"ఆ దోపిడీలూ, హత్యల సంగతి నాకెందుకూ చెప్పడం? ఎప్పుడొస్తారో చెప్పండి."
"ఐ.జీ. వెళ్ళేదాకా వీలుపడదు మరి!"
"అంటే?"
"ఓ వారం రోజులన్నా పడ్తుంది. తర్వాత శెలవు పెట్టాలి. అది మా యస్.పి.కి చెప్పుకొని మానేజ్ చేసుకొంటాలే?"
డి.యస్.పి. ఏదో డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నాడనుకొంది వరూధిని. తల వంచుకుని నేలచూపులు చూస్తూ కూర్చుంది.
"నువ్వు ఉదయం ఎక్స్ ప్రెస్ కు వెళ్తన్నావుగా? సీట్ రిజర్వు చేయిస్తాను. ఏం?"
వరూధిని తలెత్తి మోహన్ రావు ముఖంలోకి చూసింది.
"నేను వెళ్ళడంలేదు. ఇక్కడే వుంటా."
"ఆఁ! ఇక్కడే వుంటావా? ఎందుకూ?"
"అవును! ఇక్కడే వుంటా? నువ్వు నాతో వచ్చేదాకా ఇక్కడే వుంటాను."
"మా ఐ.జి. పోగానే వస్తానన్నానుగా?"
"మీ ఐ.జి. పోతే నాకేం? ఉంటే నాకేం? నువ్వు నాతో రావాలి. ఆ శంకర్రావు వ్యవహారం చూడాలి. నన్ను తీసుకెళ్ళి నట్టేట్లో ముంచేశావ్! అ అబాధ్యత నీదే. ఎవరికోసం వస్తావ్?" మొండిగా మాట్లాడింది వరూధిని.
నువ్వు తెల్లవారేసరికి ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి!" మోహన్ రావు కంఠంలో అధికారం, దర్పం ధ్వనించాయి. వరూధిని వీపుమీద కొరడాదెబ్బ 'ఛెళ్' మని తగిలినట్టు అయింది!
"ఏం? ఎందుకు పోవాలంట?" బింకంగా అన్నది.
"వరూ? నేను చెప్పేది విను!" మోహనరావు తగ్గిపోయి మాట్లాడాడు.
వరూథినికి బిగువు సడలిపోయింది.
"అసలీ హోటల్లో ఎందుకు దిగావ్? నువ్వు చూశావుగా ఏం జరిగిందో? ఎలాంటి వాళ్ళు ఈ హోటల్లో వుంటారో?"
"నాకేం తెలుసూ? ఆ ముసలి ముండాకొడుకు ఈ హోటలే మంచిదని తీసుకొచ్చాడు."
"అయిపోయిందేదో అయిపోయింది. నేనుండబట్టి సరిపోయింది. మా డి.ఐ.జి.కి కంప్లెయింట్స్ వెళ్ళాయట, ఈ ప్రొప్రయిటర్ లోకల్ పోలీసుల్ని కట్టుకొని బ్రోతల్ నడుపుతున్నాడని. ఆయన ఇక్కడున్నాడనే హఠాత్తుగా రైడ్ చెయ్యటం జరిగింది. నువ్వీ హోటల్లో వంటరిగా వుండటం, నిన్ను నేను వదిలేయడం, మా డిపార్టుమెంటులో పై వాళ్ళకు తెలిసిందంటే ఇంకేమయినా వుందా?"
అంతవరకూ మౌనంగా వింటున్న వరూధిని మోహనరావు ముఖంలోకి తీక్షణంగా చూసింది. అతని ముఖం చూస్తుంటే ఆమెకు వెగటు పుట్టుకొచ్చింది.
"ఆ చెప్పేదేదో సూటిగా చెప్పండి."
"బ్రోతల్ యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చెయ్యాల్సి వుంటుంది. కాని....."
వరూధిని అభిమానం కర్పూరంలా మండిపోతూంది.
"కానీ....నేను చెయ్యలేదు. ఎంతో రిస్క్ తీసుకొన్నాను. మా సి.ఐ. ఒట్టి దొంగరాస్కెల్. వాడు యస్.పి చెవులో వేస్తాడు. అది ఐ.జి. దాకా పాకే ప్రమాదం వుంది!"
"పోనీ నన్నూ అరెస్టు చెయ్యండి. బ్రోతల్ యాక్ట్ కింద బుక్ చేసి కేసు పెట్టండి. సంవత్సరంన్నర క్రితమే ఈ నేరం జరిగింది. అందుకు కర్తవూ, సాక్షివీ నువ్వే! నువ్వు అరెస్టు చేసి తీసుకుపోయావే వాళ్ళకూ నాకూ తేడా ఏమిటి? వాళ్ళు శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకొన్నారు. నేను నా డబ్బుతోపాటు అన్నీ ఇచ్చాను! మనిషినీ మనసునూ నా సొంతం చేసుకొన్నానని భ్రమపడ్డాను. మోసపోయాను. దగాపడ్డాను. వాళ్ళు శరీరాన్ని మాత్రమే అమ్ముకున్నారు. నేను అన్నీ అమ్ముకున్నాను. అన్నీ పోగొట్టుకొన్నాను. అరెస్టు చెయ్యండి. నాకు శిక్ష వేయించండి. ఈ బతుక్కంటే, ఆ జైలు గోడల మధ్యే సుఖంగా ఉంటుంది. ఈ పెద్ద మనుషులా, మోసగాళ్ళా ముఖాలు నాకు కన్పించవు. వాళ్ళనుంచి దూరంగా బతుకుతాను. అరెస్టు చెయ్యండి. చూస్తారేం?" వరూధిని ఆగి మోహనరావు కేసి చూసింది.
కిటికీ దగ్గరకెళ్ళి నిలబడి బయటకు చూస్తున్నాడు మోహనరావు.
"ఆగావేం? అరువూ? పిచ్చికుక్కలా అరవంగానే సరిగాదు. ఇవతలవాళ్ళ మంచిచెడ్డలు, గౌరవమూ, హోదా చూడాలి."
"నీ హోదా? నీ గౌరవమూ? ఆ రామనాథబాబు కాళ్ళు పట్టుకుని తిరిగినప్పుడేమైంది?"
"నోర్ముయ్! వాగబాక!"
"ఏం చేస్తావేం? బ్రోతల్ యాక్ట్ క్రింద కేస్ పెడతావ్. అంతేగా? పద ఆ కోర్టులోనే చెప్తా. ఆ శంకర్రావుతో కలసి నా డబ్బు కొట్టేశావని!"
డి.యస్.పి. దిమ్మెరపోయి చూశాడు.
"ఏంటట్లా చూస్తావ్? నీకు, నివ్వరస్టు చేసిన ఆడవాళ్ళను తేడాఏమిటి? డబ్బుకోసం వాళ్ళు శరీరం అమ్ముకుంటే నేరం! అయితే నువ్వు చేసిందీ అదేగా? నా డబ్బుకోసం నీతిని అమ్ముకున్న వాడివేగా? బ్రోతల్ యాక్టుక్రింద నిన్నెందుకు బుక్ చెయ్యకూడదూ? నీ కెందుకు శిక్షవేయరూ? ఆ కోర్టువారినే అడుగుతా పద!"
మోహన్ రావు నొసటన పట్టిన చెమటను తుడుచుకున్నాడు. వరూధిని మాట్లాడేదాంట్లో 'లా' పాయింట్ ఉన్నట్టే తోచింది. అసలు 'లా' ఎలా ఉంది? అది ఆడది చేస్తే తప్పు! మగాడు చేస్తే తప్పుకాదా? అదే ఆడది చేస్తే శిక్ష పడుతుంది. మొగాడు చేస్తే నేరంకాదు. వరూధిని మాట్లాడేది తర్కమే. బతికాం. అది 'లా' కాదు. అలా 'లా'లో లేదు.
"సిగ్గు బిడియం విడిచిన దానివి! నీతో నాకెందుకల్లరి? నువ్వు రేపు ఎక్స్ ప్రెస్ కు వెళ్ళు నీ మంచికోరే చెప్తున్నా."
"నే వెళ్ళను. ఇక్కడే ఉంటా! మీ ఐ.జి.ని రమ్మను. ఆయనొస్తే నేను చెప్తా. నీ బండారం బయటపెట్టికాని ఇక్కడనుంచి పోను." మోహన్ రావు తగ్గిపోయాడని గ్రహించిన వరూధిని రెచ్చిపోయింది.
"తెగేదాకా లాగకు. నన్నర్ధం చేసుకో వారంరోజుల్లో నేను తప్పక వస్తా. నన్ను నమ్ము." ఐ.జి. పేరెత్తగానే జావకారి పోయాడు.
"నిన్ను నమ్మే మొలలోతు బురదలో కూరుకుపోయాను. నీ మూలాన్నే రామనాథబాబుకూ, నాకూ చెడింది. నువ్వేకారణం."
"అంత అడ్డగోలుగా మాట్లాడితే నేనింకేం చెప్పేది?"
వరూధిని మనస్సు కదలబారింది. చివాల్న తలెత్తి మోహన్ రావు మొఖంలోకి చూసింది ఈ మోహన్ రావులో కూడా ఓ వెంకటపతి ఉన్నాడు. ఎంత అసమర్ధుడిలా మాట్లాడుతున్నాడు?
"అసలు ఈ రామనాథబాబే నా మీద పిటీషన్లు పెట్టించి, మినిష్టర్ కు చెప్పించి, ట్రాన్స్ ఫర్ చేయించాడు తెలుసా? నా మీద ఇంకా ఎన్ క్వైరీ జరుగుతోంది."
"ఏమని పెట్టించాడూ?" వరూధిని చల్లబడింది. ఆమె ధోరణీ మారింది.
"అదే! నీ దగ్గర డబ్బుతీసుకొని రౌడీలను పెట్టి వాళ్ళ హాలు నేను స్వాధీనం చేయించానని పిటీషన్ పెట్టించాడు. మన టౌన్ లో కొంతమంది రౌడీల దగ్గర స్టేట్ మెంట్స్ కూడా తీసుకుని పంపాడు. పైగా నీతో నాకు అక్రమసంబంధం ఉందని కూడా పెట్టించాడు. అందువల్ల నన్ను వెంటనే ట్రాన్స్ ఫర్ చేసి విచారణ జరిపించాలని, మంత్రి గారితో తనేకాక ఇద్దరు ఎం.ఎల్.ఏ.ల చేత కూడా చెప్పించాడు. ఇంకా లంచాలు తిన్నానని, ఇంకేవేవో చేశానని చెత్తంతా పెట్టించాడు. థియేటర్ దావా - కోర్టులో నువ్వు వేసిన వారానికే నాకు ట్రాన్స్ ఫర్ వచ్చింది. తెలుసుగా? నేనుంటే నీకు సహాయం చేస్తానని ఆ పని చేయించాడు."
అదా కారణం? పులి అనుకున్న మోహన్ రావు మేకలా అయిపోయాడు. అతడి అసమర్ధత, ఉద్యోగం ఊడుతుందేమోనన్న భయం, అతని ప్రతిఅణువులోను, ప్రతిమాటలోను ద్యోతకం అవుతోంది. తన భర్త వెంకటపతికంటే ఇతడేమీ ప్రతిభావంతుడు కాదు. చదువువుంది. అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం దొరికింది. ఈ పోలీసు యూనిఫారంలో అధికారం ఉంది. ఆ కవచంలో మనిషి గంభీరంగా, శక్తిమంతుడిలా కనిపిస్తున్నాడు. కాని అతని లోపలి వ్యక్తిత్వం తన భర్త వెంకటపతి వ్యక్తిత్వం కంటే భిన్నమైంది కాదు. వరూధిని ఆలోచనలు పరుగులు తీశాయి. అతన్ని అంచనా కట్టింది. వీళ్ళ ముఖాలు వీళ్ళు చేసేదేమిటి? ఆ మాత్రం తను చేసుకోలేదా? పై రూపాయి చూసి మోసపోయింది.
వరూధినికి తన శక్తిసామర్ధ్యాలమీద నమ్మకం పెరిగింది. ఆవిడ కళ్ళకు డి.యస్.పి. మోహనరావు వట్టి పిరికివాడిలా దద్దమ్మలా కన్పించాడు.

