ఆ బొమ్మ.... ఆ బొమ్మ హైదరాబాద్ లో కొని కార్లో కట్టింది తనే! తన కా బొమ్మంటే ఎంతో ఇష్టం. ఆ బొమ్మ తనను చూసి గుర్తు పట్టింది. తనను పిలుస్తోంది. తనను చూసి నవ్వుతోంది.
"ఎప్పుడూ నువ్వు ఆ బొమ్మకేసి చూస్తావ్!" రామనాథబాబు అడిగాడు.
"ఇంకేం నువ్వు నీ బొమ్మకేసి చూసుకో!"
రామనాథబాబు తన కేసి చూశాడు. భుజాలకిందగా చేతులు పెనవేసి తనను ఒళ్ళోకి లాక్కున్నాడు. ఉక్కిరిబిక్కిరి చేసి పారేశాడు.
"వదలండి! పట్టపగలు. నడిరోడ్డుమీద ఇదేమిటి? ముందు డ్రైవరున్నాడన్నది కూడా మర్చిపోయారా ఏం?"
హైదరాబాద్ విజయవాడ రోడ్డుమీద యంబాసిడర్ కారు అరవై మైళ్ళ వేగంతో పోతూంది. నిముషానికి ఒక మైలు రాయి. జరిగిపోయిన రాళ్ళూ, గడిచిపోయిన కాలమూ తలచుకొంటూ వరూధిని రిక్షా ఇల్లు దాటి పోవటం కూడా గమనించలేదు.
"ఏయ్! రిక్షా! ఆపు! వెనక్కు తిప్పు! ఇల్లు దాటివచ్చేశాం!"
"మీరు చెప్పకపోతే నా కెట్టా గుర్తు? మరి సూత్తా కూర్చున్నారేం?"
"సరే! వాగబాక రిక్షా తిప్పి పోనియ్."
రిక్షా ఇంటిముందుకొచ్చి ఆగింది. వరూధిని రిక్షా దిగి మీద గుమ్మం మెట్లెక్కింది. రిక్షావాడు సూట్ కేసు మెట్లమీద దించి నిలబడ్డాడు. వాడ్ని చురచుర చూసి ఓ పావలా కలిపి వాడి చేతిలో విసిరేసింది.
తలుపు తడుతున్న వరూథిని చేతికి తాళం తగిలింది.
"హారి భగవంతుడా? ఎక్కడ చచ్చాడో?" చివరిమాట భర్తను ఉద్దేశించే అన్నది తను. కాని భగవంతుడు వింటే తనను ఉద్దేశించే అన్నదనుకొంటాడు. విన్నాడో? లేదో? మరి! ఆ భగవంతుడు.
వింటే మాత్రం ఏం కొంప మునిగిపోయింది? తనను ఇంతకంటే ఏం చేస్తాడు?
వీధి వాకిలి మెట్లమీద తాళం పెట్టిన తలుపుముందు కూలబడిన వరూధిని దేవుడితో తగాదాపడింది.
45
"రామనాథబాబా? ఎక్కడున్నాడూ?" అన్నాడు రామదాసు.
రేపు పొద్దున్నే వస్తానన్న రామదాసు మూడోరోజు వరూధిని ఇంటికొచ్చి కూర్చున్నాడు.
"మొన్న ఊళ్ళోనే ఉన్నాడన్నావుగా?" అన్నది వరూధిని.
"నిన్న కూడా వున్నాడమ్మా! పొద్దుట నేను వచ్చేముందే బయలుదేరి ఊరి కెళ్ళిపోయాడు."
"దాన్ని వెంటపెట్టుకొనేనా?"
"దేన్నమ్మా?" రామదాసు నోరు తెరిచి అలానే వుంచాడు.
"కోలవెన్ను షావుకారిగారి కోడల్ని?"
"ఆమె ఇక్కడెక్కడుంది? హైదరాబాదులోనే వుందటగా హాలు కట్టిస్తూ?"
"మరి నిన్న హాలు దగ్గరున్న అమ్మగారెవరంటా?"
"ఆమేనమ్మా! శ్యామలాంబగారు. రామనాథబాబుగారి భార్య."
"మళ్ళీ మొగుడూ పెళ్ళాం కలిశారన్నమాట?" అని పెదవి నొక్కుకుంటూ ఆలోచనలో పడింది వరూధిని.
"అంతా పై పై నాటకం! మొగుడూ పెళ్ళాలు బాగానే వుంటారు"
"మరి రామనాథబాబు అలా మాట్లాడతాడేం?"
"మాట్లాడడు మరీ? తడిగుడ్డలతో గొంతులు కోసే రకం!"
వరూథినికి కళ్ళెర్రబడ్డాయి.
ఎంత మోసం? ఎంత కుట్ర? రామనాథబాబును ఏం చేసినా పాపం లేదు!
"హైదరాబాదే వెళ్ళాడేమో? దాన్ని కూడా ముంచేస్తాడు."
"కాదమ్మా! విశాఖపట్నం వెళ్ళాడు. అక్కడేదో హాలు అమ్మకాని కొచ్చిందంట. కొనాలనే ఉద్దేశంతోనే వెళ్ళాడు."
"అక్కడ దేన్ని పట్టుకొన్నాడో?"
"అక్కడ ఈయన పప్పులేం ఉడకవ్. ఇలనాటి బాబులు చాలామంది ఉన్నారు"
వరూధిని సరిగా వినలేదు.
"ఏమిటి రామదాసూ నువ్వంటున్నది?"
"ఇట్టాంటి బాబులు ప్రతి టౌన్లోనూ తయారయ్యారమ్మా!"
ఆఁ! వరూధిని కళ్ళు రెపరెపలాడాయి."
అంతలోనే ఆమె ముఖం వివర్ణమయింది.
"సంవత్సరంగా మన ఏ క్లాసు టౌన్లన్నీ చూస్తూ తిరుగుతున్నాగా? షోకిలాగాళ్ళంతా సినిమా హల్సులో చేరతారు. ఆఫీసు ముందూ, టెర్రస్ మీద కుర్చీలు వేసుకొని వచ్చేపోయే ఆడవాళ్ళను చూస్తూ కూర్చుంటారు. వాళ్ళకదే పనయిపోయింది. పల్లెటూళ్ళనుంచి, జబ్బులన్నీ, పిల్లల చదువులనీ వంకపెట్టుకొని, స్థితిగల కుటుంబాల్లోనుంచి బస్తీలకు రావడం, సినిమాలనీ పాడనీ మోజలుపడటం చివరికి ఇట్టాంటి వాళ్ళ చేతుల్ల పడటం. కుటుంబాలకు కుటుంబాలే నాశనం అయిపోతున్నాయిగదమ్మా! మన టౌన్లో సగంమంది డాక్టర్ల ప్రాక్టీసేమిటను కున్నావ్?"
"నర్సింగ్ హోంలు కట్టడం. గదులద్ధెకివ్వటం. గుండెజబ్బూ, నీరసమూ, ఆయసమూ అనిచెప్పి ఏళ్ల కొద్దీ ఉంచి టానిక్కులూ, మందులూ ఇవ్వటం వేలువేలు గుంజటమూను. అదేపని. ఛ! ఛ! ఏం నర్సింగ్ హోంలో? ఏం సినిమా హాళ్ళో? ఊళ్ళు ఊళ్ళు నాశనం అయిపోతున్నాయ్. రామ! రామ! ఏ బస్తీ చూసినా?విజయవాడ-గుడివాడ-బందరు- గుంటూరు-తెనాలి-ఏలూరు....ఇంతెందుకు? ఎక్కడ రెండు సినిమాహాళ్ళుంటే అక్కడల్లా నర్సింగ్ హోంలు వెలుస్తున్నాయి. నాలుగు నర్సింగ్ హోంలు వుంటే... అక్కడ రెండు సినిమాహాళ్ళు లేస్తున్నాయి. అబ్బే ఇంకా ఏంబాగుపడతా...."
వరూధిని లేవడం చూసి ఆగిపోయాడు రామదాసూ. ఆమె ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు. రామదాసు కేసి చూడలేక పోతూంది.
"ఉండు! కాఫీ తెస్తాను రామదాసూ!" అంటూ లోపల కెళ్ళింది.
చన్నీళ్ళతో ముఖం కడుక్కుని కాఫీకలుపుతూ అనుకొంది వరూధిని.
ఇన్నాళ్ళూ రామదాసు అంటే తను ఏమో అనుకొంది. అసాధ్యుడు. అతడు చెప్పిందంతా నిజమే. అందులో ఆవగింజంత అబద్దం లేదు. రిప్రజెంటేటివ్ గా ప్రతి టౌనూ తిరిగి హ్కోసిన వాడు. ఆ షావుకారుగారి కోడలంతేగా? ఇట్టాటి రకం చాలా మంది ఉంటారు.
తను? మరి తనూ? తనూ అంతేగా?
గుండెలో దబ్బనాలు గుచ్చినట్టున్నాయి. రామదాసు మాటలు. దీనికంతా కారణం ఆ రామనాథబాబే! వాడ్ని ప్రాణాలతో వదలకూడదు!
వరూధిని కాఫీకప్పు రామదాసుకు అందించి మళ్ళీ ఎదురుగా కూర్చుంది.
"మీరే తెచ్చారు? వంటమనిషిలేదేమో?" కాఫీ తాగుతూ అన్నాడు రామదాసు.
కొండల్రావు ఏమయ్యాడయ్యా రామదాసూ?
వరూధినికి అకస్మాత్తుగా కొండల్రావెందుకు గుర్తొచ్చాడో రామదాసుకు అర్ధం కాలేదు. ఓ క్షణం ఆలోచించి చెప్పాడు.
"వాడా! పూర్తిగా చెడిపోయాడమ్మా! అసలే వాడున్న పేటంతా రౌడీలే! వాళ్ళతో చేరాడు. పనీపాటాలేదు. ఎవడు తాగబోయించి వందరూపాయలిస్తే వాడు చెప్పినవాడ్ని వెళ్ళి తన్నొస్తాడు. అట్లావుంది వాడిపని. వాడిప్పుడు మన టౌన్లోనే లేడు. బెజవాడలో పెద్ద మొనగాడిలా కాలరెత్తుకు తిరుగుతున్నాడు. అప్పటికీ ఓసారి చెప్పా ఏమిటిరా ఇదని? వాడు...."
"రామదాసూ?" అతడిమాటలకు అడ్డొచ్చి అన్నది వరూధిని.
"నువ్వు గడ్డం ఎందుకు పెంచావ్?" కొండల్రావు మీదనుంచి సంభాషణ తనగడ్డం మీదకు తిరిగేసరికి రామదాసు కొంచెం గాబరాపడ్డాడు.
"చెప్పాగా తిరుపతి మొక్కని?"
"ఏం పాపం చేశావ్?"
"మనిషన్న తరవాత ఏ పాపమో చెయ్యకుండా వుంటాడా?" మాటజారి, జారినందుకు బాధపడ్డాడు రామదాసు.
"వెంకటేశ్వరస్వామి మీ జుట్టు తీసుకొని నీ పాపాన్ని కడిగేస్తాడా?" వరూథిని నవ్వింది.
అలా నవ్వుతున్న వరూథిన్ని చూస్తుంటే రామదాసుకు భయం వేసింది.
"పాపం కడిగేసుకోటానికేనా అందరూ దేవుడి దగ్గర కెళ్ళేది? పుణ్యం సంపాదించుకోవటానికని ఎందుకనుకోకూడదు?"

