"ఈశ్వర్ని అరెస్ట్ చేశారట!"
"అరెస్టు చేశారా?"
"అవునట."
"అన్యాయం!"
"అక్రమం!"
"మనం దీన్ని సహించకూడదు."
"ఈ చర్యని మనం ఖండించాలి."
విద్యార్ధుల్లో తీవ్రమైన సంచలనం కలుగుతోంది.
"ఈశ్వర్ని వెంటనే విడుదల చెయ్యాలి." అరిచింది చిత్ర.
"విడుదల చెయ్యాలి!" ముక్తకంఠంతో అరిచారు విద్యార్థులంతా.
"అతని సస్పెన్షన్ రద్దు చేయాలి!"
"రద్దు చేయాలి!"
"పోలీసుల చర్యని......"
"ఖండించండి!"
"న్యాయవిచారణ జరిపించి దోషిని పట్టుకోవాలి!"
"అవును"
"ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం" - "ఉండకూడదు!"
"ఈశ్వర్!"
"జిందాబాద్!"
"పోలీసుల జులుం......"
"నశించాలి!"
"విద్యార్థుల ఐక్యత......"
"వర్ధిల్లాలి!"
"ఈశ్వర్......"
"జిందాబాద్!"
"విద్యార్ధుల సంఘటిత శక్తి"
"వర్ధిల్లాలి!"
అంకయ్య జెన్నీ మొహమొహాలు చూసుకున్నారు. తమ అంచనా తలకిందులైనందుకు ఉక్రోషంతో ముక్కుపుటాలెగరేశారు ఇద్దరూ.
విద్యార్థులు బారులు తీరి నినాదాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు.
వెనక పోలీసు వ్యాన్ మెల్లగా వాళ్ళని అనుసరిస్తోంది.
"విద్యార్థుల సమైక్యతని దెబ్బతీసే సంఘ విద్రోహులు....."
"నశించాలి!"
"నశించాలి!"
ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ ని ఆపి అద్దాలు పగలగొట్టారు కొందరు.
మరి కొందరు చక్రాల్లో గాలిని తీసేశారు. విద్యార్ధుల ఆందోళనకి భయపడి కొన్నిషాపుల ఓనర్లు షట్టర్సు కిందకి దించేస్తున్నారు.
ఇన్ స్పెక్టర్ సహనంతో వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
అతను అనుభవజ్ఞుడు! విద్యార్ధులపైన చర్య తీసుకుంటే పరిస్థితి అదుపు తప్పుతుందని అతనికి తెలుసు.
"మీ ఆందోళనని పీస్ పుల్ గా చేయండి" అని అభ్యర్థిస్తున్నాడు ఇన్ స్పెక్టర్.
కానీ అప్పటికే రెచ్చిపోయిన విద్యార్థినీ విద్యార్ధులు అతన్ని లక్ష్యపెట్టడంలేదు.
ఒక మహా ప్రవాహంలా కదులుతున్నారు వాళ్ళు..... తన మాటలని లక్ష్యం చెయ్యకుండా ఈశ్వర్ని బలపరుస్తోన్న స్టూడెంట్స్ ని చూసేసరికి అంకయ్యకి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. జెన్నీగాడి మాట విని తప్పటగుడు గానీ వేశానా? అని ఓసారి తనలో తానే ప్రశ్నించుకున్నాడు.
కానీ...... కానీ....... అతన్ని మరింత విస్మయ పరచిన విషయం ఒకటే!
అతని కూతురు అశ్వని కూడా నినాదాలు చేస్తూ ఆ జన సమూహంలో వెళుతోంది.
చిత్ర చేతిని పట్టుకొని ఉద్రేకంతో అరుస్తూ అడుగులు వేస్తోంది అశ్వని. కోపంతో ఒళ్ళు తెలీలేదు. కానీ పరిస్థితి అతనికి అనుకూలంగా లేకపోవడంతో నోరు మూసుకున్నాడు.
రాజకీయ చదరంగంలో తన ఎత్తు వీగిపోగా మరో ఎత్తు వేయవలసిన సమయం ఆసన్నమైందని అంకయ్య గ్రహించాడు.
మొహాన్ని కందగడ్డలా చేసుకొని కారెక్కాడు అంకయ్య.
జెన్నీ అతని బృందం కూడా కారెక్కగానే కదిలింది.
ఈశ్వర్ నిరపరాధి అన్న నమ్మకం ఎంతగా ఉందో, స్వర్ణకి జరిగిన అన్యాయానికి రెట్టింపు బాధ విద్యార్థినీ విద్యార్ధుల్లో వుంది.
విద్యార్థుల వెల్లువ.... ఓ మహా ప్రవాహమై పోలీస్ స్టేషన్ వేపుపోతోంది.
వాళ్ళు చేస్తున్న నినాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.


