Previous Page Next Page 
మహాశక్తి పేజి 22

    ఎందుకో చిరాకుగా ఉంది. కొంతసేపు పోతే అదే మామూలైపోతుందిలే అనుకుంది.

    సరిగా అదే సమయంలో ఇంటి ముందు ఆటో ఆగింది.

    అందులోంచి అశ్వని దిగింది.

    అశ్వనిని చూడగానే స్వర్ణకి ఎంతో ధైర్యం వచ్చింది.

    కానీ అంతలోనే అనుకుంది.

    ఎంత చెడ్డా అశ్వనికి బావ జెన్నీ.

    అశ్వనితోనే పంపాడేమో ప్రేమలేఖని.

    ఆ ఆలోచనతో తిరిగి నీరు కారిపోతూ అడిగింది స్వర్ణ - "ఎప్పుడూ లేంది ఈ రోజు ఇలా ఊడిపడ్డావే?" మొహంపైకి చిరునవ్వుని తెచ్చిపెట్టుకుంటూ.

    అశ్వని చిన్నగా నవ్వింది.

    "ఈ రోజు అనుకోకుండా ఎర్లీగా బయలుదేరాను. దారిలోనే కదా మీ ఇల్లు. నిన్ను పికప్ చేసుకెళ్ళవచ్చు కదాని ఆగాను. వస్తావా వెళదాం."

    ఆమె తనని పద్మవ్యూహంలోకి దగ్గరుండి తీసుకెళ్ళడానికి వచ్చినట్టుగా అనిపించింది స్వర్ణకి.

    క్షణంపాటు ఏదో ఆలోచించి-

    "పద వెళదాం" అంది బ్యాగ్ తీసుకుని.

    "అమ్మా వెళుతున్నాను" అని అరిచింది.

    "వెళుతున్నాను ఏమిటే నీ మొహం. వెళ్ళొస్తాను అనాలి" అరిచింది లోపలనించి ప్రసూన.

    ఆ మాటల్ని స్వర్ణ వినిపించుకోలేదు.

    ఆటో ఎక్కాక అంది స్వర్ణ తిరిగి అనుమానంగా.

    "నువ్వు కాజువల్ గా వచ్చావు. అంతే కదూ."

    అశ్వనికి జాలేసింది. స్వర్ణ ఎందుకలా అడిగిందో అశ్వనికి తెలుసు.

    స్వర్ణ మొహం అప్పటికే వివర్ణమైపోయింది. ఆమె మొహంలో భయం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. జెన్నీ గురించి ఆమె భయపడుతోంది జెన్నీ ప్లాన్ స్వర్ణ అమలు పరచకుండా చూడాలనే అశ్వని ఆమె దగ్గరకొచ్చిన సంగతి స్వర్ణకి తెలీదు.

    ఆ రోజంతా కూడా స్వర్ణని తను విడిచిపెట్టకుండా జెన్నీకి అవకాశం ఇవ్వకుండా చూడాలన్నదే అశ్వని ఆలోచన.

    అందుకనే ముందుగా స్వర్ణ కోసం వచ్చింది అశ్వని.

    ఆటో వేగంగా వెళుతోంది.

    స్వర్ణ భుజంపైన చెయ్యి వేసింది అశ్వని.

    "నా కెందుకో యీ రోజంతా నీతోనే గడపాలనుందే స్వర్ణా" అంది.

    ఆ మాటకి స్వర్ణకి ఎక్కడలేని ఆనందం కలిగింది.

    "నిజంగా యీ రోజంతా నా పక్కనే ఉంటావా?" అడిగింది స్వర్ణ విప్పారిన నేత్రాలతో.

    "నీ మీద ఒట్టు"

    "థాంక్స్ అశ్వనీ. నువ్వు రాకపోతే యీ రోజు అసలు కాలేజీకి వచ్చేదాన్ని కాదు."

    "ఎందుకని?" అడిగింది అశ్వని ఆమె ఏం చెపుతుందోనని ఎదురుచూస్తూ.

    "ఏమో, నాకు చాలా చిరాకుగా ఉంది. అసలు చదువు మానేసి ఏ వెంకటసుబ్బయ్యనో పెళ్ళి చేసుకొని వాడికి వండిపెడుతూ కూర్చుంటే పోతుందనిపిస్తోంది."

    "ఏడిశావు. ఆడదంటే ఒకటికి వండి పెట్టడానికేనా?"

    "అంతకంటే దేనికి పనికివస్తాం?"

    "ఆడదాన్ని అంత తేలికగా అంచనా వేయకు స్వర్ణా.

    ఆడది మగాడితో సమానంగా చదువుతోంది.

    ఉద్యోగం చేస్తోంది. రాజకీయాల్లో అగ్రస్థానాలనందుకుంటోంది.

    ఆడా, మగా జాతిలోనే తేడా స్వర్ణా.

    నిజానికి ఆడదానికున్న తెలివితేటలు, సాహసం, తెగింపు మగాడి కెక్కడివే" అంది అశ్వని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS