Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 93


    "యస్సార్!" ఇద్దరూ ఒకేసారి అని వెనక్కు చూడకుండా బయలుదేరారు.
    "అదృష్టం బాగుంది సార్. ఇంకా నయం తొందరపడి ఆవిడగార్ని లాక్కొస్తే నిజంగానే డి.యస్.పి. గారు నాతాట వలిచేవారు." అన్నాడు యువకుడైన యస్సై సి.ఐ. వెనకే నడుస్తూ.
    "డి.యస్.పి. గారి మనిషి కాకపోతే అంత అహంకారంగా మాట్లాడదయ్యా! నేనప్పుడే అనుకున్నాను." అన్నాడు సి.ఐ.
    "ఓయ్! అప్పలస్వామీ? వీళ్ళింధర్నీ వాన్ ఎక్కించు." హెడ్ కానిస్టేబుల్ కు చెప్పి సి.ఐ. యస్సై వెంటరాగా హోటలు మెట్లు దిగాడు.
    "ఆవిడెవరో వస్తుందని ఆగారుగా? ఆవిడేదీ?" ఆరా తీసింది సావిత్రి.
    "అదంతా నీకెందుకూ? నువ్వు నడవో!" అన్నాడు హెడ్డు.
    "ఆవిడ్నెందుకు వదిలారయ్యా! ముందీ మాట చెప్పు!" అనసూయ అడిగింది చేతిలో చెయ్యివేసి గుద్దుకొంటూ.
    "ఓహో! సానా వుందే గోరోజనం? ఆవిడ మీ బోటి పోరంబోక అనుకున్నావా? క్లాసు. క్లాసు మడిసి!" అప్పలస్వామి మీసాల గుబురుదాటి నవ్వు బయటికి రాలేదు.
    "ఏంటయ్యా క్లాసూ? చేసేది ఆ పనేగా?" కాకినాడ సరస్వతి అప్పలస్వామిని కసిరింది.
    "ఆవిడకు లేని రూలు మాకేంటయ్యా? మేంరాం! ఏంచేస్తావో చేసుకో." రాజమండ్రి అనసూయ మొండికేసింది.
    "ఏమేవ్? ఆ సూపర్నెంటేడీ?" కాకినాడ సరస్వతి ఆరాతీసింది.
    "పదమూడో నెంబరు గదిలో కెళ్ళాడుగా?" నెల్లూరి చంద్రమతి అన్నది.
    "జుట్టు పట్టుకొని లాక్కొస్తానని వెళ్ళిన మగాడు అక్కడే వుండిపోయాడేమే సరస్వతీ?" ఏలూరు దమయంతి కళ్ళు తిప్పింది.
    "గ్లాసుకదే గ్లాసు? ఏం! హెడ్డయ్యోయ్? అంతేనా?" అన్నాది బెజవాడ సావిత్రి చేతులు తిప్పుతూ.
    అనసూయా, చంద్రమతీ, దమయంతీ, సరస్వతీ విరగబడినవ్వారు. బందరు లక్ష్మి ముసిముసి నవ్వులు వలికించింది. వాళ్ళ నవ్వులకు గదుల్లో ఖాళీ సీసాల ముందు కూర్చున్న మగాళ్ళ గుండెలు గుబగుబలాడాయి.
    "ఏందే ముండల్లారా డి.యస్.పి. గారిమీద ఏళాకోళాలు! ఆరిన్నారంటే మీయమ్మ.....మిమ్మల్ని...." బండబూతు లొచ్చాయి అప్పలస్వామి నోటికి.
    ఆ మాట అన్నదెవరో గుర్తించలేకపోయాడు అప్పలస్వామి.
    "ఓయ్! పెద్దకరోడాలావున్నావు. ఎవరే నువ్వు?" మీసాలు పీక్కున్నాడు అప్పలస్వామి.
    "యహ! సూత్తాలేందోయ్ తొయ్యక?" హెడ్డు తన సిబ్బందిని పురమాయించాడు.
    అంతవరకూ నోళ్ళు తెరుచుకొని తమాషా చూస్తున్న ఫోర్ ట్వంటీ, త్రినాట్ ఫోర్, ఫైవ్ సెవనొ జీరో, త్రిబుల్ త్రీ కానిస్టేబుల్స్ ఆడవాళ్ళను చుట్టుముట్టి ముందుకు నడిపించారు.
    హోటల్ ఆవరణలో వున్న పోలీసువాన్ దగ్గిర కొస్తుండగా సావిత్రి చెవిలో నోరుపెట్టి అప్పలస్వామి గొణిగాడు.
    "మడిసికో వందిచ్చుకోండి. కేసు మాఫయిపోతది."
    "మొన్ననేగా మేమొచ్చింది? అప్పుడే వందేడ్నుంచి వస్తయ్? నిన్నా మొన్నా వచ్చింది హోటల్ వాడికి, బ్రోకర్ కూ సరిపోయా? ఇవ్వాళేమో మీరొచ్చి పడితిరి?" అన్నది సావిత్రి అప్పలస్వామి గుబురు మీసాల్లోకి చూస్తూ.
    "ఏందే ఈళ్ళకిచ్చేదీ? కోర్టు ఏసినా యాభయ్యో వందో? జుల్మానా అక్కడే కడ్డాం" అన్నది సరస్వతి.
    "ఎక్కండెక్కండి" వెనక వాన్ డోర్ తెరచి మహనిక్కచ్చి మనిషిలా అరిచాడు అప్పలస్వామి.
    "ఇది ఎన్నోసారీ?"
    "ఏడు"
    "మీయమ్మ మీతో మాట్టాట్టమే పీక్కు రేసుకొన్నట్టుందే? జరుగహ?" సరస్వతిని నెట్టి పక్కన కూర్చున్నాడు హెడ్డు.
    "ఏడోసారంటే నువ్వేడుస్తావెందుకూ?" అన్నది అనసూయ.
    "మా పోలీసోళ్ళంటే మీకు బొత్తిగా భయమేపోయింది!" ముందు కూర్చున్న యస్సై వినాలన్నట్టు పెద్దగా అన్నాడు అప్పలస్వామి.
    "ఇది చాలా అన్యాయం సార్!" సి.ఐ. పక్కన ముందుసీట్లో వొదిగి కూర్చొని అన్నాడు యస్సై.
    "నీ సర్వీసెంతా?" అడిగాడు సి.ఐ.
    "రెండేళ్ళు!"
    "ఇంకో రెండేళ్ళు పోనీయ్! అంతా న్యాయంగానే కన్పిస్తుంది! నాకిరవై రెండేళ్ళ సర్వీస్. ఇరవైఏళ్ళగా నేను ఏది చేస్తే అదే న్యాయం అనుకొంటున్నా."
    వాన్ మెరక ఎక్కుతో ధ్వని చేస్తోంది.
    యస్సై వెనక కూర్చున్న సావిత్రి, అనసూయ, దమయంతి, చంద్రమతి, సరస్వతుల కేసి దిగులుగా చూశాడు.
    లక్ష్మీ ప్రసూన పైట చెంగు అడ్డం పెట్టుకొని సన్నగా ఏడుస్తోంది.
    ఆ ఏడుపు పోలీసు వాన్ రొదలో కలిసిపోయి ముందుకూర్చున్న యస్సైకి వినిపించటంలేదు.
    
                           43
    
    "అంతపని చేశాడా శంకర్రావు." మోహన్ రావు పళ్ళునూరాడు.
    వరూధిని కళ్ళుతుడుచుకొంది. గుర్నాథం సంగతికూడా చెప్పాలనిపించింది. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ, ఇప్పుడు కాదులే ముందా శంకర్రావుగాడి వ్యవహారం తేలనీయ్, అనుకోని వూరుకొంది.
    "రామనాథబాబే మంటాడూ?" మోహనరావు సాలోచనగా అన్నాడు.
    వరూధిని అతని ముఖంలోకి చూసి నిట్టూర్చింది.
    "రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందన్నట్లుంది మీరడగటం?"
    "అయితే నన్నిప్పుడేం చెయ్యమంటావ్?"
    బ్రహ్మాండం బద్దలు కొస్తాడని ఆశించి ఎదురు చూస్తోన్న వరూధిని నీరసించి పోయింది.
    "తీసుకెళ్ళి శంకర్రావు చేతుల్లో పెట్టి ఇప్పుడే నన్నేం చెయ్యమంటావని అడుగుతారేం?"
    "వాడింత రోగ అని నేను మాత్రం అనుకున్నానా ఏం? అప్పుడు బాగానే వుండేవాడు మరి!"
    "వాడు మొదట్నుంచీ అంతే. దగాకోరు."
    "అయితే నేను తెలిసే నీ కేసు వాడికిప్పించానంటావా?" నొసలు ముడిచాడు మోహన్ రావు.
    "అని నేనన్నానా? ఇప్పుడైనా తెలిసిందిగా మోసగాడని?"
    "ఇప్పుడు తెలిసినా ప్రయోజనం ఏమిట్లే?"
    "అదేమిటీ? మీరొచ్చి అడగండి. నాడబ్బు నాకిచ్చి వకాల్తా వదులుకోమనండి. వాడి తాతల్లాంటి ప్లీడర్లు దొరుకుతారు."
    "మళ్ళీ వాడి తాతెందుకూ? ఈయనకన్నా మంచి లాయర్ ను పెట్టుకో!"
    వరూధిని నవ్వు ఆపుకోటానికి ప్రయత్నించి కోపాన్ని నటించింది.
    "మీ మాటలూ మీరూ? ఎప్పుడు బయల్దేరదాం?"
    "నీతోనా?"
    "వేరే పెట్టెలో ఎక్కండి. ఏం పోయింది?" వరూధిని అలిగింది.
    "నేననేది అదికాదు. ఇప్పుడు బయలుదేరటానికి వీలుపడదని."
    "ఇప్పుడు యీ అర్దరాత్రి పూట బయలుదేరామని ఎవరన్నారూ? బండి మాత్రం ఏముంది? తెల్లవారి ఎక్స్ ప్రెస్ కు వెళ్దాం." అన్నాది వరూధిని.
    "రేపు మా ఐ.జి. వస్తున్నాడు. వారంరోజులు మా రేంజ్ లోనే టూర్ వుంది. చాలా ముఖ్యమైన రైడ్స్ కండక్ట్ చెయ్యాలని మా డి.ఐ.జి. ఆర్డర్స్ ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు భూస్వాములమీద తిరగబడ్డారు! ఇప్పటికే ఐదారు దోపిడీలూ, హత్యలూ జరిగాయి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS