Previous Page Next Page 
మహాశక్తి పేజి 36

    ఛీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ రంగంలోకి దిగుతారు.

    ప్రతిపక్షం సభలు, సమావేశాలు ప్రారంభిస్తుంది. బంద్ లు - వూరేగింపులు - ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది.

    మొత్తం సమస్య పొలిటికల్ ఇష్యూగా మారిపోతుంది.

    ఎస్. పి. ప్రభాకర్ చిరునవ్వుతో వాళ్ళకి అనునయంగా చెప్పాడు.

    "ఆవేశం కాదు కావాల్సింది - ఆలోచన. నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. కొంచెం వ్యవధి ఇవ్వండి. సమస్య పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను. ప్లీజ్. దీన్ని తీవ్రతరం చేసి మమ్మల్ని ఫోర్స్ ఉపయోగించేలా చేసి ఇరుకులో పడకండి" వాళ్ళని హెచ్చరిస్తూ కూడా చాలా అనునయంగా చెప్పాడు ప్రభాకర్.

    చండశాసనుడు ప్రభాకర్. అలాంటి ఆఫీసరు అంత మృదువుగా మాట్లాడ్డం ఆయన సబార్డినేట్స్ కి ఆశ్చర్యంగా ఉంది.

    తను చెప్పిన మాటలు ఆయనపైన బాగా పనిచేశాయని ఎస్. ఐ. స్వరూప్ అనుకొంటున్నాడు.

    ఎవరైనా వచ్చి బెయిల్ ఇస్తే ఈశ్వర్ని విడిచిపెట్టేయాలనుంది డిపార్ట్ మెంట్ కి.

    అదే సమయంలో ఓ వ్యక్తి..... విద్యార్థులని తప్పించుకొంటూ ముందుకి వస్తున్నాడు. ఆయన చేతిని పట్టుకొని చిత్ర.

    "డాడీ!" అంది చిత్ర అందరికేసి చూస్తూ.

    అక్కడ గుమికూడిన వాళ్ళందరికీ అర్ఘం అయిపోయింది. ఆమె ఈశ్వర్ కోసం తండ్రిని వెంటబెట్టుకొచ్చింది. డి.ఆర్. రాజు ఆఫ్యాయంగా కూతురు భుజంపైన తట్టాడు.

    విద్యార్ధులకేసి ఆయన చిరునవ్వుతో చెప్పారు.

    "ఈశ్వర్ కి నేను బెయిల్ ఇస్తున్నాను. మీరు ఆందోళన మానేయండి" అన్నారు.

    డి.ఆర్. పోలీస్ స్టేషన్లోకి నడుస్తుంటే విద్యార్ధులు ఆనందోత్సాహంతో కేకలు పెట్టడం మొదలుపెట్టారు.

    "ఈశ్వర్."

    "జిందాబాద్."

    "విద్యార్ధి నాయకుడు."

    "వర్ధిల్లాలి."

    "విద్యార్ధుల ఐక్యత."

    "వర్దిల్లాలి."

                                 15

    ఎస్.ఐ. ఫ్రేం చేసిన చార్జిషీట్స్ ని చూస్తున్నాడు ఇన్ స్పెక్టర్ అవధాని.

    తలమీదుగా నిండు ముసుగులో నిలబడి ఉన్న ఆమెని వెంటనే పోల్చుకున్నాడు అవధాని.

    "స్వర్ణ!"

    ఆమె స్టేషన్ కి ఎందుకొచ్చిందో అర్ధం కాక ఆమెని చూస్తూ అడిగాడు అవధాని.

    "ఏమ్మా ఇలా వచ్చావు. రా, కూర్చో."

    స్వర్ణ కళ్లెత్తి ఆయన వంక చూసింది.

    నిర్వికారంగా ఉన్న ఆమె చూపులని చూసిన ఇన్ స్పెక్టర్ అవధానికి గుండెలో చెయ్యి పెట్టి కెలికినట్టయింది.

    తెలుగుదేశంలో ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని అరికట్టలేకపోయానే అన్న గిల్టీనెస్ అతనిలో కలిగింది. అసలు నేరస్థుడ్ని పట్టుకొని చిత్రహింసలకి గురిచెయ్యాలనిపించింది.

    ఆమె ఆయనకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

    ఆమె మొహం లోకి చూశాడు అవధాని.

    ఏడ్చి ఏడ్చి మొహం బాగా ఉబ్బినట్టుగా ఉంది. ఆయాసంతో ఆమె గుండెలెగిసిపడుతున్నాయి. సన్నగా శరీరం కంపిస్తోంది.

    కానిస్టేబుల్ని పిలిచి "టీ తీసుకురా" అన్నాడ అవధాని.

    "నాకేం వద్దు సార్" అంది పేలవంగా.

    "ఫర్వాలేదు. అలసట తీరాక చెబుదువుగానీ."

    ఆమె నిట్టూర్పు విడిచింది.

    "ఇన్ స్పెక్టర్ గారూ! నేను ఈశ్వర్ పైన కేసు విత్ డ్రా చేసుకొంటున్నాను" అన్నది స్వర్ణ.

    ఇన్ స్పెక్టర్ ఆమె మొహంలోకి సూటిగా చూశాడు.

    "అలా విత్ డ్రా చేసుకోమని నిన్నెవరన్నా బెదిరించారా అమ్మా" అడిగాడు.

    "లేదు. నేనే తొందరపడి ఒక నిరపరాధి పైన రిపోర్ట్ చేశానని తెలుసుకొన్నాను. నా పొరపాటుని దిద్దుకోవాలని వచ్చాను."

    "అతను చెయ్యలేదని నీకెలా తెలుసు?"

    ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

    "నా అంతరాత్మ చెబుతోంది."

    "తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదమ్మా. నేరస్తుడిని శిక్షించకుండా విడిచిపెడితే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. న్యాయాన్ని నిలువుగా చంపేసినట్టవుతుంది."

    "ఇన్ స్పెక్టర్ గారూ! నేను చాలా చిత్రాతి చిత్రంగా ఈ వూబిలో చిక్కుకున్నాను. మొదటి నేరం ఈశ్వర్ చెయ్యలేదని నాకు కచ్చితంగా తెలుసు. కానీ గూండాగాడైన ఆ జెన్నీగాడికి భయపడి ఈశ్వర్ పైన అన్యాయంగా రిపోర్ట్ చేసి కాలేజీనించి సస్పెండ్ చేయించాను. ఆ సాయంత్రం నన్ను కొందరు రౌడీలు ఎత్తుకెళ్ళి శిరోమండనం చేస్తూ ఆ పని ఈశ్వర్ చేయించినట్టుగా నన్ను నమ్మించారు. కానీ దానితో ఈశ్వర్ని పూర్తిగా రొంపిలోకి దింపడానికి, జెన్నీ ఆడిన నాటకం అని నా స్నేహితురాలి ద్వారా ఆలస్యంగా తెలుసుకొన్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS