'వరూథినీ బేకరీ', 'వరూథిని మంగలిషాపూ', 'వరూథినీ షోడా షాపూ', 'వరూథినీ కిల్లీ షాపు'..... రిక్షాలో వరూథిని తలవంచుకొంది. రెప్పలు వాల్చేసుకొంది.
రిక్షావేగం తగ్గింది. అరుస్తూ, బెల్ కొడుతున్నాడు. వచ్చే రిక్షా పోయే రిక్షా. మధ్యమధ్య కార్ల హారన్ మోతలు, జనంతో రద్దీగా ఉంది. కార్లు తప్పుకుని, రిక్షాల ముందుకొస్తున్నారు జనం.
వరూథిని మనస్సు ఆగటం లేదు. హాలుమీద ఆమె పెంచుకున్న మమత నరనరాన్ని పట్టి గుంజుతోంది. వీడేంటీ? ఇంత మెల్లగా పోతాడు?
"నేల బెంచీ అయిపోయినాయ్!"
"కుర్చీ తీసుకోండి!" ఆవిడెవరో భర్తను దబాయిస్తోంది.
"కుర్చీ మూడురూపాయలు..... కుర్చీ మూడు....." బ్లాక్ చేసే కుర్రాడు అరుస్తున్నాడు.
"ఏ బొమ్మ ఆడుతుందో?" తలవంచుకొనే కళ్ళెత్తి చూసింది వరూథిని.
కాగితపు జండాలు, తోరణాలు గాలికి రెపరెప లాడుతున్నాయి. బేనర్సు, పోస్టర్సు, కట్ అవుట్సూ ఫ్లెడ్ లైట్ వెలుగుల్లో మెరిసి పడిపోతున్నాయి.
"కొత్త పిక్చర్ రిలీజై ఉంటుంది. ఏం పిక్చరూ?" వరూథిని తలయెత్తి చూసింది.
"శ్యామల"
"శ్యామలా! ఇదెప్పుడు తీశారూ? తను వినలేదే?
"థియేటర్!"
"శ్యామల"
"థియేటర్" చిన్న అక్షరాల కింద శ్యామల పెద్దక్షరాలు ఫ్లెడ్ లైట్ కాంతిలో వెలిగిపోతున్నాయి.
ఈ థియేటరెప్పుడు కట్టారు? ఇదే బజారు! ఇదే రోడ్డు? రిక్షావాడెటుపోతున్నాడూ?
"ఏయ్! రిక్షా ఆపు!"
రిక్షావాడు పక్కకు తీసి ఆపాడు.
"వరూథిని పిక్చర్ ప్యాలెస్" బోర్డుమీద అక్షరాలు పీకేసిన వరవడి మాత్రం ఇంకా కన్పిస్తూనే ఉంది. ఆ బోర్డు మీదే కొత్తక్షరాలు గుండ్రంగా లావుగా కన్పిస్తున్నాయి.
"థియేటర్ శ్యామల"
"ఇదేమిటీ? ఏమైంది?" అప్రయత్నంగానే వరూథిని రిక్షాదిగింది.
బేకరీవాడూ, కిళ్ళీ షాపువాడు, "వరూథిని" పేరు చెరిపేసి "శ్యామలా బేకరీ", "శ్యామలా కిళ్ళీషాపు" అని కొత్తగా రాయించేశారు.
వరూథినికి కాళ్ళు భూమిలోకి దిగిపోతున్నాయి! తన కళ్ళే తనను మోసం చేస్తున్నాయా? ఇది నిజమా? కలా?
రిక్షావాడు థియేటర్ గోడమీదున్న బొమ్మలకేసి దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. విజయలలిత డాన్సింగ్ ఫోజు చూట్టంలో తన్మయుడై ఉన్నవాడికి వరూథిని పిలుపు వినిపించలేదు.
వరూథిని కళ్ళు చీకట్లు కమ్మాయి! థియేటరు ముందున్న అన్ని దీపాలు కళ్ళమీద పడుతోన్న చీకటిని తొలగించలేక పోయాయి. చెవుల్లో రైలు కూతలు వినబడసాగినై. తలతిరిగి పోతూంది. గుండెల్లో పోటు. ఎలాగో రిక్షాలోకి చేరవేసుకుంది శరీరాన్ని.
"ఏయ్ రిక్షా? నీకే చెప్పేది?" ఎంతో పెద్దగా అన్నాననుకుంది. కాని గొంతు లేవలేదు. కళ్ళమీద నీటిపొరలు కమ్ముకొస్తున్నాయి. పెదవులు వణుకుతున్నాయి.
"నమస్కారం అమ్మా?" గడ్డం పెంచుకొన్నవాడొకడు రిక్షా ముందుకొస్తూ అన్నాడు.
వరూథిని ఉలిక్కిపడింది! అతడు ఎటునుంచి వచ్చాడో చూడలేదు. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోటానికి ప్రయత్నం చేస్తూ అతనికేసి చూసింది.
"నన్ను గుర్తుపట్టలేదా? రామదాసుని?" అన్నాడు అతను నల్లగా వికారంగా పెరిగిన గడ్డం ఆడించుకుంటూ.
"నువ్వా రామదాసూ?" తన ఆశ్చర్యాన్ని అణుచుకోలేక పోయింది వరూధిని. అవునమ్మ గడ్డం పెంచాను. తిరుపతి మొక్కుంది.
"ఇక్కడేం చేస్తున్నావ్?" ఆమె కంఠంలో ఆశ్చర్యం కంటే సందేహమే ఎక్కువగా స్ఫురించింది.
"ఉదయమే వచ్చాను."
"ఈ హాల్లో పనిచేయటం లేదా?"
"ఈ హాల్లోనా? పనిచేయటమా? మీకు తెలిసిందేగా?"
"ఆహాఁ! అదిగాదు సినిమాచూట్టానికి వచ్చావా?"
"కథానాయకి మాదే! దాంతో వచ్చాను." మందహాసం చేస్తూ చెప్పాడు రామదాసు.
వస్తోంది కథానాయకి! కథానాయకి! కథానాయకి! కథానాయకి! కథానాయకి! గోడలమీద, ఎలక్టిక్ స్తంభాలమీదా, సినిమాహాలు ముందూ ఆమె చూసిన పోస్టర్లూ, రంగులూ - బొమ్మలూ - వరూథిని బుర్రలో గిరగిరా తిరిగాయి.
"ఇప్పుడెక్కడుంటున్నావ్?"
"మాడిస్టిబ్ర్యూషన్ హెడ్డాఫీసులోనే. నెలకైదురోజులేనమ్మా హెడ్ క్వార్టర్స్ లో ఉండేది. మిగతా ఇరవై ఐదు రోజులూ టూరింగే? హాలు మన స్వాధీనం నుంచి పోయిన నెలకే రిప్రజెంటీటివ్ గా చేరాను. శేఖరం గారి కాళ్ళమీద పడ్డా. వారే పాపం! సహాయం చేశారు. మీ సంగతి అప్పుడప్పుడు అంటుంటారు."
రామదాసు చెప్తున్నది మొదటి రెండుముక్కలూ తప్ప ఆమె బుర్రకు ఎక్కటం లేదు. వింటున్నట్టుగా రామదాసును చూస్తూనే ఉంది. కాని ఆమె మనసెక్కడో వుంది.
"నీకేమన్నా తెలుసా?"
"ఏమిటమ్మా?"
"కోర్టువారు స్వాధీనంలో ఉంది కదా? కోర్టు ద్వారానే లీజుకివ్వడం జరిగింది. వారెలా పేరుమారుస్తారు."
"అదేమిటమ్మా! మీకు తెలియదా? ఊళ్ళో లేరా?" అసలే నల్లటి ముఖం ఇంకా నల్లకప్పేసిపోయింది.
వరూధినికి దున్నపోతుమీద ఎక్కి వస్తున్నవాడు కన్పించాడు! యమపాశాలు మెడచుట్టూ మెలిచుట్టుకుని పాముల్లా కదలాడుతున్నట్టుగా వుంది వరూధినికి!
"ఇంతసేపైతే ఎట్టాగండీ?" రిక్షావాడు విసుగ్గా అన్నాడు.
వీడెప్పుడొచ్చాడో! గాడ్దికొడుక్కు సినిమా పోస్టర్లు చూట్టం ఇప్పటికైంది కాబోలు. రామదాసును చూస్తూ, రిక్షావాడిని గురించి అనుకుంది వరూథిని.
"అయితే కేసు పోయిన సంగతి మీకు తెలియదన్నమాట? నిన్ననే తీర్పు ఇచ్చారట. శ్యామలాంబగారు అప్పటికప్పుడు థియేటర్ పేరు మార్పించారు. ఇవాళే రీ ఓపెనింగ్ "థియేటర్ శ్యామల" అని ఎంత పబ్లిసిటీ ఇచ్చారో చూశారుగా? మా అపిక్చార్ కంటే వాళ్ళ థియేటర్ కె ఎక్కువ పబ్లిసిటీ గా ఉంది- పేరు మారిందనీ......"
"రామనాథబాబు లేడా?"
"మధ్యాన్నం కన్పించాడు. ఇప్పుడింకా వచ్చినట్టు లేడు. ఈ లోపలేమన్నా వచ్చాడేమో?"
"ఏ రిక్షా పోనియ్!"
"అదేమిటీ? దిగండి. కథానాయకి చూడరూ? రిజర్వ్డ్ క్లాసులో రెండు సీట్లు ఖాళీగా పెట్టించా."
వరూథిని తల అడ్డంగా తిప్పి "రామదాసూ! రేపొకసారి వస్తావా?" అన్నది.
రిక్షా సాగింది.
రామదాసు రిక్షా పక్కనే నడుస్తూ "నే నివ్వాళే వద్దామనుకున్నా - బుకింగ్ క్లోజ్ అయింతర్వాత. మీరే కన్పించారు. రేపొద్దున్నే వస్తా. అదే ఇల్లుగా?" అన్నాడు.
"తప్పకుండా రావాలి. ఆఁ. అదే ఇల్లు!" రిక్షాలో నుంచి తల బయటికి పెట్టి అన్నది వరూధిని.
రామదాసు తల ఎగరేస్తూ నిలబడ్డాడు. రిక్షావాడు సడన్ బ్రేక్ వేశాడు. థియేటర్ ముందు వరూధిని తూలింది. రిక్షాను దాదాపు రాచుకొంటూ థియేటర్ లోకి తిరుగుతోంది. 'యంబాసిడర్' కారు.
"అమ్మగారొస్తున్నారు, అమ్మగారొస్తున్నారు. గేట్లు తెరవండి." గేటు దగ్గర ఒకడు హడావిడి చేస్తున్నాడు.
కారువెనక అద్దంలో నుంచి కార్లో కూర్చున్న ఆవిడ ముడీ, మెడా ఠీవిగా కన్పించాయి. ఇంకా ముందుకు వంగి చూసిన వరూథిని కళ్ళకు అద్దాన్ని ఆనుకొని వేలాడుతున్న బొమ్మ అడ్డం వచ్చింది.

