడం ప్రారంభించింది.
    రానురాను ఈ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. నళిని రాణి లా ఇంట్లో అధికారం చెలాయించ సాగింది. సీత ఆమెకు అణగి మణగి ఉండవలసి వచ్చింది.
    ఒక సంక్రాంతి రోజున :
    నళిని అజ్ఞా ప్రకారం సీత లోపల పిండి రుబ్బుతూ ఉంది. నళిని ఏదో పని మీద దొడ్లో కి వెళ్ళింది.
    అప్పుడు బయటికి వెళ్ళిన మూర్తి తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే ధైర్యం తెచ్చుకుని వెంటనే లేచింది.
    "ఏమండీ" అంటూ అతని దగ్గరికి వెళ్ళింది.
    "ఏమిటి?" అని అడిగాడు, తిరిగి చూడకుండానే.
    "ఇంత పిండినీ నన్నోక్కదాన్నే రుబ్బమంది అక్కయ్య. నా వల్ల ఎలా అవుతుందని? అక్కయ్యను కూడా రుబ్బమనండి" అంది.
    "అది రుబ్బదు. నీ కిష్టమైతే రుబ్బు."
    "లేకపోతె........."
    "బయటికి వెళ్ళు!"
    "ఏమిటి? నన్ను చూసి చెప్పండి."
    అతను ఆమె వైపు తిరిగి కోపంగా చూశాడు. "బయటికి వెళ్ళమని చెపుతున్నాను . నాకేం భయం?' అంటూ అతను గది వైపు నడిచాడు.
    సీతకు గుండె నరం ఒకటి పుటుక్కున తెగినట్లయింది. చాలా క్షణాల పాటు కళ్ళు చీకట్లు కమ్మాయి. అక్కడ ఆమె నిలవలేక పోయింది.
    రోలు వద్ద కూర్చుంది. ఏడ్చింది. అతన్ని పెళ్లి చేసుకోకుండా, భార్యగా జీవిస్తున్న ఆ భయంకర పరిస్థితిని తలుచుకుంది. ఒళ్ళంతా కంపించింది.
    "బయటికి వెళ్ళు." 'ఎంత మాట అన్నాడు? నేనెక్కడికి వెళ్ళను? మా నాన్న నన్ను ఆదరిస్తాడా? ఊరేమను కుంటుంది? ఈయన ఎందుకిలా మారిపోయాడు? నేనిప్పుడు ఎందుకు నచ్చక పోయినాను? నళిని అంటే ఎందుకింత ప్రేమగా ఉంటున్నారు?' ఇలా రకరకాలుగా ఆలోచించింది. "ఏమయినా నళిని ఆయనకు శాస్త్ర సమ్మతంగా భార్య అవుతుంది. మరి నేను?"
    ఏమీ తోచలేదు. ధనవంతుల ఇంట్లో పుట్టి, చివరికి ఇక్కడ ఇలా కష్టపడుతున్నాను గదా' అనుకుంది.
    ఆరోజుకా రోజు సీతకు ఎక్కువగా పనులు అప్ప జెప్పడం మొదలు పెట్టింది నళిని. వాటన్నిటిని సీత మౌనంగా ఒప్పుకుని చెయ్యవలసి వచ్చేది. పిల్లవాడికి పాలిచ్చెందుకు కూడా ఆమెకు వ్యవధి ఇచ్చేది కాదు నళిని.
    పోనుపోను నళినీ, మూర్తీ ఆమెలో ఏదైనా తప్పు వెతికి తిట్టడం ప్రారంభించారు. మూర్తి ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. త్వరలోనే నళిని కూడా ఈ పనికి అందుకుంది.
    ఇంట్లో అన్ని పనులూ మౌనంగా చేసేది సీత. ఒంటరిగా ఉన్నప్పుడల్లా కంట తడి పెడుతూ ఉండేది.
    ఒక శనివారం నాడు-- రాత్రి ఎనిమిది అయి ఉంటుంది. అంగడి నుంచి నూనె తీసుకు వస్తుంది సీత. వస్తుంటే కాలు తగిలి నూనె కాస్త కింద ఒలికి పోయింది. ఇంటికి భయపడుతూ వచ్చింది. జరిగిన విషయాన్ని మెల్లగా చెప్పింది.
    "ఎందు కంత అ జాగ్రత్త నీకు? ఇక మీద నువ్విక్కడ ఉండకూడదు. పో, పో నిన్నెవరు పిలుస్తారో వాళ్ళింటి కే వెళ్లు" అంటూ ఆమెను బయటికి నెట్టదలచినది నళిని.
    సీత భయపడిపోయి నిలబడింది. ఆమెకు ఏడుపు వచ్చింది. ఇదంతా చూస్తూనే సావిట్లో కూర్చున్నాడు మూర్తి. సీత సరాసరి అతని దగ్గరికి వెళ్ళింది.
    "మిమ్మల్ని బతిమాలు కుంటున్నాను. ఈ ఇంట్లోంచి నన్ను గెంటి వెయ్యకండి! నన్ను మీ భార్యగా చూడకండి. పని మనిషిగా ఇక్కడుంటాను. మీరు పెట్టింది తింటూ గొడ్ల సావిట్లో ఉంటాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను ఇంట్లోంచి గెంటి వెయ్యకండి! ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగాను. మిమ్మల్ని నమ్మి వచ్చాను. మీ పని మనిషిగా ఉండేందుకు నా కనుమతి ఇవ్వండి." అని ఏడుస్తూ చెప్పింది.
    మూర్తి ఏమీ కదల్లేదు.
    "ఆయనతో ఏమిటే చెప్పు కుంటున్నావు? సరసారి బయటికి వెళ్లు" అంది నళిని, సీతను చేతులు పట్టి లాగుతూ.
    "అక్కయ్యా! నేనెక్కడి కని వెళ్ళను? వెళ్ళే చోటు లేదు. మా నాన్న నన్ను దగ్గరికి రానివ్వడు. నేనిక్కడే ఉంటాను."
    "ఇదేమన్నా నీ అత్తవారిల్లను కున్నావా? పోవే."
    నళిని సీతను ఒక తోపు తోసింది. ఆమె ఒక మూల పడిపోయింది.
    "దాని గుడ్డలు దాని కిచ్చి తరిమేయ్! ఇక మీద అది ఇక్కడ ఉండకూడదు." అరిచాడు మూర్తి.
    బాధగా అతని వంక తేరిపార చూసింది సీత. ఏడుపు ముంచుకు వచ్చింది.
    "మూర్తీ!" అని పిలిచింది.
    "పేరు పెట్టి పిలవకు."
    "సార్...."
    "అలానూ పిలవకు! నీకూ నాకూ సంబంధ మేమిటి?"
    "నా భర్త కారా?"
    "నీకు మంగళ సూత్రం కట్టానా?"
    "సీత మహా బాధపడింది. జీవితపు పునాది కదిలిపోయినట్లని పించింది.
    "కట్టలేదు. కాని మీతో కాపరం చేశాను. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోను?"
    "నీకు వెళ్ళే చోటు లేదనా? మీ నాన్న ఇంటికి వెళ్లు. అయన ధనవంతుడు!"
    "ఏ మొహంతో పోను?"
    "ఈ మొహంతో నే. ఇక్కడ నిన్ను పోషించలేను. నువ్వు వెళ్లి తీరాలి."
    మూర్తి దొడ్లోకి వెళ్లాడు. కాళ్ళు కడుక్కుంటుండగా లోపలి నుంచి "ధం ధం" అనే చప్పుడూ, 'అయ్యో! నన్ను కొట్టకండి" అని సీత రోద ధ్వని వినవచ్చాయి. ముఖం తుడుచుకుని అతను లోపలికి వచ్చేసరికి తల విరబోసుకుని సీత నిలబడి ఉంది. ఆమె నుదుటి నుంచి నెత్తురు కారుతూ ఉంది. కోపావేశంతో నిలబడిన నళిని చేతిలో ఒక కర్ర ఉంది. సీత పది నెలల పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తూ ఉన్నాడు.
    "ఫో బయటికి" అంది నళిని. భయపడుతూ సీత తన గుడ్డలు తీసుకుంది. జంకుతూ నిలబడింది.
    "పొమ్మంటే పోవెం" అని మూర్తి మండి పడ్డాడు. నళిని చేతిలోంచి ఆ కర్ర తీసుకుని సీత వీపు మీద ఒక దెబ్బ కొట్టాడు. "అమ్మా" అంటూ మెలికలు తిరిగి పోయింది సీత. వీపు ఎత్తలేక పోయింది. రెండు నిమిషాల తరవాత బాధపడుతూ వీపు పై కేత్తింది. సగం ప్రాణం పోయినట్టుగా నిలబడింది.
    "ఇంకా నించున్నావుటే , వెళ్ళమంటుంటే . ఇదుగో , కాల్చిన గరిటె తెస్తా ఉండు" అంటూ లోపలికి పరిగెత్తింది నళిని. కొంచెం సేపటి కల్లా బాగా కాలిన గరిటె తో బయటికి వచ్చింది.
    "ఇలా ఇవ్వు" అని ఆ గరిటె తీసుకుని మూర్తి సీత వద్దకు వచ్చాడు.
    అతన్ని వెర్రిగా చూసింది సీత , కనుగుడ్లు బయటికి వచ్చాయా అన్నట్లు చూసింది.
    "అక్కడ నిలవండి." ఆమె అరిచింది.
    "ఏమిటి, బెదిరిస్తున్నావా?"
    "ఒక్క అడుగైనా వెయ్యకండి."
    "ఏం చేస్తావ్?"
    వెంటనే గుడ్డల్లో దోసి ఉంచిన కొడవలి ని బయటికి తీసింది.
    "అంత దైర్యమా?' అంటూ గరిటె తో మూర్తి ఆమెను సమీపించాడు.
    ఆ మరుక్షణం సీత కొడవలి ని విసిరి వేసింది.
    "ఆ" అనే అరుపు వినిపించింది. మూర్తి చుట్టచుట్టుకుని కింద పడ్డాడు. కడుపులోకి దిగబడిన కొడవలి అలాగే నిలిచి పోయింది.
    ఈ విషయం గురించి ఆమె తరవాత నాతో మాట్లాడినప్పుడు ఇలా చెప్పింది:
    "అప్పుడు నాకు వచ్చింది కోపమో, లేక దెబ్బకు దెబ్బ తియ్యాలనే మనస్తత్త్వమో తెలియదు. నాలో అణిగి వున్న శక్తి అంతా ఒక్కసారి పైకి లేచింది. కొడవలి ని విసిరివేశాను. ఆ తరవాత ఏం జరుగుతుందో అని ఆలోచించలేదు. నన్ను హింసించిన వాళ్ళని హింసిద్దామనుకున్నాను.
    సీత పిల్లవాడ్ని తీసుకుని. బయట చీకట్లో మాయమయింది.
    పొలాలూ, బాటలూ దాటింది. ఆ రాత్రిని ఒక చెట్టు కింద గడిపింది. తెల్లవారిన తరవాత గబగబా నడక సాగించింది.
    హత్య జరిగిన ఒక గంట కల్లా మూర్తి మరణించాడు. ఊరు గుమిగూడింది. పోలీసులు వచ్చారు. కేసు పెట్టారు. హత్య జరిగిన రెండవ రోజున పదిహేను మైళ్ళ దూరాన ఉన్న ఒక గ్రామంలో బిచ్చమెత్తుకుంటున్న సీత ఖైదు చెయ్యబడింది.
    ఆమె తలిదండ్రులు గాని, బంధువులు గాని ఎవ్వరూ ఆమెకు సహాయంగా నిలబడలేదు. కేసు కోర్టు వారి ఎదటికి వచ్చింది. తాను హత్య చెయ్యలేదని సీత వాదించింది. విచారణ చేసిన న్యాయమూర్తి ఆమెకు యావజ్జీవ శిక్ష విధించాడు.
    జైలులో సీత ఏడేళ్ళు గడిపింది. బాల భవనం లో చేర్చబడిన ఆమె కొడుకు అక్కడే ఎనిమిదేళ్ళ వరకు పెరిగాడు.
    గాంధీజీ శతజయంతి సందర్భంగా జైలు శిక్ష తగ్గించబడడంతో సీతకు విడుదల లభించింది. ఆమె వెడుతూ చెప్పిన మాటలివి:
    "నేను తలిదండ్రుల మాటను విని ఉండవలసింది. కాని వినలేదు. జైలు శిక్ష అనుభవించాను. నాలా స్త్రీలు పిచ్చిగా ప్రేమించ కూడదు. ప్రేమ కనక ఏర్పడితే కళ్ళు తెరుచుకుని చూడాలి. జీవితంలో చిత్త శాంతి చాలా ముఖ్యం. మా నాన్న చెప్పినట్టు విని నేను మరొకర్ని కనక పెళ్లి చేసుకున్నట్లయితే నాకీ గతి పట్టేది కాదు. మూర్తి నన్ను మోసం చేశాడు. చంటి పిల్లవాడు కనక లేకుంటే ఎప్పుడో నా ప్రాణాన్ని అంతం చేసుకునే దాన్ని. పిల్లవాడి మీద ప్రేమ కొద్ది నేను బతికి ఉన్నాను."
    "మీరిక్కడికి వెడతారు, ఎలా జీవిస్తారు?' అని అడిగినందుకు ఆమె ఇలా బదులు చెప్పింది.
    "ఎక్కడి కని వెళ్ళను! నా తలిదండ్రుల వద్దకు వెడతాను. వాళ్ళు కనక నన్ను ఆదరించక పొతే, ఎక్కడైనా కూలి చేసు కుని బతుకుతాను. మా అబ్బాయి నాకు తోడుగా ఉంటాడు."
    నిజానికి పిల్లవాడు ఆమెకు తోడు! ఎనిమిదేళ్ళు నిండాయి వాడికి. చదువులో చాలా గట్టి వాడని అప్పుడే పేరు సంపాదించాడు. టీచర్లు వాణ్ణి మెచ్చుకుంటూ మాట్లాడారు.
    జైలులోంచి ఒక ఖైదీ విడుదల అయ్యేనాడు సాధారణంగా అతని బంధువులు, మిత్రులూ వచ్చి అతన్ని పిలుచుకు వెళ్ళడం అలవాటు. కాని సీతను పిలుచుకు వెళ్లేందుకు ఎవరూ రాలేదు. అయినా భ్రమ కొద్దీ తన చుట్టూ పక్కలు చూసింది. ఎవరూ కనిపించలేదు. అందుకని ఆమె ధైర్యం కోల్పోలేదు. కుర్రవాడి చెయ్యి పుచ్చుకుంది. దగ్గరున్న వాళ్లకు ఒక్కసారి నమస్కరించింది. ఆ తరవాత ఒంటరిగా ఆబల వలె గబగబా నడక సాగించింది.
    ఆ దృశ్యాన్ని ఎన్నడూ మరిచి పోవడానికి వీలు లేదు.
    
                              *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS