వెంకటపతి నములుతున్న ముద్ద మింగి భార్య కేసి చూశాడు.
"ఉన్నయ్ అవేగా? అవికూడా తగలెయ్. తర్వాత జోలి పట్టుకు తిరిగుదురుగాని."
"అదికాదండీ, హైకోర్టులో అసీలు చేస్తున్నాంగా?"
"ఈ కోర్టులో అయింది. ఇక ఆ కోర్టులో గెలుస్తావ్. ఫో! ఫో!" విసురుగా అన్నాడు వెంకటపతి.
"ఆ! ముమ్మాటికి. ఇక్కడ శంకర్రావు అవతలివాళ్ళ దగ్గిర కతికి కేసు పాడు చేశాడు. హైకోర్టులో తప్పకుండా గెలుస్తాము. అక్కడ రామనాథబాబు ఆటలు సాగవు. అది హైకోర్టు! డాక్టరు భుజంగరావుకూడా ఈమాటే అన్నారు."
"ఆ! ఇక్కడలేని న్యాయం అక్కడుంటది?" దిగులుగా అన్నాడు వెంకటపతి.
"ఎందుకూ? అంతగా దిగులుపడి పోతారూ? పొద్దున గుండె పరీక్ష చేయించుకోటానికి డాక్టరుగారి దగ్గిర కెళ్ళాను. అక్కడ గవర్నమెంటు ప్లీడరు హరిప్రసాదరావుగారు సమయాన్ని కున్నారు. డాక్టరుగారే మన వ్యాజ్యం సంగతి ఎత్తారు. వారు చెప్పమంటే విషయాన్ని టూకీగా ఆయనకు చెప్పాను. ఆయన నాలుగుమాటల్లో తేల్చి చెప్పారు-" భర్త వింటున్నాడా లేదా అనే అనుమానం వచ్చి ఆగింది.
తలవంచుకొని తింటున్న భర్త తలెత్తి "డాక్టర్ల కేం తెలుస్తాయి కోర్టు సంగతులు?" అన్నాడు.
వరూథినికి వళ్ళు మండిపోయింది.
ఒకటీ సరిగా విని చావడు. విన్నా తలకెక్కదు. అందులోనూ తిండిలో పడ్డాడా ఇక చెప్పనక్కర్లేదు.
కోపాన్ని నిగ్రహించుకొని వరూధిని అన్నది.... "డాక్టరంటారేం? గవర్నమెంటు ప్లీడరు చెప్పాడంటుంటే?"
"గవర్నమెంటు ప్లీడరా? అట్టయితే సరే! అయిందయింది" పళ్ళెంలోని ఆఖరి మెతుకులు ముద్దచేసి నోట్లోకి విసురుకొంటూ అన్నాడు వెంకటపతి.
వరూథిని మళ్ళీ అన్నం పెట్టి పెరుగుగిన్నె బొళిక్కున గుమ్మరించింది.
"అంతా వేశావ్! మరి నీకో?"
"నేను తినన్లే! మీరు తినండి."
"ఓహో! తిన్నావన్నమాట?"
వరూథిని మనసు కలత చెందింది. ఏం మనిషి? తిన్నానో లేదో తెలియటంలా? తిన్నాననగానే నమ్మేశాడు. ఇలాంటి మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడో భగవంతుడు? పుట్టించాడే పో, తన పాలిటే పడేయాలా? తన కర్మ కాకపోతే?
పెరుగుముద్ద మింగి వెంకటపతి "అన్నం కాటుపోయినట్టుందే? కాటు పోయింది! కాటుపోయింది" అన్నాడు.
"నా బతికె కాటుపోయింది!" అనుకొన్నది వరూధిని భర్తను చూసి.
వెంకటపతి తింటున్న అన్నంలోని మాడుచెక్కలు తెల్లటి పెరుగులోనుంచి తొంగి తొంగి చూశాయి.
46
"ఎన్నిరోజులు పడ్తుందటా?" రిక్షా ఎక్కి కూర్చున్న భార్యను అడిగాడు వెంకటపతి.
"ఎన్నో రోజు లెక్కడండీ? వారంరోజుల్లో తిరిగి రానూ? హైకోర్టులో కేసు దాఖలు చెయ్యగానే వస్తాను. ఇల్లువదిలి ఊరుమీద తిరక్కండి." అంటూ ఇంటికేసి చూసి దిగాలు పడిపోయింది.
ఇంకా ఏమున్నాయ్ ఆ ఇంట్లో? ఉన్నవేమో తన ఒంటిమీదే ఉన్నాయి. రవ్వల దుద్దులూ, సన్నగొలుసూ, మంగళసూత్రం, రెండు జతల నొక్కుల గాజులూ, ఓ ఉంగరం తప్ప మిగతా నగలన్నీ కొలిమిలో కరిగి ఈపాటికి ముద్దయి వుంటాయి. ఏ షావుకారు పెళ్ళామో, కూతురో బంగారం కొని నగలు చేయించుకొంటూ వుంటుంది. అమ్మ నగల్లో ఎక్కువభాగం తనకే ఇచ్చింది. తమ ఇంట్లో తరతరాలనుంచి వస్తున్న బంగారం అది. ఋణం తీరిపోయింది.
తలచుకొని వరూథిని కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. భార్యను చూసి వెంకటపతి దిగాలు పడిపోయాడు.
"రిక్షా! పోనియ్ బాబూ!" అన్నది వరూధిని.
భర్తకేసి తల ఊపింది.
రిక్షా కదలిపోయింది.
రిక్షా కనిపించినంతదూరం చూసి వెంకటపతి వాకిట్లో మెట్లమీద చతికిలబడ్డాడు ఎండలో. కాలిమీద కాలు వేసుకొని పై మోకాలు రెండు చేతుల్తో గుంజుకుంటూ ముందుకు వంగి ఆలోచనలో పడ్డాడు.
అరగంట అలాగే కూర్చున్నాడు. అయినా ఆలోచన తెగలేదు. కిందా పైనా వేడెక్కి బుర్ర చుర్రుమంది. లేచాడు పంచ దులుపుకొని నెత్తిమీద వేసుకొన్నాడు.
"మాలావు ఎండా కొడ్తందే? పొద్దు రెండుబారలన్నా ఎక్కలేదు. ఎండ దంచేస్తుంది. ఎండాకాలం వచ్చినట్టుంది." గొణుక్కున్నాడు వెంకటపతి.
లోపలకెళ్ళి తాళం తెచ్చాడు. తలుపుకు తాళంవేసి రోడ్డున పడ్డాడు. జేబులో వున్న కరెన్సీనోట్లను చేత్తో తడిమి చూసుకొన్నాడు.
వారంరోజులు అడిగేవాళ్ళు లేరు. ఇష్టారాజ్యంగా తిరగొచ్చు. తాగొచ్చు.
"ఓ మడిసీ! తప్పుకో! నీకేనయ్యా! గంట కొడ్తావుంటే వినపట్టంలా?" వెనకనుంచి రిక్షావాడు ఒకటే ఒకటే అరుపు.
"చూళ్ళేదులే! ఫో! ఫో!" వెంకటపతి తప్పుకొని రోడ్డువారగా నడవసాగాడు...
స్టాండ్ కు ఇంకా హైదరాబాద్ బస్ రాలేదు. వరూథిని రిక్షా దిగి స్టాండింగ్ లో బస్ వచ్చేచోటుకు వెళ్ళి నిలబడింది. కూలివాడు పెట్టె తెచ్చి ఆమె పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. బస్సుకోసం ఎదురుచూస్తున్న వరూధినికి లోపలకు వస్తున్న ఎంబసిడర్ కారు కన్పించింది.
ఆ కారు....? ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. కార్లో నుంచి దిగాడు రామనాథబాబు. తనవైపే చూస్తూ వస్తున్నాడు. అదే నవ్వు.....అవే చూపులు. మనిషిలో మార్పేమీ లేదు. అతడు దగ్గరగా వచ్చేస్తున్నాడు. వరూధిని తలవొంచి కళ్ళు దించేకసుకొంది.
"ఎక్కడికి వరూ ప్రయాణం?"
ఎంత తియ్యగా మాట్లాడతాడు?
"హైదరాబాదేనా వరూ?"
ఎంత ఆప్యాయత ఆ పలకరింపులో పలుకుతుంది? అతని కెలా తెలిసింది తను హైదరాబాదు వెళుతున్నట్టు?
జనానికి దూరంగా వెళ్ళి నిలబడింది. రామనాథబాబు ఆమె వెనకే వచ్చాడు.
"హైకోర్టులో అపీలు చేస్తున్నావటగా? ఇంకా కోర్టులూ, కేసులూ ఎందుకు చెప్పు? నీ రెటమతం నీది. చెప్తే వింటావా?"
"ఐదులక్షలాస్తి నీ పెళ్ళాన్ని కప్పజెప్పి చేతులు ముడుచుకు కూర్చోమంటావా?"
రామనాథబాబు పక్కలకు చూసి, "ఇది బస్ స్టాండ్ వరూ! మెల్లగా మాట్లాడకూడదూ?" అనునయంగా చెప్పాడు.
"ఏం? నన్ను తలగొట్టి మొలేస్తారా? పరువెప్పుడో గంగలో కలిసిపోయింది. నా యిష్టం వచ్చినట్టు చేసుకుంటూ నువ్వెవడివి అడగటానికి?"
"ఆవిడా అదేమాట! చేసుకోండి. చేసుకోండి. మధ్య నే నెవర్నీ? ఇక్కడ అయింది చాలు! మీ కీర్తి హైదరబాదులో కూడా చాటింపు వేయించుకోండి. మాటే వినిపించుకొని మనుషుల్తో ఏం మాట్లాడతారు ఎవరైతే మాత్రం?" టిన్ లో నుంచి తీసిన సిగరెట్టు కిందపడింది. మరొకటి తీసి వెలిగించుకొన్నాడు రామనాథబాబు.
ఎంత హుందామనిషి? కిందపడ్డ సిగరెట్టు వైపన్నా చూడలేదు. తేరగా వచ్చింది. పరాయి సొమ్ము. ఆడాళ్ళ సొమ్ము.
"ఎందుకు బస్ లో పడి పోతావ్? కారు తీసుకెళ్ళు. ఇంజన్ చెక్ చేయించి రేపు తెల్లవారుతూనే పంపిస్తా."
"నీ కార్లో తిప్పేవాళ్ళను తిప్పు. చాల్లే! నీ కారూ వద్దు! నీ మర్యాదా వద్దు" స్టాండ్ లోకి వస్తున్న హైదరాబాద్ బస్సును చూసి వరూధిని గబగబా ముందుకు నడిచింది.
"సరే, నీ ఇష్టం. నే వస్తా! నాలుగురోజుల్లో హైదరాబాద్ రావాల్సిన పని ఉంది. అప్పటిదాకా ఉంటావా?" ఆమె పక్కనే నడుస్తూ ఆగిపోయాడు రామనాథబాబు.

