Previous Page Next Page 
మహాశక్తి పేజి 42

    ఎర్ర రిబ్బన్ కత్తిరించేసుంటే దానంతటదే ఉరిపోసుకుని కిమ్మనకుండా, ఎవరికీ ఏమీ చెప్పకుండా చచ్చేది. అప్పుడు ఆ ఈశ్వర్ గాడే యిది చేశాడని లోపలికి తోయించడం సులువైపోయేది.

    ఇదంతా చేసింది నువ్వేనని కాలేజీలో తెలిసి చచ్చేది కాదు!"

    "నువ్వే చెప్పావుగా."

    "నేను గుండు కొట్టించమని చెప్పలేదురా అబ్బీ! ఎత్తుకెళ్ళి దానికి సత్కార్యం చేయమన్నాను.

    సత్కార్యం అంటే ఏమిటి?

    ఓ ఆడపిల్ల..... సత్కార్యం.....

    అర్ధం చేసుకుని చావాలి. అన్నీ అరటిపండు ఒలిచి పెట్టినట్టు పెట్టదు రాజకీయం.

    సందు చూపిస్తే బాణంలా దూసుకెళ్ళాలి గానీ బురదలో కాలేయకూడదు. దొరికిపోతే బురదే నిన్ను దోషిగా పట్టిస్తుంది. అర్ధమైందా?"

    "ఏం అర్థం అయినా ఆ ఈశ్వర్ గాడి బలం పెరిగిపోయింది మామా! వూళ్ళో జనం కూడా వాడంటే పడిచస్తున్నారు. ఆఖరికి పోలీసుల్లో కూడా వాడికి పరపతి పెరిగిపోయింది.

    ఇప్పుడు ఒకటే మార్గం!

    అడ్డమడత వేసి దెబ్బకొట్టాలి. లేకపోతే వాడు మనకి దొరకడు." జెన్నీ చూయింగ్ గమ్ నములుతూ ఈశ్వర్ని నరికేయాలన్నంత కసిగా అన్నాడు.

    "ఇంకా వాడికి ముహూర్తం రాలేదురా జెన్నీ. కాస్త ఓపిక పట్టు" అన్నాడు అంకయ్య.

    "ఇంకా ఎదురు చూడమంటావా మామా! నీచేతిలో గూండాలకీ, రౌడీలకీ తక్కువా? ఏ ఒక్కడితో చెప్పినా ఒక్క వేటుతో వాడి తల నరికేస్తారు."

    అంకయ్య నవ్వాడు పంచెని ఎగదోపుతూ.

    "ఓ చిట్టి వెధవని చంపడం ఓ నల్లిని చిటికిన వేలుతో నలిపినంత పనిరా జెన్నీ! ఆ ఈశ్వర్ గాడికి మనం ప్రత్యక్ష శత్రువులం. అందుచేత యిప్పుడు వాడికేం జరిగినా వెంటనే కేసొచ్చి సూటిగా మనమీద పడ్డది. అందుచేత వాణ్ని చిట్టి చిట్టి అడుగుల్తో గంతులెయ్యడానికి ప్రయత్నం చెయ్యనీ.

    అప్పుడు..... అప్పుడు రా గొడ్డలి దెబ్బ వాణ్ని ముద్దెట్టుకుంటుంది.

    సారా డిపో కోటినాగు లున్నాడు.

    బ్రాకెట్ కంపెనీ గుణపతిగాడున్నాడు.

    బ్రోతల్ కంపెనీ ఓనరు టెంటుల పాపారావున్నాడు.

    వీళ్ళకంటే నెత్తురు తాగే రౌడీ లెవర్రా? అలాగే సంఘవిద్రోహక శక్తులంటారు విన్నావుగా. అవన్నీ మనకున్న అస్త్రశస్త్రాలూ. యిందులో ఏ ఒక్కణ్నీ ట్రైల్లో పెట్టినా ఈశ్వర్ గాడి మెడ తెగిపోతుంది.

    ఆ సంగతి నాకు తెలుసు.

    "కానీ వాడికింకా సమయంరాలేదు. వాడికే కాదు నా కున్న ప్రత్యర్ధుల్లో కొంతమందికి కూడా ఇంకా సమయం ఆసన్నం కాలేదు."

    గంభీరంగా అన్న అంకయ్య మాటలు విని జెన్నీ అన్నాడు కోపంగా.

    "నీ మాటలు వినడానికి చాలా బాగున్నాయి. అయితే ప్రస్తుతం గోళ్ళు గిల్లుకోమంటావా?"

    "అవసరం లేదు. మనకి సహకరిస్తుందనుకున్న ఆ పిల్ల మన పథకాన్ని బెడిసి కొట్టించింది చివరి క్షణాల్లో.
    ఇప్పుడు దాని కథ ఊళ్ళో అందరికీ తెలుసు.

    జరిగిన అవమానానికి అది ఆత్మహత్య చేసుకున్నా ఎవరూ ఆశ్చర్యపడరు.

    తల్లి చచ్చింది. తండ్రి పిచ్చివెధవైపోయాడు.

    కానీ ఓ చిక్కుంది. అదిప్పుడు ఆత్మహత్య చేసుకుంటే పరోక్షంగా దానికి బాధ్యుడవని నిన్ను లోపలకి నెట్టేస్తారు పోలీసులు.

    అందుచేత..... దాన్ని టెంటుల పాపారావుకి ఒప్పగించేస్తే దాని నోరునొక్కి నాలుగు టెంటులేసేస్తాడు. దెబ్బకి సానిగా వాడి కంపెనీలో పడుంటుంది."

    అంకయ్య అనబడే ఆ రాజకీయ నాయకుడి మేధకి జెన్నీ అతని స్నేహితులు అచ్చెరువొందేరు.

    "అంకుల్. మీరు నిజంగా జీనియస్" అన్నాడు వెంకోజీ.

    "ఉరక్కు. దాని తల్లి కర్మకాండ పూర్తి కానీయ్ ఎందుకంటే ఏ క్షణంలో ఎవరొచ్చి తలుపు కొడతారో తెలీదు సానుభూతి మాటలు చెప్పడానికి."

    జెన్నీ ఆలోచించాడు. అది నిజమేననిపించింది.

    అదీకాక ఈశ్వర్ ఇప్పుడు ఆ ఇంటి దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు.

    వాడి కళ్ళు కప్పి ఓ పథకం ప్రకారం కార్యక్రమాన్ని నడిపించాలి.

    జెన్నీ బయటకి నడుస్తుంటే అన్నాడంకయ్య.

    "టెంటుల పాపారావును వెంటనే వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు."

    "అలాగే" అని అతను స్నేహితులతో బయటికి నడిచాడు.

    అశ్వని గుండెపైన చేతులు వేసుకొంది.

    ఆమె మొహం చెమటతో తడిసిపోయింది.

    వాళ్ళ మాటలన్నీ విన్నదామె.

    ఆమె గుండె ఝల్లుమంది.

    ఆమెకి తండ్రంటే అసహ్యం.

    'ఛీ ఇలాంటి వాడి కడుపునా నేను పుట్టింది?' ఆమె కెక్కడలేని వైరాగ్యం కలిగింది.

    బావ జెన్నీ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS