Previous Page Next Page 
మహాశక్తి పేజి 37

    "ఎవరా స్నేహితురాలు?"

    "జెన్నీ మరదలు..... అశ్వని."

    "అంటే అంకయ్యగారి కూతురు కదూ?"

    "అవును."

    ఇన్ స్పెక్టర్ ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు సిగరెట్ వెలిగించి.

    కానిస్టేబుల్ టీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు.

    "వద్దు సార్. నేను టీ తాగే స్థితిలో లేను. నా పొరపాటుని సరిదిద్దుకోవాలని వచ్చాను. అతనిపైన చార్జిషీట్ ఫ్రేంచేసి కోర్టుకి తీసుకెళ్ళకముందే కేసుని విత్ డ్రా చేసుకోవాలనే రాలేని, రాకూడని పరిస్థితిలో కూడా ఇల్లు విడిచి వచ్చాను సార్!" ఆమె మొహాన్ని చేతుల్లో కప్పేసుకుని బావురుమంది.

    "ప్లీజ్ ఏడవకు." ఆయన వారించారు.

    "ఈశ్వర్ కు అపకారం జరిగితే నేను మరింత పాపిని అవుతాను. నాకిక పరిహారం చెల్లించుకోవడానికి కూడా అవకాశం ఉండదు సార్." ఏడుపు గొంతుతో చెబుతోంది స్వర్ణ.

    అదే సమయంలో ఆమె భుజంపైన ఓ చెయ్యి అభయం ఇస్తున్నట్టుగా పడింది.

    ఆమె తలెత్తి చూసింది.

    ఎస్. పి. ప్రభాకర్.

    "ఈశ్వర్ ని బెయిల్ పైన క్రిమినల్ లాయర్ డి.ఆర్. గారు విడుదలచేయించి తీసుకెళ్ళారు. అతని పక్షాన డి.ఆర్. కేసు తీసుకుంటున్నారంటే ఆయనకి భయం ఏమీలేదు" అన్నారాయన.

    ఆమె మొహంలోకి వెలుగొచ్చింది ఆ మాట వినగానే.

    "అలాగే నీకు న్యాయం జరిగేలా కూడా నేను చూస్తాను. నువ్వు భయపడనవసరం లేదు!" అన్నాడు ఎస్.పి.గారు.

    "న్యాయమా?" ఆమె పడీ పడీ నవ్వింది అంత బాధలోనూ.

    ఎస్.పి. గారికీ, ఇన్ స్పెక్టర్ కీ ఆమె నవ్వుతుంటే ఏం చెప్పాలో తోచలేదు.

    "భలేవారే సార్! న్యాయమా! ఎక్కడుందది? ఒక ఘోరమైన అన్యాయం జరుగుతుంటే దాన్ని అరికట్టలేకపోయింది మీ చట్టం.

    ఒక అఘాయిత్యం జరిగిపోతుంటే పోలీసులున్నారు, చట్టం ఉంది కదా అని కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ ఘోరం మరింత సులువుగా జిరిగిపోతుంటే తప్ప మీ రొస్తారన్న నమ్మకం నేరాన్ని జరగకుండా ఆపదు.

    అది జరిగాకే మీకుసమాచారం అందుతుంది. అప్పుడే వస్తారు మీ డిపార్ట్ మెంట్ వాళ్ళు.

    కానీ దానివల్ల ప్రయోజనం?

    నేరస్ధుణ్ని శిక్షించవచ్చు.

    కానీ దానికి బలైన వ్యక్తికి కలిగే లాభం ఏమిటి?

    ఇంత దారుణానికి బలైన నేను ఈ సమాజంలో ఎలా తలెత్తుకు తిరగాలి!

    "దాన్నేరా రౌడీలెత్తుకెళ్ళి గుండు చేశారు" అని నలుగురూ నవ్వుతుంటే గుండెని రాయిగా చేసుకు బతకడానికి ఆఫ్ట్రాల్ ఓ ఆడపిల్లకి అవకాశం ఉందా? చెప్పండి."

    ఆమె ఉద్రేకంతో ఊగిపోతోంది.

    ఇంతమంది అధికారులున్నారు తగలడ్డానికా అని ఆమె ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది.

    ఆమె మాటల్లో నిజం ఉంది. కాదనడానికి ఆ అధికారులకి అవకాశం లేకపోయింది.

    "దీనంతటికి మూలకారణం ఎవరో నీకు తెలుసా?" అడిగాడు ఎస్. పి. ప్రభాకర్.

    "ఇన్ స్పెక్టర్ గారికి ఇంతకు ముందే చెప్పాను. కానీ ప్రయోజనం లేదు. ఆ వ్యక్తిపైన కేసు పెట్టలేరు. పెట్టినా ఆ కేసు నిలవదు."

    "నువ్వు ఎస్. పి. ప్రభాకర్ ముందు మాట్లాడుతున్నావని మరచిపోకు అమ్మాయ్! అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడైనా. నా విధి నిర్వహణలో నేను రాజీపడను. భయపడను. నా స్కిన్ కాపాడుకోడానికి అధర్మానికీ, చట్టానికీ వ్యతిరేకంగానూ నేనెప్పుడూ నిలబడను."

     "జెన్నీ"

    ప్రభాకర్ నవ్వాడు.

    "గుడ్. ఆ పేరే చెబుతావని నాకు తెలుసు."

    తను జెన్నీ పేరు చెప్పగానే ఆయనలో ఎలాంటి రియాక్షన్ కలుగుతుందోనని చూసింది ఆమె.

    "మిస్టర్ అవధానీ! మీరు వెంటనే జెన్నీని, అతని ముఠాని కస్టడీలోకి తీసుకోండి." ఆర్డర్స్ ఇచ్చాడు ప్రభాకర్.

    "నో! వద్దుసార్. అతనిపైన కూడా నేను రిపోర్ట్ చేయడం లేదు. నేను అశక్తురాలిని. నిర్భాగ్యురాలిని. దౌర్భాగ్యురాలిని. నా నిస్సహాయతతో ఎవరూ ఆటలాడకండి. నన్నిలా బతకనివ్వండి. నేను కేసుని విత్ డ్రా చేసుకోడానికి వచ్చాను. నేనిప్పుడు అతనిపైన కేసు పెట్టి న్యాయం కోసం పోరాడినా, ఏదో ఒకనాడు అతను నాకు కీడుచేయకమానడు. కాలకూట విషాన్ని కక్కే విషసర్పం లాంటివాడు జెన్నీ. నో..... నో..... నన్నిలా బతకనివ్వండి. లెట్ మీ లివ్ లైక్ దిస్. కానీ ఒక ప్రార్ధన....." అన్నది.

    "చెప్పమ్మా!"

    "ఒకసారి మీరు మా ఇంటికి రండి సార్. నేను ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చానో మీకే తెలుస్తుంది. ఒక నిరపరాధిని పోలీసు స్టేషన్లో పెట్టించి, కొట్టించినందుకు దేవుడు నా కెలాంటి శిక్ష విధించాడో మీరే చూద్దురు కాని..... రండి సార్."

    ఇంతలో ఫోన్ మోగింది.

    ఇన్ స్పెక్టర్ ఫోన్ తీసి -

    "సార్. అంకయ్య ఆన్ లైన్" అని రిసీవర్ని ప్రభాకర్ కి అందించాడు.

    "హలో!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS