ఆమె బాధని లెక్కచెయ్యకుండా బావురుకప్పలా నోరు తెరిచి డబ్బాలో రాళ్ళు పోసి ఆడిస్తున్నట్టుగా నవ్వాడు వాడు.
ఆ నవ్వుకి ఆమె కడుపులో పేగులన్నీ మెలిపెట్టి తిప్పినట్టయి వాంతి వచ్చినంత పనయింది.
కారాకిళ్ళీ నమిలి నమిలి నల్లగా గారపట్టి ఉన్నాయి వాడి పళ్ళు. ఆమెకి శరీరంపైన తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్టుగా అనిపిస్తోంది. అతని చేతిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
"ఇంతకంటే నన్ను చంపేయండి!" అరిచింది స్వర్ణ.
"ఇంతకంటే అంటున్నావు - అసలు నిన్నింకా ఏమీ చెయ్యలేదు కదే?" అన్నాడొకడు.
స్వర్ణకి తెగింపు వస్తోంది.
తనని వాళ్ళెలాగూ విడిచిపెట్టరు.
అశ్వని ఆ ఉదయం తనకోసం రాకపోతే అసలు ఆ రోజు కాలేజీ ఛాయలకి కూడా వెళ్ళేది కాదేమో! అప్పుడిలా జరిగి ఉండేది కాదు.
తన జీవితం నాశనం కాబోతూంది.
పరాభవానికి కొన్ని క్షణాల వ్యవధి మాత్రమే ఉంది.
వెగటు కలిగించేవాళ్ళ చూపులూ, చేతలూ ఆమెలో ఆవేశాన్ని కగిలిస్తున్నాయి. కోపం, ఉక్రోషం.....
"థూ" అని కాండ్రించి వాడి మొహంపైన ఉమ్మేసింది.
వాడో క్షణంపాటు నివ్వెరపోయాడు మొహాన్ని చేత్తో తుడుచుకొని నవ్వాడు.
"ఉ..... ఉ.....ఉ...... హా..... హా..... హా..... యాఁ" అలా నవ్వుతూనే అతను చేతిని గాలిలో కదిపాడు.
"ఫట్" మన్న చప్పుడు.
"అమ్మా!" అన్న ఆక్రందన గదిలో మారుమోగింది.
స్వర్ణ పెదవి చిట్లి రక్తం కారుతోంది.
ఆడపిల్లన్న కనీసపు సానుభూతి గానీ, జాలి గానీ లేకుండా కొట్టాడు వాడు.
ఇక ఆలస్యం చెయ్యలేడు వాడు.
ఆమె రెక్కల్ని విరిచి పట్టుకున్నాడు. బాధతో మూలిగింది ఆమె.
కళ్ళనించి కన్నీరు నిర్విరామంగా జారిపోతోంది. కానీ ఆ పశువులకు కనికరం కలగలేదు.
"నూజివీడు రసంలా ఉంది. చీకిపారేస్తే సరి" అన్నాడు ఒకడు
"అందుకు ఈశ్వర్ ఒప్పుకోడు." ఇంకొకడు అన్నాడు.
"వాడికిదేం చెప్పదుగా!" తిరిగి అన్నాడు వాడు.
"అయినా సరే, వద్దు చెప్పింది చేద్దాం!"
వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొంటున్నారు.
ఇదంతా ఈశ్వర్ పనే.
"ఈశ్వర్ ఒరే, నువ్వింత రాక్షసుడివని అనుకోలేదురా! నా ఉసురు నీకు తగులుతుంది. ఆడపిల్ల నన్న జాలికూడా నీకు లేకపోయినందుకు ఇంత కింత అనుభవిస్తావు." ఆమె శపిస్తోంది.
"షటప్" మన్న శబ్దం. అగంతకుల్లో ఒకడి చేతిలో కత్తి తెరుచుకొని తళుక్కున మెరిసింది.
కత్తి.....
ఆమె నిలువు గుడ్లువేసి చూసింది దానికేసి.
వాడు కత్తిని చేత్తోపట్టుకొని ఒక్కో అడుగూ ముందుకేస్తున్నాడు. ఇంకొకడు ముందుకొచ్చి మోకాళ్ళపైన ఆమె ముందు కూర్చుని ఆమె తొడలపైన చెయ్యి వేశాడు. వికారంగా నవ్వుతున్నాడు. మెల్లగా చేతుల్ని పైకి కదుపుతున్నాడు.
"బావున్నాయి" అంటున్నాడు. ఇంకొంచెం పైకి చేతులు కదులుతున్నాయి.
వాళ్ళు తనని ఏం చెయ్యబోతున్నారో ఆమెకి అంతుచిక్కడంలేదు.
"కదలకుండా పట్టుకో" మరొకడు వచ్చి ఆమె నడుం చుట్టూచేతులు వేశాడు. వాడి చేతివేళ్ళు తేళ్ళు పాకుతున్నట్టుగా, పొట్టపైన కదులుతున్నాయి.
"నాకైతే వదిలి పెట్టాలనిపించటంలేదు."
నాలుగోవాడు గభాల్న ఆమె జుత్తు పట్టుకున్నాడు.
"ముందు ఆ పని కానిద్దాం."
కత్తెరతో ఆమె జుత్తుని కత్తిరించడం మొదలుపెట్టాడు.
అంతకంటే ఘోరం ఏం కావాలి?
ఆమె గుండె తెగిపడేలా ఏడుస్తోంది. ప్రాణం పోదే అని రోధిస్తోంది.
ఆ పని చేయడం వాళ్ళకి మాత్రం మహదానందంగా ఉంది. ప్రొఫెషనల్స్ లా చకచకా పని పూర్తి చేస్తున్నారు.
ఆమె తలని నున్నగా కత్తిరించి గుండు చేసేశాడు అగంతకుడు.
హృదయ విదాకరంగా విలపిస్తోంది ఆమె.
"ఏమే! మొహం పైన ఊస్తావా? ఇప్పుడు అద్దంల చూసుకోవే."
"పొన్నకాయలా ఉందిరా."
