"కానీ, 'ఆడది' అనే తేలిక భావంతోనే చూస్తాడు మనల్ని."
"ట్రాష్. ఆడదాన్ని ఓ గాడిద కొడుకు తేలికగా చూసినంత మాత్రాన తేలికై పోదు స్వర్ణా. మగాడి పరువు, మర్యాదలు ఆడదాని చేతిలో ఉంటాయి. ఆడది తెలిస్తే మగాడి బతుకు నవ్వుల పాలవుతుంది. వాడి పరువు, మర్యాదలు, స్టేటస్ అన్నీ గంగలో కలిసిపోతాయి."
"కానీ, ఆ తెగింపు చర్యకి స్త్రీ రెడీగా ఉండదు అశ్వనీ.
"దానికి కారణం చెప్పనా - ఆడదానికి దాని శక్తి తనకి తెలీకుండా 'నువ్వు భారత నారివి, నోరుమూసుకు పడుండాలి' అని నోరెత్తకుండా చేశారు. కానీ ఆడది ఆదిశక్తి స్వరూపం.
ఆడది తెగించిననాడు మహాశక్తి అవుతోంది. ఆనాడు ఈ ప్రపంచాన్నే శాసించగల శక్తి ఆడది మాత్రమే స్వర్ణా"
స్వర్ణ కొంచెం చిరాకుగా చూసింది.
"ఉపన్యాసం దేనికి?"
"నీకు ధైర్యం చెప్పడానికి"
"నాకా?"
"ఎస్, ఫర్ యూ ఓన్లీ" నవ్వింది అశ్వని.
స్వర్ణకి ఆమె మాటల్లోని అంతర్యం అర్ధం కాలేదు.
"చెబితే సరిగా చెప్పు లేకపోతే ఊరుకో."
"ఏం లేదులే. తమాషాగా అన్నాను."
కాలేజీ వచ్చేసింది.
గేటు దగ్గర ఇద్దరూ ఆటో దిగారు.
అప్పటికే అక్కడ..... చెట్టు కింద మోటార్ సైకిల్ మీద స్టాండ్ వేసి కూర్చుని ఉన్నాడు జెన్నీ.
అతని చుట్టూ గాంగ్ అంతా ఉంది.
అశ్వని అతన్ని చూసి స్వర్ణతో అంది.
"చూడు. గోతికాడ నక్కలా ఎలా కూర్చున్నాడో?"
"మీ బావేగా?"
"నేను సిగ్గుపడి చచ్చేది అందుకే" అంది అశ్వని.
స్వర్ణ తన మరదలు అశ్వనితో కలిసిరావడంతో జెన్నీ కళ్ళలో ఎర్రజీరలు ఏర్పడినాయి.
అదే సమయంలో స్వర్ణ అతనికేసి చూసింది.
అతను కళ్ళెగరేశాడు.
అంతే. ఆమె అడుగులు తడబడినాయి.
అశ్వని అది చూసి -
"అదేమిటి, భూమి కదులుతోందా ఏమిటే అలా నడుస్తున్నావు?" అంది.
"నీరసంగా ఉండి తూలిపోబోయాను"
"దాన్ని తూలిపోవడం అసరు. తడబాటంటారు."
"అబ్బే. తడబాటు నాకెందుకు?"
"జెన్నీని చూసి నువ్వు భయపడ్డావు."
ఆ మాటతో స్వర్ణకి కళ్ళలో నీరు తిరిగింది. కానీ అశ్వని గమనించకుండా జాగ్రత్తపడింది. జరిగింది ఏమిటో అశ్వనికి చెప్పేయాలనిపించింది. నిజంగా తన నీ విషమ పరిస్థితి నించి కాపాడాలంటే ఆ అవకాశం ఒక్క అశ్వనికి మాత్రమే ఉంది. కానీ ఎలా చెప్పాలి?
"నిజమే నాకు అతన్ని చూస్తే భయం" అంది.
లైబ్రరీలో తనని నొక్కి బెదిరించిన దంతా చెప్పాలి. కానీ సిగ్గు, అవమాన భారంతో ఆమె చెంపలు ఎరుపెక్కాయి.
"నేనుండగా నీ జోలికి రాడులే."
"ఏమో తేలుకి అవసరం లేకపోయినా కుట్టడం సహజలక్షణం. పులికి ఆకలెయ్యకపోయినా ఎదుటి జంతువుని చంపడం అలవాటు. పాముమీద పొరపాటున కాలు వేస్తే...... అది పొరపాటున వేశామని ఊరుకోదు కాటేస్తుంది. యీ జెన్నీగాడు అంతే అశ్వనీ."
అశ్వని నవ్వింది.
"అఫ్ కోర్స్ నువ్వు చెప్పిన లక్షణాలన్నీ వాడిలో ఉన్నాయి. ఎప్పుడో, ఎక్కడో పెద్ద దెబ్బ తింటాడులే. పద" అంది.
