Previous Page Next Page 
మహాశక్తి పేజి 45

    "అలా చూస్తారేం నాయనా! న్యాయం చెప్పలేరా? నోరు విప్పి ఒక్కమాట అనలేరా? ఆర్నెల్లయింది. డబ్బులివ్వడు. అడిగితే ఇదీ గొడవ. చూస్తున్నారుగా వాడి ఆగడం."

    "ఏంటిరా ముసలినాకొడకా అద్దె కావాలిరా నీకు! అసలీ ఇల్లు నాది. నీ దిక్కున్నకాడ చెప్పుకో నువ్వే నాకు అద్దె కట్టు. లేకపోతే నీ సామాను బయట పారేస్తాను" అరుస్తున్నాడు రౌడీగాడు.

    "చూశారా బాబులూ. విన్నారా? న్యాయం చెప్పండి నాయనా! చూడండి ముసలాయన్ని ఎలా కొడుతన్నాడో? కాపాడండి." ఆమె ఏడుస్తోంది.

    ఆ రౌడీ ఒక్క గెంతు గెంతి ఇంట్లోకి జొరబడి ఆ యింటి యజమాని అయిన ఆ ముసలాయన సామాను బయటికి విసరడం మొదలుపెట్టాడు.

    "అయ్యో! ఏమిటీ దారుణం? నా ఇంట్లో అద్దెకి ఉండి నా సామానే బయట పారేస్తున్నాడు. ఈ రౌడీకి బుద్ధి చెప్పేవాళ్ళే లేరా?"

    రౌడీ బయటకొచ్చాడు.

    "ఏంటిరా కూస్తున్నావు? నేను మీ ఇంట్లో అద్దెకున్నానా? ఇది నా ఇల్లుబే" అని ముసలాయన మొహం పైన గుద్దాడు.

    ఆయన కిందపడిపోయాడు. పెదవి చిట్లి రక్తం కారుతోంది అతనికి. ఆయాసపడుతున్నాడు.

    ఒకసారి జనంకేసి గర్వంగా చూశాడా రౌడీ.

    ఎవరూ నొరెత్తకుండా కిమ్మనకుండా బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు. ఏం మాట్లాడాలన్నా అందరికీ భయంగానే ఉంది. వాడెంత ఘనుడో అక్కడున్న వారందరికీ తెలుసు.

    "ఈ మస్తాన్ గాడి తఢాఖా ఈ పేటలో అందరికీ తెలుసుబే. ముసలి నా కొడకా! నేను సారా డిపో కోటినాగులుగారి శిష్యుణ్ని. నా గురువుగారి గురువెవడో తెలుసా అంకయ్యగారు" అని కిందపడిపోయిన ముసలాయన్ని కాలితో తంతున్నాడు. దొర్లిస్తున్నాడు.

    "పెద్దవాడన్న ఇంగితం కూడా లేదేరా రౌడీ సచ్చినోడా! అలా చూస్తారేం నాయనా! వీడి దౌర్జన్యాన్ని అరికట్టలేరా? మీకే ఇలా జరిగితే ఏం చేస్తారు?" ముసలామె వణికిపోతూ అరుస్తోంది. తిడుతోంది. శాపనార్ధాలు పెడుతోంది.

    "నేనున్నాను."

    అందరూ ఒక్కసారి అటు చూశారు.

    ఈశ్వర్ నడుంమీద చేతులు పెట్టుకుని పెదాల మధ్య సిగరెట్ అటూ యిటూ కదుపుతూ అన్నాడు.

    మస్తాన్ పగలబడి నవ్వుతూ చూశాడు ఈశ్వర్ని ఓ యీగని చూసినట్టు.

    "ఏరా కుర్రనాయాలా! బతికి బట్ట కట్టాలని లేదా?" అరిచాడు భుజాలు చరుచుకొంటూ.

    ఈశ్వర్ అడుగు ముందుకేశాడు.

    మస్తాన్ ఆశ్చర్యంగా చూశాడు. ఓ పెడబొబ్బ పెట్టాడు. అక్కడి వాళ్ళకి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.

    ఈశ్వర్ రెండు చేతులతో అతని మొహాన్ని పట్టుకొని తన పెదాల మధ్య ఉన్న సిగరెట్ ని అతని ముక్కుమీద అంటించాడు.

    "అమ్మో!" అరిచాడు మస్తాన్.

    మోకాలు లేపి డొక్కలో పొడిచాడు ఈశ్వర్ అతన్ని.

    మస్తాన్ వెల్లకిలా పడిపోయాడు.

    జనం ఘొల్లుమని నవ్వారు. చప్పట్లు కొట్టారు.

    "భలే" అనుకున్నారు.

    దాంతో మస్తాన్ రెచ్చిపోయాడు.

    కింద నుంచి లేచి వెర్రి కోపంతో ముందుకి పరుగెత్తుకుని ఈశ్వర్ని రెండు చేతులతో పట్టుకోబోయాడు.

    దగ్గరి వరకూ అతన్ని రానిచ్చి తప్పుకున్నాడు ఈశ్వర్.

    ఆ విసురుకు ఆగలేక రోడ్డుమీద ఉన్న కుండలమీద పడ్డాడు మస్తాన్. ఆ కుండలన్నీ పగిలిపోయాయి.

    "తాతా నీ కొచ్చిన భయంలేదు" అని, తన స్నేహితులకి ఆ ఇంట్లోంచి ఆ రౌడీ మస్తాన్ గాడి సామాను బయట పడేయమని చెప్పాడు ఈశ్వర్.

    మస్తాన్ రోషంతో బుసలు కొట్టాడు ఈశ్వర్ని చూస్తూ.

    "ఒరే! నేనెవరో తెలుసా? మస్తాన్ తో తలపడ్డావంటే తల లేచి పోతుంది" అరుస్తూ ఈశ్వర్ని ఢీ కొట్టబోయాడు తలతో.

    ఈశ్వర్ కాలు మడిచి వాడి తలపైన పొడిచాడు.

    "ఓమ్మో!" అరుస్తూ కిందపడ్డాడు మస్తాన్.

    ఈశ్వర్ సిగరెట్ వెలిగించాడు.

    "ఏరా! నాతో ఆటలాడకు. ప్రాణం తీసేస్తాను. నా గురువు కోటినాలుగు నీ రక్తం తాగుతాడు."

    "ఓహో! నువ్వు అయిపోయావు. యిక నీ గురువా? అవునూ వాడి గురువెవరన్నావ్?" అడిగాడు ఈశ్వర్.

    "అంకయ్య" మస్తాన్ కోపంగా చెప్పాడు.

    ఈశ్వర్ వాడి మెడచుట్టూ తన చేతిని మెలిపెట్టి తన మోకాలి బాడం లోంచి కత్తిని తీసి రెండో చేత్తో దాన్ని వాడి పీకమీద పెట్టాడు.

    "నేను చెప్తున్నాను విను.

    నా పేరు ఈశ్వర్. నాగురువు పేరు ఈశ్వర్. నాగురువుగారి గురువు పేరు ఈశ్వర్. మాలో ఏ ఒక్కడు మూడోకన్ను తెరిచినా మీరంతా మాడిపోతారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS