కాలేజీలో ఎంతమంది లేరు. ఈ దౌర్భాగ్యపు పరిస్థితి తనకే రావాలా?
అద్దం ముందు దిగులుగా కూర్చున్న కూతుర్ని చూసి అడిగింది స్వర్ణ తల్లి ప్రసూన -
"ఏమే యింకా అలాగే కూర్చున్నావు. తయారవ్వవే. కాలేజీకి వెళ్ళవా?"
"వెళ్ళను. అసలు చదువే మానేయాలనుంది" అని చెప్పాలనిపించింది. కానీ అలా అన్లేదు.
"బద్ధకంగా ఉందమ్మా" అంది.
"బద్ధకం లేదు గిద్ధకం లేదు. ఇంట్లో కూర్చుంటే అది మరింత ఎక్కువవుతుంది. పైగా మీ నాన్నగారు ఊరుకోరు. వెళ్ళు" అని కసిరింది తల్లి.
ఇంట్లో ఉండనివ్వదు తల్లి.
క్రితం రోజు జెన్నీ తనపైన చేసిన అఘాయిత్యం గుర్తుకొచ్చి మనసుని ముల్లుతో పొడుస్తున్నట్టుగా ఉంది. వాడు ముట్టుకున్నప్పుడు ఒంటిపైన గొంగళీపురుగులు పాకినట్లుగా అనిపించింది.
ఎవరికి చెప్పినా అది పెద్ద అవమానమే.
వయసొచ్చిన ఆడపిల్లకి అంతకంటే పరాభవం ఏముంటుంది?
కళ్ళలో నీరు తిరిగింది.
పవిట చెరగుతో కళ్ళు తుడుచుకొని, పౌడరు మొహానికి అద్దుకొంది.
ఎంత సర్ది చెప్పుకున్నా మనసు అల్లకల్లోలంగానే ఉంది.
కాలేజీకి వెళ్తుంది. జెన్నీ వచ్చి తనకి ప్రేమలేఖ ఇస్తాడు. దాన్ని ఈశ్వర్ రాశాడని ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చెయ్యాలి.
అన్యాయం. ఇంతకంటే దారుణం మరోటి ఉండదు. ఈశ్వర్ ఎంత మంచివాడో ఆమెకి తెలుసు. తనలా కంప్లయింట్ చెయ్యగానే తననెంతమంది ఈసడించుకుంటారో కూడా ఆమెకి బాగా తెలుసు.
"దేవుడా నన్నీ ఆపదనించి కాపాడు తండ్రీ" అని పదే పదే మనసులో దేవుణ్ణి ప్రార్థించింది స్వర్ణ.
వెళ్ళి అన్నం పళ్ళెం ముందు కూర్చుంది. కానీ తినబుద్ధి కావడం లేదు. పళ్ళెంలో చెయ్యిపెట్టి కెలుకుతుంటే తల్లి కోపంగా అడిగింది.
"ఏమయిందే నీకు?"
తల్లి ప్రశ్నకి ఉలిక్కిపడింది స్వర్ణ.
ఆ తల్లికి తెలుసు. వయసొచ్చిన ఆడపిల్ల అలా అన్యమనస్కంగా వున్నదంటే ఎన్నో కారణాలుంటాయి.
ఒకటి ప్రేమలో పడి వుండాలి.
రెండు ఏ వెధవ మాటలో నమ్మి మోసపోయి వుండాలి. మూడు నెల తప్పడమో లేక మరంతకన్నా పెద్ద చిక్కులో చిక్కి ఉండాలి.
ఏమై వుంటుందో?
"ఏమిటో చాలా వికారంగా వుందమ్మా" అని పళ్లెంలో చెయ్యి కడిగేసింది.
దాంతో ఆ తల్లి కంగారుగా చూసింది.
"కొంపదీసి నెలగానీ తప్పిందా?పాపిష్టిది. కొంప పరువు తీస్తుందేమో?" బాంబు పక్కనే పడినట్టుగా ఉంది తల్లి ప్రసూనకి.