ఆ రాస్కెల్ గాడికి తను మరదలా!
ఎంత సిగ్గు!
ఆమెకి ఏడుపొచ్చింది.
ఈశ్వర్! ఆమె కళ్ళముందు ఆరడుగుల విగ్రహం కదులుతోంది.
అతన్ని ఆమె మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది.
అతన్నే దైవంగా ఆరాధిస్తోంది.
కానీ.....ఆమెకి తెలుసు.
అతను ఆమెకి అందనంత దూరంలో ఉన్నాడు.
అతని మనసునీ, హృదయాన్నీ చిత్ర గెలుచుకొంది.
చిత్ర ఎంత అదృష్టవంతురాలు!
చిత్ర అదృష్టానికి ఆమె అసూయపడడంలేదు.
తనకి అందని పండుని అందుకోగలిగిన వాళ్ళు అందుకని అనుభవించడం ధర్మమే అవుతుంది కానీ ఈర్ష్య పడవలసిన పనిలేదు. అది కేవలం అదృష్ట రేఖపైన ఆధారపడుతుంది.
అందుకే ఆమె చిత్రనిగానీ, ఈశ్వర్నిగానీ ద్వేషించడం లేదు.
తండ్రితో అలా మాట్లాడిందే కానీ ఆమె మనస్సాక్షికి తెలీదా అతనంటే ఎంత ఇష్టమో మరెంత ప్రాణమో!
అతన్ని తను చేసుకోలేకపోవచ్చు. కానీ అతన్ని ప్రేమించిన ప్రియురాలిగా అతనికి ఏ ఆపదా సంభవించకుండా చూసుకోవలసిన బాధ్యత తనపైన ఉన్నట్టుగానే ఆమె భావిస్తోంది.
'తనవాడు' అనుకొన్న మనిషికోసం ఆడది ప్రాణం పోయినా బాధపడదు.
తండ్రీ జెన్నీ కలిసి వేసిన పథకాన్ని భగ్నం చేయాలి.
వాళ్ళంటే ఆమెకి జుగుస్స కలుగుతోంది. ఆమెకి వాళ్ళతో గల రక్తసంబంధం గుర్తుకొస్తే మనసు మూలుగుతోంది.
కోపమూ, అసహ్యమూ మేళవించి ఆమె గుండె ఉద్రేకంతో ఎగిరిపడుతున్నది.
ఈశ్వర్ కి ఎలాగైనా సరే వాళ్ళ ప్లాన్ ఏమిటో తెలియజేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే మళ్ళీ జరగరాని అనర్ధం ఏదన్నా జరిగిపోతే!
ఇప్పటికి జరిగింది చాలు. ఇకనన్నా స్వర్ణ జోలికి ఎవరూ పోకుండా ఉంటే చాలు!
18
అశ్వని బ్యాగ్ తీసుకొని గబగబా మెట్లు దిగి కిందికి వచ్చింది.
అంతే!
ఆశ్చర్యంతో ఆమె బొమ్మలా నిలబడిపోయింది.
ఆమె కెదురుగా......
మెళ్ళో మఫ్లర్, వత్తైన గెడ్డం, ఎర్రని కళ్ళు, జరదాపాన్ నములుతూ నవ్వుతూ వికారంగా చూస్తూ ఓ అగంతకుడు నిలబడి ఉన్నాడు.
ఆమె చిగురుటాకులా కంపించింది క్షణంపాటు.
"నాన్నగారున్నారా?" అడిగాడతను.
ఒకసారి లోపల గదికేసి చూసి మళ్ళీ అతనికేసి చూసింది. రెండు గుటకలు మింగింది అశ్వని.
అతను చూస్తూన్న చూపులకి ఆమెకి కడుపులో తిప్పినట్టయింది.
భయంగా ఓ అడుగు వెనక్కి వేసింది అశ్వని.
అతనే టెంటుల పాపారావు.
అశ్వని కేసి చూస్తూ చప్పరించాడు టెంటుల పాపారావు.
"నాయాల్ది. క్లాసు ఫోర్ ముండలకి టెంటులేస్తే డబ్బు రావడం కష్టంగా ఉంది. ఇలాంటి గుంటకి నాలుగు టెంటులు వేస్తే కనీసం లక్షా సంపాదించవచ్చు." అని మనసులో అనుకున్నాడు.
పాపారావు తనని తినేసేలా చూడ్డం అశ్వని కెక్కడలేని కంపరాన్నీ పుట్టించింది.
రాయి దొరికితే వాడి బుర్రమీద కొట్టాలనిపించింది.
"ప్చ్. ఏం చేస్తాం? ఇది గురువుగారి కూతురైపోయింది." అని మనసులోనే బాధపడిపోయాడు కూడా.
"ఎవరదీ?" అంటూ అంకయ్య బయటకి వచ్చాడు. తండ్రి అక్కడికి రాంగానే రెండే రెండు అడుగుల్లో గుమ్మం బయటకెళ్ళిపోయింది అశ్వని.
టెంటుల పాపారావుని చూస్తూనే అంకయ్య -
"హలోలోలో..... నీకు నూరేళ్ళు ఆయుష్షురా పిచ్చి సన్నాసీ! రారా! కూర్చో. నీ కోసమే కబురెట్టాను" అన్నాడు.
పాపారావు మెడలో మఫ్లర్ ని సర్దుకున్నాడు అరచేత్తో గెడ్డాన్ని సవరదీసుకుంటూ -
"జెన్నీ బాబు సెంటర్లో కనబడి చెప్పాడు. అంతే ఇక్కడ వాలాను" అన్నాడు వినయంగా.
"అవున్రా శిష్యా! నేనే రమ్మన్నాను. ఈ మధ్య నాకు చిరాకేసిపోతోంది. ఎక్కడ చూసినా రాజకీయం అంటే తేలికచూపు అయిపోతోంది.
నేను దేన్నన్నా సహిస్తాను కాని రాజకీయాన్ని అవమానించినోళ్ళని సహించను క్షమించను. ఓ బుడ్డనాయాలగాడు కోడి పుంజులా నా మీద సవాలు చేస్తున్నాడు"
పాపారావు వికారంగా నవ్వాడు.
"ఆ కోడిపుంజు కాళ్ళు తీసేయమంటారా? లేక పీక తెగ్గోసి పలావు చెయ్యమంటారా?"
అంకయ్య నవ్వాడు భళ్ళుమని.
