"మా బావ బస్తీలో సినిమా చూసి వచ్చాడట ఉదయం ఆట! కథ చెప్పుతుంటే అలా వచ్చేశాను. ఏమీ అనుకోకు!"
"మీరు మీరూ ఒకటేగా? నేనేమనుకుంటాను?....ఎప్పటికయినా వంటరిగా వుండవలసిన దాన్ని నేనేగా!" బుంగమూతి పెట్టింది.
"అలా అనుకోకే సుబ్బులూ! ఈ ఒక్కసారికీ క్షమించు! అసలు సమయానికి ఈ బావ ఒకడు! ఈ కాలువగట్టుమీద తనకోసం కాపలా వుండకపోతే ఆ చెప్పులు యిటికే తీసుకొచ్చి యివ్వకూడదూ? ఏదో బావ ముచ్చట! నిన్ను మరిచిపోయికాదే!"
కావేరి బ్రతిమాలుతున్న కొలదీ సుబ్బులు తన బుంగమూతిని విప్పలేదు. యింకా నడకవేగం హెచ్చించింది.
అలాగే చూస్తూ వుండిపోయింది కావేరి! దగ్గిరకు వచ్చిన వినాయకం సుబ్బులుని చూస్తూ అన్నాడు.
"పోనియే దానినీ!....దానికంత బెట్టు ఏమిటి? నువ్వు రాలేవా? వెళ్ళలేవా స్కూలుకి! అంతకీ నీకు జత లేకపోతే రోజూ నా సైకిల్మీద నిన్ను స్కూలుకి తీసుకెళ్ళి తీసుకువస్తాను!"
"అదికాదు బావా!....అది వెళ్ళి మా అమ్మకి నామీద చాడీలు చెప్పుతుంది. అమ్మ నా మీద కేకలు వేస్తుంది. తిడుతుంది. స్కూలు మానిపించి వేస్తుంది! నా మాట నమ్మదు అమ్మ!"
"ఎందుకని?"
"నాకు సినిమాపిచ్చివుందికదా? సినిమా పుస్తకాలు కొని చదువుతానని! పోయిన సంవత్సరం యూనివర్సిడేకి మా స్కూలునాటికలో వేషం వేసి నటించానని అమ్మ తెగ తిట్టేసింది!"
"అత్తయ్యకి నేను చెప్పుతానుగా! నువ్వేమీ భయపడకు ఆ సుబ్బులుకి! దానికి ముట్టెపొగరు చాలావుంది. తీసే మొగుడు రావాలి! అప్పుడుగానీ దానిపొగరు అణగదు! పదపద!"
వినాయకరావు ఎంతచెప్పినా కావేరి తన మనసుని స్వస్తత పర్చుకోలేక పోయింది. అలాగే మాన్పడి నిలబడి వెళుతున్న సుబ్బులునేచూస్తూ వుండిపోయింది.
"సైకిల్ ఎక్కు! ఆ సుబ్బులుకంటే ముదే మనం వెళ్ళగలం!"
"వద్దులేబావా! ఎవరయినా చూస్తే ఏమయినా అనుకుంటారు. ఇది పల్లెటూరు! మనిద్దరం అలా వెళుతుంటే వింతగా చూస్తారు. చెవులుకొరుక్కుంటారు! నడిచే వెళదాములే!" అంది.
వినాయకరావు ఇంకా కావేరిని బలవంతపెట్టలేదు. కావేరి సైకిల్ వెనుక సీటుమీద కూర్చుని తనను గట్టిగా పట్టుకోవాలనిమనసులో వుండేది. కాని ఆ కోరిక తీరేది కనిపించలేదు ఇప్పట్లో!
5
"ఆ కావేరీకి సినిమాపిచ్చి ఎక్కువ! అది ఆ పొట్టి వినాయకరావుని చస్తే చేసుకోదు! ఎప్పుడువెళ్ళి మద్రాసులో వాలిపోవాలా? ఎప్పుడు సినిమాల్లో నటించాలా అన్నదే దాని కోరిక!" అంది సుబ్బులు! ఆరోజు ఆదివారం కావటం వలన తలంటుకుని ఎండలో నిలబడి తలవెంట్రుకలను ఆరబెట్టుకుంటూ.
బియ్యం చెరుగుతున్న సీతమ్మ ఆశ్చర్యంగా కూతురివైపు చూసింది నిజమేనా? అన్నట్టుగా!
"అవునమ్మా! దాని టక్కులు టిక్కులు నువ్వు చూడలేదుగానీ! ఇప్పుడు అది స్కూలులో వేయబోయే నాటకంలో వేషం వేయబోతోంది. మగవాళ్ళతో కలిసి తిరగాలన్నా మాట్లాడాలన్నా దానికి తెగ సరదా!"
"నాటకాల్లో అయినింటి ఆడపిల్ల రంగులు పూసుకుని వేషం వేయటం ఏమిటి?" చెరగటం ఆపి విస్తుబోయింది సీతమ్మ.
"దానికి పెద్ద సినిమాతార అయిపోవాలన్న కోరిక! ఇప్పటినుంచే అలా నాటకాలలో వేస్తే అనుభవంలోకి వస్తుందట!"
"ఎంత చోద్యం!" బుగ్గలు నొక్కుకుంది.
"స్నో, పౌడర్ రాస్తుంది....ఎత్తుచేప్పులు వేస్తుంది...రోజుకో కొత్తరకం లంగా, ఓణీ వేసుకువస్తుంది చూశావా అమ్మా!"
"ఆఁచూశాను! వాళ్లకేం తక్కువని? పదిహేనువేలు కట్నం యిచ్చి పెద్దకూతురికి పెళ్ళిచేశాడు వాళ్ళనాన్న పరంధామయ్య! మేనల్లుడు ఎలాగూ వున్నాడుగా! కావేరీని యిచ్చి చేస్తాడు! కలవారికేమిటి బాధ? అన్ని హంగులూవుండి!" తన లేమితనాన్ని మనసులో వుంచుకుని పైకి అనలేక అలాఅంది సీతమ్మ.
"కావేరి చస్తే చేసుకోదు ఆ మరుగుజ్జువాడిని."
"ఛా! వాగకు! ఎవరయినా వింటే మన నోళ్ళల్లో యింత గడ్డిపెడతారు."
సుబ్బులు నెమ్మదిగావచ్చి తల్లి చెవిలో గుసగుసలాడింది ఎంతో సేపు! వింటుంటే సీతమ్మ కళ్ళు పెద్దవి అవుతున్నాయి తగ్గుతున్నవి! కూతురు చెప్పేది నమ్మలేకపోతున్నట్లు ముఖభావాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఆ తరువాత యివతలికి వచ్చిఅంది.
"నేను చెప్పినట్టుకాకపోతే నా చెవి తెగ్గోయించుకుంటాను. ఎందుకయినా మంచిది నాన్నకి చెప్పి వినాయకరావుని అడిగించు! ఓ మాట వేసివుంచితే మనకే ఎప్పటికయినా లాభించుతుంది. నా మాట నమ్ము!"
"అలాగే! అలాగే!" అప్పటికి కూతురుమాటలు మీద గురిఏర్పడింది సీతమ్మకి! ఏదో ఆ నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకోబట్టి యిన్ని తెలివితేటలు అబ్బాయి! అసలు తనకే ఈ ఆలోచన రానేలేదు! అసలు ఆస్తులు అంతరాలలోకూడా ఎంతోతేడా వుంది. అలాంటప్పుడు ఊహకికూడా తావు ఎక్కడిది? అయినా ప్రయత్నించటంలో తప్పేమిటి?
ఆ రాత్రికి కిరాయితోలి ఆలస్యంగా వచ్చిన భర్తకి అన్నంవడ్డించి తింటుంటే కూతురు అభిప్రాయాలేకాదు, తన మనసులోనూ కలిగిన ఆలోచనలన్నీ వివరించింది సీతమ్మ.
"నిజమంటావా?"
"మన సుబ్బులు అబద్దం చెపుతుందా? నేను అబద్దం చెపుతానా? అది సినిమాల్లో చేరుతుందట! ఈ వినాయకాన్ని ఎందుకు చేసుకుంటుంది?"
"అవునండీ!"
"సినిమాల్లో యిక్కడవుండి ఎలా చేరుతుందట?" అర్ధంకాక అడిగాడు వెంకయ్య తినడం ఆపి.
"అదేమన్నా బ్రహ్మ విద్యా ఏమిటి? మద్రాసు పారిపోతుంది సినిమాల్లో వేషాలు వేస్తుంది. కావాలని అనుకున్న వాళ్ళకి తెగింపు ఎక్కువ!" అంతవరకూ చాటుగావుండి తల్లిదండ్రుల మాటలు వింటున్న సుబ్బులుకి "మద్రాసు పారిపోతుంది!" అన్న తల్లి మాటలు సుబ్బులు మీద బాగా పనిచేసింది!" పారిపోగల ధైర్యం వుండదేమో? కాని ధైర్యం కలిగించితే ఆ పనిఅదే చేస్తుంది! అన్న కొత్త ఆలోచన ఉద్భవించింది సుబ్బులులో.
ఆ రాత్రంతా ఆలోచనలతోనే గడిపింది సుబ్బులు! నిద్రపోలేదు. తొలికోడి కూత విన్నది. తనేదో ప్రపంచాన్ని జయించిన వీరుడులాగా నూతనోత్తేజం వచ్చేసింది. తానెంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టుగా వుంది సుబ్బులుకి! తల్లిలేచి పనులు చేసుకుంటున్నా లేవలేకపోయింది. రోజూ అయితే తల్లి చేసేపనుల్లో సహాయపడేది. వీధిలోనూ యింటిముందు ముగ్గులు పెట్టిగాని మరోపని చేసేది కాదు! ఆరోజు ముగ్గులు పెట్టటానికి తల్లి లేపగా అప్పుడే లేచివచ్చి ముగ్గుగిన్నె తీసుకుని వీధి గుమ్మంలోకి వచ్చేసరికి వినాయకరావు హడావుడిగా తమ యింటివైపుకే రావటం చూసి నిలబడిపోయింది సుబ్బులు.
