Previous Page Next Page 
కావేరి పేజి 15

                                                                            6

    ఎరువు సంచులు బండిమీద నుంచి దించటం అయినా తరువాత బండి దగ్గిరకు వచ్చి  రెండు పదుల కాగితాలు తీసి వెంకయ్యకి ఇచ్చాడు వినాయకరావు.

    కాని వెంకయ్య తీసుకోలేదు ఆశ్చర్యం కలిగింది వినాయకరావుకి. ఠంచనుగా బండి కిరాయి తీసుకునేవాడు. ఒకవేళ డబ్బులేకపోయినా! చిల్లరలేక పోయినా, రేపు రమ్మనమని చెప్పినా ఊరుకునేవాడు కాదు. "నాకెంతో అవసరం! ఇస్తేనే గాని వీలు లేదనేవాడు!" లేదా తను చిల్లరే తెచ్చియిస్తాననేవాడు. రేపు ఇస్తానంటే సరిగ్గా ఆ టైంకి వచ్చి కూర్చునేవాడు. అలాంటి వెంకయ్య కిరాయి డబ్బులు తీసుకోకపోవటం ఆశ్చర్యం కలిగించింది.

    "మనతో మనకేటి బాబూ! వుంచండి." అన్నాడు చిన్నగా నవ్వుతూ...ఈ ధ్వంధార్ధం మరింత ఆశ్చర్యం కలిగించింది వినాయకరావుకి.

    "అదేమిటి మామయ్యా!" అన్నాడు తేరుకుని.

    "నువ్వు మామయ్యా! అని అన్నావు కాబట్టి నామనసులోని మాట నీకు చెపుతున్నాను చినబాబూ. నేను ఎప్పటికీ నీ మామగానే వుండి పోవాలనుకుంటున్నాను. నువ్వు సుబ్బులుని ఇష్టపడితే."

    వినాయకరావుకి పట్టరాని నవ్వు వచ్చింది. ఎంత ఆశ? తన మేనమామ కూతురు కావేరీ కంటే సుబ్బులు దగ్గిరచుట్టమా? ఏమిటో ఈ పిచ్చి ఆలోచన? తను తెగేసి చెప్పటం దేనికి? తనతల్లినే అడగమంటేపోతుంది. నాలుగు చివాట్లు వేసి పంపితేనే గాని తెలిసిరాదు...ఆ రోజున సుబ్బులు ఎంత రోషంగా తమను దాటుకుని విసవిసా నడుచుకుంటూ వెళ్ళింది? అలాంటి దానినా తను చేసుకోవటం? కావేరీ పుట్టినప్పటినుంచీ తన పెళ్ళాం అన్నారు ఈ గ్రామ ప్రజలు! అలాంటి కావేరీని కాదని సుబ్బులుని ఎలా చేసుకుంటాడు తను.

    "నేనేం చెప్పేది మామయ్యా? పెద్దది, అమ్మ వున్నదిగా? అమ్మని అడుగు? అమ్మ ఇష్టపడితే నాదేముంది."

    తనకి ఆ విషయం తోచనందుకు బాధపడ్డాడు. తన భార్య అన్నీ చెప్పింది గాని ఈ విషయం చెప్పలేదు. అతగాడినే అడుగు అంది. అతను వప్పుకుంటే కామాక్షమ్మ ఎంత? అన్నది. వినాయకరావు అంగీకరించాడు కాబట్టి తను నిర్భయంగా కామాక్షమ్మను అడగవచ్చును. అనుకున్నాడు.

    "మీ అమ్మతో చెప్పు చినబాబూ! నేను రాత్రికి వస్తాను....చిరు చలివుండగానే పెళ్ళి అయిపోతే ప్రాణానికి తెరిపిగా వుంటుంది!" అన్నాడు వెంకయ్య.

    "అలాగే మామయ్యా!"

    ఎడ్లను అదిలించే సరికి బండి ముందుకి సాగుతుంటే వెనుకగా నడిచి వెళ్ళిపోయాడు వెంకయ్య.

    బండి వెళ్ళిన తరువాత పెరటి వైపు గేటు వేసి లోపలికి వచ్చిన కొడుకుని చూసి కామాక్షమ్మ అడిగింది.

    "వెంకయ్యన్న అంతసేపు మాట్లాడుతూ నిలబడ్డాడు? ఏమిటీ వ్యవహారం?"

    "వలల సుబ్బులుని నేను పెళ్ళి చేసుకోవాలట...!

    "ఆఁ.."

    ముందు ఆశ్చర్యపోయినా ఆ తరువాత తేరుకుని నెమ్మదిగా అడిగింది.

    "నువ్వేమన్నావు?"

    "ఏమంటాను?...మా అమ్మని అడగమన్నాను!"

    'అలా అనటం ఏమిటి నువ్వు?"

    "నిన్ను అడిగితే నాలుగు చివాట్లు పెట్టి పంపించుతావని! నేను పెడితే బాగోదు కదా? అందుకని అలా అన్నాను."

    "మంచిపని చేశావు....రానివ్వు! ఇంత బుద్దీ గడ్డీ పెట్టి పంపించుతాను!" కోపంగా అంది.

    "బాగా పెట్టి పంపించు అమ్మా! మేనమామ కూతురు వుంది. చిన్నప్పటి నుంచీ అనుకుంటున్నామని తెలుసు కదా? మధ్యలో తన కూతురు సుబ్బలక్ష్మిని చేసుకోమని అడగటం ఏమిటి? నాకయితే ఎంతో కోపం వచ్చింది. పైగా చుట్టరికం కలిసినట్లుగా కిరాయి డబ్బు ఇవ్వబోతే "మనలో మనకేమిటి" అంటూ తీసుకోకుండా వెళ్ళిపోయాడు."

    "ఇలా యివ్వు ఆ డబ్బు! ఈసారి వస్తే కిరాయి డబ్బు తన మొహాన కొడతాను."

    జేబులోని డబ్బు తీసి తల్లికి ఇచ్చాడు. కామాక్షమ్మ రొంటిన దోపుకున్నది. ఆ రాత్రి తల్లీ కొడుకు కూర్చుని భోజనం చేశారు. బజారులోకి వెళ్ళబోతున్న కొడుకుని ఆపుచేసింది.

    "నువ్వింటిలోనే వుండు! వెంకయ్యన్న వస్తాడేమో? విందువు గానీ."

    తల్లి మాట కాదనలేక వచ్చి తన గదిలో పడుకున్నాడు. వీధి తలుపులు తెరిచి నట్లయి అటూ చూసింది కామాక్షమ్మ. లైటుని ఎత్తిపెట్టి చూసింది నల్లటి ఆకారానికి తెల్లని పంచే బనీను వేసుకుని కాలుతున్న బీదీని బైటనే పారవేసి లోపలికి వస్తున్న వెంకయ్యని ఆయన భార్య సీతమ్మని చూసి అవాక్కయిపోయింది ఇద్దరూ కలిసి వస్తున్నారంటే కొడుకు చెప్పిన దాన్ని గురించేనన్న సంగతి అర్ధమయిపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే కోపం, ఆవేశం కలిగాయి కామాక్షమ్మకి! ముందుగా తానయి బైటపడకూడదని తనను తాను సమాధానపర్చుకున్నది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS