Previous Page Next Page 
కాగితపు పల్లకి పేజి 12

 

    అయితే ఈ వారం రోజుల పరిచయం లోనూ చలపతి ప్రవర్తన లో కొంత మొరటుతనం, అసభ్యత ఆమె పసి గట్టక పోలేదు. సంసారంలో పది మందిలో మెసిలిన భావన చనువుగా కలిసి మెలిసి తిరగటం ఒక మాటకి పది మాటలు కలుపుకోవటం అతనికి తెలియవు. ఒకటి రెండు సందర్భాలలో రంగనాధం సరదాగా వేళాకోళం చెయ్యబోతే భర్త చాలా మొరటుగా సమాధానాలు చెప్పాడు. తానూ అక్కడే వుంది. మీద కలియపడి కొడతారేమో అని తాను భయపడింది.
    "ఏం బావగారూ మరీ అంత అంటీ అంటకుండా ఉంటె ఎలా? కాస్త మాతో కలిసి కబుర్లు చెప్పండి." అన్నాడు రంగనాధం భోజనాలయి వరండా మీద కూర్చున్నప్పుడు.
    "ఉత్తి కబుర్లు చెప్పుకుని ఏవిటి ప్రయోజనం? చేతనైతే రెండు పేకలు తీసుకురండి చేతులు కలపండి. మరి శక్తి చూపించండి." అన్నాడు చలపతి.
    రంగనాధం బావమరుదులకి పేకాట అట్టం రాదు. అందుకు రంగనాధం "డబ్బెట్టి పెకాడితే పెద్దవాళ్ళు హర్షించరు. మనం చెడిపోతున్నాం అని వాళ్ళు గొడవ చేస్తారు." అన్నాడు.
    "చేతకాదని చెప్పరాదూ. ఎందుకొచ్చిన సంజాయిషీ లు. ఉత్త కబుర్లూ ఆడాళ్ళు చెప్పుకుంటారు. " అన్నాడు చలపతి.
    అక్కడున్న వాళ్ళంతా ముఖం మీద కొట్టినట్టుగా చలపతి అన్న ఈ మాటలకి ముఖం మాడ్చుకున్నారు. రంగనాధం నోరు మెదపలేక ఊరుకున్నాడు. ఆడవాళ్ళ ముందు చలపతి అలా చులకనగా తీరిపారేస్తూ మాట్లాడినందుకు రంగనాధం బావమరుదులు లోపలికి వెళ్ళటానికి మనస్కరించక అక్కడే ఉండటానికి మనస్కరించక కొంతసేపు బొమ్మల్లా కూర్చున్నారు.
    చలపతి "పోనీ ఓ పందెం వేద్దాం" అన్నాడు.
    ఎవరూ ఉలకలేదు, పలకలేదు.
    "అస్సలు నోరు మెదపకుండా రోజంతా గడపాలి."
    రంగనాధం "మేం ఓడిపోతాం అలాంటి పందెంలో" అన్నాడు.
    "మరింకేం చేతనవును మీకు. డబ్బాల్లాగా డబాడబా సొల్లు వాగుడు వాగాటానికి పనికొస్తారు. పోనీ కుస్తీ పడదామా?" అన్నాడతను.
    రంగనాధం ముఖం ముడుచుకుని "తొందర పడకు చలపతి. కుస్తీలో మాతో నిలబడ లేవు.నేను కాలేజీ లో కుస్తీ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాను. "రంగనాధం వాళ్ళావిడ్నీ పురమాయించి అలమారు లోంచి రెండు కప్పులు తెప్పించాడు.
    అవి చూసి చలపతి జంకి పోతాడని కాబోలు రంగనాధం బావమరుదులు కూడా అతనికి వత్తాసు నిలబడ్డారు.
    "చలపతి" మరయితే ఇంకేం సిద్దం కండి. లంగోటా బిగించండి." అన్నాడు.
    చలపతి చొక్కా కాలరు పట్టుకుని వెనక్కు లాగినందుకే నేలమీద ఎల్లకితలా పడి నడుం విరగోట్టుకున్న రంగనాధం ఆ నొప్పుల నుంచి కోలుకుందుకు రెండు రోజులు పట్టింది. రాత్రంతా భార్య బెల్లం , సున్నం కలిపి పట్టు వేసి నడుం మీద అమృతాంజనం మర్దనా చేస్తూనే ఉంది.
    రంగనాధం రెండు చేతులూ జోడించాడు. తాను చూస్తూనే ఉంది అదంతా.
    "మరి ఊరుకో. ఎందుకొచ్చిన వాగుడు." అన్నాడు చలపతి మొరటుగా.
    ఇక ఆ తర్వాత ఎవరూ భర్తని చనువుగా పలకరించలేదు. వాళ్ళకి భయం. అతనేం అంటాడో నని.
    ఆరోజే రాత్రి చలపతి అరిటి పళ్ళు తిని కావాలని వీధి గుమ్మంలో పడేశాడు. రోజూ పొద్దున్నే రంగనాధం అక్కడే నిలబడి ఇంటి యజమాని హోదా వెలగబెడుతూ ఊరంత గొంతు చేసుకుని లేనిపోని కోపతాపాలు ప్రదర్శిస్తుంటాడు పనివాళ్ళ మీద.
    పాపం రంగనాధం పొద్దున్నే మాములుగా లేచి కళ్ళు నులుపుకుంటూ వీధిలో కొచ్చాడు. రౌద్రంగా పనివాళ్ళ మీద ఎగురుతూనే ముందుకు అడుగు వేశాడు. అడుగు వెయ్యటం ఆలస్యం ఒక్క ఊపులో జర్రుమని జారి మెట్ల మీంచి ముందు పంచాలోకి వెళ్ళి చతికిల బడ్డాడు.
    చలపతి అరిటి పండు తిని ఆ తొక్కలు కిటికీ లోంచి గుమ్మంలో పారేయకుండా రాధ జాగ్రత్త తీసుకుంది. ఆమె అడ్డు పడకపోతే చలపతి మళ్ళీ తొక్కలు అలాగే పడేసేవాడు.
    చలపతి సిగరెట్టూ అంతమందిలో మా దర్జాగా కూర్చుని కాలుస్తుంటాడు. ఆ సిగరెట్టూ పీకలు వాళ్ళ తలల మీంచి అవతలకు విసిరేస్తుంటాడు. కాస్త అవతలకు పోయి కాల్చుకోకూడదు. పోనీ అక్కడే కాల్చినా లేచి వెళ్ళి పారేయ్య కూడదు." అనిపించింది రాధకు.
    రంగనాధం రాధతో అన్నాడు కూడాను. "తొందర పడ్డాం ఏవిటి ధోరణి." అని.
    ఏం చెబుతుంది తను. "ఎందుకలా చేస్తారంటే" "నాకు తోచినట్టు చేస్తాను" అంటాడు భర్త.
    ఏం చెబుతుంది తాను. అటు అన్నగారికి ఇటు భర్తకి సర్ది చెప్పలేక ఎప్పుడు ఈ వారం రోజులు గడుస్తాయా అని వెయ్యి దేవుళ్ళ కి మొక్కుకుంది.             
    రాజశేఖరం భార్య పెరటి అరుగుల మీద కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు.
    రాజశేఖరం ఇంకా సర్ది చెబుతున్నాడు "సంసారం ఏర్పాటయితే అన్నీ అవంతట అవే సర్దుకు పోతాయి." అని.
    "ఎన్ని చెప్పారండి నంగ నాచి మాటలు. మితభాషి అని. మితాహారి అని బండారం బయటపడింది. మనం ఎన్ని రకాలుగా సర్ది చెప్పాలని చూసినా వాళ్ళు నమ్మటం లేదు. పైకి తేలకపోయినా లోపల్లోపల నానా విధాలుగా గింజు కుంటున్నారు. హడలి ఆకాశం చూస్తున్నారు. పైగా ఇప్పుడే తీసుకు పోతానంటున్నాడుట అదేవిటి?
    "అవును ఎందుకు ఆలస్యం. వాడికి ముప్పై ఏళ్ళు. ఆమెకి ఇరవై ఏళ్ళకి పైపబడ్డాయి. ఇంకా చిన్నపిల్లలా , ముద్దులూ ముచ్చటలూ తీర్చుకుందుకు.
    "ఒక్క ఏడాది పాటయినా వాళ్ళకి ఉంచుకోవాలని ఉంది పాపం."
    "నా అభిప్రాయం ఆలస్యం అనర్ధాలకు దారి తీస్తుంది." అని అన్నాడు రాజశేఖరం.
    కొబ్బరి ఆకుల నీడలు ఆ పంచలో కి పడుతున్నాయి.
    రాజశేఖరం ఇంకా జరిగిన కలత నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతనికి భార్య మీద కొంచెం కోపంగా ఉంది. ఆమె పూనిక వల్లనే తను బాధ్యత మీద వేసుకున్నాడు. అనవసరంగా గొడవల్లో పడ్డాడు. అయినా భార్య తిక్క ఎదురు విసురుతుంది.
    "మనం అంటే ఏంతో గౌరవం అభిమానం ఉండేవి." అంది సుభద్రమ్మ.
    రాజశేఖరం ముఖం వంచుకున్నాడు.
    "ఇప్పుడాదంతా పోయింది. మన్ని మోసగాళ్ళ క్రింద జమ కట్టి మాట్లాడుతున్నారు. వీసమెత్తు విలువ కూడా ఉండటం లేదు. మరిది గారు నోరున్న మనిషి గనుక అనలేక భయపడుతున్నారు గాని మనం అంటే అసలు లక్ష్య పెట్టటం లేదు. కూరాకులో పురుగులా తోసి పారేస్తున్నారు. నాకు తలవంపులుగా ఉంది. ఎప్పుడెప్పుడు కొంపకి చేరతామా అనిపిస్తుంది." అంది సుభద్రమ్మ.
    "ఇందంతా నీ మూలాన్నే" అన్నాడు రాజశేఖరం.
    "నేనేమన్నా కలగన్నానా వారిలా దాచిపెట్టి ఇలాంటి సంబంధాలు అంట కడతారని నేను అనుకున్నానా" అసలు లోపాలు నా దగ్గరయినా  చెప్పవచ్చుగా . నా దగ్గరా దాచారు. మోసం చేస్తే ఇలాగే ఉన్న పరువులు కూడా పోయి అల్లరి అవుతాం."
    "నూరు అబద్దాలయినా చెప్పి ఓ పెళ్ళి జరిపించమన్నారు పెద్దలు. అలానే చేశాను."
    "సర్లెండి. ముందు ముందు అతగాడు సరిగ్గా ఉన్నాడా సరే ఏమైనా గొడవలు జరిగితే భాద్యత మన మీద పడుతుంది. తమ్ముడ్ని ఎలా దారిలో పెట్టుకుంటారో ఏవిటో?"
    రాజశేఖరం "నాదేముంది నీది బాధ్యత" అన్నాడు.
    సుభద్రమ్మ కాసేపు వూరుకుని మళ్ళీ మొదలు పెట్టింది. భర్తకి విసుగ్గా వున్నా ఆమె ఒకంతట విడవకుండా "అది సరే అసలు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారండి. మధ్యన వాళ్ళెకెందుకు ఈ రొష్టు. నిన్న చిలకా గోరింకల్లా రెండు సినిమాలు చూసొచ్చారు. పెళ్ళయి నాలుగు రోజులు కాలేదు అప్పుడే ఇరవై నాలుగంటలు తలుపులు వేసుకుని ...ఛా...సిగ్గు ....ఎగ్గు అన్నీ విడచెశారండి. ఈనాటి పిల్లలు.... మరి అంత చేటు లోపల్నుంచి పకపకలూ వినిపిస్తున్నాయి."
    "మీ తమ్ముడికి కోపం కాబోలు."
    "కోపం కాదూ మరి. ఏమాట కామాటే చెప్పుకోవాలి. మీ తమ్ముడు చేసిన పని ఏం పని? అలా అరిటి పండు తొక్కలు అక్కడే పదేయ్యాలా?"
    "తెలిసి చేస్తారా?"
    "అలా నవ్వితే ఎలా ఉంటుంది?"
    "వాడేందుకు నవ్వాడో, ఇందుకే అని ఎందు కనుకోవాలి."
    "సర్లెండి మీ సమర్ధన."
    "ఏదెలా ఉన్నా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండి వాళ్ళ కాపురం ఇలాగే ఎల్లకాలం వెళ్తే అదే గదా అందరికీ కావాల్సింది." అన్నాడు రాజశేఖరం ఆవులిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS