Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 11


    అప్పటికి ధాన్యలక్ష్మి ఇంటికి చేరుతుంది. రైతులకు పనులు తీరి విశ్రాంతి లభిస్తుంది. ధాన్యరాశి బంగారు కాంతులు చూసి, ప్రతి వ్యవసాయదారుడూ మురిసి పోతాడు. ప్రతి గృహమూ ఇంటికి వచ్చిన అల్లుళ్ళ తోనూ, ఆడబడుచులతోనూ కలకలలాడుతూ ఉంటుంది.
    అన్ని రకాల పళ్ళు, కూరగాయలు, పువ్వులు పుష్కలంగా లభించే రోజులు. కొత్త ఉడుపులు ధరించిన పిల్లల సంతోషం చెప్పనలవికాదు. ఎంత పేదవాడయినా, తన శక్తి కొద్దీ కొద్దో గొప్పో పండుగ జరుపుకుంటాడు. ఎటు చూసినా కన్నుల పండువే!
    అప్పుడే లేచినవాళ్ళు మబ్బు మొహాలతో బయటికి రాగానే, భోగి మంటలు చూడగానే మత్తూ గిత్తూ అంతా వదులుతూంది. కొందరు ఇండ్లముందు బళ్ళను కడిగి అలంకరిస్తూంటే, ఏదో కావలిసి అంత దూరంలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతున్నవాళ్ళు, కాసేపు పలకరింపులు వగైరాలు చేసి, తొందర పని ఉందంటూ విడిపోతున్నారు. మరి కొందరు పెద్దవాళ్ళు తీరిగ్గా కూర్చుని, పలుదోము పుల్లలు వేసుకుని వచ్చిపోయే వాళ్ళను కుశలాలు అడుగుతున్నారు.
    అల్లంత దూరాన కరణంగారి ఇంటి ముందు సాతాని జియ్యరు నెత్తిన చెంబుకింద పడకుండా, కాళ్ళకున్న గజ్జెలను గల్లుగల్లు మనిపిస్తూ ఆడుతున్నాడు. 'హరే హరేలో రంగా' అన్న అతని పదానికితంబురా నాదము, జత్గది కంఠంతోబాటు తాళాల చప్పుడూ తోడయ్యాయి. బుడబుక్కలవాడు తన దగ్గిర ఉన్న చిన్ని ఢమరుకను, బుడుక్ బుడుక్ మని మోగిస్తూ పసి పిల్లలను వినోదం కలిగిస్తున్నాడు. వీళ్ళందరినీ మించి డూడూ బసవన్న ఆటలో సన్నాయి మోగుతున్నది.
    నాలుగు బజార్లు కలిసేచోట భోగిమంటలు పైకి నాల్కలు చాస్తున్నాయి. పిల్లలూ, యువకులూ, హుషారు చావని వృద్దులూ దాని చుట్టూ చేరి గోలగా అరుస్తున్నారు. కొంతమంది కొంటె కుర్రకారు ఊళ్ళో కలప మంటల్లోకి చేర్చుతున్నారు.
    దూరాన ధనుర్మాసార్చనలు, పూజలతో గ్రామ దేవాలయము మార్మోగుతూ ఉంటే, గంభీరంగా మోగే ఘంటా నినాదాల్లో లీనమవుతూ శ్రావ్యములు, గంభీరములు అయిన వేదమంత్రాలను వినటం ఎంత హాయిగా ఉంటుందని! చలి ఎముకలు కొరకాలని చూస్తున్నా, ఏట్లో ఈత కొట్టటం మరొక సరదా. ఈత రానివాళ్ళు, పెద్దవాళ్ళు వణుకుతూ ఒడ్డునే స్నానం చేస్తూంటే (పాపం!) వెక్కిరించటంలో కుర్రకారుకు భలే సరదా! ఎవరూ లేకుండా చూసి, పొలాల్లో తాటిదుంగల్నీ, మందకర్రల్నీ ఊడపీక్కుని ఎత్తుకు వచ్చి భోగిమంటల్లో పడేసి, దాని చుట్టూ తిరగటం ఎంత ఆనందంగా ఉంటుంది! ఇండ్ల ముందున్న పాత చెక్కల్నీ, కర్రల్నీ ఇంటివాళ్ళు కేకలేస్తూంటే, చేతికందినవాటిని అందుకుని, పరిగెత్తి వస్తూంటే కలిగిన సంతోషం అది అనుభవించే పిల్లలకే తెలుసు. చలిని సవాలు చేస్తూ, ఆకాశాని కెగిసే భోగిమంటల వెచ్చ దనంలో కలిగే అనిర్వచనీయానందం వేరు!
    పౌష్యలక్ష్మి సువర్ణజ్యోతులతో ప్రవేశించే శుభ సమయం దానితోపాటు ఉత్తరాయణ పుణ్యకాలం గూడా ప్రవేశిస్తుంది. ఈ కాలం సర్వ శుభప్రదమైనదని మన నమ్మకం. అవాం'గ్యకరమైనదని నమ్మబడుతున్న దక్షిణాయనం అంతటితో ముగుస్తుంది.
    పిన్నలూ, పెద్దలూ, స్తీలూ ఒకరేమిటి? ఎవరిని కదిలించినా ఉత్సాహం పొంగులు వారుతూ ఉంటుంది. వీరందరినీ మించిన హడావిడి కన్నెపడుచులది. ప్రాంగణంలో పెట్టిన గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ-
    "తామరపువ్వంటీ తమ్ముణ్ణి య్యావే
    చేమంతీ పువ్వంటీ చెల్లీనియ్యావే ..." అంటూ రంగురంగుల రంగవల్లికల మధ్య మెరుస్తున్నట్లున్న గొబ్బెమ్మలకు నివేదించుకుంటారు. చివరి చరణం వచ్చేసరికి చెక్కిళ్ళు ఎర్రబారతాయి! నును సిగ్గుతో, వాల్చి కళ్ళతో మంద్రస్థాయిలో-
    "మొగలీ పువ్వంటి మొగుణ్ణియ్యావే..." అని పూరిస్తారు. పెద్దల నవ్వుల మధ్య కన్నెపిల్లలు అందాలరాసులై వెలిగిపోతాడు. భోగిమంటల కోసం గోగుపిడకలు గుచ్చి ఆనందించే కన్యలు ప్రతి గృహానికీ సహజ శోభ.
    కొత్త బట్టల సంబరంతో అదో విధమైన తృప్తితో, గర్వంతో వీథుల్లో తిరిగే పిల్లల దగ్గర నుంచీ, చేసిన పిండివంటలు బొజ్జనిండా దట్టించి ఆయాసపడే తాతయ్యల వరకూ ఆ రోజున ఆనందోత్సవాలకు కొదవ లేకుండా ఉంటారు.
    వేసిన కోళ్ళపందెం తలల పందెమై తలలు పగల గొట్టినా, గొర్రెల పందెం ప్రాణానికి పందెమై, మెడలమీది తలలను వేరుచేసినా ఎవరూ మానరు.
    పట్టపగ్గాలు లేని సంబరాలు!
    ఆ ఉద్రేకాలు వేరు!
    ఆ ఉత్సాహాలు వేరు!
    పొగమంచుమీద విజయం సాధిస్తూ, ఇంటి ముందు, పైన చూరులో వేలాడగట్టిన నరివెన్నుల జడలమీద పడి పైడి కాంతులుగా భాసిస్తున్నాయి అహస్కరుని కిరణాలు, వాటికోసం పిచ్చుకలు గోలగా అరుస్తూ వచ్చి పోతున్నాయి.
    రాధ ఇంటి ముందు అరుగులమీద కూర్చున్నది. పాలేరు పెళ్ళాం చానమ్మ కలాపి చల్లుతూంది. అప్పటికే ఎదురింటి కామాక్షి ముగ్గులు పెట్టి వెళ్ళిపోయింది. రోజూ అప్పటి వరకల్లా అయిపోయేది కాని, ఆ వేళ కొంచెం ఆలస్యం అయింది.
    చానమ్మ కలాపి చల్లడం పూర్తిచేశాక, పక్కనే ఉన్న రంగుల డబ్బాలను తీసుకుని అరుగు దిగింది రాధ. తనలో తానే గొబ్బెమ్మ పాట పాడుకుంటూ ముగ్గులు వేస్తున్నది. చానమ్మ లోపలికి వెళ్ళి గొబ్బెమ్మ లూ, గుమ్మడి పువ్వులూ, దానిమీద ఉంచటానికవసరమైన తదితర వస్తువులూ అన్నీ తెచ్చింది.
    రాధ ఆ వేళ తను ఎవరింటికీ రానని నిన్ననే స్నేహితులతో చెప్పింది. పొద్దున ఆరుకల్లా ఆమె స్నానం వగైరాలు అయిపోతాయి. ఏది ఏమైనా స్నానం కాగానే కొద్దిగా చద్ది అన్నం పెరుగు వేసుకుని తినేసి. తెల్లావు పాలు గ్లాసుడు తాగవలసిందే. ఇవన్నీ ఆరున్నరకల్లా అయిపోవలిసిందే.
    రాధ ముగ్గులు దిద్దుతున్నది. పొడుగ్గా, కుచ్చులు వేసిన జడ నల్లని తాచులా, భుజంమీదుగా కిందకుజారి నేలను అందుకోవాలని కాబోలు ఆరాటపడుతున్నది.
    చానమ్మ రాధ వేసిన ముగ్గుల మీద గొబ్బిళ్ళ నుంచి, గుమ్మడి పువ్వులు, రేగుపళ్ళు, దోస కాయలు, చొప్పదంట్లు ఉంచుతూ పసుపు కుంకుమలు చల్లుతున్నది.    
    ఎడ్ల మువ్వల చప్పుడు వినపడింది.    
    అది రాధకు పరిచితమే. ముగ్గులు కూడా వెయ్యటం అయింది. నిలుచుని చూసింది. అంత దూరాన తండ్రి, సూటు బూటు వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న పట్నం బాబు మాట్లాడుతూ వస్తున్నారు. వెనక రెండెడ్ల బండి మలుపు తిరుగుతున్నది. ముందు పగ్గాలు పట్టుకున్న పాలేరు సుబ్బడు నడుస్తున్నాడు. బండిలో ఒకామె కూర్చుని ఇటే చూస్తున్నది.
    రాధ ముగ్గుడబ్బా అలాగే చేతిలో పట్టుకుని లోపలకు పరుగు తీసింది. తల్లి వంటింట్లో పని చేసుకుంటున్నది.
    "అమ్మా! వాళ్ళు.... వాళ్ళు.... వస్తున్నారే."
    "నీ ఆరాటం చల్లగా ఉండా! ముందా ముగ్గు డబ్బా అవతల పెట్టి చేతులు కడుక్కోవే!"
    "కాదే!" ఆ డబ్బా అక్కడే వంటింటి గడప కివతల పెట్టింది. అంటే అది తీసేయించవలసిన డ్యూటీ తల్లిదన్న మాట.
    "ఏమిటే? ఎవరు వస్తున్నారు? చావమ్మా, ఈ ముగ్గు డబ్బా పెరట్లో పెట్టు. దీని కసలు రోజుకు రోజు సోమరితనం ఎక్కువవుతున్నది." ఆమె కేకవేసింది.
    "మరి ... మరి ..." అని రాధ అంటుండగానే వాకిట్లో బండి ఆగిన చప్పుడయింది. అప్పుడే ఒక యువకుడూ, అతనికన్న పెద్దవాడుగా. ఉన్న మరొకాయనా మెట్లెక్కుతున్నారు. వాళ్ళను చూసి, "నీ దుంప తెగ! దీనికే నానా ఆర్భాటం ..." రాధ తల్లి వంటింటి తలుపు దగ్గిరికి లాగి మధ్య గుమ్మం దాటి వచ్చింది. రాధ కూడా ఆమె వెనకాలే వచ్చింది.
    ఆర్తి బండి దిగింది. పాలేరు సుబ్బడు సామాన్లు లోపలకు తెస్తున్నాడు. వేణు, రాధ తల్లి, తన అక్క వర్దనమ్మను చూసి నవ్వుతూ, "వచ్చేశాం, పెద్ధక్కా!" అన్నాడు.
    ఆర్తి లోపలకు వచ్చింది. వర్ధనమ్మ ఆమె కెదురు వచ్చి కౌగిలించుకుంది. ఎందుకో ఇద్దరి కళ్ళూ తడి శాయి. కాస్సేపు నిశ్శబ్దం.
    రఘుపతి అన్నాడు: "తరవాత తీరికగా మాట్లాడవచ్చులే! వాళ్ళు రాత్రి ఎప్పుడు బయల్దేరారో ఏమో? స్నానానికి ఏర్పాటు చెయ్యి."
    "ఆఁ! ఆఁ! సుబ్బడిని పంపి, కాఫీ పొడుం ఏమన్నా అమ్ముతున్నాడో ఏమో, కోమటాయన దగ్గిరికి పంపి తెప్పించండి." వర్ధనమ్మ వంటింటివైపు నడిచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS