Previous Page Next Page 
మహాశక్తి పేజి 39

    "ఇన్ స్పెక్టర్ గారూ! చూశారు కదూ! మా అమ్మ వెళ్ళిపోయింది. తన కూతురికి జరిగిన ఘోరాతి ఘోరమైన అన్యాయాన్ని భరించలేక గుండె పోటుతో ఆమె చచ్చిపోయింది.

    అటు చూడండి! నాన్న పిచ్చివాడైపోయాడు. ఎలా ఏడుస్తున్నాడో చూస్తున్నారా?"

    "స్వర్ణా! యింత జరిగాక కూడా నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్ధం కావడంలేదు. నువ్వు 'ఊ' అంటే ఆ రాస్కెల్స్ ని జైలుకి పంపిస్తాను" ఆవేశంతో అన్నాడు ప్రభాకర్.

    "ఒద్దు సార్! నేనిప్పుడు ఒంటరి ఆడపిల్లని. నాకిప్పుడు అమ్మ లేదు. నాన్న అలా అయిపోయాడు. నేను అన్యాయాన్ని ఎదిరించలేను. అధర్మాన్ని ఖండించలేను."

    "నీకు నేనున్నానమ్మా!"

    ఆ మాటలకి తలెత్తి చూసింది స్వర్ణ.

    ఎదురుగా అభయం ఇస్తున్న శివుడిలా నిలబడి ఉన్నాడు ఈశ్వర్.

    "అన్నా!"

    అతని గుండెపైన వాలిపోయింది స్వర్ణ.

    ఎన్నో రకాల నేరాలని, హత్యలని సర్వీసులో చూసిన ఆ పోలీస్ అధికారులకి జరిగింది చూస్తూంటే ఆశ్చర్యంగా వుంది.

    'ఈశ్వర్' అనబడే ఆ యువకుడి వ్యక్తిత్వం అపూర్వంగా వూహించని రీతిలో వాళ్ళ దృష్టిలో పెరిగిపోయింది.

    "అన్నా! నేను పాపిష్టిదాన్ని. నీకు నేను తలపెట్టిన ద్రోహానికి నాకు తగిన శిక్షని విధించాడుకదూ దేవుడు! నన్ను క్షమించకన్నయ్యా! నీ చేతులతో నన్ను చంపెయ్! నన్ను నీ చేతుల్లో కడతేరిపోనీ. అమ్మతోనే నన్నూ సాగనంపేయ్!"

    "ఏయ్ పిచ్చీ! ఏమిటా వాగుడు?" చిత్ర మందలించింది.

    స్వర్ణ రోషంగా చూసింది.

    ఆమె కళ్ళలో ఎర్రని జీరలు.

    ఉద్రేకంతో ఆమె వక్షోజాలు ఎగిసి పడుతున్నాయి.

    "ఆడదాని మొగుడు చ్తే గుండు చేస్తారు.

    నాకు పెళ్ళి కాలేదు.

    మొగుడు లేడు.

    కానీ నాకు గుండు చేశారు.

    అంటే...... ఈ సమాజం చచ్చిపోయింది.

    అశ్వని ఆమెని దగ్గరగా తీసుకుంది.

    "ఇలా జరగకూడదనే నేను ఎంతో ప్రయత్నించాను. కానీ ఏమీ చేయలేకపోయిన అసమర్ధురాలిని" అంది బాధగా అశ్వని.

    వచ్చిన దగ్గరి బంధువులు ఆమె తల్లి శవాన్ని స్నానం చేయించి నిండు ముత్తయిదువుగా అలంకరిస్తున్నారు.

    స్వర్ణ తల్లి శవాన్ని పాడెపైన పడుకోబెట్టారు.

    ఈశ్వర్, అతని మిత్రులు ఆమె శరీరంపైన పూలమాలలు పరిచారు.

    ఆమె భర్త నిర్వికారంగా భార్యని పడుకోపెట్టిన పాడెచుట్టూ తిరుగుతున్నాడు ప్రదక్షిణాలు చేస్తూ.

    "అదుగో చూడవే అశ్వనీ! అమ్మ కట్టుకున్న చీర.....

    ఆ చీరని అమ్మ నా పెళ్ళికోసం కొని దాచింది. ఆ చీరని ఇప్పుడు అమ్మే కట్టుకొని వెళ్ళిపోతోంది" ఆమెని పట్టుకోలేక పోతున్నారు.

    పాడెని ఎత్తడానికి సిద్ధం అవుతున్నారు. స్వర్ణని పొదివి పట్టుకుని పాడెచుట్టూ ప్రదక్షణాలు చేయింది ఆమె పాదాలకి నమస్కారం చేయించాడు ఈశ్వర్.

    "గోవిందా..... గోవిందా......"

    పాడెపైకి లేచింది.

    "గోవిందా...... గోవిందా......"

    ఊరేగింపు కదిలింది.

    "అమ్మా...... వెళ్ళిపోతున్నావా?" ఆమె గుండె తెగిపోయేలా అరిచింది స్వర్ణ.

    "ఏడవకు! నీకు ఈ 'అన్న' ఉన్నాడు."

    ఈశ్వర్ ఆమె తలపైన ముద్దు పెట్టుకున్నాడు.

    ఆమె ఏడుస్తూనే వుంది.

    ఈశ్వర్ ఊరేగింపు వైపు కదిలాడు.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS