"సర్! మీరు ఆగ్రహించనంటే ఓ మాట చెపుతాను" అన్నాడు స్వరూప్ వినయంగా.
ప్రభాకర్ అతని వంక తీవ్రంగా చూశాడు.
స్వరూప్ నీళ్ళు నమిలాడు.
"వాట్ మిస్టర్ స్వరూప్."
"సర్. మీరు చాలా తొందరపడుతున్నారు. అతను చాలా మంచివాడు." ఎస్ పి.కి చెప్పాడు.
"సో వాట్? ఇప్పటివరకూ మంచివాడుగా ఉన్నవాడు తరువాత చెడ్డవాడన్న రూలేమీ లేదు."
"మే బి సర్. కానీ యితని సంగతి వేరు. హి హాజ్ ఎ వెరీ గుడ్ రికార్డ్. మంచికి అవరోధం కలిగితే సహించడు యితనంటే విద్యార్థుల్లోనే కాదు, ఊళ్ళో వాళ్ళకి కూడా చాలా అభిమానం. అంతేకాదు. మన డిపార్ట్ మెంట్ కి కూడా ఎన్నోసార్లు సహాయపడ్డాడు సర్" అని వినయంగా చెప్పాడు స్వరూప్.
ఎస్ పి. సాలోచనగా చూశాడు అతనికేసి.
"మరి ఈ రిపోర్ట్ మాటేమిటి!"
"ఇది ఫాల్స్ రిపోర్ట్ అని నా నమ్మకం సర్."
"హౌ?"
"కాలేజీలో రెండు వర్గాలున్నాయి సర్. దీని వెనక ఏదో కుట్ర వుందని నేను అభిప్రాయపడుతున్నాను."
"నిరూపించగలవా?" అడిగాడు ప్రభాకర్.
"ప్రయత్నిస్తాను సర్. కానీ ఈలోగా ఇతన్ని...... మనం......"
"ఆల్ రైట్" అని కానిస్టేబుల్స్ ని బయటికి పిలిచి లాకప్ తలుపు వేయించేశాడు ప్రభాకర్.
"అమ్మయ్య!" అని ఊపిరి పీల్చుకొన్నారు పోలీసులు.
ఇంతలో రోడ్డుపైనుంచి నినాదాలు వినవచ్చాయి.
ఎస్. ఐ. మొహంలోకిచూసి వరండాలోకి వచ్చాడు ప్రభాకర్.
వేల సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు వరద గోదారిలా పోలీస్ స్టేషన్ని ముంచెత్తడానికి నినాదాలు చేస్తూ వస్తున్నారు.
"మిస్టర్ స్వరూప్...... ఎలర్ట్" అని అరిచాడు ఎస్. పి.
స్టేషన్ లో వున్న పదిహేను మంది కానిస్టేబుల్స్ లాఠీలవి చేతుల్లోకి తీసుకొని బయటికి పరుగెత్తుకొచ్చారు.
ప్రభాకర్ గబగబా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు తగిన బలగం కోసం.
కేకలు..... అరుపులు!
వాళ్ళ వెనక నిస్సహాయంగా కదిలి వస్తున్న పోలీస్ వ్యాన్.
ప్రభాకర్ కి సిట్యుయేషన్ విషమం కాబోతోందని అర్ధం అయింది.
"విద్యార్ధి నాయకుడు ఈశ్వర్......"
"విడుదల కావాలి."
"ఈశ్వర్."
"జిందాబాద్."
"పోలీస్ జులుం."
"నశించాలి."
"ఓ ఆడపిల్లకి జరిగిన అవమానాన్ని......"
"ఖండించండి"
"న్యాయవిచారణ."
"జరిపించాలి."
"ఈశ్వర్."
"జిందాబాద్."
"ఈశ్వర్ ని"
"విడుదల చేయాలి"
"పోలీసుల జులుం"
"నశించాలి."
"సంఘ విద్రోహశక్తులు."
"నశించాలి."
ఎస్.పి. ప్రభాకర్ కి ఈశ్వర్ వ్యక్తిత్వం ఎలాంటిదో ఆ క్షణంలో అర్ధం అయింది.
అతను..... తను నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి తన అధికారాన్ని వేలెత్తి చూపించిన సాహసి.
నిజమే.
ఇప్పుడాయన మనసు ఈశ్వర్ వేపు మొగ్గుతోంది.
ఎస్. ఐ. స్వరూప్ తనని వారించకపోతే పరిస్థితి ఎంత వికృతంగా మారిపోయి వుండేదో వూహించగానే ఆయనకి చలిజ్వరం వచ్చినట్టయింది.
స్వరూప్ చెప్పినట్టు ఇదంతా ఎవరో చేసి నేరాన్ని యితనిపైన మోపారని ఆయన కూడా నమ్ముతున్నాడు.