Previous Page Next Page 
మహాశక్తి పేజి 40

                                                               17

    జెన్నీ విసురుగా పచార్లు చేస్తున్నాడు. అంకయ్య సోఫాలో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. జెన్నీ ఫ్రెండ్స్ చిన్న మొహాలు చేసుకుని కూర్చున్నారు.

    అశ్వని అప్పుడే బయటినుంచి వచ్చింది.

    "అశ్వనీ!" అంకయ్య పిలిచాడు.

    లోపలకి వెళ్ళబోతున్నదల్లా ఆగింది అశ్వని.

    ఆయనెందుకు పిలిచారో ఆమెకి తెలుసు.

    "ఏమిటి నాన్నా!" అంది.

    "ఆ మందతోపాటు నువ్వు కూడా కలవడం నాకు నచ్చలేదు. పోలీస్ స్టేషన్ కెందుకెళ్ళావు?"

    అశ్వని తండ్రికేసి చూసింది.

    "నేను నీ కూతుర్ని నాన్నా! అందుకే వెళ్ళాను."

    అర్ధం కానట్టు చూశాడు జెన్నీ.

    "అంటే?"

    అతనికేసి యీసడింపుగా చూసింది అశ్వని.

    "నీకూ చెప్పాలా?"

    "చెప్పాలి" అరిచాడు జెన్నీ.

    "అరవకు. నాకు చిరాగ్గా ఉంటుంది. నీకు సమాధానం చెప్పవలసిన అగత్యం నాకు లేదు."

    "చూశావా మామా! ఎలా మాట్లాడుతుందో."

    "చూడమ్మా! నేను కదా అడిగేది చెప్పు" అన్నాడు అంకయ్య.

    "అవున్నాన్నా! ఓ పక్క నువ్వు జనంలో అభాసుపాలయ్యావు. జెన్నీ అంటే అందరికీ రోత. అందుకే దీంతో నాకేం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళలో కలిసిపోయాను.

    మీకేం మగాళ్ళు!   

    ఎలాగయినా తిరుగుతారు.

    కానీ నేను ఆడపిల్లని. నేను కాలేజీకి తలెత్తుకుని వెళ్ళాలా వద్దా?" అంది.

    "నిజమే!" అన్నాడు అంకయ్య.

    "ఏమిటి నిజం? చెపితే ఏడుస్తుంది మామా! దానికి ఆ ఈశ్వర్ గాడంటే మోజు" జెన్నీ అక్కసుగా అన్నాడు.

    అశ్వని చివ్వున తలెత్తి చూసింది.

    "హోల్డ్ యువర్ టంగ్ జెన్నీ! అతన్ని నేను యిష్టపడితే నీకేమిటి?"

    "అతను నాకు శత్రువు" అన్నాడు జెన్నీ.

    "నీకు శత్రుత్వం యిప్పటిది కాదు!"

    "ఎప్పుడో పెద్దవాళ్ళు పట్టుదలలకి పోతే యిప్పుడు దాన్నే మనమూ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదే!"

    "అది పెద్దవాళ్ళ పరువు, మర్యాదలకి చెందిన విషయం."

    "ఆ పెద్దవాళ్ళెప్పుడో పోయారు" అంది అశ్వని.

    "చూశావా మామా! దీని పొగరు"

    "మిస్టర్ జెన్నీ! అదీ, యిదీ, దీని, దాని అనే శబ్దాలంటే నాకు పరమ అసహ్యం. మరోమారు మాట జారితే నీకు మర్యాద దక్కదు."

    "చూశావా మామా! చూశావా!"

    "పోన్లేమ్మా. బావేగా! ఏదో ఉడుకు రక్తం."

    "నాతో పెట్టుకుంటే ఆ ఉడుకు రక్తం గడ్డకట్టిస్తుందని చెప్పు నాన్నా! ఈశ్వర్ కుటుంబానికీ, మన కుటుంబానికీ ఎప్పటినించో వైరం ఉందని నాకూ తెలుసు నాన్నా! అలాంటి మనిషిని నేనిష్టపడడం నీకిష్టం ఉండదని నాకు తెలుసు. కానీ నేను ఆడపిల్లని. వాళ్ళు శతృవులని వాళ్ళపైన నేనెలా దువ్వగలను?

    ఒక కాలేజీలో చదువుకొంటున్నాం.

    నేను యిబ్బందుల్లో పడకూడదంటే శత్రువయిన అతనితో ఏమీ ఎగుగనట్టే నవ్వుతూ మాట్లాడటం తప్పులేదే! యిదంతా నా జాగ్రత్త కోసమే నాన్నా!" అంది అశ్వని తండ్రి భుజంపైన చెయ్యివేసి.

    "లేకపోతే ఏం చేస్తాడు?" అరిచాడు జెన్నీ.

    "చేసేవరకూ ఊరుకొని, చేసిం తరువాత ఏడవటం నాకిష్టం లేదు. రోజుకు నాలుగుసార్లు అతని చేతిలో తినొస్తున్నావు. చెప్పడానికి సిగ్గుగా లేదూ?" అని విసవిస పైకి నడిచింది అశ్వని.

    అశ్వని మాటలు అతనికి తల కొట్టేసినట్టనిపించింది.

    "అమ్మాయి మాటల్లో రాజకీయం నీకు అర్ధం కాలేదా జెన్నీ?" అడిగాడు అంకయ్య.

    జెన్నీ ఉక్రోషంగా చూశాడు.

    తన ఫ్రెండ్స్ ముందు అశ్వని అంత చులకనగా మాట్లాడటం అతనికి ఎక్కడలేని బాధనీ కలిగించింది.

    కానీ దాన్ని కప్పిపెడుతూ మేనమామవంక చూశాడు జెన్నీ. కొన్ని క్షణాలలాగే చూసి అన్నాడు-

    "ఒక మనిషిని మనం దెబ్బ తీయడానికి వేసిన ప్లాన్ బెడిసికొట్టడమే కాకుండా, వాడు..... వాడు..... ఆ ఈశ్వర్ గాడు పెద్ద హీరో అయిపోయాడు. ఈ అవమానాన్ని నేను సహించలేను మామా! వాడి తలనరికి చేత్తో పట్టుకుని నగర వీధుల్లో ఊరేగితే తప్ప నాకు శాంతిలేదు" జెన్నీ ఆవేశంగా అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS