"నన్ను ముందీ ట్రబుల్లోంచి బయటపడనీయ్! వాళ్ళ అంతుతేలుస్తా!" అన్నాడు మోహన్ రావు.
అతని మాటలు వరూథినికి అసహ్యాన్ని కలిగించాయి.
"ముందు నువ్వు బయటపడు! వాళ్ళ సంగతి నువ్వేం చూస్తావ్?"
డి.యస్.పి.కి తన పై అధికారి అన్నట్టుగా ఉంది. వరూథిన్ని ఏమో అనుకున్నాడు. తనకు వీలు దొరికితే అమాంతం తినేస్తుంది.
మోహన్ రావు టైం చూసుకుని నిలబడ్డాడు. "రెండు దాటింది. వాళ్ళు నాకోసం ఎదురుచూస్తుంటారు పోతా." కొంచెం ఆగి "నీ ప్రయాణం రేపు ఎక్స్ ప్రెస్ కేగా?" అన్నాడు.
"నా యిష్టం వచ్చినప్పుడు పోతా. నీకెందుకూ? పోయి నీ పని చూసుకో. ఆ ఆడవాళ్ళమీద చూపు నీప్రతాపం?" వరూథిని అతన్ని సాగనంపటానికి లేచింది.
వచ్చిన కోపాన్ని లోలోపలే తొక్కిపట్టి మోహన్ రావు పేలవంగా నవ్వాడు.
"కొంచెం ఆగు నా తడాఖా చూపిస్తాను. కాళ్ళు లేక కాదు కాలమొచ్చి చిక్కాను. ఆ రామనాథబాబుగాడ్ని ప్రాణాలతో వదులుతానా. ఐ.జి.ని పోనీయ్! నేనొచ్చి ఆ శంకర్రావుగాడ్ని ఏంచేస్తానో నువ్వె చూద్దువుగాని?"
"ఆ మాట నా తల్లో వెంట్రుకలన్నిసార్లు చెప్పావు. మూడగంటలుగా అదే పాట. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అన్నట్టుంది."
"సామెతలు కూడా నేర్చుకున్నావే? ఏమోననుకున్నాను. రేపు ఎక్స్ ప్రెస్ కు వెళ్ళు నా మాటవిని. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు."
"అబ్బా! ఒహటే జీడి..... వెళ్ళూ...... వెళ్ళూ...... విశాఖపట్నం నీ సొంత ఇల్లు కాదు."
"ఈ విశాఖపట్నంలో అంతా స్టూడెంట్సే."
"ఉంటే? నాకోసం క్యూలో నిలబడతారా ఏం?"
"ఛ! అదికాదు. వాళ్ళకు తెలిసిందంటే టౌనంతా అల్లరయి పోతుంది. ఇక బ్లాక్ మెయిల్ చేసే పత్రికల కరస్పాండెన్స్ ఉన్నారు. వాళ్ళకు తెలిసిందంటే, నా కొంప మునిగి నట్టే! నీ ఫోటోతోసహా మన భాగోతం అంతా బెజవాడ పత్రికల్లో ఎక్కుతుంది. అసలే ఎన్ క్వైరీలో ఉన్నా ఇది కూడా జరిగిందంటే......"
వరూథిని అతనికేసి దీక్షగా చూస్తూ ఆలోచనలో పడింది.
"నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ రేపు వెళ్ళు."
వరూథిని రెండడుగులు వెనక్కు వేసింది. అతడు తన కాళ్ళమీద పడి బ్రతిమాలుకుంటున్నట్లు ఊహించుకుంది!
"వెంకటపతే నయం. ఆయనకంటే అథమస్తుడు. అనుకుంది వరూధిని."
"రేపు వెళ్తావుగా? నేను వారం రోజుల్లో వస్తా. వస్తా మరి!" డి.యస్.పి. మోహన్ రావు పదమూడో నెంబరు గదిలోనుంచి బయటపడ్డాడు.
వరూథిని తలుపు మూసి పక్కమీద కూచుంది. హోటల్ ఆవరణలో జీపు సాగిన ధ్వని. మరోక్షణంలో జీపు చప్పుడు దూరమైపోయింది. జీపులో గంభీరంగా కూర్చొని వెళ్తున్న డి.యస్.పి. ... వరూథిని మెదడులో అల్లిబిల్లి తిరిగి, పల్టీలు కొడ్తున్నాడు. వరూథిని ఆవలించింది. నిద్రపోవటానికి ప్రయత్నించింది.
సర్కసులో తాటిమీద నడుస్తోంది. అందమైన ఆడది. కింద వల పట్టుకొని నిలబడ్డారు మగవాళ్ళు.
ఆ ఆడది ఎవరూ? తనే! వలపట్టుకొన్న మగవాళ్ళెవరూ? రామనాథబాబూ, మోహన్ రావూ, శంకర్రావూ, గుర్నాథం. నలుగురూ నాలుగు కొసలు పట్టుకొని మెడలు విరుచుకొని తనకేసి చూస్తున్నారు. తాను తాటిమీద నడుస్తోంది. అందరూ చప్పట్లు కొడ్తున్నారు. తను చివరిదాకా నడిచింది. కాబోలు! పడకుండా నడిచింది. పడితే ఏంచేస్తారూ? తనెప్పుడూ పడకుండా నడిస్తే వాళ్ళకేం ఇంట్రస్టు ఉంటుంది. వాళ్ళ అంతరాంతరాల్లో ఉన్నది అదే కోరిక. మెడ నడుం విరిగి, కాళ్ళు చేతులు విరిగి, నెత్తురు మడుగులో పడివున్న తనను చూడాలనే ఇంతమంది టిక్కెట్లు కొనుక్కొని వచ్చారు.
తను పడలేదు. వాళ్ళకు ఆశాభంగమైంది. కాని చప్పట్లు కొడుతున్నారు. అంతా నాటకం. ఉయ్యాల తనకేసి వచ్చింది. అది పట్టుకుని రెండుసార్లు ఊగింది. దానిమీదనుంచి, ఎత్తుగా వున్న మరోఉయ్యాలమీదకు దూకింది. మరో ఉయ్యాల అది ఇంకా ఎత్తుగా మరొకటి, అది ఇంకా ఎత్తుగా తను ఆకాశంలో నక్షత్రాలకు దగ్గరగా తిరుగుతోంది. కిందకు చూసింది. వల పట్టుకొన్న రామనాథబాబూ, మోహన్ రావూ, శంకర్రావూ, గుర్నాథం చీమల్లా కనిపిస్తున్నారు. వాడెవడూ? కనకయ్య? మేజిక్కులు చేస్తున్నాడు. టోపీలోనుంచి పావురాలను తీస్తున్నాడు. అంతా తన వైపే చూస్తున్నారు. అతనెవరూ! బఫూన్లా ఉన్నాడు? ఉండటమేమి? బఫూనే. వెంకటపతి. తన భర్త వెంకటపతి! ఏదో చేశాడు. జనం నవ్వలేదు. అంతా తనకేసి మెడలు విరుచుకుని చూస్తున్నారేం? అటుకేసి ఒక్కడూ చూడడేంటీ. వెంకటపతి దిగులుగా ముఖం పెట్టాడు. సింహాల రింగులోకి వెళ్ళాడు బఫూన్. వాటితో ఆడుకుంటున్నాడు. శివంగి మీదకి దూకింది. వెంకటపతి తప్పించుకోవటానికి దారిలేదు. చుట్టూ ఇనపచువ్వలు బయటకు వచ్చే గేటు ఎవరో మూసి పట్టుకున్నారు! వాళ్ళెవరూ? పెళ్ళి బ్రాహ్మలు. వాళ్ళకు సర్కసులో ఏం పని? అసలు సర్కసంతా చేయించేది మేమే అంటున్నారా? సివంగి అరుస్తోంది! దాని వెనక రెండు సింహాలు పరిగెత్తుకొస్తున్నయ్! బఫూన్ పారిపోడేం! భయపడడేం? అలా మొద్దులా నిలబడతాడేం? పారిపోడే? ఏంమనిషి? శివంగి నోరుతెరిచింది. అదేమిటి ఆయనే దాని నోట్లో తలపెడతాడూ? ఏవండీ! మిమ్మల్నే? సింహం నోటిలో వెంకటపతి తల. పటపట కొరుకుతోంది. నువ్వుమనిషివా? గొడ్డువా? ఉయ్యాల పట్టుతప్పింది. తను కిందపడిపోతుంది. పైన ఖాళీ ఉయ్యాలలన్నీ వెనక్కి ముందుకి ఊగుతున్నాయి. తను కింద పడిపోతుంది! కింద వల, వలపట్టుకొన్నవాళ్ళేరి? జనం లేచి నిలబడ్డారు. తన భర్తను సింహం మింగేసిందా? సింహాలు అరుస్తున్నాయి. తోకలు ముడిచి రింగుచుట్టూ తిరుగుతున్నాయి. వాటిమధ్యలో ఎవడో నిలబడి కొరడా ఆడిస్తున్నాడు. వంటిమీద వెండి, బంగారం పథకాలు మెరుస్తున్నాయి. ఎవరాయన? ఇంకెవరూ? మామగారు. తన మామగారే! వెంకటపతి తండ్రి సాంబయ్యగారు కొరడా పట్టుకొని ఆడసింహాన్ని బాదుతున్నాడు. అది వెంకటపతి తల వదిలేసింది. తల చితికిందికాని మనిషి చావలేదు. బతికే ఉన్నాడు. రింగ్ మాస్టర్ మామగారు సివంగిని గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. ఆయన చావలేదు. భర్త బతికే ఉన్నాడు. తను కింద పడిపోతూంది. వల లేదు. వాళ్ళు లేరు. అమ్మో! తనకు కాళ్ళు విరుగుతాయ్. చేతులు విరుగుతాయ్. తల వక్కలౌతుంది! అదేమిటీ? తనెక్కడ పడింది? సాంబయ్య కొరడా ఎత్తి తనను కొడ్తాడెందుకూ? ఏమిటట్టా చూస్తా నిలబడతావ్. మీ అయ్యా నన్ను కొడ్తూ ఉంటే? నిన్నే! అసలు నువ్వు మగాడివేనా? నువ్వుమగాడివేనా? భర్త కదిలాడు వెంకటపతి తండ్రిచేతిలో కొరడా లాక్కొని ఆయన మెడచుట్టూ చుట్టాడు. అటులాగు, నేను ఇటులాగుతా. ఇద్దరూ కొరడా గుంజుతున్నారు. ఎంతకీ చావడేం ఈ రింగుమాస్టరు? ఈ ముసలాడు? కొరడా తెగింది. తను వెల్లకిలా పడింది...
వరూథిని లేచి కూచ్చుంది. నోరు తడారిపోయింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి లేచి లైట్ వేసింది. కూజాలో నీళ్ళు రెండుగ్లాసులు తాగింది.
రోట్లో పొత్రం తిరుగుతున్న మోత వినబడుతుంది. పిండిరుబ్బుతున్నారనుకుంది. ప్లేట్లు గ్లాసులు కడుగుతోన్న చప్పుడు వినపడుతోంది. వరూథిని వాచీ చూసింది. ఐదైంది. ఆరుంబావుకు ఎక్స్ ప్రెస్ వళ్ళంతా విరగ్గొట్టినట్టుగా ఉంది.
బాత్రూం లోకి వెళ్ళింది.
స్నానంచేసి బట్టలు మార్చుకునే సరికి ఐదున్నర అయింది. హోటల్ కుర్రాడు ఇడ్లీ కాఫీ తెచ్చాడు.
"అక్కడ పెట్టు, నేను గది ఖాళీ చేస్తున్నా. బిల్లు చేయించి పట్టుకురా. ఓ రిక్షాకూడా స్టేషన్ కు."
కుర్రాడు ఎగాదిగా చూసి, "సరే! అమ్మగారూ!" అన్నాడు.
"ఎక్స్ ప్రెస్ కు వెళ్తున్నా. టైంలేదు. త్వరగా రావాలి."
తలవూపి కుర్రాడు వెళ్ళిపోయాడు.
ఇడ్లీ తిని కాఫీ తాగింది. ప్రాణం తేరుకుంది. చెప్పులు తొడుక్కుని, సూట్ కేస్ బెడ్ మీద పెట్టి టైం చూసుకుంది.
ఆరయిపోతూంది. కుర్రాడు బిల్లింకా తేలేదేం.
"ఏమిటమ్మా! వెళ్తున్నారా?" వరూధిని వాకిలికేసి చూసింది.
ప్రొప్రయిటర్ మందహాసం చేస్తూ నిలబడి వున్నాడు.
"రాత్రి నేను హోటల్లో లేను. ఉంటే అలా జరిగేది కాదు."
"రాత్రి మిమ్మల్ని అరెస్టు చేయలా?" అడగకూడదనుకొంటూ అడిగేసింది.
"నన్నా! అరెస్టా!" చాలా తేలిగ్గా తీసుకొని అన్నాడు.
"రాత్రి మీకోసం పోలీసులు రాలా? ఎక్కడున్నారూ?"

