Previous Page Next Page 
మహాశక్తి పేజి 41

    అంకయ్య కాస్త కోపంగా చూశాడు.

    "నోరు మూసుకుని నాల్రోజులు మొహాన్ని బయటకు చూపెట్టకుండా గదిలో పడుండు ఆ ఈశ్వర్ గాడు చేసినట్టు నమ్మించాలనుకొన్న నీ వెధవ పనులన్నీ జనానికి తెలిసిపోయినాయి. ఓ పక్క ఆ పిల్లముండ తల్లి కాస్త గుండె పగిలి చచ్చింది. నువ్వు బయటకనబడితే రేచుకుక్కల్లా తరిమికొడతారు. ఆ భగవంతుడు మన పక్షాన ఉండబట్టి, ఆ పిల్ల రిపోర్ట్ ఉపసంహరించుకోబట్టి బతికిపోయావు. లేకపోతే ఆ ఎస్. పి. ప్రభాకర్ గాడు నిన్ను లోపలకి నెట్టి తలుపుకి తాళం వేసేవాడు."

    జెన్నీ ముక్కుపుటలెగరేశాడు.   

    ఆఖరికి తన మేనమామ కూడా అలా మాట్లాడ్డంతో అతనికి రోషం ముంచుకొచ్చింది.

    "అంకుల్! ఇంత అవమానాన్ని సహిస్తూ యింట్లో కూర్చోవడం మన చాతకాని పనికి తార్కాణం అవుతుంది" రాజకుమార్.

    "చేసింది సన్నాసి పనేగా! అవమానం ఫీలయితే ఎలా?"

    "రాజకీయంలో తల పండినవారు మీరు. ఒక ఎత్తు చెప్పండి" అన్నాడు వెంకోజీ.

    ఆ పొగడ్తకి అంకయ్య గుబురు మీసాల్లోంచి నవ్వాడు.

    "మీరింకా పిల్లనాయాళ్ళురా అబ్బాయిలూ! నేటి యువతకి రెచ్చిపోవడమే తెలుసు కానీ, సమయం చూసి కొట్టడం తెలీదు.

    అయితే రాజకీయంలో ఓ రూలుంది

    ఈ రోజు కొట్టినోణ్ని ఈ రోజే తిరిగి కొట్టకూడదు.

    ఈ రోజు తిట్టినోణ్ని గుర్తు పెట్టుకుని వాడో పనికిమాలిన పని చేసిన రోజున దాన్ని గుర్తు చేస్తూ పరమబూతులు తిట్టాలి.

    కావాలంటే పేపరు చదువు.

    ఈ మధ్య ఎన్నికల్లో ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు, ఓ సెంట్రల్ మినిస్టరూ తిట్టుకొన్నతిట్లు.

    ఎంత ముద్దొచ్చే మాటలో తెలుసా అవి?

    నా బోటివాళ్ళకి ఊపిరి పోసేది అలాటి మాటలేరా అబ్బాయిలూ!

    పోతే! ఇంకో ఉదాహరణ చెప్పనా!

    నా ఎమ్.ఎల్.ఏ. పదవి పూడకొట్టడానికి కంకణం కట్టుకొని కేసెట్టిందెవరు?

    ఆ డి.ఆర్. గాడు!

    ఆడు నన్ను కొట్టిన దెబ్బ చావుదెబ్బ.

    అయితే వేటకుక్కలా నేనేం వాడిమీద విరుచుకుపడలేదు. ఇప్పుడు కాస్తో కూస్తో పవరు తగ్గిపోయినోణ్ని. అందుచేత తిరిగి పవర్లో కొచ్చినప్పుడు ఆ డి.ఆర్. గాడిని కైమా కొడతాను. అయితే అసలా ఆలోచన మన మనసులో ఉన్నట్టు కూడా మనం కనబడకూడదు.

    అవసరం అనుకున్నప్పుడు చిన్న వానచినుకుతో వరదలతో ప్రళయాన్ని సృష్టించాలి. అదీ రాజకీయం.

    అంతేకాని లేడికి లేచిందే ప్రయాణమంటే వేటగాడి చేతిలో దెబ్బ తప్పదు.

    "ఇప్పుడు కానిపనేం చేశాం? అన్నీ నువ్వు చెప్పినట్టే చేశానుకదా!" అన్నాడు జెన్నీ.

    అంకయ్య లేచి నించుని జెన్నీ భుజంపైన చెయ్యి వేశాడు.

    ఆయన నవ్వాడు.

    "కాదనడం లేదురా జెన్నీ! నీ కిదివరకే చెప్పాను. చేసే ప్రతి పనీ మనకి అనుకూలిస్తుందనే చెయ్యాలి. ఆ మాటకొస్తే కాలేజీ ముందు పిల్లగాళ్ళు నా గాలి తీసిపారేశారు.

    నే నేడుస్తున్నానా?

    తుడిచేసుకున్నాను.

    పదవి కావాలనుకునే రాజకీయ నాయకుడికి యిలాంటివి తప్పదు.

    అవసరం అయితే అవతలి వాడి చెప్పులు మనం మొయ్యాలి. లేకపోతే చెప్పులు వాడిచేత మోయించాలి.

    అసలు తప్పెక్కడ జరిగిందో చెప్పనా?"

    "చెప్పండంకుల్" అన్నాడు వెంకోజీ ముక్కుపుటలెగరేస్తూ.

    "చక్కెర పొంగలిలా ఓ ఆడకూతురు దొరికితే ఎర్ర రిబ్బన్ కత్తిరించాల్సింది పోయి ఎవరన్నా తల గొరుగుతారా పోలీసుల్లా."

    "రెడ్ రిబ్బనా."

    "ఆ...... అదే.....అదే! పని చేసుంటే అసలు గొడవలేకపోను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS