Previous Page Next Page 
కాగితపు పల్లకి పేజి 11

 

    పెళ్ళి జరుగుతుందనే సంతోషం ఒక్కరి ముఖంలోనూ కనపడటం లేదు. తుఫాను వెలిసిం తర్వాత ఏర్పడే ప్రశాంతత అంతా ఆవరించింది.
    ఎవరి మటుకు వారు తొందర పడ్డారనే అపవాదు ఆడపెళ్ళి పెద్దల పైన వెయ్యక వేశారు. ఆడవాళ్ళు ఇంత ముఖాలు చేసుకుని ఏం చేస్తాం ఇక ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ, తెలియకే దాని బ్రతుకు నట్టేట ముంచేశారని, దాని గొంతు కోశారనే చెప్పుకున్నారు బయటి వాళ్ళు." తండ్రి ఉంటె ఇలా జరగనిచ్చేవాడా" అ ఊరు వెళ్ళి అతని ఉద్యోగం ఏవిటో అతని రాబడి ఏవిటో తెలుసుకోకుండా ఇలా పెళ్ళి చేసేవాడా?" అనుకుంటున్నారు కొంతమంది.
    రాజశేఖరం చెవిని ఈ మాటలు పడుతూనే వున్నాయి. అతనికి మనస్సు చురుకు చురుకు మంటుంది. ఈ మాటలతో. అతనికి అక్కడ కూర్చోవటం కష్టంగా ఉంది. ఇలా జరుగుతుందేమో అనే భయంతోనే ఈ ఈ సంబంధం గురించి చాలా ఆలోచించాడు. భార్య తొందర పడినా తాను అనేక విధాల ఆలోచించాడు అయితే ఇలా పెళ్ళి పీటల మీదే గొడవ జరుగుతుందని మాత్రం అతను అనుకోలేదు. ఎప్పటికైనా సంసారంలో గొడవ లొచ్చి అతను ఈమెను సరిగ్గా చూడకపోతే అల్లరిఅవుతుందేమో అనుకున్నాడు గాని ఇలా జరిగుతుందని మాత్రం అనుకోలేదు.... రంగనాధం తొందర బాటు మనిషి. ఉద్రేక స్వభావం కలవాడు. అతనికి తోడు బావమరుదులు అలాంటి వాళ్ళే.
    చుట్టూ కూర్చున్న వాళ్ళలో కొందరు తన్ని గురించి కూడా విసుర్లు మొదలు పెట్టారు.
    ఈ నిప్పుకు కారకుడైన అసలు వ్యక్తీ గొడవ రేగటంతో చల్లగా జారుకున్నాడు. అతనే అక్కడ ఉంటె చలపతి ఆగ్రహానికి అతను గురయ్యే వాడే. అక్కడికే చలపతి అతని కోసరం చాలా గాలించాడు.
    సుభద్రమ్మ భర్త పక్కగా చేరింది "ఏమిటిలా చేశారు. నాక్కూడా చెప్పకుండా ఎందుకు దాచారు" అంది.
    రాజశేఖరం నాకు మాత్రం ఏం తెలుసు?" అన్నాడు.
    "అబద్దం అడకండి. ఆనాడే నాకు అనుమానం వచ్చింది. అయితే మిమ్మల్ని నమ్మి నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేశాను మీకు తెలిసే ఈ పని చేశారు కదూ?' అంది.
    రాజశేఖరం ఒప్పుకోకుండా "ఏదో కొద్దిగా తెలిసినా...."
    సుభ్రద్రమ్మ అర్ధంతరంగా అందుకుని నూరు అబద్దాలు అయినా ఒక పెళ్ళి జరిపించమని పెద్దలే చెప్పారు గనుక ఫర్వాలేదు అనుకున్నారు అంతేగా అంది.
    రాజశేఖరం "నువ్వు కూడా అలా మాట్లాడితే నేనేం చెప్పను. నాకు చలపతి ఎంతో రాదమ్మా అంతే" అన్నాడు.
    "అలా పైకి అంటారు. ఎంత అల్లరి ఆగం అయిందో చూడండి. ఇక ముందు ముందు ఏం జరుగుతాయెనని వాళ్ళు భయపడుతున్నారు. పెళ్ళి జరుగుతుందనే సంతోషం వాళ్ళలో ఒక్కరికీ లేదు" అంది ఆమె.

                              *    *    *    *
    "ఏంటి గురూ ఇక్కడ కూడా మొదలెట్టావు" అన్నాడు రాఘవులు.
    "ఎక్కడయితే మాత్రం ప్రాణం ఊరుకుంటుందా. అలవాటు పడ్డ ప్రాణం."
    "ఇంత గొడవ జరిగినా ఇంకా జ్ఞానం రాలేదు."
    చలపతికి ఈ విసుగు  సూటిగా తగిలింది. అతను కోపంగా "ఆడు కాళ్ళుచ్చుకున్నాడని ఊరుకున్నాను. లేకుంటే ఈ పెళ్ళి నా కక్కర్లేదని తెగతెంపులు చేసేవాడ్ని" అన్నాడు.
    రాఘవులు సకిలిస్తున్నట్లుగా నవ్వేసి "ఊరుకోండయ్యా అసలు మీకు ఈ సంబంధం మీద మోజు ఉంది." అన్నాడు.
    "నాకేమీ మోజు లేదు."
    "నాకు ఆశ్చర్యం వేసిందంటే నమ్మండి. చలపతయ్య గారెంది ఆయనలా చడమడా తిడుతుంటే చూస్తూ ఊరుకోవటవెంటి  అని."
    "నేనెందుకు వూరుకున్నాను. వాడ్ని చొక్కా పట్టుకుని ఓ గుంజు గుంజేసరికి ఎల్లికలా పడ్డాడు."
    "అలా కూసినందుకు మన ఊళ్ళో అయితే ఆదికి ప్రాణాలుంటాయా. సున్నంలోకి ఎముక లేకుండా ఒళ్ళంతా పచ్చడి పచ్చడి ఇరగొట్టేయ్యరూ."
    చలపతి ముక్కు ఎగపీల్చాడు.
    ఆడపిల్ల మనస్సుకి నచ్చుతే ఎంత లావు మొగాడయినా అంతేనండి. పిల్లయి పోతారు. అలాంటోళ్ళని చిన్న పిల్లాడు కూడా అలుసు కట్టేస్తాడు?

    "ఎడిశావు . నా జోలికొస్తే పళ్ళు రాలగొడతా."
    "ఆ చూశానుగా. ఏపాటి రాల కొడతారో. లోక రివాజు చలపతయ్య కాళ్ళుచ్చుకుంటే తన్నటం....తన్నే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం...."
    చలపతి రాఘవుల్ని బ్రతిమాలాడే ధోరణి లో "ఈ గొడవలన్నీ లిల్లమ్మ కు చెప్పకేం?" అన్నాడు.
    "ఛా! మీరు వెళ్ళటం మానేసిం తర్వాత నేను ఒక్కసారి కాబోలు అటు పోయాను. ఇక్కడి వక్కడా అక్కడి విక్కడా చేరేయ్యటమేనా నా పని."హోటలు చేరేసరికి చలపతి "ఈ చుట్టుప్రక్కలా మనవాళ్ళే వరూ లేరుగదా" అన్నాడు. చుట్టూ ఓసారి కలయజూసి --
    చలపతి ఈ వారం రోజులకి హోటల్లో రూం రిజర్వు చేయించుకున్నాడు. అక్కడ మత్తుగా తాగేసి ఆ నిషా బాగా తగ్గిం తర్వాత గాని కొంపకి చేరడు..... రెండో కంటి వాడికి తెలియకుండా ఈ తంతు సాగిస్తున్నాడు. రాజశేఖరానికి అనుమానం అయితే వచ్చింది కాని అతనేవీ సాహసించి తమ్ముడికి చెప్పలేకపోయాడు. గుండెలు దడదడ మంటూనే ఉన్నా అతనికి ఈ రహస్యం కాస్తా ఎక్కడ బయట పడి ఆల్లరవుతుందోనని.
    సుభ్రదమ్మ అడిగేసింది. "ఎక్కడికి రోజూ సాయంత్రం వెళ్ళి బాగా పొద్దు పోయి వస్తాడు మరిది." అని.
    "షికారుకి పోతుంటాడు." అన్నాడు రాజశేఖరం.
    "అంతేనా. ఊళ్ళో అమృతం పుచ్చుకుందుకు పోతున్నాడా?"
    రాజశేఖరం గుండెలు దడదడ లాడాయి.
    "ఎందుకొచ్చింది నీకా అనుమానం?"
    "వాళ్ళు అనుకుంటున్నారు"
    రాజశేఖరం చలపతి తో అన్నాడు" ఇక్కడ కూడా మొదలు పెడితే ఎలా? ఇంత గొడవ జరిగినా ఏమీ పట్టనట్టుగా ఉంటె మధ్యన నాకు ఇబ్బందిగా ఉంది" అన్నాడు.
    చలపతి "ఎవరు అంటున్నారో చెప్పు" అన్నాడు.
    "ఎందుకు? మళ్ళీ కొట్లాటలు జరగటానికా"
    "అంతే రెండు దెబ్బలు పడితే ఇక ఆ ఊసు ఎత్తరు" అన్నాడు చలపతి.
    రాజశేఖరం భార్యతో "విన్నావుగా" అన్నాడు.
    సుభద్రమ్మ "ఏనాడయితే ఈ పెళ్ళి జరిగిందో వాళ్ళ గుండెల్లో పెద్ద బండే పడిపోయింది అప్పుడే. ఇక ఎన్ననుకుని ఏం ప్రయోజనం. నోరు మూసుకుని భరించి ఊరుకోవాల్సిందే అంది."

                           *    *    *    *
    రాధమ్మ మంచం వారగా పందిరి పట్టే కి అనుకుని కూర్చుంది.
    చలపతి మంచానికి అడ్డంగా పడుకుని అరిటి పళ్ళు తింటున్నాడు.
    టేబిల్ మీద అగర వత్తులు కాల్తున్నాయి. ఆ సువాసన గదంతా కమ్ముకుంటుంది.
    "ఆ తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎవరైనా జారి పడతారు. ఎవరో ఎందుకు పొద్దున్నే మీరే పడతారు." అంది రాధ.
    చలపతి ఈ పరిహాసానికి "నేనెందుకు పడతాను. ఒళ్ళు తెలియని వాళ్ళు పడతారు." అన్నాడు.
    రాధ "ఈ ఇంట్లో ఒళ్ళు తెలియని వాళ్ళెవరూ లేరు" అంది.
    "లేకేం చూస్తుండు ఎవరు పడతారో. నిన్న ఎలా పడ్డారో రేపూ అలాగే పడతారు." అన్నాడు చలపతి.
    రాధకు ఉక్రోషం వచ్చింది." అరిటి పండు తొక్కలు గుమ్మంలో పారేస్తే ఎవరైనా అడుగేస్తారు. మా అన్నయ్య కాదు మీఆన్నయ్య అయినా పడతారు." అంది.
    "అందరూ ఎందుకు పడతారు. ఒళ్ళు తెలియని వాళ్ళు పడతారు."
    "మా అన్నయ్య కు ఒళ్ళు తెలియదంటారు అంతేనా? అందుకే కాబోలు చొక్కా పట్టుకుని తోసేశారు అంది.
    "ఒళ్ళు తెలుస్తే అలా తొందర పడతారా ఎవరైనా . నేను కాబట్టి సరిపోయింది. ఇంకొక రైతే అసలు ఒప్పుకునే వారే కాదు. ఇంత గొడవ  చేసేందుకు మళ్ళీ నీ మెళ్ళో పుస్తె కట్టాలని ఉందా?' అన్నాడు.
    "మీ అన్నగారు ముందు చెప్పకుండా అలా చేయ్యోవచ్చా?"
    "ఏం చేశారు?"
    "ఎవరైనా అలాగే భయపడతారు. మీ అన్నగారు తమ పిల్లలకి పెళ్ళి చెయ్యరూ. అయన మాత్రం వెనకా ముందూ చూడకుండా సంబంధం చేస్తారా?" అంది.
    "ఇప్పుడు మీ వాళ్ళు తొందర పడ్డారంటావా?"
    "ఏమో మీ గురించి విన్న సంగతులు ఎవరికైనా భయం పుట్టిస్తాయి. అంది రాధ."
    అప్పటికీ చాలా పొద్దు పోయింది. ఊరంతా నిద్రపోయింది. స్టేషన్లో రైలు కూడా వచ్చింది కాబోలు అది ఆవిరి వడుల్తున్న చప్పుడు వినిపిస్తుంది. బయట ఎవరో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.

                            *    *    *    *
    అతని జీవిత విశేషాలు ఈ వారం రోజుల్లోనూ రాధ చాలావరకూ ఆరాలు తీసింది. అతను మనసులో దాపరికం లేకుండా అన్నీ చెప్పాడు అలా చెప్పటం వల్ల చలపతికి చాలా మనశ్శాంతి పొందినట్లు కనిపించాడు. పెళ్ళిలో తన అన్న చేసిన గొడవకి అతను చాలా కలత చెందాడు. ఈ పెళ్ళి తెగతెంపులు చేసుకునే వరకూ అతని ఆలోచనలు పోయాయి. అయితే తానుగా అన్న చేసిన పనిని ఖండించి ఈ వివాహం జరగవాల్సిందే అనటం తో అతని మనస్సు మార్చుకున్నాడు....లేకుంటే తన జీవితం లేని పోనీ పోరుషాలకు పోయి వుంటే ఇంకోలా ఉండేది. పెళ్ళి పీటల మీద చెడిపోయిన పెళ్ళి అని తెలిస్తే మళ్ళీ ఎవరు తన్ని పెళ్ళి చేసుకుంటారు. భర్త ఆ మాట అన్నాడు. పంతానికి తాను "ఉద్యోగం చేసుకుంటానని తన బ్రతుకు తాను బ్రతుకుతానని అన్నయ్య కి తానంటే....స్వంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాడని రకరకాలుగా చెప్పినా ఎవరు చేసుకుంటారు? ఏదో లోపం లేకపోతె ఎందుకు పెళ్ళి చెడుతుంది. అని అపవాదులు వేస్తారు. ఇప్పుడు పుల్లింగాలు పెట్టి ఈ పెళ్ళి చెడగొట్టాలని చూసిన వాళ్ళే అప్పుడు ఇంకోలా మాట్లాడతారు. ఇంకో విధంగా అపవాదులు పుట్టిస్తారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS