Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 99


    "కొండల్రావుని నా కొకసారి కన్పించమని చెప్తావా?" ఆమె చూపులు తీక్షణంగా వున్నాయి.
    "కొండల్రా వెందుకమ్మా!"
    "వాడితో పనుంది!"
    "వాడితో రిస్క్ కూడా వుంది."
    "మరి నువ్వు చేస్తావా?"
    "ఏమిటదీ?"
    "రామనాథ బాబును వేసెయ్యాలి!"
    చింత కొమ్మమీద గొడ్డలిదెబ్బ గుర్తొచ్చింది రామదాసుకు.
    "ఎటు తిరిగి గడ్డం పెంచావ్! అంతా ఒకేసారి కొట్టుకుపోతుంది."
    వరూధిని ఇంకా ఎలా నవ్వగలుగుతుంది? రామదాసు ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు.
    "అది అంత తేలిగ్గాదు."
    "అని ఎవరన్నారూ? అంత తేలికయితే నీదాకా ఎందుకూ?" వరూథిని కంఠం 'ఖంగ్'న మోగింది.
    రామదాసు తత్తరపోయాడు.
    ఆమెకేసి చూస్తూ "ఆడది; శక్తి!" అంటారు ఇందుకే కాబోలు అనుకున్నాడు.
    "ఏం? మాట్లాడవేం? పదిరోజుల్లో పని అయిపోవాలి."
    "పదివేలవుతుంది."
    "అలాగే పని పూర్తి చెయ్!"
    "నా ఒక్కడితో ఏమవుతుంది? ఇద్దరు ముగ్గుర్నన్నా పట్టుకోవాలి. వాళ్ళు ముందే అడుగుతారు."
    "అంతా ముందే ఎలా ఇస్తాను?"
    "అంతా అవసరంలేదు. ముందు సగం ఇవ్వండి. పూర్తయాక మిగతా సగం."
    వరూధిని లేచి పడక గదిలోకి వెళ్ళింది. రామదాసుకు ఆలోచించే వ్యవధి దొరికింది.
    రామనాథబాబును ఖతం చెయ్యటం మాటలా? కొండల్రావు కళ్ళలో కదిలాడు. వాడికి వందిస్తే చాలు ఏ పనయినా చేస్తాడు. ఒక వెయ్యి పారేస్తే రామనాథబాబు తల నడిరోడ్డుమీద నరుకుతాడు. వాడికీ రామనాథబాబంటే కోపమే! ఓరకంగా రామనాథబాబు తనకూ శత్రువే. ఆ థియేటరు వరూథినమ్మ కింద ఉంటే ఈపాటికి తను మేనేజరయేవాడు. ఏడాదికి మూడువేలు జీతం, మూడువేలు బ్లాకూ దొరికేది. ఊళ్ళు ఊళ్ళు పట్టుకు తిరగలేక చస్తున్నాడు తను.
    "ఇవిగో!"కర్చీఫులో కట్టినమూట రామదాసు ముందు పడేసింది.
    "పెద్ద గొలుసు పదిసవర్లు. అది కాసులపేరు ఇరవైరెండు సవర్లు, గజ్జెల వడ్డాణం పద్దెనిమిది సవర్లు, జడ బిళ్ళా, జడకుప్పెలూ, ఆ నాలుగు జతల వంకీ గాజులూ చేరి పది సవర్లకు పైగా వుంటాయ్ మొత్తం ఏభై సవర్లబంగారం.... అమ్మితే నువ్వడిగిందానికంటే మూడింతలు ఎక్కువే వస్తుంది".
    "నగలన్నీ అమ్మేస్తారా?"
    "అవన్నీ పాతకాలం నాటివేలే! వాడేవీ పెట్టేవీ కాదు. రవ్వల దుద్దులూ, రాళ్ళ నెక్లెసూ, సన్న గొలుసూ, నా చేతి గాజులూ కలిపితే ఇంకా పది వేలొస్తాయి. పనయిన తెల్లవారి రా. నీ డబ్బు నీ చేతుల్లో పోస్తాను."
    "అబ్బే అందుకనలేదు నేను. నగకట్టు అమ్మతున్నారే అని బాధ కొద్దీ అన్నాను." రామదాసు తప్పుకొన్నాడు.
    రామదాసు అసాధ్యుడు. ఎంత తెలివిగా మాటమార్చాడూ? అనుకొన్నది వరూధిని అతన్ని చూస్తూ.
    "ఇవి నే నమ్మితే ముందే పట్టుపడతాను. డేంజర్. మీ నగలు మీరే అమ్మితే మంచిది కాష్ ఇవ్వండి."
    కేటు రామదాసు ముందాలోచన ఉన్నవాడు. పని చేయగల సామర్ధ్యం ఉన్నవాడే? వరూధిని ధైర్యం కలిగింది.
    "అనుభవం బాగానే వున్నట్టుందే రామదాసూ? ఇంతకుముందేదన్నా.....?" ఓరగా చూస్తూ అన్నది వరూథిని.
    రామదాసు గుబురు గడ్డంలోనుంచి పెదవులు కదలడం కన్పించింది వరూథినికి.
    రామదాసు లేచాడు.
    "మళ్ళీ ఎప్పుడు కన్పించమంటారు?"
    "ఎప్పుడోనా? ఆలస్యం అమృతం విషం అంటారు. రాత్రికి రా!"
    వెళ్దామన్న ప్రయత్నంలో రెండడుగులు వేసి ఆగిపోయాడు. రామదాసు.    
    "అంతా చేతులు దాటిపోయాక బాబును సఫా చేస్తే మీకొచ్చేదేమిటి?" వరూధిని ముఖంలోకి చూసి ఎందుకు అన్నానా అని నాలుక కొరుక్కున్నాడు.
    "అప్పుడే ఏమయిందీ? ముందు లేదూ ముసళ్ళపండగ?"
    ఆహారంకోసం బోనులో అలజడిగా తిరిగే పులి గుర్తొచ్చింది రామదాసుకు.
    "వస్తానమ్మా! రాత్రి రెండో ఆట బుకింగ్ క్లోజ్ అయ్యాక కనిపిస్తాను. పొద్దుపోతుంది ఫర్వాలేదుగా?"
    "అలాగే!" వరూధిని రామదాసును వీధి వాకిలిదాకా సాగనంపింది.
    బీరువా తెరిచి నగలపెట్టెలో వున్న రాళ్ళనెక్లెసూ, నాలుగు ఉంగరాలూ, తెగిపోయిన బంగారపు గొలుసుముక్కలూ తీసి మిగతా నగల్లో కలిపి మూటగట్టింది. పొయ్యిమీద వున్న అన్నం కాటుకంపు రాగా వరూథిని వంటగదికేసి పరుగెత్తింది. అన్నంగిన్నె మూతతీసి కాటువాసనతో పొగలు చిమ్ముతున్న గిన్నెలో నీళ్ళు పోసింది. అన్నంగిన్నె అటూ ఇటూ కదిలిస్తూ కూర్చుంది.
    "ఎవరా గడ్డమోడు మనింటో నుంచి పోతున్నాడూ?" వరూథిని గిన్నె పొయ్యిమీద వదిలి వెనక్కుతిరిగి చూసింది. భర్త నిలబడి వున్నాడు.
    "నీతో అతను మాట్లాడలేదా?"
    "నన్ను  చూడలేదు. నేను ఇటునుంచొచ్చా ఆ గడ్డమాయన అటునుంచి వెళ్ళిపోయాడు."
    "రామదాసు!"
    "ఏ రామదాసు?"
    "మన హాల్లో పనిచెయ్యలా? ఆ రామదాసే. గడ్డం పెంచాడు."
    "ఓహో మన రామదాసా? పడమటిల్లు తలుపు తీసుంటేను?"
    "ఆఁ" కళ్ళు పెద్దవి చేసింది వరూథిని.
    "బీరువా తలుపులు తెరిచుంటే అందుకడిగా! దొంగాడేమన్నా జొరబడ్డాడేమోనని?"
    "అమ్మో! ఏం జాగ్రత్త! ఏం జాగ్రత్త" తమాషాగా అంది వరూధిని.
    "వడ్డించమంటారా?" అడిగింది వరూధిని.
    వెంకటపతికి కొత్తగానూ, వింతగానూ విన్పించింది.
    "పెట్టు! పెట్టు!" అని పదిసార్లు అంటేగాని అన్నం పెట్టని వరూథిని పదిగాకముందే అన్నం పెడతానంటోంది. అది అసలు తనకు పెట్టింది ఎన్నిసార్లు? వంటమనిషి ఉన్నప్పుడు అదే పెట్టేది. ఆవిడ వెళ్ళాక తనే ఎక్కువసార్లు పెట్టుకొని తినేవాడు. అయితే కేసు పోయిన దగ్గర్నుంచీ తనంటే ఎదురెదురుగా ఉంటోంది. గౌరవం చూపిస్తోంది. ఆ రోజు వ్యాజ్యం పోయిన రోజు వరూధిని ఊళ్ళోలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం చేసి వుండేవాడో తనకే తెలియదు. ఎంత ఆస్తి నాశనం చేసింది? ఇంకా ఇప్పుడేముంది? తను తినటానికీ, అది పెట్టటానికీ?
    "ఏమిటండీ మీ అలోచనా మీరూనూ?"
    "ఇంకేముంది ఆలోచించటానికి అంతా అయిపోయిందిగా?"
    "వడ్డిస్తున్నా! ముందు మీరు కళ్ళు కడుక్కురండి." పళ్ళెం, గ్లాసూ తీసి వంటింట్లో పీట వాల్చింది.
    "ఏమిటంటా తొందర? ఎక్కడికి పోవాలంట? ఇంకేం చేస్తావు పెత్తనాలు? అంతా అయిపోయిందిగా?"
    తనూ గట్టిగానే మాట్లాడగలడు. తనూ తెలివిగానే చురకలు వేయగలడు. దాని నోటికి వెరిచి ఊరుకున్నాడు ఇంతకాలం.
    భార్య తగ్గినకొద్దీ వెంకటపతి బుర్ర చురుగ్గా పని చెయ్యసాగింది.
    "పెత్తనాలా పాడా, తొందరగా తినండి. షరాబు బజారుకు వెళ్ళి రావాలి"    
    "నగలు కొంటావా? ఇంకేం కొంటావ్ ఆ రోజులు పోయినైగా?" అంటూ గబగబా అన్నం కలుపుకొన్నాడు.
    "నగలు అమ్ముదామని!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS