Previous Page Next Page 
మహాశక్తి పేజి 31

    "చూడండి బాబులూ. జరిగిన ఘోరం ఎలాంటిదో మనకందరికీ తెలుసు. నేను ప్రజల మనిషిని. నా ప్రజలలో ఓ ఒక్క మనిషికి కష్టం కలిగినా నా మనసుకి చితిపెట్టినట్టుగా హృదయం భగ్గుమంటుంది!!" వాళ్ళని రెచ్చగొట్టడానికి అంకయ్య ప్రయత్నిస్తున్నాడు.

    "ఛీ నోర్ముయ్! నిన్ను ప్రజానాయకుడని ఎవరన్నారు. అసలు నీ ఎన్నికే చెల్లదని కోర్టు తీర్చు చెప్పింది. దొంగ ఓట్లు వేయించుకొని గెలవడానికి చూసే నువ్వు ఎప్పటికీ ప్రజా ప్రతినిధివి కాలేవు. ప్రజా నాయకుడివి అంతకంటే కాలేవు." చలపతి అన్నాడు.

    "నేను కోర్టు తీర్పుని శిరసావహించాను నాయనా!" అన్నాడు తెచ్చిపెట్టుకొంటున్న చిరునవ్వుతో అంకయ్య.

    "లేకపోతే ఏం చేస్తావ్?" ముకుందం అరిచాడు.

    అంకయ్య అతనికేసి తీక్షణంగా చూశాడు.

    "అనుభవం లేని వయసు నీది. రాజకీయ నాయకుల జీవితం అంటే వైకుంఠపాళీలో పావులాంటిదబ్బాయ్. పదవి పోయినా రాజకీయ నాయకుడికి కత్తిలా పదును రెండు వైపులా ఉంటుంది. దీనికి బాధ్యుడైన ఈశ్వర్ని జైలుకి పంపందే నేను నిద్రపోను" ఆవేశంగా అన్నాడు.

    "నటించకు. నీ తుచ్ఛ రాజకీయాలని మా విద్యార్థులపై రుద్దాలని చూడ్డం మంచిది కాదు అంకయ్యా. ఇది ఈశ్వర్ చేయలేదని ఖచ్చితంగా మాకు తెలుసు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలీని వాజమ్మలం కాదు మేము."

    "అతను మీ స్నేహితుడైనంత మాత్రం చేత సమర్ధిస్తే సరిపోదు." జెన్నీ అన్నాడు.

    "షటప్" అరిచాడు రాజు.

    "ఈశ్వర్ని నేరస్థుడిగా చిత్రీకరించడానికి ఇది మీరు చేసిన కుట్రని మాకు తెలుసురా జెన్నీ!
ఇందులోని నిజానిజాలని బయటపెట్టి మీ తోలు తీసి ఎండేస్తాం" చలపతి అన్నాడు.

    "దానికి మీకు ఋజువుందా?" అడిగాడు అంకయ్య.

    "ఉంది."

    అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ మాటన్న వ్యక్తివేపు
   
    చిత్ర!

    చిత్ర ముందుకొచ్చింది.

    "ఏమిటిది?" అడిగాడు జెన్నీ.

    "నిన్న ఈశ్వర్ని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసిన క్షణం దగ్గర్నించీ అతను నా దగ్గరే ఉన్నాడు."

    "నీ దగ్గరా?" హేళన ధ్వనించింది అంకయ్య కంఠంలో.

    "అవును. అతను ఏ విధంగానూ తొందరపడకుండా ఆపడానికి అతన్ని నిన్నటినుంచీ నా దగ్గరే ఉంచుకొన్నాను" అంది చిత్ర.

    "ఉంచుకొన్నావా?" గొంతులో అవహేళన.

    "ఒరేయ్ అంకయ్యా! ఇందాకే కదరా స్త్రీల ఆత్మగౌరవం గురించి మాట్లాడావు. ఇప్పుడో ఆడపిల్లని ఇంత మందెదుట చులకనగా మాట్లాడుతున్నావు నీది నాలికా, తాటిపట్టా!" అడిగాడు రాజు.

    "ఇది మా సమస్య మేమే పరిష్కరించుకొంటాం. నీలాంటి వాళ్ళ ప్రమేయం అనవసరం." ఓ విద్యార్థి అరిచాడు.

    "అవును...... అనవసరం. ఇది మా సమస్య మేమే పరిష్కరించుకొంటాం."

    "అవును. అనవసరం."

    విద్యార్థుల్లో తన పట్ల వ్యతిరేకభావం కలుగుతోందని అంకయ్య గ్రహించాడు.

    అంతలో అక్కడికి పోలీస్ వ్యాన్ వచ్చింది.

    అందులోంచి ఇన్ స్పెక్టర్, పోలీసులు బిలబిలమని దిగారు.

    ఇన్ స్పెక్టర్ అందర్నీ అక్కడి నుంచి డిస్ బర్స్ అవమని హెచ్చరించాడు.

    పోలీసులు లాఠీలతో విద్యార్ధులని చుట్టుముడుతున్నారు.

    "ఈశ్వర్ గాడిని అరెస్ట్ చేసేవరకూ నేనిక్కడనించి కదలను!" అంకయ్య బింకంగా అన్నాడు ఇన్ స్పెక్టర్ తో.

    "అతన్నెప్పుడో అరెస్ట్ చేశాం. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి" అన్నాడు ఇన్ స్పెక్టర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS