"ఇంట్లోనే వున్నా! బై ఎలక్షన్స్ లో గెలిచిన ఈ ఊరి ఎం.పి.కి మా ఇంట్లో డిన్నరు ఇచ్చాం. చాలా పొద్దుపోయిందాకా వాళ్ళు ఉన్నారు. అందుకే మీ దగ్గరకు రాలేక పోయాను."
వరూథిని షాక్ తగిలినట్టయిపోయింది.
"మీకేమీ ఇబ్బంది కలుగ లేదుగా?"
వరూథిని నిట్టూర్చింది. ఓస్! అందుకా ఆయన రాలేకపోయానంటున్నాడు.
"నాకు టైం అయిపోతూంది. బిల్లు పంపించమన్నా ఇంకా తేలేదు."
"మీరేం భయపడాల్సిన పనిలేదు. మన హోటల్లో మళ్ళీ పోలీసు కాలుపెట్టే పనేలేదు! ఆ డి.యస్.పి మోహన్ రావు వారంరోజుల్లో ట్రాన్స్ ఫర్ అయిపోతాడు!"
వరూథిని గుండెలు ఝల్లుమన్నాయి.
"ఎక్కడికీ?"
"ఇక్కడ నుంచి వదిల్తే చాలు. ఎక్కడకెళ్తే మనకేం? ఆయనమీద లోగడ్నుంచే కంప్లయింట్స్ ఉన్నాయట."
వరూథిని టైం చూసుకొంటూ "ఆలస్యమైపోతోంది. బండి అందదేమో? త్వరగా బిల్లు తెప్పించండి." అని పర్సు తెరిచి నోట్లు బయటకు తీసింది.
"అంత బిల్లేమయింది లెండి మీరివ్వటానికి?"
"అట్లాకాదు తీసుకోండి!" వరూథిని తొందరపెట్టింది.
"ఫర్వాలేదు. ఈసారొచ్చినప్పుడు ఇద్దురుగాన్లేండి. ఎక్స్ ప్రెస్ కే వెళ్ళాలంటే టైం అయిందీ. బయలుదేరాలి. రేయ్! బోయ్! పెట్టె తీసుకో. రిక్షాలో వెళ్తే బండి అందదేమో? మన బండిలో పెట్టు. డ్రైవరొచ్చాడేమో చూడు." అని బోయ్ కి చెప్పి హోటల్ ప్రొప్రయిటరు బయటకు నడిచాడు.
"మిమ్మల్నెక్కడో చూశాను. గుర్తురావటం లేదు." అప్రయత్నంగా అని నాలుక కరుచుకొంది వరూథిని.
ప్రొప్రయిటరు వెనక్కు తిరిగాడు.
"నన్ను గుర్తుపట్టారేమో అనుకున్నాను. హైదరబాద్ లో ఓసారి గోపాలరావుతో కలిసి మీరున్న హోటల్ కు వచ్చా గోపాలరావు మా కజిన్ బ్రదర్. అప్పచెల్లెళ్ళ బిడ్డలం!"
"ఓహో! అలా చెప్పండి" వరూధిని కళ్ళు విప్పారాయి.
గోపాలరావు కజనా? అందుకే పాపం! ఇంత ఇదిగా ఉన్నాడు. ఎందుకో ఏమిటో అనుకొంది తను.
"మీ పేరూ?" ప్రొప్రయిటర్ని కొంతదూరం నడవనిచ్చి అడిగింది అతని వెంటే నడుస్తూ.
"గోపాలరావు" నడుస్తూనే చెప్పాడు.
"కాదు. మీ పేరు." అతను వినలేదేమో అనుకొంది.
"నా పేరు గోపాలరావే. నేను యస్. గోపాలరావు, మా వాడు యం."
వరూథిని హోటలు గదులముందుగా నడుస్తూ గదులకేసి చూసింది. అంతా నానాఖంగాళీగా వుంది. లోపలంతా గలీజుగా వుంది. రాత్రివచ్చేటప్పుడు సరిగా చూడలేదు. తనగది ఒక్కటే అంతబాగుంది. ఆ పదమూడో నంబరు చూసి హోటలంతా చాలా డీసెంటుగా వుందనుకొంది. గదుల్లో మనుషులు ఆమెకేసి గుడ్లప్పగించి చూస్తున్నారని గమనించింది. వరూధిని.
ఛ! ఛ! అంక ఛండాలం. మనుషుల్లా ఉన్నారా? వట్టి చెత్త హోటల్. మురికి కూపం, నరకలోకం. తన ముందు అతి హుందాగా నడుస్తోన్న ప్రొప్రయిటర్ యస్. గోపాలరావుమీద అంతకుముందా ఏర్పడిన గౌరవంలో సగం పోయింది వెనకనుంచి అతన్ని చూస్తోన్న వరూథినికి.
వరూథిని వాల్తేరు స్టేషన్ చేరేసరికి ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫారం మీద ఉంది. కూలీకి సూట్ కేసు అందించి బుకింగ్ కౌంటరు దగ్గరకు పరుగెత్తింది.
గార్డు విజిల్ వినబడింది. వరూథిని గాబరాగా పెట్టెలు వెతుక్కుంటూ కూలీ వెంట పరుగెత్తింది. ఆమె ఎక్కుతూండగానే బండికదిలింది. కూలీ ఫుట్ బోర్డుమీద వేలాడుతూ చెయి చాపాడు. కూలీచేతిలో చేతి కొచ్చిన చిల్లర పెట్టింది. వాడు కిందకు దూకి తీరిగ్గా చేతిలో చిల్లర లెక్క చూసుకోసాగాడు. వాడు తలపైకెత్తేసరికి బండి ఫ్లాట్ ఫారందాటి వేగాన్ని అందుకొంటూంది.
కంపార్ట్ మెంట్ దాదాపు ఖాళీగానే వుంది.
ఒకావిడ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక మూలగా కూర్చుని ఉంది. మరో ఇద్దరు ఆమెకు పక్కగా, వాళ్ళకు ఎదురుగా ఓ కళ్ళజోడు పెట్టుకున్న ఆవిడ కూర్చుని వున్నారు. మగాళ్ళెవరూ లేరేం? ఆ ఆలోచనతోపాటు ఇది "లేడీస్ కంపార్ట్ మెంట్" అన్న సంగతి స్ఫురణకు వచ్చింది.
ఖాళీగా వున్న బెర్త్ మీద కూర్చొని మెడకిందా, ముఖమూ చెంగుతో తుడుచుకుంది వరూథిని. ఆమె గుండెదడ తగ్గేసరికి ఎక్స్ ప్రెస్ అవుటర్ సిగ్నల్ దాటి చాలా దూరం వచ్చింది.
ఎదురుగా నల్ల కళ్ళజోడులోనుంచి తననే చూస్తున్న ఆవిడను చూసి వరూథిని పెదవి విరుచుకుంది. పర్సులో ఉన్న తన కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకోపోయి, తను సిగ్గుపడింది. ఆవిడను హ్కోసి తను పెట్టుకొన్నదని ఆమె అనుకుంటుందేమోనన్న ఆలోచన కంట్లో పడ్డ బొగ్గు నలుపులా బాధ పెట్టింది.
అందుకే తనకు లేడీస్ కంపార్ట్ మెంటులో ఎక్కడం ఇష్టం ఉండదు. ఆ కూలివాడు తెచ్చి ఇందులో తగలేశాడు. హడావిడిలో తనూ గమనించలేదు. పగలంతా ప్రయాణం బోర్! ఆ ముటముట లాడే ముఖాల్ని చూస్తూ, తను కూర్చోవాలి.
వచ్చేప్పుడు రాజమండ్రిలో దిగిన సిల్కులాల్చీ, వైజాగుదాకా వచ్చిన గళ్ళచొక్కా గుర్తొచ్చి నవ్వుకుంది వరూథిని.
44
ఎక్స్ ప్రెస్ కరక్టు టైంకే చేరింది. వరూథిని కిటికీలోంచి తల చెయ్యి బయటికి పెట్టి కూలీకి సైగ చేసింది. బండిదిగి స్టేషన్ బయటకొచ్చింది. జుట్టు రేగిపోయి వుంది. ముంగుర్లు చెంపలమీద పడుతుంటే సర్దుకుంటూ కూలీ వెనకే నడిచి, రిక్షా స్టాండులోకి వచ్చింది. బట్టలు బొగ్గు దుమ్ము కొట్టుకొని, మాసి, నలిగి ఉన్నాయి. ముఖం వాడిపోయి వుంది. కూలివాడికి డబ్బులిచ్చి రిక్షామాట్లాడుకొని ఎక్కి కూర్చుంది.
రిక్షాల్నూ, కార్లకూ, జనాన్నీ తప్పుకుని రిక్షా స్టేషన్ రోడ్డు దాటింది. మెయిన్ రోడ్డెక్కి రిక్షావేగంగా పోతోంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పిచ్చుకోబోయి, వెనక వస్తున్న కారుకు అడ్డం వచ్చాడు రిక్షావాడు. కారుడ్రైవరు రిక్షా దాటిపోతూ చురచురా రిక్షావాడికేసి చూశాడు.
"పోవోయ్! సూత్తున్నాడు మగాడు!" అంటూ కాళ్ళమీద లేచి బలంగా తొక్కాడు. మెల్లగా తొక్కుతున్న ముందురిక్షావాడ్ని ఏదో అన్నాడు. వాడ్ని దాటేసి మళ్ళీ నడిరోడ్డుమీదకొచ్చాడు.
"వీడివ్వాళ దేనికో గుద్దుతాడు." కోడెదూడలా ఉన్న రిక్షాయువకుడి పిక్కలు చూస్తూ అనుకొంది వరూథిని.
"ఏమిటా అదిరిపాటు? మెల్లగా పోనీ!"
"రిక్షా ఇచ్చేయాలమ్మా అరగంటాలస్యమైతే ఒకరోజు అద్దె గుంజుతాడు ఓనరు."
రివ్వున దూసుకు పోతోంది సిమెంటు రోడ్డుమీద రిక్షా వాడికది అలవాటే.
బండముండాకొడుకు! వాడితో మాట్లాడి లాభంలేదు. ఇట్టాంటివాళ్ళను పోలీస్టేషన్ లో పెట్టి ఉతికిచ్చాలి. లేకపోతే దారికి రారు.
వరూథినికి డి.యస్.పి. గుర్తొచ్చాడు. ఆయనకు ట్రాన్స్ ఫర్ అవుతుందన్నాడు. హోటల్ గోపాలరావు. ఇక్కడికి వేస్తే బాగుంటుంది. ఇట్లాంటి పొగరుబోతుల పనన్నా పట్టచ్చు. వారం రోజుల్లో వస్తానన్నాడు. వస్తాడా? ట్రాన్స్ ఫర్ ఆయాకన్నా వస్తాడేమో? అసలు వస్తాడా అని? వచ్చినా ఆ శంకర్రావును అదుపులో పెట్టగలడా?
లక్ష్మీసిల్క్ ప్యాలెస్...... జనతా మెడికల్ స్టోర్స్.....రవీంద్ర మిలటరీ హోటల్......బాటా చెప్పులషాపూ.....దాటిపోతోంది రిక్షా.
ఇదేమిటిలా పోతున్నాడు? ఈ రోడ్డున వస్తున్నాడేమిటి? షరాబ్ బజార్ నుంచి వెళ్తే దగ్గరకదూ? వీడికి కండబలం తప్ప బుద్ది బలంలేదు. మొద్దుసన్నాసి. వరూథిని గుండెలు కొట్టుకో సాగాయి. తను ఆ రోడ్డున వచ్చి చాలా రోజులైంది. ఇటు రావడమంటేనే మనస్కరించదు. ఏమిటో తలకొట్టేసినట్టుంది. తలెత్తి చూడలేదు. దృష్టి నిలిపి చూడలేదు. దుర్గావిలాస్ దాటింది రిక్షా. ఇక వచ్చేదే "వరూథినీ పిక్చర్ ప్యాలెస్". అమ్మగారి హాలు టౌను మొత్తం మీద పేరుగల హాలు. కొత్తలో హాలు చూట్టానికే జనం విరగబడ్డారు. హాలుకు పక్కనా, ఎదురుగా ఎన్నో షాపులు వెలిశాయి.

