పద్మిని నిట్టూర్చి - "నాకు తెలిసిన మగాళ్ళందరూ మంచివారే!" అంది.
"ఎవరండీ మీకు తెలిసిన మగవారు!" అంది మానస చిరాగ్గా.
"మా నాన్నగారు, తాతయ్య, ఇద్దరన్నలు, ఒక తమ్ముడు...."
మానస నిట్టూర్చి - వీళ్ళను వదిలి బయట ఒక్క డంటే ఒక్క మగాడితో స్నేహంచేసి చూడండి. వాడి రంగు బయటపడుతుంది-"అంది.
"మీరలా చేశారా?" అంది పద్మిని.
"చేశాను కాబట్టే అంత కచ్చితంగా చెబుతున్నాను. అతడు నాకు అరచేతిలో స్వర్గం చూపించాడు. నన్ను మత్తులో పడవేశాడు. నేను లొంగిపోయాక అవతలకు పొమ్మన్నాడు. నేను ఏడ్చినా గుండె కరగలేదు...." అంది మానస.
"ఇది ఎప్పుడూ వినే కధే-తెలిసీ అంత సులువుగా మోసపోవడం ఆడదాని తప్పు-" అంది పద్మిని.
"చైర్మన్ గారబ్బాయి కదా - మోసం చేయడనుకున్నాను...."
పద్మిని ఉలిక్కిపడి-"చైర్మన్ గారబ్బాయా? పేరు.." అంది.
"సురేష్!" అంది మానస.
పద్మినికి కాసేపు నోటమాట రాలేదు. తర్వాత పరీక్షగా మానస వంక చూసి-"నేనెవర్నో తెలుసా మీకు?" అనడిగింది.
"చెప్పండి-" అంది మానస.
"నేను సురేష్ కి కాబోయే భార్యను...." అంది పద్మిని.
మానస మ్రాన్పడిపోయినట్లు క్షణంసేపు పద్మినివంక చూసింది. తనలోతనే ఏదో గొణుక్కుంది. తర్వాత వినిపించీ వినిపించనట్లు-"ఇడియట్, స్కౌండ్రల్...." అంది.
"ఎవర్నో తిడుతున్నట్లున్నారు...." అంది పద్మిని.
"మిమ్మల్ని కాదు-ఆ సురేష్ ని!" అంది మానస.
"నా ఎదురుగా ఆయన్ను తిట్టవద్దు-"
మానస చిత్రంగా పద్మినివంక చూసి - "అతడిని నువ్వు ప్రేమిస్తున్నావా?" అనడిగింది.
"లేదు ఆయనే నన్ను ప్రేమించారు-ఇక్కడే ఈ పార్కులోనే చూసి వరుసగా వారంరోజులు నా వెంటబడ్డారు. ఒక రోజు మర్యాదగా పలకరించి-తను నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పారు. నన్ను తాకడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఇష్టపడితే పెద్దలతో మాట్లాడతానన్నారు. అంతా పెద్దల ఇష్టం అన్నాను. పెద్దలు మాట్లాడుకున్నారు. మా పెళ్ళి నిశ్చయమై పోయింది-"అంది పద్మిని.
"అతణ్ణి మీరు నమ్ముతున్నారా?" అంది మానస.
"నా నమ్మకం సంగతి అటుంచండి. ఒకే ఒక్క సందేహం. నాతో యింత మర్యాదగా ప్రవర్తించిన మనిషి మీతో మరొకలా యెందుకు ప్రవర్తించారంటారు?"
మానస చురుగ్గా పద్నినివంక చూసి-"మీ దగ్గర అగ్గిపెట్టె వుందా?" అంది.
"లేదు-"అంది పద్మిని.
మానస తన చేతిలోని సిగరెట్ ను పద్మిని చేతిలో ఉంచి- "ఇది మీ దగ్గర ఉంచండి. ఇప్పట్నించీ సిగరెట్ అలవాటు చేసుకుంటే పెళ్ళయ్యాక యెంతో సంతోషిస్తారు-" అని అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
3
"మీ పేరేనా పద్మిని!" అన్నాడా కుర్రాడు.
"నువ్వెవరు?" అంది పద్మిని.
"నన్ను లక్ష్మమ్మగారు పంపారు-" అన్నాడా కుర్రాడు.
పద్మిని చటుక్కున లేచి నిలబడింది. లక్ష్మమ్మ సురేష్ తల్లి. తనకు కాబోయే అత్తగారు.
"యెక్కడున్నారు?"
"నాతో రండి...." అన్నాడా కుర్రాడు. పద్మిని అతడిననుసరించింది. ఇద్దరూ ఓ చిన్న యింట్లో దొడ్డి గుమ్మంద్వారా ప్రవేశించారు.
"ఇది లక్ష్మమమగారి ఇల్లు కాదే...." అంది పద్మిని.
"ఇది వాళ్ళుండే ఇల్లు కాదండి. అద్దెకిచ్చిన ఇల్లు మీతో యిక్కడ రహస్యంగా మాట్లాడాలిట. లోపల వారి సెక్రటరీ ఉన్నాడు. అతడు మీకు వివరాలన్నీ చెబుతాడు-" అని ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
పద్మిని భయంలేకుండా వెళ్ళింది.
గదిలో యువకుడొకడు ఆమెను చూస్తూనే-"రండి, కూర్చోండి!" అన్నాడు.
పద్మిని తడబడుతూ అక్కడ కూర్చుంది.
"మీరు చాలా అందంగా ఉన్నారు...." అన్నాడతను.
పద్మిని ఇబ్బందిగా నవ్వింది.
"సంప్రదాయమైన కుటుంబానికి చెందినట్లు కనబడుతున్నారు...."
పద్మినికి ఏమనాలో తెలియలేదు.
"సురేష్ నాకు అన్నీ చెప్పాడు. మీరు నాకు నచ్చారు-" అన్నాడతను.
ఈ మాటల అర్ధం ఆమెకు తెలియలేదు. చిన్నగా దగ్గింది.
అతడు కొనసాగించాడు- "ఒక మంచి మిత్రుడిగా నాదో సలహా. మీ యిబ్బందు లేమిటో, మిమ్మల్నిందుకు పురిగొల్పిన పరిస్థితులేమిటో నాకు వివరంగా చెబితే సానుభూతితో అర్ధం చేసుకుని మీకు సహాయపడతాను. కానీ డబ్బుకోసం మీరు ఎంతో పవిత్రమైన శీలాన్ని అమ్ముకోకండి-'
పద్మిని ముఖం ఎర్రగా అయింది-"ఏమిటి మీరనేది?"
"నాకు తెలుసు. మిమ్మల్ని సురేష్ పంపాడు. పంపుతానని అతడంటే వద్దన్నాను నేను. పిల్లను చూశాక నా మనసు మారుతుందన్నాడు....."
ఇద్దరూ ఒకరినొకరు అర్ధంచేసుకుందుకు కొంతసేపుపట్టింది.
సురేష్ కు అతడితో పెద్ద పని పడింది. అతడు వినడం లేదు. డబ్బాశకు కూడా అతడు లొంగలేదు. అప్పుడు సురేష్ పద్మిని ద్వారా ఈ కార్యం సాధించాలనుకున్నాడు. ఆమెను అతడి కైవసం చేయడానికి పధకం వేశాడు. అయితే అతడు అందరిలాంటి వాడూ కాదు. నైతిక విలువలకూ, పవిత్రతకూ ప్రాధ్యాన్యతనిచ్చే వ్యక్తి.
"సురేష్ నాక్కాబోయే భర్త. అతడిలాంటి పని చేస్తాడంటే నేను నమ్మలేదు-"అంది పద్మిని, అయితే ఆమె కంఠంలో ఏడుపు తొంగి చూస్తోంది. కనులు కూడా చెమర్చాయేమో ఒకసారి తుడుచుకుంది.
"అతడి క్కాబోయే భార్యలు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. అతడెలాంటి పనికైనా వెనుదీయడనీ నాకు తెలుసు. అయితే నేను అతడిలాంటి వాడిని కాదు. అతడి కోసం మీరు శీలాన్ని త్యాగం చేయడానికి సిద్దపడినా, నేను నా పవిత్రతను వదులుకుందుకు సిద్దంగాలేను. మీరింక వెళ్ళవచ్చు-"
పద్మినికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇలాంటి అవమానాన్ని కలలో కూడా ఊహించలేదామె. తనను సురేష్ ఈ యువకుడికి తార్చాలనుకున్నాడా? ఇది నిజమా?
ఆమె వెళ్ళి పోబోతూంటే అతడు-"మేడమ్! సురేష్ కు నా విషయం స్పష్టం చేయండి. మీరేదైనా ప్రమాదాన్ని శంకిస్తే శేఖర్ అనబడే ఈ మిత్రుడి సాయాన్ని కోరండి-" అన్నాడు.
4
"హలో నువ్వా-రామానుజం!" అన్నాడు సురేష్.
"అవును నేనే! నీవల్ల ఒక చిన్న సాయం కావలసి వచ్చాను...." అన్నాడు రామానుజం.
రామానుజం నాటకాల కంపెనీ నడుపుతున్నాడు. ఓ నాటకంలో నేపథ్యంలో విలక్షణమైన గొంతుక కొన్ని డైలాగ్సు చెప్పవలసి ఉంది. ప్రతి నాటకంలోనూ నిత్య నూతనత్వం చూపాలనుకునే రామానుజం ఈ నాటకంలో స్నేహితుడు సురేష్ గొంతును ఉపయోగించుకోవాలనుకున్నాడు.
