Previous Page Next Page 
మహాశక్తి పేజి 46

    నిన్నూ,

    నీ గురువునీ,

    నీ గురువు గురువునీ సారా బట్టీలో వేసి సారా కాసేస్తానని చెప్పు.

    నీకు అయిదే అయిదు నిమిషాలు టైమ్ యిస్తున్నాను.

    ఈ ఇల్లు విడిచిపెట్టు.

    నీ సామాను తీసుకొని యీ పేట విడిచిపోవాలి.

    తిరిగి యీ ఛాయల్లో కనబడినా, నీ చితికి నువ్వే నిప్పెట్టుకొన్న వాడివవుతావు" హెచ్చరికగా అన్నాడు ఈశ్వర్.

    "వెళ్ళకపోతే ఏం చేస్తావ్?"

    "చెప్పాలా? అయితే విను. నా చేతిలో కత్తి కసుక్కున నీ పీకలో దిగిపోతుంది. నీ పీకకి చిల్లుపడి రక్తం బయటికి వస్తుంది. గాలి ఆడదు. వూపిరి ఆడక కొట్టుకు కొట్టుకు చస్తావు" అంటూ కత్తితో అతని పీకపైన అదిమాడు ఈశ్వర్.

    మస్తాన్ చూపు ఆ కత్తిమీదే ఉంది.

    అతను అన్నంత పనీ చేస్తాడని భయపడ్డాడు మస్తాన్.

    ఆ పేటలో ఇంతకాలం తిరుగులేని రౌడీగా చెలామణీ అవుతూ పులిలా బతికాడు మస్తాన్.

    కానీ, ఇప్పుడో కాలేజీ కుర్రాడి చేతిలో దెబ్బలు తినడం కాదు. ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో పడిపోయాడు.

    స్టూడెంట్స్ తో గొడవంటే ఎలా ఉంటుందో మస్తాన్ కి తెలుసు.

    అప్పటికే వాడి సామాను బయటపడేశారు రాజు, చలపతి, ముకుందం.

    "నీ అంతు చూస్తాను" అన్నాడు పళ్ళు కొరుకుతూ మస్తాన్.

    "ఏడిశావు. అదిగో నీ సామాను" అంటూ ఒక్కతోపు ముందుకి తోసి ఎగిరి వాడి గుండెపైన తన్నాడు ఈశ్వర్.

    గుండె కదిలిపోయి ఊడి కింద పడిందేమోననిపించింది మస్తాన్ కి. ఆ దెబ్బ అలాంటిది!

    ఈశ్వర్ అక్కడ ఆగివున్న ఓ బండి చూసి ఆ బండివాడిని పిలిచాడు.

    "ఇదిగో! ఈసామాను నీ బండిలో తీసుకెళ్ళి వీడెక్కడికి రమ్మంటే అక్కడికి తీసుకెళ్ళు. డబ్బులు తీసుకో. ఇవ్వకపోతే నాకు చెప్పు. కాళ్ళు విరిచేస్తాను."

    జరిగిన గొడవని కళ్ళారా చూసిన బండివాడు -

    "అలాగే బాబూ!" అన్నాడు వినయంగా.

    "మస్తాన్ గారూ! మీ సామాను బండిలోకెక్కించండి" అన్నాడు రాజు హేళనగా.   

    మస్తాన్ అతనికేసి చూసి తన సామాను బండిలో కెక్కించడం మొదలుపెట్టాడు.

    "బాబూ! సమయానికి దేవుడిలా వచ్చి ఆదుకొన్నావు. చిన్నవాడివయినా చేతులెత్తి నమస్కరిస్తున్నాను" ఆ వృద్ధుడు కన్నీళ్ళతో అన్నాడు.

    "తప్పు తాతా! పెద్దవాడివి. అలా అనకూడదు"

    జనం ఈశ్వర్ని తెగ మెచ్చుకోవడం మొదలుపెట్టారు.

    జనంకేసి చూశాడు ఈశ్వర్.

    అప్పటివరకూ నోరు మెదపని జనం..... తనని మెచ్చుకోవడం చూసి అతనికి ఉద్రేకం వచ్చింది. కోపం వచ్చింది. ఆవేశం వచ్చింది.

    "ఇంతమంది ఉన్నారు. ఒక ముసలి మనిషికి, మీలో ఒకడైన ఈ వృద్ధుడికి, మీ వాడకట్టు మనిషికి ఓ రౌడీ ఇంత అపకారం చేస్తుంటే చూస్తూ నించున్నారు. ఇది కాదు మీరు చెయ్యవలసింది.

    మనలో ఐక్యత ఉండాలి. ఇలాంటి వాళ్ళని ప్రతిఘటించగలిగితే ఈ రౌడీలు ఏమీ చెయ్యలేరు. ఇప్పటికయినా ఒకరి కొకరు సాయంచేసుకోవడం నేర్చుకోండి.

    పక్కింటికి కదా 'నిప్పు' అంటుకొందని చూస్తూ వూరుకొంటే అది మన ఇంటినీ కాల్చి బూడిద చేస్తుంది" అన్నాడు.

    "నిజమే!"

    "అవును..... ఈ అబ్బాయి చెప్పింది నిజమే."

    "బాబూ! నేను బతికేది ఇంటి అద్దెమీద. ఆర్నెల్లనుంచి కానీ కూడా ఇవ్వలేదు" ఆశగా అన్నాడు వృద్ధుడు. మస్తాన్ చేత తన డబ్బు యిప్పించమని ప్రాధేయపడుతూ అడిగాడు.

    ఈశ్వర్ తలతిప్పి చూశాడు. మస్తాన్ వెళ్ళిపోడానికి రెడీగా వున్నాడు.

    "ఒరే మస్తాన్!" అన్నాడు ఈశ్వర్.

    "ఆయనకి నువ్వు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వు" అన్నాడు.

    "నా దగ్గర లేదు."

    "లేదా?"

    "లేదు" మొండిగా అన్నాడు మస్తాన్.

    గబుక్కున వాడి చేతిని మెలిపెట్టి అతని జేబులోకి చేతిని పోనిచ్చాడు ఈశ్వర్.

    అయిదు రూపాయల నోట్ల కట్ట అతని జేబులోంచి బయటికి లాగాడు ఈశ్వర్.

    "ఇదిగో తాతా నీ అద్దెకింత ఈ డబ్బు తీసుకో" అని అందించాడు.

    "ఒరే, నీ అంతు చూడందే నిద్రపోనురా" అన్నాడు మస్తాన్ కొరకొర చూస్తూ.

    జనం అతని మెడమీద చెయ్యివేసి ముందుకి తోసేశారు.

    అవమానంతో బండి వెనక నడుస్తూ వెళ్ళిపోయాడు మస్తాన్ వెనక్కి వెనక్కి తిరిగి చూసుకొంటూ.

    "బాబూ, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు" అన్నాడు వృద్ధుడు దీవిస్తున్నట్టుగా.

    ఈశ్వర్ సాహసానికి అచ్చెరువందిన జనంలో కొంతమంది అలా మనం ఎందుకు చెయ్యలేకపోయామని బాధపడిపోయారు.

    అదే సమయంలో అక్కడికి పోలీస్ జీపు వచ్చి ఆగింది.

    ఎస్. పి. ప్రభాకర్ అందులోంచి దిగుతున్నాడు.

    అక్కడేదో గొడవ జరిగిందని ప్రభాకర్ గ్రహించాడు.

    ఈశ్వర్ దగ్గరకి అడుగులో అడుగు వేస్తూ వచ్చాడు.

    "ఇక్కడేం చేస్తున్నావ్?" అడిగాడు ఈశ్వర్ని.

    పోలీసు జీపుని చూడగానే కొందరు భయంతో పక్కగా తొలగిపోతున్నారు. మరి కొందరు దూరంగా నించుని చూస్తున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS