Previous Page Next Page 
మహాశక్తి పేజి 35

    ఎలా? అసలేం జరిగింది? ఎలా జరిగింది?   

    ప్రభాకర్ స్ట్రిక్ట్ ఆఫీసరుగా పేరుంది. నేరస్తుల పాలిట యముడని పేరు ఆయనకి. సిటీకి ఈ మధ్యనే బదిలీ అయి వచ్చాడు. నిరపరాధిని శిక్షించబోయానే అన్న బాధ అతని గుండెని ముల్లుతో గుచ్చుతోంది.

    "ఇప్పుడేం చెయ్యాలి?"

    ఆలోచనలో పడిపోయాడు ఎస్.పి. ప్రభాకర్.

    ఈశ్వర్ ని నేరస్తుడిగా చిత్రీకరిస్తూ అన్ని పేపర్లలో వార్త ప్రచురింపబడింది.

    కేసు సీరియస్ గా మారిపోయింది.

    అతన్ని విడుదల చెయ్యడానికి వీల్లేదు. వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెబితే వాళ్ళు వింటారు?

    వాళ్ళు విద్యార్ధులు.....

    ఆదర్శం కోసం ప్రాణాలనే తీసుకోగల పసివాళ్ళు. వాళ్ళు అడిగేది న్యాయసమ్మతమే అయినా చట్టం దాన్ని ఒప్పుకోదు. చట్టం దానికున్న ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది.

    ఎస్. పి. సీరియస్ గా చూస్తూ నించున్నాడు.

    నినాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎస్. ఐ. స్వరూప్, ఇన్ స్పెక్టర్ అవధాని వచ్చి ఆయన పక్కనే నించున్నారు.

    స్టేషన్ ముందు గుంపులుగా నించుని అరుస్తున్నారు.

    కేకలు..... అరుపులు...... చెవులు హోరెత్తి పోతున్నాయి.

    పోలీసులు వాళ్ళని కార్నర్ చేస్తున్నారు. కానీ అదేం పట్టించుకోడంలేదు వాళ్ళు. పోలీసులు ఎస్.పి. గారి ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్డర్స్ వస్తే లాఠీలకి మంచి పని చెప్పచ్చని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు పోలీసులు.

    ప్రభాకర్ విద్యార్ధులని చేత్తో అరవద్దని వారించాడు.

    ఆయన ఏం చెప్పబోతున్నాడో వినడానికి వాళ్ళు కామ్ గా అయిపోయారు.

    "మీ నాయకుడికి వచ్చిన ప్రమాదం ఏమీలేదు. కేసు విచారించి నేను విడుదల చేస్తాను. దయచేసి శాంతించి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి."

    ఆయన అభ్యర్ధనని విద్యార్థులు తోసిపుచ్చారు.

    "లేదు. ఈశ్వర్ని విడిచిపెడితే కానీ వెళ్ళం. మా ఆందోళన విరమించం" రాజు అడుగు ముందుకు వేశాడు.

    "మీరు ఆవేశంలో ఉన్నారు. మీకు చెప్పినా అర్ధంకాదు. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ....."

    "మాకు అనవసరం" అరిచాడు చలపతి.

    "మా నాయకుణ్ణి మాకు అప్పగించండి."

    ప్రభాకర్ కి సహనం పోతోంది.

    ఆయన ఎక్కడ తొందరపడి లాఠీచర్యకి గానీ, టీయర్ గాస్ కి గానీ ఆర్డర్స్ ఇస్తాడేమోనని కంగారుపడుతున్నారు ఇన్ స్పెక్టర్ సబ్ ఇన్ స్పెక్టర్.

    కంట్రోల్ రూమ్ నుంచి మరో రెండు వాన్లు వచ్చాయి. వాటిల్లోంచి బిలబిలమని పోలీసులు గిగుతున్నారు.

    వాళ్ళు విద్యార్థులని రౌండ్ చేసేస్తున్నారు.

    ప్రభాకర్ ఏ మాత్రం తొందరపడినా చాలామంది గాయపడతారు. అందులోనూ ఆడపిల్లలు కూడా ఉన్నారు.

    విద్యార్థుల సమస్యలని చాలా డెలికేట్ గా డీల్ చేయాలి.

    విద్యార్ధులంటే సామాన్యులు కారు.

    వారి శక్తి అసమానమైంది.

    వాళ్ళ ఐక్యత అత్యంత అపూర్వమైనది.

    ప్రాణాలు పోగొట్టుకోడానికి వెనకాడరు. ఆగ్రహమొస్తే ఎల్ కేజీ విద్యార్ధి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధి వరకూ మొత్తం స్టేట్ లెవల్లో ఏకం అయిపోతారు.

    ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపి కొత్త ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించగల సమర్ధులు విద్యార్ధులు.

    వాళ్ళ ఆందోళన తీవ్రతరమై విషమిస్తే అది మంత్రివర్గాన్ని కలవరపరుస్తుంది.

    పోలీసుల అసమర్ధత, అధికార దుర్వినియోగం పేరుతో కొందరి ఉద్యోగాలు వూడిపోతాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS