Previous Page Next Page 
మహాశక్తి పేజి 30

    "ముద్దొస్తుందిరా బుజ్జిపండు."

    స్వర్ణకి ఆ మాటలు వినబడ్డంలేదు.

    ఆమె మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది.

    ఎలా? ఎలా చూపించాలి మొహం నలుగురికీ?

    ఎంత నగుబాటు? ఇంక తలెత్తుకు తిరగలేదు తను.

    పరుగెత్తుకెళ్ళి ఏ చెరువులోనో దూకి చావాలి. లేదా రైలు కింద తలపెట్టాలి. అంతే! అంతే!!

    "పద" ఆమె చేతిని పట్టుకుని గుంజాడు గుండు చేసినవాడు.

    ఆమె ఒక్కసారి నిర్వికారంగా వాళ్ళకేసి చూసింది. ఆమె నోరు విప్పలేదు తలొంచుకొని అడుగు ముందుకు వేసింది.

    ఆమెకి తిరిగి కారెక్కించారు కారు కదిలింది.

    పావుగంటలో కారు ఆమె ఇంటి ముందు ఆగింది. డోర్ తెరిచి ఆమెని బయటికి నెట్టేశారు వాళ్ళు.

    ఆమె రోడ్డు మీద పడిపోయింది. అదే క్షణంలో కారు వేగంగా వెళ్ళిపోయింది. ఆమె కింద నించి లేవలేకపోయింది.

    అప్పటికే కూతురు ఇంటికి రాలేదన్న కంగారులో గుమ్మంలో నుంచుని ఎదురుచూస్తోన్న ఆమె తల్లి కారులోంచి తన బిడ్డని బయటికి నెట్టడం చూసింది.

    ఆమె గబగబా మెట్లు దిగి వచ్చి కూతుర్ని చూసి.

    "ఇదేమిటి తల్లీ!" అని బావురుమంది. అంతకు మించి ఆ క్షణంలో ఏం చెయ్యడానికీ ఆమెకి తోచలేదు.

    స్వర్ణ నోటినుంచి మూడు అక్షరాలు వెలువడినాయి.

    "ఈ.....శ్వ.....ర్."

    అంతే! ఆమెకి స్పృహ తప్పింది.

                                                                 13

    కాలేజీ బయట వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది.

    స్టూడెంట్స్ కాలేజీ లోపలికి పోకుండా బయటే నించున్నారు. వాళ్ళని ఉద్దేశించి అంకయ్య గొంతు సవరించుకున్నాడు.

    "ఈ చర్యకి నేను తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాను. కాలేజీకి ఆడపిల్లలెందుకొస్తున్నారు? ఇలా గుళ్ళు కొట్టించుకోడానికి కాదని నేను మనవి చేస్తున్నాను! కేవలం చదువుకోడానికి అని కూడా నేను వక్కాణిస్తున్నాను. కానీ జరుగుతున్నదేమిటి?

    అవమానాలు!

    అత్యాచారాలు!

    అసలు పాపం ఆడకూతుళ్ళకి రక్షణ లేకుండా పోయినందుకు నా ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇదంతా చూసి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఈ సమాజం ఎప్పుడు మారుతుంది?

    ఈ కాలేజీలోనే చదువుకొనే ఓ చిట్టితల్లికి జరిగిన అన్యాయానికి, దానికి కారకుడైన ఈశ్వర్ని ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి" అని స్టూడెంట్స్ కేసి తన ఉపన్యాసానికి తనే మురిసిపోతూ చూశాడు.

    జెన్నీ అడుగు ముందుకేసి అన్నాడు.

    "నరికి పోగులు పెట్టాలి వాడ్ని"

    "నరికి పోగులు పెట్టడానికి నువ్వెవరివి? న్యాయవిచారణ జరిపించాలి దోషిని పట్టుకోవాలి. అప్పుడు ఇది పలాన వ్యక్తి చేశాడని ఆరోపించాలి" రాజు ఉద్రోకంతో అన్నాడు.

    "అవును."

    "అవును." విద్యార్థుల్లో కలకలం. ముక్తకంఠంతో అరిచారు.

    ఈశ్వర్ అలా చేయడన్న నమ్మకం అక్కడ ఉన్న ప్రతి విద్యార్థినిలోనూ ఉన్నది. ఈశ్వర్ సస్పెన్షన్ని వాళ్లందరూ ఖండిస్తున్నారోపక్క.

    "ఇంకా న్యాయ విచారణ దేనికి. ఇది చేసిందెవరో ఆ అమ్మాయే చెబుతోంది?" అన్నాడు జెన్నీ. అతని స్నేహ బృందం పక్కన చేరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS