Previous Page Next Page 
కావేరి పేజి 14

    "మీనాన్న వున్నాడా సుబ్బలక్ష్మీ! "అనడిగాడు వినాయకరావు వీధిలోనే నిలబడి!

    "ఆఁ వున్నాడు! మీరులోపలికిరండి!"

    అని ముగ్గు గిన్నెను అక్కడేవుంచి లోపలికి వచ్చింది. వెనుకనే వినాయకరావు వచ్చాడు.

    "కూర్చోండి!" అని మంచం వాల్చి చూపించింది.

    "ముందు మీ నాన్నని పిలువు!" అన్నాడు నిలబడి!

    సుబ్బులు నవ్వుకుంటూలోపలికి వెళ్ళి తల్లితో చెప్పింది వినాయకరావు రావటం విషయం!

    కూతురు రాత్రి చెప్పినట్టే జరుగుతుందేమో? అందుకే తెల్లవారేసరికి ప్రత్యక్షమయ్యాడు? అని సంతోషపడిపోయింది. సుబ్బులు గబగబా పెరటిలోకి వచ్చి సబ్బుతో ముఖంతోముకుని తుడుచుకుని పౌడర్ వ్రాసుకుని బొట్టు పెట్టుకుని కాగుతున్న పాలను గ్లాసులోకి వంచుకుని పంచదార కలుపుకుని వినాయకరావుకి యివ్వాలని తీసుకువచ్చేసరికి; తానుకూర్చోమన్నా కూర్చోకుండా నిలబడే వున్న వినాయకరావుని కోపంగాచూస్తూ- "మాయింట్లో మంచంమీద కూర్చోవటం తప్పనుకున్నారా?" అనడిగింది.

    "అబ్బే! అదేంలేదు! అవతల చాలా పనులున్నవి! అందుకని!"

    "పోనీ ఈ పాలు అయినా తీసుకుంటారా? దానికి కూడా అవతల పనులున్నాయా?" అంటూ గ్లాసు అందించబోయింది.

    "నేను పాలు త్రాగేవచ్చాను."

    "కాదని అన్నానా? మా యింటికి వచ్చారుగా? చుట్టపు మర్యాద! అబ్బా! తీసుకోండి! పాలకి కూడా బెట్టేనా?"

    అని వినాకరావు చెయ్యిపట్టుకుని చేతిలో పాలగ్లాసుని వుంచింది సుబ్బులు!

    సుబ్బులు తీసుకున్న ఆ చొరవకి వినాయకరావు విస్తుపోయాడు. తను స్వతంత్రించటం తప్ప కావేరి ఏనాడూ యిలా తనను తాకటంగానీ; చెయ్యి పట్టుకోవటంగానీ చేయలేదు! ఆ మధ్య కాలువగట్టుమీద తామిద్దరూ మాట్లాడుకుంటూ వస్తూంటే అలిగి ముందుగా వచ్చేసిన సుబ్బులు గుర్తుకువచ్చింది. తాను యిప్పుడు ఈ పాలు త్రాగాకపోతే అంతపనీ చేయగలదన్న భయంతో పాలు త్రాగసాగాడు.

    "పంచదార సరిపోయిందా?" అలవోకగా వినాయకరావు వైపు చూస్తూ అడిగింది.

    "ఆఁ....సరిపోయింది!"

    తననే నిలువెల్లా పరిశీలించుతూ రెప్ప వాల్చకుండా చూస్తున్న సుబ్బులు చూపులకి భయపడిపోయాడు. అంతవరకూ పాలు వేడిగా వున్నాయని నెమ్మదిగా త్రాగితున్న వినాయకరావు గడగడా త్రాగేసి కాలి పోయిన నాలకను గొంతుకను సవరించుకుంటూ గ్లాసుని సుబ్బులుకి యిచ్చేశాడు. అలాగయినా వెళ్ళిపోతుందని!

    అయినా సుబ్బులు వెళ్ళలేదు! అలాగే చూస్తూ నవ్వుతూ నిలబడిపోయింది. ఆ చూపులు, ఆ నవ్వులు ఎంతో యిబ్బంది కరంగా పరిణమించాయి వినాయకరావుకి!

    "మీ నాన్నని పిలువు! నాకు టైం అవుతోంది. నేను వెళ్ళాలి!" అన్నాడు చేతికున్న వాచీని చూసుకుంటూ.

    అలా చెయ్యి తిప్పి చూసుకుంటుంటే వినాయకరావు చేతి వేలిన వున్నవంటి రాయి వున్న ఉంగరం తళుక్ మని మెరిసింది. అలా మెరుస్తూ వుంటే చూడటం అంటే సుబ్బులుకి ఎంతో యిష్టం.

    పై కండువాతో చేతులూ ముఖం తుడుచుకుంటూ అక్కడికి వచ్చాడు వెంకయ్య. వినాయకరావుని చూసి నవ్వుతూ అడిగాడు.

    "ఏమిటి చినబాబూ! యిలా వచ్చావు?"

    "నీ ఎడ్లబండితో అవసరం వచ్చింది మా బండి ఇరుసు విరిగి పోయింది. పెళుసు వుందనుకుంటాను...బస్తీ నుంచి ఎరువులు వేసుకురావాలి! చలమయ్య గారి కొట్లో వున్నాయి. డబ్బు మొన్ననే కట్టేశాను. ఎరువు జల్లితేనే దాళవా పంట చేతికి వచ్చేటట్లు లేదు! ఆ మధ్య చల్లినది  చాలలేదు. పచ్చదనం రాలేదు పైరుకి. వెళ్ళేటప్పుడు కిరాయి లేకపోయినా సరే! నువ్వు ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఎరువులు వేసుకునిరా...! రానూపోనూ కిరాయి నేనే యిచ్చుకుంటాను."

    అని జేబులో నుంచి మడతపెట్టిన తెల్లకాగితం, పది రూపాయలూ తీసి వెంకయ్య చేతిలో వుంచి అన్నాడు.

    "మిగతా డబ్బు ఎరువులు వేసుకుని వచ్చిన తరువతః యిస్తాను. ఇప్పుడు నా దగ్గిరయింతే వుంది వెంకయ్య మామా."

    "మనలో మనకి ఈ కొసర్లు ఏమిటి బాబూ! వుంచండి! తరువాత చూసుకొనవచ్చును..." అని తిరిగి పది రూపాయలు ఇచ్చేశాడు వెంకయ్య.

    అంతా కలసి ఒక్కసారే ఇవ్వవచ్చును లెమ్మని ఆ పదిరూపాయలను జేబులో వుంచుకుని వెనుతిరిగి వచ్చేసి అంతలోనే ఆగాడు.

    "నువ్వు త్వరగా బండి కట్టుకుని వెళ్ళుమామా." అన్నాడు.

    "వెళ్తాను!...వెళతాను! నా పని అయిపోయింది. అన్నం తిని బైలు దేరటమే బాబూ."

    వినాయకరావు వీధిలోకి వచ్చేశాడు. తన వెనుకనుంచీ సుబ్బులు పరిశీలనగా తననే చూస్తూ వున్నదన్న సంగతి తెలియక వడివడిగా నడిచి ముందుకి వెళ్ళిపోతున్నాడు.
       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS