14
ఈశ్వర్ మెడమీద చెయ్యివేసి విసురుగా సెల్ లోపలకి నెట్టాడు ఎస్. పి. ప్రభాకర్.
అవమాన భారంతో రగిలిపోతూ కోపంగా చూశాడు ఈశ్వర్.
అధికారం న్యాయాన్ని ఖూనీ చేస్తోందన్న భావంతో అతను ఆవేశంతో వూగిపోతున్నాడు.
తను నిరపరాధిని అని నిరూపించుకోటానికి అవకాశం లేకుండా తీసుకొచ్చి లోపలవేసి కేసు పెడుతోంది చట్టం.
ఎస్ పి. ప్రభాకర్ పళ్ళు పటపటమని కొరుకుతూ బెల్ట్ తీసి -
"యూ స్కౌండ్రల్!" అని ఈశ్వర్ పైన విసిరాడు. ఈశ్వర్ ఒంటిపైన దెబ్బపడింది.
"మిస్టర్ ఎస్ పీ!" అరిచాడు ఈశ్వర్.
ప్రభాకర్ ఆవేశంతో మళ్ళీ విసిరేశాడు బెల్ట్ ని.
"ఏమిటిరా! కళ్ళెర్రజేస్తే భయపడతాననుకున్నావా? లేకపోతే నాకూ గుండు చేయిస్తావా?"
"ఇంతవరకూ నాకు ఏమీ తెలీదు. కానీ ఒక్కమాట! ఇంకొక్క దెబ్బ నా శరీరం పైన పడితే మీ పరువు దక్కదు. ఇది హెచ్చరిక కాదు - వేదవాక్కు" అన్నాడు ఈశ్వర్.
"ఏం చేస్తావ్ బే!" కఠినంగా అడుగు ముందుకేశాడు ఎస్. పి. ప్రభాకర్.
పులిని ఢీ కొనటానికి రిక్తహస్తాలతో అడుగుని సాహసంతో ముందుకేస్తున్న వేటగాడిలా తనూ ముందుకి కదిలాడు ఈశ్వర్ ఏమాత్రం భయపడకుండా.
"ఇట్స్ ఎ వార్నింగ్ మిస్టర్ ప్రభాకర్! డోంట్ గో బియాండ్ యువర్ లిమిట్స్!"
ఎస్.పి. ప్రభాకర్ ఆశ్చర్యంతో పాటు ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు.
ఆఫ్ట్రాల్ ఓ స్టూడెంట్ తన కస్టడీలో ఉండి తనని బెదిరించడమా? అదో సవాల్ గా అనిపించిందతనికి.
పెద్ద పెద్ద గూండాలకీ, హంతకులకీ తనంటే సింహస్వప్నం. పేరు చెబితే మంచినీళ్ళు తాగరు.
అలాంటిది నూనూహు మీసాల యువకుడు..... జీవితంలో అనుభవంలేని ఓ చిన్నవాడు తనని హెచ్చరించడమా? కోపంతో మళ్ళీ బెల్ట్ విసిరాడు.
ఈసారి ఈశ్వర్ ఆ బెల్ట్ ని ఒడుపుగా అందిపుచ్చుకున్నాడు.
ప్రభాకర్ చేతిలోంచి అది ఈశ్వర్ చేతిలోకి వచ్చేసింది. ఈశ్వర్ చూపులు తనని హేళన చేస్తున్నట్టుగా అనిపించింది ఎస్.పి.కి.
ప్రభాకర్ కొన్ని క్షణాలు నిర్ఘాంతపోయాడు. అది చూసి ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలకు పరుగెత్తుకొచ్చారు.
ఈశ్వర్ మూడోకన్ను తెరుస్తున్న త్రినేత్రుడిలా చూశాడు వాళ్ళకేసి.
"ఒక నిరపరాధిని నేరం చేయలేదని నిరూపించుకోటానికి అవకాశం యివ్వకుండా, న్యాయ విచారణ చెయ్యకుండా, దర్యాప్తు జరపకుండా హింసకి పాల్పడుతోన్న మిమ్మల్ని నరికిపోగులు పెడతాను. మీరు డ్యూటీలో ఉన్న అధికారులు కావచ్చు. కానీ.... నా దారికి అది అడ్డుకాదు. అధర్మానికి శత్రువుని."
బెల్ట్ ని చుట్ట చుట్టి దాన్ని ఎస్. పి. మీదకి విసరటానికి సిద్ధపడుతున్నాడు ఈశ్వర్.
కానీ ఎస్.పి. దాన్ని లెక్కచెయ్యలేదు. నిర్లక్ష్యంగా అన్నాడు -
"నువ్వు నా కస్టడీలో ఉన్నావు. నీ ఎముకల్ని సున్నంలోకి మిగలకుండా చేస్తాను. నీ కీళ్ళు నీ స్వాధీనంలోకి రాకుండా చేస్తాను" నిజానికి అతనన్నంత పనీ చేయగలవాడేనని ఈశ్వర్ అనుకున్నాడు.
"తెలుసు! నీకంతకంటే ఏం చేతనవుతుంది? అధికారం ఉందని పొగరుతో నిరపరాధులని తీసుకొచ్చి లాకప్ లో పెట్టి యింటరాగేషన్ పేరుతో హింసలు పెట్టి లాకప్పులో చంపగల మీ డిపార్ట్ మెంట్ ప్రతిభ ప్రజలందరికీ తెలుసు!"
"తెలిసి ఏం చెయ్యగలరు?"
"ఎవ్విర్ డే ఈజ్ నాట్ సండే! యీ రోజు కాకపోవచ్చు. రేపు కాకపోవచ్చు. వెల్లువలాంటి ప్రజావాహిని కన్ను తెరిచిననాడు ఇటు మీకూ, అటు ప్రభుత్వానికీ కూడా సమాధానం దొరకదు.
"ప్రభుత్వం మీకు అధికారాలని కట్టబెట్టింది చట్టాన్ని పరిరక్షించడానికే తప్ప దాన్ని దుర్వినియోగం చెయ్యడానికి కాదు.
"మీరు అహంకారంతో ప్రవర్తించి, దానివల్ల కలిగే పరిణామాలని ప్రభుత్వం నెత్తిన రుద్దుతారు. ఒక నిరపరాధి అయిన విద్యార్థి నాయకుడిని అదుపులోకి తీసుకోవడం, హింసించడం అంటే నీ తలకి నువ్వే కొరివి పెట్టుకున్నవాడివి అవుతావు. నిప్పుని గుప్పిట బిగించాలని నువ్వు చేస్తున్న యీ ప్రయత్నం వ్యర్ధమైందని మరచిపోకు" ఈశ్వర్ ప్రతి మాటనీ నొక్కి నొక్కి అన్నాడు.
"బీట్ దిస్ రాస్కెల్!" అరిచాడు ఎస్.పి.
కానిస్టేబుల్స్ లాఠీలతో లోపలకి వచ్చారు.
ఈశ్వర్ కేసి ఓసారి చూశారు వాళ్ళిద్దరూ.
ఓసారి గూండావాళ్ళ చేతిలో దెబ్బలు తింటుంటే వాళ్ళని కాపాడాడు ఈశ్వర్.
అలాంటి మనిషిని కొట్టమని అధికారి ఆదేశిస్తున్నాడు.
కానీ అతనిపైన చెయ్యెత్తి లాఠీలతో కొట్టడానికి మనసు అంగీకరించడంలేదు వాళ్ళకి.
"ఊ..... బీట్ హిమ్" మరోసారి గర్జించాడు ప్రభాకర్.
"దేవుడా మమ్మల్ని క్షమించు." ఇద్దరు కానిస్టేబుల్స్ మనసులోనే దువుణ్ని ప్రార్ధించారు.
"యూ!"
పోలీస్ స్టేషన్ మారు మోగిపోయేలా రంకె పెట్టాడు ఈశ్వర్.
అతని ధైర్యానికి, సాహసానికీ ఎస్.పి. ప్రభాకర్ కొద్దిక్షణాలు కలవరపడిపోయాడు.
