Previous Page Next Page 
మహాశక్తి పేజి 38

    "నేను అంకయ్యని." అవతలనుంచి వినబడింది బొంగురుగొంతు.

    ప్రభాకర్ నవ్వుకున్నాడు.

    "ఈశ్వర్ గాణ్ని కోర్టుకి తీసుకెళ్తున్నారా?" అడిగాడు అంకయ్య.

    "ఆ!"

    "కేసు బలంగా పెట్టండి. ఆడపిల్లల ఉసురు పోసుకొనేవాళ్ళని విడిచిపెట్టకూడదు. కనీసం నాలుగేళ్ళు శిక్ష పడాలి గాడిదకొడుక్కి."

    "ప్రయత్నిస్తాను"

    "ప్రయత్నిస్తానంటే కాదు. అసలు బెయిల్ ఎందుకిచ్చారు?"

    "ఒక క్రిమినల్ లాయర్ వచ్చి రూల్ ప్రకారం విడిపించుకెళ్ళారు" అన్నాడు ప్రభాకర్.

    "డి.ఆర్. పనేనా?"

    "అవును."

    "డి.ఆర్.కి అసలు పనుందో లేదో పాపం. ఇలాంటి చిల్లర కేసుల్లో తల దూరుస్తాడెందుకో."

    "చిల్లర కేసా మరి మీరెందుకు అడుగుతున్నట్టు?"

    తన ప్రశ్నకి అంకయ్య ఎలా రియార్ట్ అయి ఉంటాడో ప్రభాకర్ కి తెలుసు.

    "ప్రభాకర్ సాబ్. నేను ప్రజా నాయకుణ్ని. నాకు అవసరం ఉండబట్టే అడిగాను."

    "మీలాంటి నాయకులుండటం నిజంగా మన పుణ్యభూమి చేసుకొన్న పుణ్యం సార్. కానీ మీకు తెలుసా? ఈకేసిప్పుడు మరో చిత్రమైన మలుపు తిరిగింది."

    "ఏమిటిది."

    "ఈ కేసులో జెన్నీ కూడా ఉన్నాడు."

    "జెన్నీనా?" ఆశ్చర్యంగా అడిగాడు అంకయ్య.

    "అవును. నేరస్థుడు జెన్నీనా, ఈశ్వరా అన్నది కోర్టు తెలుస్తుంది. జెన్నీని అరెస్టు చెయ్యడానికి ఆర్డర్స్ ఇస్తున్నాను."

    "ప్రభాకర్! జెన్నీ నా మేనల్లుడని తెలుసా?"

    "బెయిల్ కి ఏర్పాటు చేసుకోండి. విడిచిపెడతాను" అన్నాడు ప్రభాకర్.

    "ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"

    "తెలుసు"

    "తెలిసే అతితెలివికి పోతే కష్టాల్లో పడిపోతావ్ ఎస్ పీ! నిన్ను శ్రీకాకుళానికి బదిలీ చేయిస్తాను" యించుమించు ఫోన్ లో అరిచాడు అంకయ్య.

    "ఎక్కడయినా ఒకటే నాకు."

    "అంటే?"

    "ఎక్కువ మాట్లాడ్డం నాకు అలవాటు లేదు. నాకు జెన్నీ అయినా ఒకటే, మీరయినా ఒకటే! లా అండ్ ఆర్డర్ ని కాపాడ్డానికి నేనీ ఖాకీ బట్టలు తొడుక్కున్నాను. వీటిని అడ్డుపెట్టుకుని నీలాంటి వాళ్ళ అరాచకాలని ప్రోత్సహించడానికి మాత్రం కాదు" అని ఫోన్ పెట్టేశాడు ప్రభాకర్.

    ఇన్ స్పెక్టర్ అవధాని అడిగాడు-

    "జెన్నీని అరెస్ట్ చేయమంటారా?"

    "వద్దు. ఈ అమ్మాయి కేసు విత్ డ్రా చేసుకుంటుంది. స్టేట్ మెంట్ తీసుకోండి."

    "మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే?" ఆశ్చర్యంగా అడిగాడు అవధాని.

    "ఆడపిల్ల! నిస్సహాయ స్థితిలో ఉంది. మన డిపార్ట్ మెంట్ కన్ను కప్పి ఈమెని పీడించటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడంకంటే కేసు క్లోజ్ చేసి......"

    "చేసి......"

    "అవకాశం కోసం చూసి వెధవల్ని లోపలకి తోసేయ్" అన్నాడు ప్రభాకర్.

    చాలా ముందుచూపుతో ఆయన తీసుకొన్న ఆ నిర్ణయాన్ని ఇన్స్ పెక్టర్ మనసులోనే అభినందించాడు.

    అవధాని ఆమె దగ్గర స్టేట్ మెంట్ తీసుకోగానే "పదమ్మా! వెళదాం" అన్నాడు ప్రభాకర్.

    జీపులో ఎక్కి కూచుంది స్వర్ణ నిర్లిప్తంగా.

    ప్రభాకర్, అవధాని కూడా ఎక్కగానే జీపు కదిలింది.

                                 16

    పదిహేను నిముషాల్లో స్వర్ణ యింటిముందు ఆగింది జీపు.

    దారి పొడవునా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే వుంది. జీపు కిందకి దిగుతూ చూశాడు ఎస్. పి. ప్రభాకర్.

    ఆ ఇంటిముందు జనం ఉన్నారు. అందులో స్టూడెంట్స్ ఎక్కువ మంది వున్నారు.

    "ఏంటమ్మా? ఏం జరిగింది?"

    అప్పుడు.....అప్పుడు..... స్వర్ణ రెండు చేతుల్లో మొహాన్ని దాచేసుకుని బావురుమంది.

    "సర్వనాశనం జరిగిపోయింది సార్! మా అమ్మ చనిపోయింది కాదు గుండె బద్దలై చనిపోయింది. ఆమె అమాయక హృదయాన్ని కత్తితో ముక్కలు చెక్కలు చేసి చంపేశారు" కీచుగా పలికింది ఆమె గొంతు.

    అప్పుడర్ధం అయింది ఆమెలోని నిజాయితీ, సిన్సియారిటీ.

    ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకొని పోలీస్ స్టేషన్ కొచ్చి ఈశ్వర్ని నిరపరాధి అని స్టేట్ మెంట్ యిచ్చి కేసు రద్దు చేసుకొంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS